డా. మోహన్ భాగవత్ జీ |
జీవితం విజయంవంతం కావటమే కాదు, అర్థవంతమూ కావాలి
ప్రగతి గురించి మనకు ఒక కల్పన ఉంది. పాశ్చాత్యులకు మరొకటి ఉంది. మన ఆలోచన ప్రకారం ముందుకు సాగాలి. అంధానుకరణం ద్వారా ఇతరులు ఎలాగైతే సమస్యలు కొనితెచ్చుకున్నారో అదే పని మనం కూడా ఎందుకు చేయాలి ? అందరి ప్రగతి, సంతులిత ప్రగతి అనేవి నేడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తున్న, ఆలోచిస్తున్న అంశాలు.
సుస్థిర ప్రగతి ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. దీనికి అవసరమైన ఆలోచనా విధానం మన దగ్గర ఉంది. గతంలో దీనికి సంబంధించిన ఉదాహరణలు మనం ప్రపంచం ముందు ఉంచాం కూడా. ఆధునిక ప్రపంచానికి అవసరమైన మోడల్ మనం ప్రపంచానికి అందించగలం. ఈ దిశగా మనం ఆలోచించాలి. డబ్బుకు అవసరానికి మించి ప్రాధాన్యమిస్తే అనేక సమస్యలు వస్తాయి. కొన్ని పరిమితులకు లోబడి అర్థకామాలను తీర్చుకోవాలి. సంపాదనే సర్వస్వం కాదు. నాలుగుచేతులా సంపాదించాలి. కానీ అలాగే పంచిపెట్టాలి కూడా. ఇది చాలా ముఖ్యమైన విషయం. సంపాదించడం కంటే సంపాదించినది ఎలా వినియోగించాలి, ఎందుకు వినియోగించాలన్నది ముందు తెలుసుకోవాలి. విజయవంతమైన (సక్సెస్ ఫుల్) జీవితం కావాలి. కానీ అది అర్థవంతమైనదై (మీనింగ్ ఫుల్) ఉండాలని మనం చెపుతాం. అందుకు మనం ప్రాధాన్యమిస్తాం. ఇలా ప్రతి విషయానికి సంబంధించి మనదంటూ ఒక ఆలోచన ఉంది. మన దేశంలో అందరూ ఆ ఆలోచనను ఆచరణలోకి తెచ్చేందుకే ప్రయత్నిస్తారు. అలాంటి హిందుత్వాన్ని గురించి మేము మాట్లాడతాం. దాని అధారంగా సద్గుణాలను నింపి వ్యక్తులను తీర్చిదిద్దడమే మా పని.
సర్వేషాం అవిరోదేన. ఎవరిపట్ల మా మనస్సుల్లో ఎలాంటి చెడు ఆలోచన ఉండదు. లేదు. అలాంటి హిందుత్యానికి మూడు ముఖ్య అంశాలున్నాయి. దేశభక్తి, పూర్వజులపట్ల గౌరవం, సంస్కృతి, వీటిగురించి ఎలాంటి వివాదం ఉండాల్సిన అవసరం లేదు. ఇవి అందరూ కోరుకునేవీ, అందరికీ ఉండాల్సినవి. తెలిసో, తెలియకో మనమంతా వాటిని ఆచరిస్తాం. కాస్త మనలోపల మనం తొంగి చూసుకుంటే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఇన్ని విషయాలు ఉన్నప్పుడు ఆధునిక కాలంలో మనం ప్రత్యేక రాజ్యాంగాన్ని ఎందుకు రూపొందించుకుని, అనుసరిస్తున్నాము అనే ప్రశ్న వస్తుంది. మన రాజ్యాంగం ఈ విషయాలన్నింటి సారాంశం. కాబట్టే దానిని అనుసరించడం మనందరి కర్తవ్యం సంఘం ఈ విషయాన్ని మొదటినుంచీ చెపుతోంది. ఇప్పటివరకూ నేను ఏది చెప్పానో అదే అక్కడ ఉంది. అయితే చెప్పిన పద్ధతి, భాష మారి ఉంటాయి. ఈ రాజ్యాంగం ఏదో అలా తయారైపోలేదు. ఎక్కడి నుండో ఊడి పడలేదు. వేల సంవత్సరాల తరువాత మనదైన జీవనాన్ని రూపొందించుకునేందుకు, స్వీయపాలనకు అవకాశం వచ్చినప్పుడు అనేకమంది మేధావులు, సామాజికవేత్తలు కలిసి ఎంతో ఆలోచించి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. అందులో ప్రతి మాట గురించి విస్తృతమైన చర్చ జరిగింది. అంతటి చర్చ తరువాత ఏర్పడిన సర్వసమ్మతి ద్వారా రాజ్యాంగం రూపొందింది.
ఇందులో ప్రస్తావన (ప్రియాంబుల్) ఉంది. అందులో పౌరుని బాధ్యతలు ఏమిటో వివరించారు. ఈ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలూ ఉన్నాయి, పౌరుల హక్కుల గురించి కూడా ఉంది. వీటి ఆధారంగా ఏర్పడిన చట్టాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఈ చట్టాలు రూపొందించడానికి, తగిన మార్పులు చేయడానికి పార్లమెంటు ఉంది రాజ్యాంగాన్ని సరిగా వ్యాఖ్యానించడానికి కోర్టుల అభిప్రాయం తీసుకుంటారు. ఇది ఒక వ్యవస్థ, దీనిని అనుసరించాలి. రాజ్యాంగంలో పేర్కొన్న విషయాలు అన్నీ సర్వసమ్మతి ద్వారా ఏర్పడినవి కాబట్టి వాటిని అందరూ గౌరవించాలి, ఆనుసరించాలని మేం బావిసాం. అలాగే నడుచుకుంటాం. రాజ్యాంగపు ప్రస్తావన ఒకసారి చదువుతాను.
'వుయ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, హావింగ్ సాలమ్'లీ రిజాల్వ్డ్ టు కానిస్టిట్యూట్ ఇండియా ఇన్టూ ఏ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్' ఇందులో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు తరువాత వచ్చి చేరాయి. అయితే ఇప్పుడు ఉన్నాయి. అందుకే వాటిని కూడా చదివాను. "అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటన్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ''. ఇంకా ముందుకు చదివితే మరొక ముఖ్యమైన విషయం ఉంది. దీని గురించి డా|| ఆంబేడ్కర్ రాజ్యాంగసభ సమావేశంలో ప్రస్తావించారు. 'అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రాటర్నిటీ అష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిడ్యువల్ అండ్ ది యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ది నేషన్'. మన పరస్పర కలహాలవల్ల విదేశస్తులు మనల్ని బానిసల్ని చేయగలిగారు అని రాజ్యాంగ సభలో ఆయన అన్నారు. ఇక్కడ కేవలం నేను ఆయన చెప్పిన విషయాన్ని చెపుతున్నాను. మీరు ఆయన ఉపన్యాసాన్ని చదివి తెలుసుకోవచ్చును. 'ఇప్పుడు మనం ఈ సభలో మాట్లాడుతున్నాం. పరస్పర వ్యతిరేకమైన ఆలోచనలు, భావాలను వ్యక్తం చేస్తున్నాం. అయినా వీటన్నింటికీ మించి మనమంతా ఒకటేననే భావాన్ని మనం
ఏర్పరచుకోకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో ఊహించలేం'అని ఆంబేడ్కర్ హెచ్చరించారు.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం - డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..