డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:విద్యారంగంలో భారతీయ విలువలు:
ప్రశ్న : విద్యలో పరంపర మరియు ఆధునికత్వవు సమన్వయం, వేదాలు, రామాయణం, మహాభారతం లాంటి వాటిని విద్యలో భాగం చేయడం, బాలబాలికలు కలసిమెలసి చదువుకోవడం లాంటి విషయాలలో సంఘం అధిప్రాయం ఏమిటి? ఉన్నతవిద్య స్థాయి నిరంతరం తగ్గిపోతోంది. భవిష్య భారతం ఎలా నిర్మాణమవుతుంది?
జవాబు : చూడండి, ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చాక చేసిన సర్వేసు గనుక గమనిస్తే, పరంపరాగతంగా మన విద్యావిధానం చాలా ప్రభావవంతమైందిగా, ఎక్కువమందిని అక్షరాస్యులుగా చేసేదిగా, మనుషులను రూపొందించేదిగా మరియు తమ జీవనాన్ని గడపడం కోసం యోగ్యులుగా తయారుచేసేదిగా ఉండిందనే విషయాలన్నీ ధర్మపాల్ వ్రాసిన గ్రంథం చదివితే మీకు అర్ధమవుతుంది. అలాంటి విద్యావిధానాన్ని ఆంగ్లేయులు ఇక్కడ నుండి తమ దేశానికి తీసుకువెళ్ళడమేగాక, పై అంశాలన్నింటినీ కలగలిపి ప్రవేశపెట్టారు. ఇది చరిత్ర, నేటి ప్రపంచంలోని ఆధునిక విద్యాప్రణాళికలో, మన పరంపర నుండి గ్రహించదగినవాటిని చేర్చుకుని, మనదైన ఒక కొత్త విద్యావిధానాన్ని రూపొందించాల్సి ఉంది. రాబోయే విద్యా విధానంలో ఈ పై విషయాలన్నీ భాగమవుతాయని సమర్థవంతంగా అక్కడ పని చేయలేని వారి దేశంలోని వారి విద్యావిధానాన్ని ఇక్కడ ఆశిస్తాను.
దాని నుండి మనదేశపు ఆలోచనా సంపద లభించాల్సి ఉంది
" చతుర్వేదాః పురాణాని సరోపనిషదస్తదా
రామాయణం భారతంచ గీతా సద్దర్శనాని చ
జైనాగమస్త్రిపిటకాః గురుగ్రంథః సతాం గిరః
ఏష; జ్ఞానిధి: శ్రేష్ఠ శ్రద్ధేయో హృది సర్వదా "
ఇలాంటి విద్య భారతీయ ప్రజలకు లభించాలి. అందరికీ లభించాలి. అంతేకాదు బయటినుండి వచ్చిన మతసంప్రదాయాలలోని మంచి విషయాలుంటే వాటిలోని విలువలను కూడా నేర్పించాలి. మతం ఆధారిత విద్యను మనం అందించరాదు. అయితే విలువలదృష్ట్యా వాటినుండి వచ్చే సంస్కారాలదృష్ట్యా వాటన్నింటిని చదవడం, అధ్యయనం చేయడం మన విద్యావిధానంలో, జాతీయ విద్యావిధానంగా తప్పనిసరి. ఇది సంఘం అభిప్రాయం.
విద్యాస్థాయి తగ్గిపోతోందని మనం అంటుంటాం. విద్యాస్థాయి కాదు తగ్గిపోతున్నది విద్య నందించేవారి స్థాయి తగ్గుతోంది. విద్యపొందేవారి స్థాయి కూడా తగ్గుతోంది. విద్యార్థి చదువుకోవడానికి వచ్చినా, తన జీవితంలో సంపాదనను దృష్టిలో ఉంచుకుని దానికి అవసరమైన డిగ్రీ కోసమని వస్తున్నాడు. మనం ఇళ్ళలో వాళ్లనలా తయారు చేస్తున్నామా ? పుణెలో ఒక మహానుభావుడు నన్ను కలిశాడు. మహానుభావుడంటే కర్తృత్వ భావన కల్గినవాడన్నమాట! చదువు సరిగా అబ్బడంలేదని అతడి తండ్రి సతారా నుండి పుణెకు పంపించాడు. అతడు ఇక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేయడం మొదలుపెట్టాడు. అలా పనిచేస్తూ చేస్తూ ఒక ఎడ్వర్డ టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించడంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా తన చదువు కొనసాగించాడు. ప్రస్తుతం అతడెలాంటి స్థితిలో ఉన్నాడంటే, మహారాష్ట్ర అధుత్వానికి కూడా ఏదైనా గ్రామంగురించిన సమాచారం (Data) కావలసి వస్తే, ఆయన దగ్గరికి వస్తుంది. అలాంటిస్థాయికి అతని ఏజెన్సీ ఎదిగింది. ఆయన పేరు ప్రదీప్ లోఖండే.
ఆయన ఒకసారి నాతో 'మీరు ఎందరికో ఉపన్యాస మిస్తుంటారు, నాదొక సందేశం వారికి అందించగలరా?' అనడిగాడు. ఏమిటా సందేశం అని నేనడిగితే, ‘ ప్రతి వ్యక్తి తన కొడుకు ఆర్కిటెక్ట్, ఇంజనీర్, డాక్టర్ కావాలని ఉంటుంది. కానీ ప్రతి పిల్లాడు ఆలా తయారవలేడు. ప్రతి ఒక్కరికి తమదైన ప్రావీణ్యం ఉంటుంది, ఆసక్తి కూడా ఉంటుంది. తమకు మంచిదిగా అనిపించేదాన్నే చేయడానికి అవకాశం లభించాలి; అలా లభిస్తే చేసే పనినే ఎంతో గొప్పగా చేస్తారు' అన్నాడు.
