అల్లూరి సీతారామరాజు |
"తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. చాలామందికి ఆయన కేవలం స్వాతంత్ర పోరాట యోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన సంస్కృతం, జ్యోతిషశాస్త్రం, విలువిద్య మరియు మూలికా వైద్యం లో కూడా సిద్ధహస్తులు. ఆయన రెండు సార్లు ఉత్తరభారతదేశం యాత్ర చేసి ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శించారు. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉన్న బ్రహ్మకపాలంలో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. ఎన్నో క్షేత్రాలలో తపస్సుని ఆచరించడమే కాక గంటల తరబడి ధ్యానం లో గడిపే వారిని చాలా మందికి తెలియదు.
సాధారణంగా మన దృష్టిలో సన్యాసి అంటే అన్నింటినీ త్యజించి ముక్కు మూసుకుని ఏదో ఒక మూల తపస్సు చేసుకునేవారనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఒకసారి చరిత్ర పరికించి చూస్తే చుట్టూ ఉన్న సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం, ధర్మం కోసం వారివారి తపశ్శక్తిని కూడా దార పోసి జీవితాన్ని అర్పించిన ఎందరో మహానుభావులు చరిత్రపుటల్లో మనకు కనిపిస్తారు. అలాంటి కోవకు చెందినవారే ఈ అల్లూరి సీతారామరాజు.
తన చుట్టూ నివసిస్తున్న ప్రజలు ఈస్టిండియా కంపెనీ చేతిలో, మిషనరీల చేతిలో దోపిడీకి గురి అవుతూ వారి నివాసమైన అడవిలోనే బానిసలుగా బ్రతకడానికి చూసి చలించిపోయారు. ఆ ప్రజలనే సమూహంగా ఏర్పాటు చేసి క్రైస్తవ దోపిడీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారి పోరాటానికి అవసరమైన తుపాకులను బ్రిటిష్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి సమకూర్చుకున్నారు. తను దోపిడీ చేయబోతున్న పోలీస్ స్టేషన్ వివరాలను, దోపిడి చేసే సమయాన్ని ముందుగానే తెలియజేసి మరి దాడి చేయడం ఆయన ప్రత్యేకత. రెండు సంవత్సరాలకు పైగా బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. చివరకు తన కారణంగా అమాయక ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు అన్న బాధతో తన ప్రాణం గురించి చింత లేకుండా తాను ఉన్న ప్రదేశం యొక్క సమాచారాన్ని బ్రిటిష్ వారికి తెలియజేసిన కర్మయోగి ఆయన."
మూలము:__శివశక్తి