మొగ్గ దశలో ఉన్న సాందీపని (సేవాభారతి) ఆవాసాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంఘ కుటుంబాలలో 'రోజు పిడికెడు బియ్యం నారాయణ పాత్ర) అనే పద్దతి ద్వారా ఆవాస విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకున్న కల్వకోలు బుచ్చారెడ్డి (74) 2021 ఏప్రిల్ 6న స్వర్గస్తులయ్యారు.
వనపర్తి జిల్లా ఫనపూర్ మండలంలోని సోలీపూర్ గ్రామంలో మంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు ఏప్రిల్ 2, 1947న జన్మించారు. వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వృత్తి విద్యను అభ్యసించారు. 1969లో విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. 2005లో పదవీ విరమణ పొందిన తరువాత సంఘ పెద్దల సూచన మేరకు సేవాభారతి పాలమూర్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
2008 నుండి నేటివరకు నగర సంఘచాలకులుగా మార్గదర్శనం చేస్తూ, ప్రతిష్టిత వ్యక్తులను సంఘానికి జోడించారు. కార్యకర్తలను ఆత్మీయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య వివరాలు అడిగి తగు జాగ్రత్తులు చెప్తుండేవారు. వారి ఆరోగ్యం బాగలేకున్నా ఇంటినుంచే ఫోన్లో పలకరిస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ, కార్యకర్తలకు ధైర్య వచనాలను చెప్తూండేవారు. అలాంటి గొప్ప కార్యకర్త లేరన్న విషాద వార్త పాలమూర్ న్వయంసేవకులు జీర్ణించలేకపోతున్నారు. వారి గత జ్ఞాపకాలను నెమరు వేసుకుని దుఃఖతప్తులయ్యారు. వారి ఏకైక కుమారుడు సంవత్సరాల క్రితం మరణించారు. బుచ్చారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏప్రిల్ 10వ తేదీన పాలమూర్లోని సాందీపని ఆవాసంలో బుచ్చారెడ్డి శ్రద్ధాంజలి సభలో తెలంగాణ ప్రాంత సహ సంఘచాలక్ సుందర్ రెడ్డి, పాలమూర్ విభాగ్ సంఘచాలక్ ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దక్షిణ మధ్య క్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న బుచ్చారెడ్డి నిరాండంబరత, కార్యశైలి గురించి స్మరించుకున్నారు. ఈ సభలో నగర కార్యకర్తలు స్వయం సేవకులు పాల్గొన్నారు.