డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: సంఘ కార్యపద్ధతి లేదా రీతి నీతి :
ప్రశ్న : సూచన లభించిందంటే ఆలోచన సమాప్తమే అని సంఘంలో చెబుతుంటారు. ఇది నియంతృత్వం కాదా ?
సంఘంలో సర్ సంఘచాలక్ పదవికి ఎన్నికలు ఎందుకు జరుగవు ?
సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా ? సంఘంలో ఆడిటింగ్ జరుగుతుందా ?
హిందూ ధర్మ రక్షణలో సిక్కులకు ప్రధానపాత్ర ఉంది. సంఘం కేవలం మహారాణా. ప్రతాప్ మరియు శివాజీ మహారాజు గుణగానం మాత్రమే చేస్తుంది. ఎందుకిలా ?
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యువకులకు దిశానిర్దేశం చేయడానికి ఏమేం చేస్తోంది ?
జవాబు : ఈ ప్రశ్నలకు నేను వరుసక్రమంలో జవాబులివ్వడం లేదు, కానీ అన్నింటికి జవాబిస్తాను. ఇపుడే నేను చెప్పాను, 'చతుర్వేదాః పురాణాని...' అందులో గురుగ్రంథ సాహెబ్ పేరు కూడా పేర్కొనబడిందిగదా ! నేను చెప్పిన శ్లోకాన్ని మేము రోజూ ఉదయమే పఠిస్తాము. అందులో గురునానక్, గురుగోవింద సింగ్ల పేర్లను ప్రతిరోజూ స్మరిస్తాము. దానిని మేము ప్రాతఃస్కరణ అంటాం. ఆ స్తోత్ర మాలికను ఏకాత్మతా సోత్రం అంటాం.
రాజాభావూ పాతూర్ కర్ పంజాబుకు ప్రాంతప్రచారక్ గా ఉండేవారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక, సిక్కుల బలిదాన చరిత్రను చిత్ర ప్రదర్శినిగా తయారుచేసి ఆయన దేశంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించారు. వాళ్ళు కేవలం సిక్కులకే కాదు అందరికీ గురువులే సిక్కుమతంలో జన్మించారు. కానీ దేశం, ప్రపంచానికే వారు గురువులు. మేము అందరినీ గౌరవిస్తాము. ఈ మధ్యనే నేను ఢిల్లీలో ఉపన్యసించాను, అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది. సిక్కు బంధువులది గౌరవపూరిత చరిత్ర, అది మనందరి చరిత్ర. కాబట్టి మేం దాన్ని గౌరవిస్తాం మరియు విశేష ఆదరభావనతో వారిని చూస్తాం. ఇది మా మనసత్వం.
ఇక సంఘం రిజిష్టర్ ఎందుకు కాలేదు ? అనే విషయం. ఎందుకంటే సంఘం ప్రారంభమైనపుడు, స్వతంత్ర భారత ప్రభుత్వం లేదు. 1925 నాటి విషయం. అపుడు అది మొదలై నడిచింది. స్వాతంత్య్రం వచ్చాక కూడా నడుస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక వచ్చిన చట్టాలలో ప్రతి సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయబడాలి అనే చట్టమేదీ లేదు. కానీ సంఘం Body of Individuals అనే దాని ఆధారంగా నడుస్తోంది. అలా Body of Individuals అనే Status ఆధారంగా చట్టపరంగా మేము పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల ప్రభుత్వం మా జమా ఖర్చుల గురించి అడగదు. అయినా మేము ప్రతి శాఖలోనూ ఒక్కొక్క పైసా గురించి జమాఖర్చులు వ్రాసిపెడతాం. ప్రతి సంవత్సరం మేము ఆడిటింగ్ చేస్తాం. అది కూడా అడిటింగ్ని యమాలకనుగుణంగా జరుగుతుంది. ఇందులో మేము దేనినీ దాచిపెట్టం. ప్రభుత్వం ఎప్పుడు కోరినా, మా జమాఖర్చుల వివరాలు చూపడానికి మేము సిద్దంగా ఉన్నాం. మేము చట్టాన్ని గౌరవిస్తూ ముందుకువెళ్లే వాళ్ళం. అంతర్గత ఆడిటింగ్ మా సంస్థలో జరుగుతుంది. అంతర్గత ఆడిటింగ్ చేయడంకోసం మేము బయటివాళ్ళను ఛార్జెడ్ అకౌంటెంట్స్గా నియమించుకున్నాము. ఏ పద్ధతిలో జమాఖర్చుల వివరాలు ఉండాలో అదే పద్దతిలో మా లెక్కల పుస్తకాలను తయారుచేయడం జరుగుతుంది. బ్యాంకు ఖాతాల ద్వారా అన్ని వ్యవహారాలు జరుగుతాయి. ఒక్క పైసా కూడా మేము దుర్వినియోగం చేయము.
