డా. మోహన్ భాగవత్ జీ |
హిందూ భారతీయ సమానార్ధకమైనవే కదా!
ఈ మాటకు ప్రత్యామ్నాయం ఏదీ కనిపించదు. హజ్ యాత్రకు వెళ్ళే ముస్లిములను అక్కడ హిందూ ముస్లింలుగానే నమోదుచేస్తారని నేను విన్నాను. అలాగే ఈ దేశానికి చెందిన సిద్ధాంతాలు, ఆలోచనలగురించి మాట్లాడేప్పుడు మేధావులు 'ఇండిక్' అనే మాట ఉపయోగిస్తుంటారు. ఇండిక్ అనేది భారతదేశానికి సంబంధించిన అనే అర్థమిచ్చే శబ్దం, అయితే ఇది కేవలం భౌగోళిక సరిహద్దుల గురించిన మాట కాదు. ఎందుకంటే ఎల్లలు మారుతూ ఉంటాయి. 'భారత్' అనేది స్వభావాన్ని తెలియజేసే మాట. ఇవన్నీ సమానార్ధకాలు, అయితే వీటన్నింటినీ స్పష్టంగా ప్రకటీకరించగలిగిన మాట 'హిందు'.
అందుకనే సంఘం హిందూ శబ్దాన్ని ఉపయోగిస్తుంది. అంతమాత్రంచేత భారత్, ఇండిక్, ఆర్య మొదలైన మాటలను వ్యతిరేకించాలని మేము అనుకోవటంలేదు. మేం ఇది వాడాలనుకుంటున్నాం. వాళ్ళు అది ఉపయోగించాలనుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నది ఈ ధర్మానికి మూలం. ధర్మ శబ్దానికి సంబంధించి ఎంతో గందరగోళం ఉంది. ఎందుకంటే ఇది కేవలం భారతీయ భాషల్లోనే కనిపిస్తుంది. భారతదేశానికి బయట ఈ శబ్దం ఎక్కడా వినిపించదు, కనిపించదు. ధమ్మ, ధర్మ శబ్దాలు రెండూ భారతదేశం ప్రపంచానికిచ్చిన కానుకలు. ధర్మం అంటే కర్మకాండ అని కూడా అనుకుంటారు. కాబట్టి విశేష పూజా పద్ధతి, ఒకానొక మూలపురుషుడు లేక ప్రవక్త మొదలైనవాటన్నింటినీ కలిపి మతం అంటున్నారు. ఆపైన మతం అనే మాటను ధర్మంతో ముడిపెడతారు.
మన భారతీయభాషలోకాక ఇతర భాషలలో మాట్లాడేవారు 'రిలిజియన్' అనే మాటను వాడితే దానిని ఇక్కడ 'ధర్మ'అని అనువదిస్తారు. వాస్తవానికి ఈ ధర్మం ఏ ఒక్క దేశానికో చెందినది కాదు. ఇది మానవాళి మొత్తానికి చెందిన వైశ్వికధర్మం. హిందూధర్మం అని మనం అంటున్నది. వాస్తవానికి కేవలం హిందువులకు మాత్రమే చెందినది కాదు. హిందువుల ధర్మం హిందూ ధర్మశాస్త్రాల పేరున లేదు. దానిని మానవ ధర్మశాస్త్రం అంటున్నారు. అది హిందూ శబ్దం వాడుకలోకి రావడానికి ముందే ఆచరణలోకి వచ్చింది. కాబట్టి అది మానవులందరికీ వర్తించగల ధర్మమని గుర్తించాలి.
మన దేశంలోని సిఖ్లు, జైన, బౌద్ధ, సనాతన, ఆర్యసమాజ మతాలు ఇక్కడ పుట్టినప్పటికీ అవి బోధించిన విషయాలు మాత్రం సర్వప్రపంచానికి వర్తిస్తాయి. ఎందుకంటే అవి ఈ వైశ్విక దృష్టి నుంచి ఎప్పుడూ వేరుపడలేదు.
'మాతాచ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః |
బాంధవాశ్మివభక్తాశ్చ, స్వదేశో భువనత్రయం' ||
ప్రకారం త్రిభువనాలు మన స్వదేశమే, మొత్తం భూమి మన కుటుంబం. వసుధైవ కుటుంబకం మన స్వభావం. ఈ అస్తిత్వంలోని ఏకత్వాన్ని చూడటమే భారతీయ తత్వానికి మూలం. ఆ మూలతత్వాన్ని అందరికీ సాక్షాత్కరింపచేయడం కోసమే, అందులోనే భారతదేశ అస్తిత్వం ఉన్నది. మన దేశం చాలా ప్రాచీనమైనది. పాశ్చాత్యుల ప్రకారం జాతి, రాజ్యం ఒక్కటే. రాజ్యం పోతే జాతి కూడా సమసిపోతుంది. కానీ మనది ఈ దృష్టి కాదు. రాజ్యాలు మారుతూ ఉంటాయి. కానీ జాతి శాశ్వతంగా ఉంటుంది. ఈ దేశంలో ఉన్న శాశ్వతవిలువలే శాశ్వత ధర్మం. హిందూ కోడ్ బిల్లు పై పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు డా|| ఆంబేడ్కర్ బిల్లును వ్యతిరేకిస్తున్నవారిని 'మీరు ధర్మాన్ని ఎంతవరకూ అర్థం చేసుకున్నారు ? ధర్మమంటే విలువలా ? లేక నియమనిబంధనలా ?' అని ప్రశ్నించారు.మీరు నియమనిబంధనలతో కూడిన కోడ్ నే ధర్మం అనుకుంటున్నారు. కానీ నియమ నిబంధనలు కాలానుగుణంగా మారుతాయి. అలా మారాలి కూడా. దానినే నేను మారుస్తున్నాను. విలువలు అవే. ధర్మాన్ని గురించి అర్థం చేసుకునే దృష్టి ఇదే. ధర్మం అంటే విలువలు. ఒక సమయంలో ఉన్న కోడ్ ఆ విలువలను ఎంతవరకూ ప్రతిబింబిస్తుందో అంతవరకే దానిని అంగీకరించాలి. కానీ ఆ విలువలకు విరుద్ధంగా ఉన్న నిబంధనల్ని కోడ్ ను మార్చాలి.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..