డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: సంఘం మరియు రాజకీయ పార్టీలు :
ప్రశ్న: సంఘానికి రాజకీయాలతో సంబంధం లేకపోతే, భారతీయ జనతా పార్టీలో సంఘటనా కార్యదర్శిని సంఘమే ఎందుకిస్తున్నది?
సంఘం ఇతర పార్టీలకు లేదా సంస్థలకు ఇప్పటివరకూ ఎపుడైనా తన సమర్ధనను అందించిందా ?
రాజకీయాలలో ముందుకు పోవడానికి వ్యక్తులు సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారా?
మతం, కులం ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి. అలాంటపుడు రాజకీయాలపట్ల సంఘానికి ఎలాంటి అభిప్రాయం ఉంది ?
రాజకీయాలు స్మశానం-కబ్రిస్గాన్లు, కాషాయ తీవ్రవాదం లాంటి వాటినుండి ఎపుడు బయటపడతాయి ?
జవాబు : సంఘటనా కార్యదర్శి కావాలని ఎవరగుతారో, వారికే సంఘం ఇస్తుంది. ఇప్పటివరకూ మిగతావారెవరూ అడగలేదు. అడిగితే అప్పుడు ఆలోచిస్తాం. వారి పనితీరు బాగుంటే కచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే 93 ఏళ్ళుగా మేము ఏ రాజకీయ పార్టీని సమర్థించలేదు. కానీ మేము ఒక విధానాన్ని సమర్థించడం మాత్రం కచ్చితంగా చేశాము. ఆ విధానం మా శక్తిని పెంపొందింపజేసేదైతే అలాంటిదాన్ని తప్పనిసరిగా సమర్థించాం. అలాగే అది ఆ రాజకీయ పార్టీలకూ లాభిస్తుంది. అలాంటి లాభాన్ని పొందాలనుకున్నవారు తీసుకుంటారు. ఇష్టం లేనివారు అలాగే మౌనంగా ఉండిపోతారు. అత్యవసర పరిస్థితి సమయంలో మనం దాన్ని వ్యతిరేకించాం, అంటే అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించే విధానాన్ని ఎంచుకున్నాం. అనేకమంది అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడారు. పోరాటంద్వారా జనసంఘ్ లాభపడుతుందని మేము ఆలోచించలేదు.ఆ పోరాటంలో బాబూ జగ్జీవన్ రాం కూడా ఉన్నారు. అందులోనే ఎస్.ఎం.జోషి, ఎన్.జి.గోరె కూడా ఉండేవారు, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఏ.కె.గోపాలన్జీ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా లాభమే కలిగింది.
స్వయంసేవకులు అందరికొరకు పనిచేశారు. రామమందిర నిర్మాణం అనే అంశం ఆధారంగా జరిగిన ఒకే ఒక ఎన్నికల్లో మేము తీసుకున్న విధానాన్ని కేవలం భా.జ.పా. మాత్రమే సమర్థించింది. అపుడు కేవలం భా.జ.పా.కు మాత్రమే లాభం కలిగింది. ఎపుడైతే అది ఒక కూటమిగా ఇతర పార్టీలతో కలిసిందో, అపుడా కూటమిలోని వారందరికీ లాభం జరిగింది. ఆ విధంగా మేము విధానాన్ని గౌరవిస్తాం, అంతేగానీ పార్టీలను ఎపుడూ సమర్థించలేదు, సమర్థించంకూడా. మా సమర్థన కారణంగా లాభం కలిగితే, దాన్ని ఎలా అందుకోవాలి అనే ఆలోచన చేయాల్సింది వాళ్ళ పనే. రాజకీయాలు వాళ్ళు చేస్తారు, మేం కాదు.
సంఘాన్ని ఉపయోగించుకోవడం-ఈ పదప్రయోగం మీరు చేశారు, ఇది చాలా కష్టమైనపని, ఇది జరిగే పని కాదు. సంఘంద్వారా ఎప్పుడూ అలా జరగలేదు. నేడు చాలామంది వస్తుంటారు ఫోటోలు తీసుకుంటుంటారు. అపుడపుడు తమ దరఖాస్తుతోపాటు వాటిని జోడిస్తుంటారు. మీరు చెప్పినట్లుగా ఈ దరఖాస్తు ఎక్కడికి చేరుతుందో, అక్కడ కూర్చున్న సంఘటనా కార్యదర్శి స్వయంసేవక్ అయి ఉంటారు, వారికి తెలుసు ఈ ఫోటో అర్థం ఏమిటన్నది ? లాభం కలుగదు సరికదా, నష్టమే జరుగుతుంది. మేం ఒక కార్యపద్దతిని ఏర్పరచుకున్నాం. అందులోకి ఎవరు వచ్చినా, వారు అప్పటివరకూ ఎలా ఉన్నా, మాకు ఎలా కావాలో అలా తయారై బయటికెళ్తారు. ఒక వేళ మనసులో స్వార్థం లాంటివి ఉన్నా, గట్లు తెగిపోతాయి. అంతేగానీ సంఘకార్యంలో జీవితాంతం ఉండిన తర్వాతకూడా, ఒక్కసారి అయినా ధన్యవాదాలు ఎవరూ చెవ్పరు. పొందడం మాట అలా ఉంచి, అంతా ఇవ్వడమే ఇవ్వడం.
మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్ గా 'బాబారావ్ భిడేజీ' ఉండేవారు. ఆయన స్వయంసేవకులతో, సంఘంలో 'యాద్యా' తయారుచేస్తారు అంటుండేవారు. మరాఠిలో 'యాది' అంటే సూచీ (జాబితా)అని అర్ధం. కానీ ఆ అక్షరాలను విడివిడిగా గ్రహిస్తే 'యా ( మరియు 'ద్యా' (ఇవ్వాలి) అని అర్థం వస్తుంది. సంఘంలో యాద్యా పని జరుగుతుంది. వచ్చి ఇచ్చేవారు ఉంటారు. ఇచ్చి పుచ్చుకోవడమేమీ ఉండదు. అదీ సంఘమంటే. అయినా కూడా ఒకరిద్దరు తెలివిమీరినవారు ఉండవచ్చు. మేమేం చేయగలం? సంఘానికి మీరువచ్చి, ఎక్కువ సమయం సంఘంతో ఉంటే, మీరుకూడా సంఘంవారే అయిపోయే ప్రమాదముందని మాత్రం మీకు నేను చెప్పగలను.
రాజకీయాలనేవి లోక కల్యాణం కోసం నడవాల్సినవి. లోక కళ్యాణానికి మాధ్యమం రాజకీయ అధికారం అవుతుంది. అంతవరకే అధికారం కల్గిన రాజకీయాలు నడవాలి. అంతకంటే ఎక్కువ నడవకూడదు. జయప్రకాశ్ నారాయణ్, గాంధీజీల కోరిక ప్రకారం దేశం కోరిక ప్రకారం రాజకీయ పార్టీలవారు నడిస్తే, మీరడిగిన అయిదవ ప్రశ్న తలెత్తదు. శ్మశానము-కబ్రిస్థాన్, కాషాయ తీవ్రవాదం లాంటి పదప్రయోగాలు జరగనే జరగవు. రాజకీయాలు లోకకళ్యాణం కోసం కాక కేవలం అధికారం కోసమే నడిచినపుడు, ఇలాటి విషయాలన్నీ వస్తాయి. ఈ విధమైన శిక్షణ అక్కడ ఇవ్వబడాల్సిన అవసరముంది. రాజకీయాల్లో ఉన్నవారు, దానిగురించి ఆలోచించాలి.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..