ఇక సర్ సంఘచాలక్ పదవికి ఎన్నికలు ఎందుకు జరగవు అనేది. ఎందుకంటే 'సర్ సంఘచాలక్ డా|| హెడ్దేవార్' ఉండేవారు, ఆయన తర్వాత గురూజీ ఉండేవారు. ఆయన తర్వాత ఇతరులున్నారు. కాబట్టి అదొక శ్రద్దాస్థానం లాంటిది. నా తర్వాత ఎవరు సర్ సంఘచాలకులు అవుతారు అనేది నా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎప్పటిదాకా సర్ సంఘచాలక్ గా ఉంటానన్నది కూడా నా నిర్ణయంమేరకే ఆధారపడి ఉంటుంది. కానీ నేను తెలివితేటలు, జాగరూకత కల్గి ఉన్నంతవరకే నా పదవి, అధికారం ఉంటుంది. సంఘంలో నాకున్న అధికారం ఏమిటంటే, ఏమీ లేదు. నేను కేవలం మిత్రుడిని మార్గదర్శకుడిని మరియు దార్శనికుడిని (friend, guide and philosopher) మాత్రమే. సర్ సంఘచాలక్ కు ఇంకేమీ చేసే అధికారం లేదు. సంఘంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి సర్ కార్యవాహ, ఆయన చేతిలో అన్ని అధికారాలు ఉంటాయి. ఒకవేళ ఆయన, ఇదంతా ఆపేసి వెంటనే నాగపూర్ కు వెళ్ళిపో అంటే, నేను ఈ వేదికపైనుండి వెంటనే దిగి వెళ్ళిపోవాల్సిందే.
'సర్ కార్యవాహ' ఎన్నిక తప్పకుందా ప్రతి 3 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. ప్రభుత్వానికి సంఘం తన లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చినప్పటినుండి నేటివరకూ మా ఎన్నిక ఏదీ కూడా ఒక్కరోజు కూడా వాయిదా వేయబడలేదు. అట్టడుగునఉన్న శాఖలు ప్రాంత ప్రతినిధులను ఎన్నుకుంటాయి. వేర్వేరు స్థాయిల సంఘచాలకుల ఎన్నిక జిల్లా, విభాగ్, ప్రాంత, క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అలాగే అఖిల భారతీయ ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కలిసి ప్రతి మూడుసంవత్సరాలకు సర్ కార్యవాహ ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ అంతా మా విధివిధానం ప్రకారమే, పూర్తిగా భావపూరిత దృష్టితోనే జరుగుతుంది. ఇలా బహుశ: ప్రపంచంలోనే నియమితంగా ఎన్నికలు జరిగే సంస్థ సంఘం మాత్రమే. కేవలం సంఘంమీద నిషేధం ఉన్నపుడు, అది కూడా అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సంవత్సరమే, సంఘంలో ఎన్నికల సంవత్సరంకూడా కావడంతో, ఆ సంవత్సరం ఎన్నిక జరగలేదు. అయితే నిషేధం తొలగించిన తర్వాత మొదటి ప్రతినిధి సభ జరిగినపుడు, అందులో మొదటిపని ఎన్నికలు నిర్వహించు కోవడమే చేశాం. కాబట్టి ఈ విషయంలో మేం చాలా పద్దతిగా ఉన్నాం.
సూచన వచ్చిందంటే చాలు ఆలోచన సమాప్తమే అనేది నిజమే. కానీ సూచన రావడానికి ముందు జరిగే తంతు ఇందులో పేర్కొనలేదు. సూచన అనేది చాలా చర్చజరిగాక వస్తుంది. నేను గత రెండు రోజులుగా ఉపన్యాసాలిస్తున్నాను. ఇపుడూ మాట్లాడుతున్నాను. నేను నా మనసుకు తట్టింది మాట్లాడుతున్నానని మీకన్పిస్తుండవచ్చు, దీనికన్నా ముందు, నేను సంఘ అధికారులందరితో ఈ ఉపన్యాసాలలో ఏ విషయాలను ప్రస్తావించాలి, ఏ విషయాలను ప్రస్తావించరాదు అనే విషయమై చర్చించడం జరిగింది. నేను ఫలానా విషయం ప్రస్తావిస్తానంటే, వారు లేదు లేదు, ఆ విషయం అవసరం లేదంటే, నేను అలాంటి దాన్ని వదిలేశాను. నేనిక్కడ చెబుతున్నదంతా సంఘ అనుమతితోనే మాట్లాడుతున్నాను. అలాగని నేనిక్కడ మాట్లాడేదాన్ని సంఘంలో ఎవరూ వ్యతిరేకించరు. సూచన వచ్చింది. ఆలోచించడం సమాప్తం నిజమే కానీ సూచనకు ముందు చాలా ఆలోచించడం జరుగుతుంది. నేను ప్రతిపాదించే విషయాలేవైనా, అవన్నీ ఆ ఆలోచనాను సారమే మాట్లాడుతున్నాను. ఇది సంఘ పద్దతి. ఇది ప్రజాస్వామ్యం. మీకు, ఇదంతా నచ్చెప్పే వ్యవహారం అన్పిస్తుండవచ్చు. ప్రజాస్వామ్యపు మూలతత్త్వమే ఏకాభిప్రాయ నిర్మాణం. అలాగే మన దేశ రాజ్యాంగం రూపొందింది.
సంఘంలో కూడా ప్రతి విషయమూ ఇలాగే సర్వానుమతితోనే నిర్ణయమవుతుంది. అందువల్లే మేము సూచన వచ్చిందంటే ఆలోచన అవసరం లేదు అంటుంటాం. మీరు ఏ వ్యక్తినైనా ఫలానా పనిచేస్తారా ? అంటే అతడు ఆ పని చేయడు. అది జరిగేది కాదంటాడు. అయినా సరే ఆలోచించడం ఆపేయరు. మరెప్పుడు పనిచేస్తాడు ? అందరూ కలిసి విషయాన్ని ఆలోచించి, సర్వానుమతి లభిస్తే అపుడు చేస్తాడు. అదే మేము చేస్తాం, కాబట్టే మేము ఆలా చెప్పగలము. ఇలా చెప్పడంవల్ల దానిని పాటించడమూ జరుగుతుంది. అంతేకాదు మనసు పెట్టి చేయడమూ జరుగుతుంది. అంతేతప్ప నిరంకుశత్వం కారణంగా మాత్రం కాదు.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..