డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:సంఘం-అల్ప సంఖ్యాకులు:
ప్రశ్న: అల్పసంఖ్యాకులను మిగతా సమాజంతో జోడించే విషయమై సంఘం ఎలా ఆలోచిస్తుంది.?
"Bunch of Thoughts"లో ముస్లిం సమాజాన్ని శత్రువురూపంలో సంబోధించడం జరిగింది. ఈ ఆలోచనతో సంఘం ఏకీభవిస్తోందా ? సంఘం గురించి ముస్లిం సమాజంలో ఉన్న భయాన్ని, వారినుండి ఎలా దూరం చేయగలము?
జవాబు : అల్ప సంఖ్యాకులు అనే పదాన్ని ఏ అర్థంలో వాడుతున్నారో మనకిప్పటికీ స్పష్టత లేదు. మతాలవారీగా, భాషలవారీగా వారి జనసంఖ్య గురించిన ప్రశ్నకు వస్తే మనదేశంలో మొదటినుండి అనేక మతాలవారు, భాషలవారు ఉన్నారు. మనం స్వతంత్రులుగా ఉన్నపుడు లేదా ఆంగ్లేయులు రాకముందు అల్పసంఖ్యాకులు అనే పదం వాడుకలో లేదు. మనమందరమూ ఒక సమాజానికి చెందినవారము, ఒక మాల (దండ)గా కలసిమెలసి నడుస్తున్నవారము. ఇప్పుడు అది లేకుండా పోలేదుగాని ఒక మాట మాత్రం ఖచ్చితం, దూరం పెరిగింది. అల్పసంఖ్యాకులను జోడించడమిలా కాదు, మన సమాజానికి చెందిన వాళ్ళు ఎవరైతే చెల్లాచెదురైపోయారో, వాళ్ళను జోడించే ప్రయత్నం జరగాలి. అన్నది నా ఆలోచన. ప్రయోగించే భాష కూడా పరిణామం చూపుతుంది కదా !
అల్పసంఖ్యాకులు అంటే మేము వేరు, మీరు వేరు, మమ్మల్ని కలుపుకోవాలి అనేది కాదు. ఎందుకు జోడించుకోవాలి? జోడించడంవల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి. అలాగైతే ఒకవేళ అభివృద్ధి జరగకపోతే ఒకరు మరొకరిని వదిలేయాల్సిందేనా ? మనమంతా ఒకదేశపు సంతానం,. అన్నదమ్ముల్లాంటి వాళ్ళం. అయితే 'అల్పసంఖ్యాకులు' అనే పదం పట్టనే సంఘానికి తనదైన తటపటాయింపు ఉంది. ఈ పదాన్ని సంఘం అంగీకరించజాలదు.అందరూ మనవాళ్ళే కానీ దూరమయ్యారంతే. కాబట్టి ఇపుడు జోడించాలి. ఈ భావనతో మేము మాట్లాడతాము.
ముస్లిం సమాజంలో, ఈ విషయమై ఏదైనా భయం ఉంటే, నేను నిన్న చెప్పిన పద్దతిలో వెళ్ళకండి. మీరు వచ్చి, సంఘాన్ని లోపలినుండి చూడండి. సంఘానికి మంచి శాఖలున్నచోట, పక్కనే ముస్లిం బస్తీలు గనుక ఉంటే, వారికి అక్కడ మరింత ఎక్కువ సురక్షిత వాతావరణం ఉంటుందని నేను హామీపూర్వకంగా చెప్పగలను. కాబట్టి వెళ్ళి చూడండి. మా ఆహ్వానం జాతీయతకు సంబంధించింది. ఆ జాతీయత ముస్లింలు, క్రైస్తవులు మరియు పరంపరకంతటికీ చెందినది. దానిపట్ల గౌరవం, మాతృభూమిపట్ల, భక్తికి సంబంధించింది; అదే హిందుత్వం,
