డా. మోహన్ భాగవత్ జీ |
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
:ముగింపు మాటలు:
రెండు మూడు చిన్న మాటలు ముగింపుగా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే రెండు ఉపన్యాసాలిప్పటికే ఇచ్చి ఉన్నాను. ప్రశ్నలకు జవాబులూ ఇచ్చాను. సంఘం గురించి ఎవరు, ఏం చెప్పినా, దాని మీద విశ్వాసముంచకండి, మీకు కావాలనుకుంటే, నేను చెప్పిన దాని మీదా విశ్వాసముంచకండి. సంఘం ఒక తెరిచిపెట్టబడిన సంస్థ. దాంట్లోకి రావడానికి ఎవరూ శుల్కం కట్టాల్సిన పనిలేదు. సంఘంలో ఎలాంటి ప్రాథమిక సభ్యత్వమూ లేదు. మనసుకు నచ్చిన విషయమంతే! మీరు వచ్చి సంఘాన్ని లోపలి నుండి చూడండి. ఇక్కడ మాతృమూర్తులు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి సంఘాన్ని లోపలి నుండి చూడవచ్చు. ఆ తర్వాత సంఘం గురించి మీరెలాంటి అభిప్రాయమైనా ఏర్పరచుకోవచ్చు. మీరు ఒప్పుకోవాలని నేను చెప్పలేదు. మీరు నమ్మేటట్లు చేయడం కోసం నేనేమీ చెప్పలేదు. అది మీకు మీరు చేయాల్సింది. అయితే మొదట సంఘాన్ని దగ్గరనుండి చూడండి. అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు చెప్పదల్చుకున్నది చెప్పండి, చేయదల్చుకున్నది చేయండి. మేము ఇక్కడ నిర్వహించిన కార్యక్రమం, మిమ్మల్ని ఒప్పించేందుకేమీ కాదు. మేము నిజాలు చెప్పాలనుకుంటున్నాము, నిజాలనే నేనిక్కడ చెప్పాను. దీనితర్వాత మీలో ఎవరికైనా సంఘకార్యంలో ప్రత్యక్షంగా పాలుపంచుకోవాలనిపిస్తే, అలాంటి వారు శాఖకు వెళ్ళండి, లేదు శాఖకు వెళ్ళడం నాకు కుదరదు అనుకుంటే, సంఘ స్వయంసేవకులు అనేక మంచి పనులు చేస్తున్నారు. అందులో భాగస్వాములు కండి. సమాజంలో మార్పు తెచ్చే పనిచేస్తున్నారు. అన్ని రకాల రంగాలలో పనిచేస్తున్నారు, వాటిలో మీరు పాలుపంచుకో వచ్చు.
సంఘ స్వయంసేవకులతో కలిసి నేనుకూడా మంచిపని నిర్వహిస్తాను అనుకుంటే తప్పనిసరిగా చేయండి. నేనెవరితోనూ కలవదలచుకోలేదు, నేను నా పని చేస్తాననుకుంటే కూడా అలాగే చేయండి. దీని తర్వాత మీరు నిష్క్రియులుగా ఉండరాదన్నదే మా ఏకైక కోరిక. మీకు అర్ధమైన మేరకు, ఈ దేశాన్ని తనదైన శక్తిమీద నిలబెట్టడానికి మరియు పరమవైభవ సంపన్నమైన దానిగా చేయడం కోసం, ఈ దేశాన్ని అర్థంచేసుకుని, మొత్తం దేశాన్ని ఒకటిగా చేసే దిశలో చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒకపని మీదైన పద్ధతిలో చేయాలని భావిస్తున్నాము. ఆ పని చేయగలరు.
