Balasaheb Deoras ji |
: సంఘంకారణంగానే సమస్యలు అదుపులో ఉన్నవి :
ఈనాడు దేశంలో చెలరేగుతున్న సమస్యలు - అవి బెంగాల్కి సంబంధించినవైనా, అసమ్ (అస్సాం)కి సంబంధించినవైనా, రాజకీయరంగానికి సంబంధించినవైనా, ఇతర రంగాలకు సంబంధించినవైనా, వాటిపైన ఏదో ఒక మేరకు అవరోధం (బ్రేక్) విధించబడుతున్నదంటే సంఘకార్యప్రభావమే దానికి కారణం. సంఘమే లేకపోతే, ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాల తీరు మరోవిధంగా ఉండివుండేది. దీనికి కొన్ని ఇతర కారణాలు ఉండివుండవచ్చుగాక. ఆ కారణాలతోపాటు ఒక విశిష్టశక్తిని సంతరించుకొని సంఘం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ప్రభావాన్ని ప్రసరింపజేయగల స్థితిలో ఉండటంకూడా ఒక ముఖ్యకారణం. చైనా దురాక్రమణ అస్సాం సమస్య, ఆచార ప్రచారాల రంగాలలోని సమస్యలలో మనం కోరుతున్నంత గట్టిగా ప్రతిఘటన జరుగుతూ ఉండకపోవచ్చు. అందుకు కారణం సమాజపు నేటి బలహీనస్థితియే మంచి, ఆరోగ్యవంతమైన సమాజంలో ఏ గుణాలు ఉండాలో, ఆ గుణాలు ఇక్కడ మన సమాజంలో లేవు. దేశవిభజన జరుగుతున్న సమయంలో ఎంతో హింస చెలరేగింది. కొట్టాటలు జరిగాయి, పెద్ద పెట్టున అత్యాచారాలు జరిగాయి. పాకిస్తాన్ ఏర్పడకుండా సంఘం అడుకొని ఉండాల్సిందని సహజంగా మనందరికీ అనిపించుతుంది. అలా అనుకోవటంలో తప్పులేదు కాని అది జరిగింది. దేశ విభజనను ఆపటం సాధ్యంకాలేదు.
దేశ విభజనను నిలువరించడానికి ఎంతశక్తి అవసరమో అంతశక్తి సంఘంవద్ద లేదు- ఇదే ప్రధాన కారణం. మనవద్ద ఎంతశక్తి ఉంటుందో, దాని ప్రభావం ఎంత ఉంటుందో-దానికి తగినట్లుగానే పరిణామాలూ ఉంటాయి. సంఘంవద్ద ఎంతశక్తి ఉందో చూసి, ఆ రోజులను గుర్తు తెచ్చుకొనేవారు ఇప్పటికీ చాలామంది కనిపించుతారు.
యుద్ధంనుండి తిరిగివచ్చే సమయంలో రియర్ గార్డ్ యాక్షన్ చాలా కీలకమైనది. యూనిట్లో ఎంతమంది ఉంటారో, వారందరూ సకుశలంగా తిరిగిరావలసి ఉంటుంది. పాకిస్తాన్ఏ ర్పాటవుతున్న సమయంలో, సంఘంవద్ద ఎంత శక్తి ఉన్నదో, దాని బలంపై అక్కడి ప్రజలను ఆమేరకు రక్షించగల్గినాము. ఆక్రమణలను ఎదిరించగల్గినాము, ఏమేరకు సంభవమో ఆమేరకు ప్రజలను సురక్షితంగా భారతదేశానికి తీసికొని రాగల్గినాము. ప్రభుత్వంకంటే సంఘమే ఎక్కువ భద్రత కల్పించింది. ఇదంతా సాధ్యమైందంటే అందుకు కారణం ఒక విశిష్టశక్తిని కలిగియుండి సంఘం తన అస్తిత్వన్ని నిలుపుకొని ఉండటమే.