Dr. Hedgewar ji - photo credit: News Bharati |
'భవిష్య భారతం'
మొదటి రోజు ఉపన్యాసము
: సార్వజనిక జీవనంలో - డాక్టర్జీ :
ఆ సమయంలో ఉద్యమాన్ని ఒకే మార్గంలో నడపడానికి అనాటి విద్యావంతులైన వారు భారత జాతీయ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. ఆయన విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తగా చేరారు. జ్యేష్ఠ కార్యకర్తల వరుసలో ఆయన పేరుకూడా వసుంది. అదే సమయంలో సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. దాని గురించి ప్రచారం చేయాలంటే గ్రామగ్రామానికి వెళ్ళాలి. అది కూడా నడిచి వెళ్ళాలి. లేదా ఎద్దులబండిమీద వెళ్ళాలి. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు నేడున్నట్లుగా లేవు. చాలా .కష్టపడి ఆయన ప్రజలను మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఆయన ఉపన్యాసాల కారణంగా అరెస్ట్ చేయబడ్డారు. ఆయనమీద రాజద్రోహనేరం ఆపాదించబడింది. నాగపూర్లోని ఒక కోర్టులో కేసు నడిచింది. కేసులో తన పక్షాన తానే వాదించుకున్నారు.
ఆ రోజుల్లో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు తమ రక్షణకు వకీలును పెట్టుకునేవారు కాదు. పడిన శిక్షను అంగీకరించేవారు. అయితే ఆయన, శిక్షను నేను అంగీకరిస్తాను. కానీ నా పక్షాన నేను వాదించుకుంటాను అన్నారు. ఆరోజుల్లో కోర్టుకు పత్రికా విలేకరులు కూడా వచ్చేవారు; అలాగే ప్రజలూ వచ్చేవారు. కాబట్టి తన ఉపన్యాసం ద్వారా తన వాదనను వినిపించాలని ఆయన నిశ్చయిం చుకున్నారు. ఏ చట్టం ఆధారంగా ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలించే అధికారం పొందారనే ప్రశ్నతో తన ఉపన్యాసం ప్రారంభించారు. అలాంటి చట్టమేదైనా ఉంటే చెప్పండి అన్నారు. 'నేను మీ ఈ అధికారాన్ని గౌరవించను. మీ చట్టాన్ని కూడా గౌరవించను, మీ న్యాయాన్ని కూడా గౌరవించను. నేను నా ప్రజలకు ఏ తప్పుడు విషయమూ చెప్పలేదు. నా సమాజంలోని ప్రజలను నేను మేల్కొల్పానంతే. స్వాతంత్య్రం అనేది మనిషికుండే సహజమైన అధికారం. స్వాతంత్య్రం ఎలా సాధించాలి, స్వాతంత్య్యం ఎలా నిలుపుకోవాలి. అని చెప్పడమేకాక, మనం స్వాతంత్య్రంతో కూడిన జీవితం గడిపేటప్పుడు ఎలా బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలి అనే విషయం గురించి నేను నా ఉపన్యాసాలలో ప్రస్తావించాను. అయితే దీన్నే రాజద్రోహంగా భావించి నన్ను, నాలాంటి ప్రజలను బంధించి జైలులో వేసే కుట్రను ఆంగ్లేయ ప్రభుత్వం చేస్తుంటే, తమ మూటాముల్లె సర్దుకుని ఈ దేశం వదలిపెట్టి వెళ్ళే సమయం దగ్గరపడిందని ఆంగ్ల ప్రభుత్వం గ్రహించాలి.' కేసును విచారించిన ఆంగ్లేయుడైన న్యాయమూర్తి ఆయనకు ఒక ఏడాది కఠిన కారాగారవాస శిక్ష విధిస్తూ, రాజద్రోహంగా భావించిన ఆయన ఉపన్యాసాలకంటే ఈ వాదన మరింత ఆవేశపూరితంగా, రెచ్చగొట్టేదిగా ఉందని అన్నాడు. ఒక ఏడాదిపాటు శిక్షనను భవించడానికి డాక్టర్జీ జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళే సందర్భంలో ఆయనకు వీడ్కోలు పలకడానికి ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
న్యాయస్థానం, పోలీసులు, జైలు అనే అంచెలు దాటే లోగా అక్కడ చేరినవారిని ఉద్దేశించి డాక్టర్ హెడ్గేవార్ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మనసులో మెదులుతుండిన ఆలోచనల సారాంశం ఆ సందర్భంలోని ఉపన్యాసంలో దొరుకుతుంది. జైలు నుండి విడుదలయ్యాక కూడా ఆయనకు ఒక అభినందన సభ జరిగింది. ఆ సభకు నెహ్రూ అధ్యక్షత వహించారు. ఆ సమయంలో కూడా డా|॥ హెడ్గేవార్ తమ ఉపన్యాసంలో 'కేవలం జైలుకు వెళ్ళడమే దేశభక్తి అని అనుకోకూడదు. జైలుకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళడానికి సిద్దమవుదాం. అయితే బయట ఉండి ప్రజలకు స్వతంత్రానికి అర్థం తెలియజెప్పి స్వతంత్రం పొందడానికి ప్రయత్నం చేయడం, దాని గురించి ప్రజల్లో చైతన్యం తేవడం కూడా దేశభక్తి. ఒక సంవత్సరంపాటు జైలులో ఉన్న కారణంగా నా బరువు పెరిగింది. తప్ప నాపై ఎలాంటి దుష్పరిణామం చూపలేదు. అయితే మావంటివారు జైలుకువెళ్ళిన సమయంలోనూ ఈ పని జరిగేఉంటుందని నా నమ్మకం.' అన్నారు. ఆయన మళ్ళీ ప్రజానీకాన్ని మేల్కొల్పే పనిని ప్రారంభించారు.