సంఘ స్వయంసేవకులు తమకున్న శక్తినంతా వినియోగించి మీకు సహాయపడతారు. కేవలం మీరు వారితో పరిచయం, సంబంధం కల్గిఉండాలి. నాతో చెబితేచాలు అన్నీ జరిగిపోతాయి అని చాలామందికి అన్నిస్తుండవచ్చు. సంఘంలో అది తారుమారుగా ఉంటుంది, పై నుండి ఏ పనీ జరగదు. అట్టడుగున నేలమీద ఉన్న వారితో మీరు సంబంధాలు కల్గి ఉండండి, మీరు ఒక్క మెట్టు కూడా పైకెక్కి రావాల్సిన అవసరం ఉండదు, అక్కడే అన్నీ పూర్తవుతాయి. మీరు స్థానికంగా సంబంధాలు కల్గి ఉండండి. మీకు సహాయం అందుతుంది. అలాగే మాకు కూడా మీతో ఏదైనా సహాయం అవసరమైతే అడగడానికి మా పరిచయమూ ఉంటుంది. మాకున్న శక్తితో మేం పనిచేస్తాం, మీకున్న శక్తితో మీరు పనిచేయండి. అయితే ఈ దేశాన్ని మనం నిలబెట్టాలి, ఎందుకంటే ప్రపంచమంతా నేడు మూడవ మార్గం వైపు చూస్తోంది.
ఆ మూడవ మార్గం చూపగలిగే అంతర్గత శక్తి కేవలం భారత్ కు మాత్రమే ఉందని ప్రపంచానికి తెలుసు, మనం కూడా అది తెలుసుకుందాం. ఇది భారత్ కు మంచిని చేకూర్చే పని. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం, మరియు మనం భారత పౌరులం. ఇది నాయొక్క మీ యొక్క వ్యక్తిగత మరియు కుటుంబహితం కొరకు కూడా జరగాల్సిన పని, అలాగే ప్రపంచ కళ్యాణ కారకమైన పని కూడా. దీన్ని చేయకపోతే ముగ్గురికీ ప్రమాదమే. మనం చైతన్యవంతం కావాలి. భారతదేశపు కర్తవ్యమది. భారతదేశం ఇతర దేశాలలోకి అడుగుపెట్టింది, వాటిని ఆక్రమించుకోవడానికి కాదు, వాటి హృదయాలను గెలవడానికే. అది ఎక్కడ ప్రవేశించినా మంచే జరిగింది.
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతంలో ఇలా అంటారు::
" ఎ అమార్ దేశ్ జెదిన్ తోమార్ వైభవ్మయ్ భాండార్ ద్వార్
అబరిత్ ఛిలో విశ్వజనాయ్ సకలకామనా పూర్ణ కర్సే మహాదినే
మహా ఇతిహాస్ నిత్య జీవనే వరణ్ కరే "
(ఓ గొప్ప దేశమా ! మా ఓ గొప్ప దేశమా! నీ జ్ఞాన భండారపు మరియు సంపదభరిత భండారపు ద్వారాన్ని ప్రపంచమంతటికీ తెరిచావో అపుడే ఆ సమస్య ప్రజల కోరికలన్నీ పరిపూర్ణమయ్యాయి. ఆ గొప్ప రోజును స్మరించుకోండి, దాన్ని మీ జీవితంలో ఆవిష్కరించుకోండి)
ఈ ఆహ్వానం మీ ముందుంచబడింది, దానిని పూర్తిచేయగల శక్తి కలిగిన దానిగా సమాజాన్ని రూపొందించాల్సి ఉంది. దీని కొరకు సమాజాన్ని కలిపి ఉంచే ఏకైక సూత్రమేది ఉందో, దాని ఆలంబనతో సంపూర్ణ సమాజాన్ని జోడించాలి. మీకు మీరు కర్తవ్యదీక్షతో నిలబడాల్సి ఉంది. దాని స్థాయిని పెంచి ఆ సామూహిక ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సి ఉంది.
ఇదొక అత్యంత పవిత్రకార్యం. ప్రపంచ జీవనంలో ఒక అర్థాన్ని, సమృద్ధినీ ఉత్పన్నం చేయగల్గిన పని. దీన్ని మనమందరమూ చేయాలి, చేసి తీరాలి. ఎందుకంటే మనం భారతమాత పుత్రులం అని చెప్పుకుంటున్నాం. భారతదేశ పౌరులం అని చెప్పుకుంటున్నాము. భారతదేశం అస్తిత్వంలోకిరావటం ఈ ప్రయోజనంకొరకే అని గ్రహించండి. ఈ సత్యం లభించిన (పొందిన) తర్వాత, మన ఆనాటి పూర్వీకులు, ఋషి మునులు గ్రామగ్రామాస, ఇంటింటికీ మనదేశపు ఈ స్వభావాన్ని చేర్చడానికి ఎంత శ్రమపడి ఉంటారో? మీరు ఊహించుకోగలరు.