తిలక్ గారి కొడుకు ఆయనతో, నాకు ఫలానా చదువు చదవాలనే కోరిక ఉంది అనగానే ఆయన, ఆ అబ్బాయికి, జీవితంలో ఏం చదవాలనేది నువ్వే ఆలోచించుకో అని ఉత్తరం వ్రాశాడు. 'ఒకవేళ నువ్వు చెప్పులుకుట్టే వృత్తి చేపట్టాలనుకుంటే కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు కుట్టిన చెప్పులు ఎంత ఉత్తమంగా ఉండాలంటే, పుణె నగరంలోని ప్రతి వ్యక్తి, చెప్పులు కొనదల్చుకుంటే తిలక్ గారి అబ్బాయి వద్దనే కొనుక్కోవాలి అని చెప్పగలిగేలా ఉండాలి' అని అందులో వ్రాశాడు.
నేను నేర్చుకుంటున్నదానిని, ఎంతో నైపుణ్యంతో ఉత్తమంగా చేయగలను, నైపుణ్యంలోనే నా గౌరవం ఉంది అనే భావన నింపి మనం మన పిల్లలను పాఠశాలలకు పంపుతున్నామా? 'ఎక్కువ సంపాదించు, ఎలాగైనా సంపాదించు కానీ సంపాదించు అనే మంత్రాన్ని వారిలో దట్టించి పంపితే, విద్య ఎంత గొప్పగా ఉన్నా అతడు దాన్ని స్వీకరించలేడు, ఎందుకంటే తండ్రి అలా చెప్పలేదు గనుక ఉపాధ్యాయులలో, నేను ఈ దేశపు బాల్లో భవిష్యత్తును నింపుతున్నాను, ఒక్కొక్క వ్యక్తిని తయారుచేస్తున్నాను అనే జ్ఞానం ఉందా? అనేకమంది మహాపురుషులు తమ ప్రాథమిక, మాధ్యమిక, పాఠశాలల్లోని, కళాశాలల్లోని ఉపాధ్యాయులను గుర్తుచేసుకుంటారు. ఎందుకలా గుర్తుచేసుకుంటారు? వీళ్ళ జీవితాల్లో వారి యోగదానం (Contribution) ఉంది. అలాంటి భావన నేటి ఉపాధ్యాయులలో ఉందా? అలాగే ఉపాధ్యాయులకు తమ బోధనా విషయంలో సరైన జ్ఞానం ఉందా? ఉపాధ్యాయులస్థాయి ఒక ప్రశ్నార్థకం కాగా అధ్యయనానికి సంబంధించిన విషయవస్తువు (Course Content) కూడా ఒక ప్రశ్నార్థకమే. చాలా సార్లు మన కళాశాలల్లో నుండి వ్యక్తులు డిగ్రీలు పొంది బయటకు వస్తున్నారు. తప్ప ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారు. డిగ్రీలేమో చాలా దొరుకుతున్నాయి కళాశాలలను నడుపుతున్నారు అయితే పరిశోధన తగ్గిపోతోంది. ఆయా విషయాలను బోధించే అధ్యాపకులు (Professors) తగ్గిపోతున్నారు.
ఈ దృష్టితో ఒక సమగ్రమైన ఆలోచన చేసి అన్నిస్థాయిల విద్యలోనూ ఒక ఉత్తమ నమూనాను మనం తయారుచేయాల్సి ఉంది. దాని కొరకు విద్యావిధానం గురించి ఆమూలాగ్రం ఆలోచించి, అందులో అవసరమైన మార్పులు చేయాలి. సంఘం ఈ పనిని అనేక సంవత్సరాల నుండి చెబుతూ వస్తోంది. దీని కొరకు ఏర్పాటైన కమీషన్ల నివేదిక కూడా ఇలాగే ఉంది. రాబోయే కొత్త విద్యావిధానంలో ఈ విషయాలన్నీ ఉండాలని భావిస్తున్నాను.
మరొక విషయముంది - మన దేశంలో నిజానికి విద్య అనేది ప్రైవేటుసంస్థల చేతుల్లో ఎక్కువగా ఉంది, ప్రభుత్వం చేతిలో లేదు. అంతేకాదు ప్రైవేటు సంస్థల స్థాయిలో చాలా మంచి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఒక సంవత్సరం క్రితం అలాంటి ప్రయోగంచేసే వారందరితో ఒక సమ్మేళనం జరిగింది. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలు స్థలాల నుండి 3,500 మందికి పైగా వ్యక్తులు వచ్చారు. వాళ్ళంతా విచిత్రాలు, అద్భుతాలు సృష్టించిన వాళ్ళు. ప్రభుత్వ విద్యావిధానం వచ్చినప్పుడు వస్తుంది అది వచ్చేవరకూ వేచిచూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. విద్యాసంస్థలలో పనిచేసే వాళ్ళు తమ అధికార పరిధిలో ప్రయోగం చేస్తూ విద్యాస్థాయిని పెంచవచ్చును. అలా జరిగినపుడు ప్రభుత్వ విధానం కూడా దాన్ని అనుసరించే జరుగుతుంది. అలాంటి స్థితి వచ్చి తీరుతుంది. కాబట్టి మొత్తమంతా ప్రభుత్వం నెత్తిన వేయకుండా, మనమంతా మనమన స్థలాల్లో దానికొరకు ప్రయత్నించాలి.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..