ఇపుడు మనం కొంత వెనక్కు వెళ్లాం. ఎందుకంటే ఈ పనులన్నీ చేస్తున్న సమయంలో దేశపు సార్వజనిక జీవనంలో డా||హెడ్గేవార్ కున్న సంబంధం ఎన్నో విధాలుగా విస్తృతంగా ఉన్నట్లుగా కన్పడుతుంది. ఎవరు, ఏ ఆలోచనా ధారతో పనిచేస్తున్నా వ్యతిరేకి అయినా సరే, ఎదుట ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండి, దేశ అభివృద్ధి అనే భావనతో పనిచేస్తున్నాడంటే ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించని స్వభావం హెడ్గేవార్ ది . అన్నిరకాల ఆలోచనా విధానాలకు చెందినవారెందరో ఆయనకు మంచి మిత్రులుగా ఉండేవారు. ఆ సమయంలో నాగపూర్ లో బారిష్టర్ రూయికర్ అనే కమ్యూనిస్ట్ నాయకుడు ఉండేవారు. ఆయన మంచి వకీలు కావడమేగాక ధనవంతుడు కూడా. నాగపూర్ లోని కార్మికులకు నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు.
డా|॥ హెడ్గేవార్ ఆయనకు మంచి మిత్రుడు. డా||హెడ్గేవార్ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉండేది కాదు. డాక్టర్జీ ఆయనతో హాస్యంగా '1 ama poor capitalist and you are Rich labourer (నేను బీద పెట్టుబడిదారుడిని, మీరేమో ధనవంతులైన కార్మికుడు) అనేవాడు. ఈ విధంగా ఆయన మాటామంతీ నడిచేది. ఒకసారి ఆయన బారిస్టర్ రూయికర్ ను 'ఒకవేళ రేపు ఉదయం నేను వచ్చి దేశంలో ఆంగ్లేయ పాలన ముగిసిపోయి మళ్ళీ శివాజీ మహారాజు పాలన ప్రారంభమైంది అని చెబితే మీరేం చేస్తారు? అనడిగారు. అందుకు బారిష్టర్ రూయికర్, “అందులో ఏమైనా అడగాల్సిన విషయముందా నేనైతే ఏనుగుమీద ఎక్కి మిఠాయి పంచుతాను" అన్నారు.అపుడు డా|॥ హెడ్గేవార్ మీరు ఎక్కడికైడే వెళ్ళాలను కుంటున్నారో, మేమూ అక్కడికే వెళ్ళాలనుకుంటున్నప్పుడు మన ఇద్దరిమధ్య గొడవ ఎందుకు ? మనమిరువురం ఎందుకు కలిసినడవకూడదు? చిన్నచిన్న తాత్విక విషయాలను పట్టుకుని ఇంత వివాదం సృష్టించడం అవసరమా అన్నారు. ఆయన ఆలోచనా విధానం అలా ఉండేది. ఈ కారణంగా అన్ని రకాల ప్రజలతో వారికి చర్చ, సంవాదం జరుగుతుండేది. నా కొద్దిపాటి అధ్యయనంలో నుండి అన్ని రకాల ప్రజలు అంటే నాలుగు రకాల ప్రజలు అని నాకు అన్పిస్తోంది.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
{full_page} భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..