సంచార సమూహం అనే మాట ఉంది, ఈ సంచార ప్రజలు ఎవరు ? స్వప్రేరణతో స్వేచ్చగా మన సంస్కృతికి చెందిన ఈ సందేశాన్ని అందరి జీవితాలలో నింపేందుకు ఇల్లు వాకిలి, గ్రామాన్ని వదిలేసినవాళ్ళే వీళ్ళు. ఒకచోట ఉండడాన్ని ఇష్టపడక, సంచార జీవనాన్ని స్వీకరించి దాన్ని గ్రామగ్రామాన ప్రచారం చేసే ప్రజలు వీళ్ళు. రోజులు మారిపోయాయి, వారి శాస్త్రం మనకు అర్గం కాదు కానీ ఒక సమూహం రహదారుల్లోనే కసరత్తులు చేస్తుంటారు. వాళ్ళను దొమ్మరులు అంటారు. వాళ్ళు శారీరకసంస్కృతిని సమాజంలో ప్రచారం చేసేవారు. వేర్లు, ఆకుల గురించి తెలిసివాళ్ళు మరికొందరు ఆ రోజుల్లో ధాతు (లోహ) యుగం నడిచేది. లోహపు పని నేర్పే మరియు నేర్చుకునే వాళ్ళు వారు, ఇలా వారిలో అనేక రకాల వాళ్ళున్నారు. నేటికికూడా ఆ ప్రజలు తమ పని చేయడానికి బయల్దేరేటపుడు, ఇంట్లో తమ పరంపరాగతమైన పూజ, అర్చన చేసిన తర్వాతే వెళతరు. ఇదంతా ఎందుకు, ఈ రోజుల్లో ఇదంతా నడవదు, దీన్ని వదిలేయండి అన్నామంటే మనకు దొరికే జవాబు 'ఇది మన ధర్మం' అనే మాటే. ఇంత శ్రమపూర్వకంగా ప్రపంచం కొరకు ఈ దేశం రూపొందించబడింది. భగవంతుడిద్వారా లభించిన కర్తవ్యం పూర్తిచేయడానికి తగిన విధంగా అది రూపొందాల్సిందే. అందుకే ఈ పని మేం చేస్తున్నాం.
ఈ విషయాలన్నీ మీకు చెప్పడం వెనుక ఉన్న భావన సంఘంగురించి మీలో తప్పుడు అభిప్రాయాలను సరిచేయాలనే ఉద్దేశం ఉండటం మాత్రమే కాదు. అయితే ఒక సంస్థగా సంఘం పెరిగిపోయినంతమాత్రాన అది గొప్పవిషయ మౌతుందా ? రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వలన దేశం ఉద్దరింపబడింది అని చరిత్రలో వ్రాయబడాలని మేము కోరుకోవడం లేదు. ఈ దేశంలో ఒక తరం నిర్మాణమై, వారి శ్రమ మన దేశాన్ని ప్రపంచానికే గురువును చేసిందని వ్రాయబడాలని మేం కోరుకుంటున్నాం. ఈ పవిత్ర కర్తవ్యాన్ని ప్రారంభించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
ఈ రెండు రోజుల్లో మీరంతా సుదీర్ఘమైన ఉపన్యాసాలను చాలా ధైర్యంగా, ఓపికగా విన్నారు. నేను మీ ప్రశ్నలకూ జవాబులిచ్చాను. అవి కూడా మీరు విన్నారు. వాటిలో ఏ విషయాలనైనా మరచిపోయి, వదిలేసి ఉంటే, మీ అందరిముందు క్షమాపణలు కోరుతున్నాను. మనమందరమూ కలిసి సమాజ మందు కర్తవ్య భావనను జాగృతం చేయాలనే ఒకే ఒక్క మాటను చెబుతూ, నా నివేదనను ముగిస్తున్నాను. ధన్యవాదములు.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
⥈ ⥈ ⥈