Balasaheb Deoras - బాళాసాహబ్ దేవరస్ జీ |
: నిత్యసిద్ధశక్తి ఒక తప్పనిసరి అవసరం :
తాత్కాలిక సమస్యల గురించి సంఘం యొక్క దృష్టికోణమేమిటో మనం స్పష్టంగా గ్రహించాలి. సంఘం ఒక నిత్యసిద్ధశక్తి. మనం ఏ లక్ష్యమైతే చేరుకోవలసి ఉందో, దానికోసం సంఘం తన అస్తిత్వాన్ని నిలుపుకోవటమేగాక, శక్తిని ప్రతినిత్యమూ పెంచుకొంటూ సంపన్నవంతంగా చేసుకోవటం అనివార్యమైన అవసరం. ఇది సంస్థాగతమైన ప్రేమతోనో, చర్మాన్ని కాపాడుకొనే దృష్టితోనో ఇలా వ్యవహరిస్తున్నామన్న భావం మన మనస్సులో ఏనాడూ రానివ్వకూడదు. వాస్తవానికి సంపూర్ణ భవిష్యత్తును కనులముందుంచు కోవలసిన అవసరం ఉంది. సంఘంయొక్క అస్తిత్వాన్ని నిలిపిఉంచుకొనడానికి ఆయా సమయాలకు తగిన నీతిని అవలంబించవలసి వచ్చింది. భవిష్యత్తులోకూడా ఇటువంటి అనేక సందర్భాలు తటస్థపడవచ్చు.
1939లో డా|| శ్యామాప్రసాద్ ముఖర్జీ నాగపూర్ లో కొన్ని సంఘకార్యక్రమాలను వీక్షించారు. ఘోష్ తో కూడిన పథసంచలనం, గణవేషధారులైన స్వయంసేవకులు సమత చేయటం, దండతో ప్రయోగాలు చేయటంలో శిక్షణ నివ్వటం-ఇవన్నీ చూసి డాక్టర్టీని ఇలా ప్రశ్నించారు. "నా దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. అవన్నీ అలా ఉండనివ్వండి. మొదటిప్రశ్న ఏమిటంటే-ఈ విధమైన కార్యకలాపాలపై ఆంగ్లేయుల ప్రభుత్వం నిషేధం పెట్టకుండా, మీరు ఎలా నిభాయించుకు వస్తున్నారు?” బెంగాలులో డా॥ముఖర్టీగారి అనుభవంలో ఉన్న విషయమేమంటే నలుగురు మనుష్యులు ఒకచోట కలిస్తే చాలు, ప్రభుత్వం వారివెంటబడుతుంది. అలాంటి పరిస్థితులలో ఇటువంటి కార్యకలాపాలు బొత్తిగా కుదరవుకదా! ఇప్పుడు మనకు సామూహిక శారీరక కార్యక్రమాలు జరిగే ఈ దృశ్యం సాధారణమైనదిగా కనబడవచ్చు. కాని ఆంగ్లేయుల పాలనాకాలంలో ఇది అసాధారణమే. కాగా వాస్తవమేమంటే సంఘం ఈ విధమైన కార్యకలాపాలు చేయబూనినపుడు చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సంకటాలు దాపురించాయి. కాని సంఘం సమయానుకూలంగా రీతి-నీతి విషయాలో చిన్న చిన్న మార్పులు చేసికొంటూ తన అస్తిత్వాన్ని కాపాడుకొంది. చిన్న చిన్న విషయాలపైకూడా శ్రద్ధ వహించి సంపర్క క్షేత్రాన్ని పెంచుకొంది.
సంఘం కార్యకలాపాలు ఒకటొకటిగా నాటి ప్రభుత్వం దృష్టికి వస్తూ ఉండేవి. సంఘం విషయంలో ప్రభుత్వం ఏమి ఆలోచిస్తున్నది, ఏ విధమైన చర్యలు తీసుకోగోరుతున్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ డాక్టర్జీ, ఇతర కార్యకర్తలూ వాటికి తగిన విధంగా సంఘాన్ని నడిపేతీరులో ఏ విధమైన మార్పులు చేయాలి, అన్నవిషయం వారి పరిశీలనలో ఉండేది. తాత్కాలిక సమస్యలు అనేకం చుట్టూ ముసిరినా నిత్యమూ పెరుగుతూ ఉన్న శక్తితో సంఘం నిలిచి ఉండటం ఆనాటి ప్రశ్నలకు వారిచ్చిన జవాబు.
ఉన్నతమైన మహత్వాకాంక్షల కారణంగా-సంఘంద్వారా అన్ని పనులూ అమితవేగంగా జరిగిపోవాలని కోరుతూ ఉండటం ధ్యేయవాదులైన వ్యక్తుల ఆలోచనలలో సహజంగా జరిగేదే ఇటువంటి పరిస్థితులమధ్య సంఘంయొక్క శక్తి దినదిన ప్రవర్ధమానమౌతూ ఉండటం సంఘం చెక్కు చెదరకుండా నిలిచి ఉండటం- ఇది రెండురకాలుగా జవాబునిస్తుంది. మనకు ఎదురైన సమస్యలు వాస్తవానికి మనకు ఎదురు నిలబడగల్గిన సమస్యలు అయిఉండక పోవచ్చునన్నది మొదటిది. పెద్ద సమస్యలే ఎదురైనవి, అయినా మనశక్తితో ప్రజలందరినీ కూడగట్టుకొని, ఏదో ఒక ఉపాయంతో ఆ సమస్యయొక్క బెడద వదిలించుకోవటంలో విజయం పొందటం రెండవది.
ఈ సంఘం లేకుండినట్లయితే నేడు ఎట్లా ఉండేది ఎన్నెన్ని తాత్కాలిక సమస్యలు మనలను చుట్టుముట్టి ఉన్నవో అవన్నీ మరింత భయంకరరూపంలో ఉండేవిగదా! ఈ సమస్యలపట్ల సంఘం తన పూర్తి శక్తిని వినియోగించలేదనేమాట నిజమే అయివుండవచ్చు. అయితే మనకు ఎంతశక్తి ఉన్నదో తదనురూపమైన పరిణామాలు అన్ని క్షేత్రాలలోనూ సంభవిస్తూ ఉండటం మనం చూస్తున్నగదా!.