కారణమేదీ లేకుండా మనసులో భయముంచుకోవడ మెందుకు ? ఒకసారి వచ్చిచూడండి, మాట్లాడి చూడండి. సంఘ కార్యక్రమాలకు రండి, చూడండి. ఏమేం జరుగుతోంది ? ఏఏ విషయాలు మాట్లాడుకుంటున్నారనేది గమనించండి. నా అనుభవం ఏమిటంటే, అలా ఎవరైతే వచ్చి చూస్తారో వారి ఆలోచన తప్పకుండా మారుతుంది. మేము చెప్పేది ఏదైనా తప్పు అయితే, మీకు వ్యతిరేకంగా ఉందనిపిస్తే మమ్మల్ని అడగండి. అలాంటిదేదీ సంఘంలో లేదు. సరైన విషయమేదైనా మికు నచ్చకపోయినా మాకు చెప్పండి. పరంపరపరంగా, జాతీయతపరంగా, మాతృభూమిపరంగా పూర్వీకులపరంగా మనమంతా హిందువులమే. ఇదే మేము చెప్పేది, దీన్ని ఎప్పుటికీ చెబుతూనే ఉంటాం. ఆ పదాన్ని మేం ఎందుకు వదిలిపెట్టమనేది నేను నిన్ననే చెప్పాను. కానీ దానర్ధం మేము మిమ్మల్ని మా వారిగా భావించటంలేదని గాదు. మిమ్మల్ని మా
వారిగా భావించడం కోసమే అలా చెబుతున్నాం. మేము దేని ఆధారంగా మిమ్మల్ని మావారిగా భావిస్తున్నామంటే కేవలం అది మతం, సంప్రదాయం, భాష, కులం లాంటివాటి ద్వారా కాదు; మాతృభూమి, సంస్కృతి, పూర్వీకుల ఆధారంగా మాత్రమే. వాటికే మేం ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. వాటన్నింటిని మేము జాతీయతలో అంగాలుగా భావిస్తాం. కాబట్టి వచ్చి చూడండి. మంచిని చూడండి.
ఇక 'Bunch of Thoughts' విషయం. ఏ విషయాలైనా ఆనాటి పరిస్థితులను బట్టి సందర్భానుసారంగా చెప్పబడి ఉంటాయి. అవి శాశ్వతంగా అలాగే నిలిచి ఉండవు. శ్రీ గురూజీకి సంబంధించిన శాశ్వతమైన ఆలోచనలతో కూడిన ఒక సంకలనం. 'శ్రీ గురూజీ-విజన్ అండ్ మిషన్' పేరిట ప్రచురితమైంది. అందులో తాత్కాలికంగా, ఆయా సమయాల్లో వెలువడిన విషయాలన్నింటినీ మేము తొలగించి, ఎల్లప్పటికీ ఉపయోగకరమైన ఆలోచనలనే పొందుపరిచాము. దాన్ని మీరు చదవండి. దాంట్లో మీకు ఇలాంటి విషయాలేవీ దొరకవు. మరొక విషయం ఏమిటంటే సంఘం డాక్టర్ హెడ్డేవార్చెప్పిన కొన్ని విషయాల ఆధారంగానే మేము ముందుకు సాగుతున్నాము అనుకొనే సంస్థ మాది. 'తలుపులు మూసుకున్న సంస్థ' కాదు. కాలం మారుతుంది. సంస్థ స్థితిగతులు కూడా మారుతాయి. మన ఆలోచన, ఆలోచనా తీరు కూడా మారుతుంది. అలా మార్చుకోడానికి మాకు అనుమతి డా॥ హెడ్దేవార్ నుండి లభిస్తుంది. లేకపోయి ఉంటే డాక్టర్ హెడ్డేవార్ మొదటిరోజే మాకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని నడపాలి, శాఖలు ఆరంభించండి అని చెప్పేవారు. కాని ఆయన మాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు. కేవలం ఆలోచన మాత్రమే ఇచ్చారు. యువ కార్యకర్తలు ప్రయోగాలు చేశారు.
ఏది సరైందనిపించిందో, దాన్నే ఉంచారు; నచ్చని దాన్ని ఉంచలేదు. అలా సంఘం పెరుగుతూ వస్తున్నది. ఒకవేళ సంఘాన్ని ఒక 'తలుపులుబిగించుకున్న సంస్థగా భావిస్తే మీకు 'Bunch of Thoughts' లో ఏం వ్రాయబడింది అంటూ, అనుమానాలు పుట్టుతూనే ఉంటాయి. నేడు సంఘ కార్యకర్తలు ఏమేం చేస్తున్నారనేది ప్రత్యక్ష అనుభవం పొందండని నేను కోరుతున్నాను. వాళ్ళు ఏం ఆలోచిస్తారు-ఎలా ఆలోచిస్తారు, అన్నది గమనించండి. మీకున్నఅనుమానాలన్నీ దూరమవుతాయి.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..