బాళాసాహబ్ దేవరస్ |
కార్యంయొక్క లక్ష్యము
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యం ఒక సార్వజనిక కార్యం. పరిస్థితులననుసరించి ఈ పనిలో కొద్దిపాటి మార్పులు వస్తూ ఉండటం సహజం. పరిస్థితులు మారుతున్నపుడు వాటికి అనురూపమైన విధంగా సంఘం ఆలోచనా విధానాన్ని వివరించే తీరులో మార్పు చేయబడుతూ ఉంటుంది. కాబట్టి సంఘంలో కనిపించే ఈ పద్దతుల మార్పును చూసి సంఘమే మారిపోయిందని భ్రమపడకూడదు. 1940కి ముందు, ఆ తర్వాత ఉదాహరణలు భిన్నమైనవిగా ఉన్నప్పటికీ ఆధారభూతమైన ఆలోచన-సిద్ధాంతము మార్పుచెందనవిగా సమానత్వం గల్గినవిగా ఉన్నవి.
హిందూ సమాజాన్ని సంఘటిత పరచి, శక్తిశాలిగా రూపొందించటం సంఘంయొక్క ఉద్దేశ్యం. ఇది ఒక భావాత్మక (కళ్లకు కనబడనిది, ఊహతో గ్రహించవలసింది) ఆలోచనల అయినందున దీనిని అర్థం చేసుకోవటం కొంచెం కఠినమైన పని. దీనికి బదులుగా రెండుమూడు సంవత్సరాలలో అందుకోగల లక్ష్యమైతే (ఉదాహరణకు దేశంలో ఆంగ్లేయుల రాజ్యాన్ని సమాప్తం చేయాలి) అది వెంటనే అర్థమవుతుంది. సంఘంయొక్క లక్ష్యం గ్రహించడానికి కఠినంగా ఉన్న కారణంగాన సంఘకార్యం ఎప్పటివరకూ చేస్తూ ఉండాలి అన్న ప్రశ్న లేవనెత్తబడుతూ ఉంటుంది. అలాగే మనశక్తి ఎలాంటిది? ఎంత ఉన్నది? వంటి ప్రశ్నలుకూడా.
వీటిని అర్థం చేసుకోవాలంటే మనం సంఘంయొక్క అంతిమ లక్ష్యాన్నిగురించి ఆలోచించాలి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూసమాజాన్ని సామర్థ్య సంపన్నం చేయగోరుతున్నది. ఈ నిర్మాణమయ్యే సామర్థ్యం సమాజంలో స్వాభావిక రీతిగా ఎప్పటికీ నిలిచి ఉండాలని సంఘం కోరుతున్నది. సామాజం యొక్క రక్షణ బయటఉండే ఏదో సంఘటన (సంస్థ-ఉద్యమం)ద్వారా చేయబడుతూ ఉండటం సరైన పద్ధతి కాదు. తమదెన.ఒక విశిష్ట పద్దతిలో వ్యవహరిస్తుండే (నడచుకొనే) వ్యక్తుల సమూహాన్నే సమాజమని అంటారు. గారడీ చూడడానికో, సినిమాజూడడానికో ఒకచోట చేరిన గుంపును సమాజమని అనరు. సమాజము అనిపించుకోవాలంటే, విశిష్టమైన వ్యవహారం గల్గిన ఆ వ్యక్తులమధ్య ఒక స్వాభావిక వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే, ఆ వ్యవస్థలోనే సమాజంయొక్క సామర్థ్యం నిహితమై ఉంటుంది. సమాజంలో దాగిఉన్న సామర్థ్యం జాగృతమైనపుడు అది తాను ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా పరిష్కరించుకొనడానికి తనంతతానుగా సిద్ధమవుతుంది. సంఘం ఇటువంటి స్వాభావిక సామర్థ్యాన్ని మేల్కొలిపేపని చేస్తున్నది. కాగా ఈ పనిని ఆచంద్రతారార్కం ఇలాగే చేస్తూ ఉంటాం అనే అభిప్రాయం మనకు ఏనాడు లేదు.
మరి ఇది ఎలా సంభవమవుతుంది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండుయొక్క ఉదాహరణ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ తగిన దిశా నిర్దేశం చేస్తుంది. ఈ మహాయుద్ధం కొట్టిన చెంపడెబ్బకు ప్రాస్సు, పోలెండువంటి దేశాలు కొద్దికాలంలోనే కుప్పకూలిపోయాయి. ఇంగ్లాండు కూడా తనవద్ద మిగిలిన కొద్దిపాటి శస్త్రాస్త్రాలను మూటగట్టుకొని డంకర్క్ నుండి పారిపోయింది. ఇంక ఇంగ్లాండు పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. ఇంగ్లాండు జర్మనీతో సంధి కుదుర్చుకుంటుందని అంచనావేయసాగారు. ఫ్రాన్స్ పతనమైన దరిమిలా 1940లో మార్షల్ పెటావ్, మార్షల్ డేబిన్లు జర్మనీతో సంధి కుదుర్చుకున్నారు.
అయితే 1945లో ఎప్పుడైతే ఇంగ్లాండు విజయం సాధించిందో అప్పుడు ఆ ఇద్దరిపై దేశద్రోహానికి పాల్పడ్డారంటూ నేర విచారణ జరిగింది. మరి ఇంగ్లాండుకి ఈ విధమైన విజయం ఎలా లభించింది? వదిలిపెట్టకుండా కర్తవ్య నిర్వహణ చేయటంలోనే విజయ రహస్యందాగి ఉన్నదని చరిత్ర సాక్షమిస్తున్నది. ఆంగ్లంలో ఒక సామెత ఉంది God helps those who help themselves తమకు తాము సహాయం చేసుకొనేవారికే భగవంతుడు సహాయం చేస్తాడు. అనేక వాస్తవాలు, తథ్యాలు ఇంగ్లాండు విజయానికి దారితీసి ఉండవచ్చు. కాని వారి విజయానికి ముఖ్యంగా కారణభూతమైనవి వారిలోని సాహసము, దృఢ నిశ్చయము, కఠోర పరిశ్రమలు. ఇంగ్లాండు విజయానికి ముఖ్యకారణమని ఆ ఘనత నాటి ఇంగ్లాండు ప్రధానమంత్రి చర్చిల్ కి ఆపాదిస్తుంటారు. అది సరైనదికాదు.
విజయంసాధించిన తర్వాత అన్ని సంస్థలు కలసి చర్చిల్ పట్ల గౌరవపూర్వకంగా ఒక విందు ఏర్పరచినవి. క్లెమెంట్ అట్లీ వంటి విపక్షనేత చర్చిల్ను ఉద్దేశించి 'మీరు ఇంగ్లాండు సింహం' (You are the Lion of England) అంటూ ప్రస్తుతించాడు. అహంకారిగా మహత్వాకాంక్షిగా పేరుపడిన చర్చిల్ దానికి జవాబుగా “కాదు, మీరందరూ సింహాలు, మీ బలాన్ని ఆధారం చేసుకొనే నేను గర్జించాను (No, I am not the Lion, yor are all Lions, I simply roared for you) అని చెప్పారు.