Sangh Volunteers |
: సంఘ కార్యవద్దతి వికసించిన తీరు :
రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించిన డాక్టర్ హెడ్గెవార్కి అప్పటికే అనేక రకాల ఉద్యమాలలో, సంస్థలలో ఎంతగానో పనిచేసిన అనుభవముంది. అది అద్వితీయమైన అనుభవమని చెప్పవచ్చు. సంఘకార్యపద్ధతిని వికసింప జేయటంలో ఆ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. గత అనుభవాల ఆధారంగా ఆయన ఏవిధమైన తొందరపాటు లేకుండా నెమ్మది నెమ్మదిగా అనేకపద్ధతులు క్రమంగా రూపుదిద్దుకొనేవిధంగా ఆయన శ్రద్ధవహించారు.
సంఘం ప్రారంభించేనాటికి - ఈ సంస్థయొక్క కార్యవిధానము, పద్దతి ఇదీ అంటూ ఆయన మార్పుకతీతమైన, లేదా స్థిరమైన ప్రణాళిక ఏదీ వ్రాసి పెట్టలేదు. ఏ సంస్థ నుండో తీసికొనివచ్చిన కార్యపద్ధతిని సంఘంపై రుద్దలేదు. డా॥ హెడ్గేవార్ చాలా ఓపికగా కార్యపద్దతి వికసించేందుకు యత్నిస్తూరావటమేగాక, వివిధ సమయాల్లో అవసరాన్నిబట్టి తగినవిధంగా మార్పులు చేస్తూ వచ్చారు. మరొక సంస్థ నుండి కార్యపద్ధతిని తెచ్చుకొని దానిని అనుసరిస్తూ కొద్దిపాటి మార్పులతో ముందుకు పోదామన్నా, అటువంటి సంస్థ ఏదీ దేశంలో ఎక్కడా లేనేలేదు. మిగిలిన సంస్థలు ప్రారంభమయ్యే పద్ధతికి పూర్తిగా భిన్నమైన తీరులో సంఘం ప్రారంభమైంది.
మిగిలిన సంస్థలలో ఏమి జరుగుతూ ఉండేది? కొంతమంది మొదట ఒకచోట కలిసికూర్చొని నియమావళి రూపొందించుకొని, ఆ సంస్థను ప్రారంభిస్తున్నట్లుగా పత్రికలలో వ్యాసాలద్వారాగాని, ప్రకటనలద్వారాగాని ప్రజానీకానికి తెలియజెసేవారు. చందాలు విరాళాలూ సేకరించేవారు. తమ సంస్థకు ఒక పేరు పెట్టటమే గాక, పదాధికారులను నిర్ణయించటంకూడా ప్రారంభంలోనే జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరిగితేనే ఒక సంస స్థాపింపబడినట్లుగా భావింపబడేది. కాని సంఘ సంస్థాపన ఈ పద్దతులకు భిన్నంగా జరిగింది. మొదట సంఘంయొక్క 'కార్యం' ఆరంభమైంది. మిగిలిన విషయాలన్నీ అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి జోడింపబడుతూ వచ్చాయి. ప్రారంభంలో ఒకే ఒక చిన్న విషయం నిశ్చయంగా ఉంది. “మధ్య మధ్య నాగాలు లేకుండా ప్రతిరోజూ శాఖకు తప్పక రావాలి" సంఘంపేరు 'రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్' అన్నది కూడా కొన్ని నెలల తర్వాతనే నిర్ణయింపబడింది. సంఘశాఖయొక్క స్వరూపం ఎలా ఉండాలి, అందులో ఏయే కార్యక్రమాలు ఉండాలి, శాఖగాక ఇతర కార్యక్రమాలు ఏవిధంగా ఉండాలి-ఇవన్నీ ఆ తర్వాతనే క్రమక్రమంగా నెమ్మదిగా రూపొందింపబడినవి.
వివిధ సమయాల్లో కార్యక్రమాల్లో భాగస్వాములైన వారికి క్రొత్త క్రొత్త విషయాలు స్ఫురించినపుడు, వాటిగురించి చర్చించి తదనుసారంగా మార్పులు చేస్తుండేవారు. ఈ మార్పులు ఎంత విస్తృతమైనవంటే-మొదట్లో ఉన్న ప్రార్థన వేఱు. ఇప్పుడు రోజూ శాఖలో పలుకబడుతున్న వేఱు,. ఇంతగా కొట్టవచ్చినట్లుగా కనబడే ఎన్నో మార్పులు చేయబడి ఈనాటి కార్యపద్ధతి రూపుదిద్దుకొని అమలుచేయబడుతున్నది.