Balasaheb Deoras - బాళాసాహబ్ దేవరస్ |
: మత పతనానికి కారణాలు :
మన ఈ పతనానికి కారణాలుగా అనేక విధాలుగా వివరణ ఇవ్వబడుతూ ఉంది. మనం దాస్యాన్ని అనుభవిస్తున్న కాలంలో పోరాటాలు ఎడతెగకుండా చేయవలసి వచ్చినందున సమాజంలో నిరాశపేరుకుపోయిందని కొందరు చెప్తారు. వర్ణవ్యవస్థ భగ్నమైన కారణంగా ఇలా జరిగిందని మరికొందరంటారు. ఇలా అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నపటికీ అసలు విషయం ఏమిటంటే - మన సమాజంయొక్క సహజమైన , స్వాభావిక స్వరూపం లుప్తమై పోయినందుననే రకరకాల వికృత సమస్యలు మనముందు నిలిచి ఉన్నాయి. వీటిని ఎదుర్కొని పరిష్కరించాలంటే, సమాజంలో స్వాభావికశక్తిని నిర్మించటం అవసరం.
సమాజంలో స్వాభావిక (అంతర్గత) సామర్థాన్ని నిర్మించే పరంపర ఎప్పుడు స్థిరపడుతుందో, అప్పుడు సంఘకార్యం పూర్తయినట్లుగా అనుకోవచ్చు. ఇంగ్లాండులో ఇటువంటి సామర్థ్యం ఒక
పరంపరగా తల్లిపాలతోనే అందించబడుతున్నది. అక్కడ ఆడే నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమాలు, విద్యాబోధన ప్రతి ఒక్కటీ, అన్ని మాధ్యమాలు అందరికీ ఒకే రకమైన సంస్కారాలను అందించే ప్రక్రియలతో ఓతప్రోతమై ఉంటాయి. పిల్లలు అటువంటి కార్యక్రమాలతో ముంచెత్తబడతారు.
యూరప్ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినా, అమెరికాలోనూ, మరికొన్ని దేశాలలోనూ వలసపాలన నెలకొనినా, వారు తమ అంతర్గతశక్తిని నిరంతరంగా కాపాడుకొంటూ వచ్చారు. ఇంగ్లాండులో ఉండగా అల్లరిచిల్లరగా తిరుగుతూ ఒక గుండాగా భావింపబడిన రాబర్ట్ క్లైవ్, తిండికి కష్టమైనదశలో భారతదేశానికి పంపించబడ్డాడు. ఇక్కడకు వచ్చి అతడు 'ఆంగ్ల సామ్రాజ్య' సంస్థాపకుడైనాడు. ఏ దేశంలోనైతే తల్లిపాలతోపాటుగానే సంస్కారాలు కూడా లభిస్తాయో, అక్కడ క్లైవ్ వంటి గుండాలు కూడా దేశానికి చక్కగా ఉపయోగపడతాడు.
మలయాలో జరిగిన ఘటనలకు సంబంధించిన మరో ఉదాహరణను చూద్దాం. అక్కడ ఒక కర్మాగారంలో పనిచేసే చైనా కార్మికులు హింసాత్మక కార్యకలాపాలకు పూనుకొన్నారు. తనచుట్టూ ఉన్న ఆ చైనా కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడి ఆంగ్లేయుడైన కలెక్టరు మూడురోజులపాటు బయటికి రాలేదు. వేరేచోటనుండి అదనపు సైన్యబలగాలు వచ్చిన తర్వాత వారిని తోడుచేసుకొని ఆ కర్మాగారం దగ్గరకు వెళ్లాడు. అయితే ఈ లోపల మరొక కర్మాగారంలో పనిచేసే యూరోపియన్ మేనేజర్ ఒకడు తన దగ్గర ఉన్న రెండు పిస్తోళ్లను తీసికొని, ఒక్కడుగా ఆ కర్మాగారంవద్దకు వెళ్లి, పిస్తోళ్లు పేల్చి అక్కడ జరుగుతున్న హింసాకాండను అదుపులోకి తెచ్చాడు. ఈ విషయమంతా తెలుసుకొన్న ప్రభుత్వం ఆ కలెక్టరును బాధ్యతలనుండి ముక్తునిచేసి ఇంగ్లాండుకు పంపించి వేసింది. అతని భార్యకూడాఇంతటి పిరికివాడిని నేను భర్తగా అంగీకరించలేను' అంటూ అతనికి విడాకులు ఇచ్చివేసింది. విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఇంగ్లాండులో ఇటువంటి ఆదర్శం ఎలా నెలకొన్నది? అంటే దేశభక్తినిగురించి ఉత్తృష్ట సంస్కారాలు స్వాభావికమైన రూపంలో అక్కడ అందుతున్నందునే.