డా. మోహన్ భాగవత్ జీ |
:ఉత్తమ లక్షణాలను అలవరుచుకోవాలి:
మనం కూడా ఈ లక్షణాలను అలవాటు చేసుకోవాలి. అందుకోసం సంపూర్ణ సమాజం సంఘటితం కావాలి. ప్రామాణిక బుద్ధితో, నిస్వార్ధంగా తమతమ పరిధిలో దేశహితంకోసం పనిచేసే అందరి భాగస్వామ్యం ఇందులో ఉండాలని మేము భావిస్తాం. సంపూర్ణ సమాజం అటువంటి భావంతో ముందుకు సాగినప్పుడే దేశ కళ్యాణం సాధ్యమౌతుంది. లేకపోతే కొద్దిరోజులు మంచిగానే గడుస్తాయికానీ ఆ తరువాత మళ్ళీ కష్టాలు ప్రారంభమవుతాయి. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత కూడా ఈ విషయం మనకు చాలాసార్లు అనుభవంలోకీ వచ్చింది. స్వాతంత్ర్యం తరువాత అనేకసార్లు ఇటువంటి ఆశావహమైన పరిస్థితులు చూశాం. దేశంలో ఎంతో ఉత్సాహం, అనుకూల దృక్పథం కనిపించింది. కానీ ఆ వెంటనే అంతకుముందెన్నడూలేని నిరాశా, చీకటి ఆవరించాయి. దీనికి కారణం ఆ పరిస్థితులను నిలబెట్టి, కొనసాగించేవారు లేకపోవటమే. దేశహితంకోసం ఎవరైనా ఉద్యమిస్తే వారికి పూర్తి మద్దతు, సహాయం అందించే ప్రామాణికత, గుణాత్మకత సాధారణ సమాజంలో నిర్మాణం కాలేదు. ఆ ఉద్యమం సఫలం కావడానికి సమాజం మొత్తం సహకరించగలగాలి. సంఘం ఇలా సమాజాన్ని రూపొందించాలనుకుంటుంది. అందువల్ల భవిష్య భారతాన్ని గురించి ఆలోచించినప్పుడు ఏం చేయాలన్నది గ్రహించడం పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే దేశభవిష్యత్తును ఇక్కడ ఉన్న అందరూ ఒకేలా కోరుకుంటారు.
మనం ఎలాంటి దేశాన్ని కోరుకుంటాం ? అన్ని విధాలుగా పటిష్టవంతమైన శక్తిసామర్థ్యాలు కలిగిన దేశం కావాలి. అటువంటి శక్తిసామర్థ్యాలు ఇతర దేశాలను అణచివేయడం కోసం కాదు. శక్తిసామర్థ్యాలు లేనివారు ఎంతటి మంచిమాట చెప్పినా ప్రపంచం పట్టించుకోదు. అందుకని వాటిని సంపాదించుకోవాలి. ఇటీవల నేను అమెరికా వెళ్ళివచ్చాను. చికాగోలో జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్ లో మాట్లాడే అవకాశం నాకు లభించింది. నేనుకూడా అంతోఇంతో ఇంగ్లీషులో మాట్లాడగలను కాబట్టి 'మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా' అని ఉండవచ్చును. నేను అలా అంటే వెంటనే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేసిఉండేవారు కాదు.
వివేకానందుడు ఇవే మాటలు అన్నప్పుడు ఆయన అమెరికాలో అపరిచితుడే. కానీ మూడు నిముషాలపాటు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. కారణం ఏమిటి? ఆ మాటలు అన్నది వివేకానందుడు, మోహన్భాగవత్ కాదు. నిజానికి అవి చాలా సరళమైన మాటలు. కఠినమైన ఆంగ్లపదాలు కూడా కాదు. 'మై అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్'. కానీ ఆ మాటలవెనుక ఉన్న తపస్సు, వ్యక్తిత్వం వల్ల వాటికి శక్తి వచ్చింది. కాబట్టి మన దేశం శక్తిసామర్థ్యాలు సంపాదించుకోవాలి. అది కూడా అన్నిరంగాల్లో సాధించాలి. ఆర్థిక, నైతిక, సామాజిక సామర్థ్యం అవసరం. దేనికోసం సంపాదించాలి? లోకకళ్యాణం కోసం. కానీ ప్రపంచంలో చాలామంది విశ్వకళ్యాణం అని ఒకపక్క చెపుతూ అందరిమీద అజమాయిషీ, పెత్తనం చలాయిద్దామని చూస్తారు. అలా కుదరదు. అందరినీ కలుపుకుని ఈ పని సాధించాలి. దీనికోసం నైతికశక్తి, శీలసంపన్నత కలిగిన దేశం అవసరం.
ఏతద్ దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః |
స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః ||
ఈ మాటల్ని నిజం చేసే విధంగా మన సమాజం రూపొందాలి. దానికోసం జ్ఞానసంపన్న దేశం కావాలి, సామర్థ్యం, శీలం, జ్ఞానములతోపాటు ఐక్యమత్యం కూడా కావాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే అనేకపూలతో కూడిన హారంతో దేశమాతను అలంకరించాలి. అందరూ కలిసిరావాలి. ఇది అసాధ్యమేమీ కాదు. ఎంత కరినమైన, క్లిష్టమైన సమస్యలనైనా చర్చలద్వారా పరిష్కరించుకోవచ్చును. దేశ భవిష్యత్తుపట్ల ఆకాంక్ష, పూర్వజులపట్ల గౌరవం ఈ సంస్కృతిపట్ల శ్రద్ధ అందరిలో ఉంటే అవే అందరినీ కలుపుతాయి. వాటినే మనం హిందుత్వం అంటున్నాం. ఆ హిందుత్వంపట్ల శ్రద్ధ ఉంటే అప్పుడు అన్ని వివాదాలు సమస్యలు తీరిపోతాయి. మనమంతా కలిసి పనిచేయగలుగుతాము. అలా కలిసి పనిచేయాలి.
ప్రపంచానికి మనం ఏదైనా చెప్పదలచినట్లెతే ముందుగా మనదేశపు తీరుతెన్నులు చక్కగా ఉండాలి. సమతాయుక్త, శోషణముక్త, విశ్వకళ్యాణాన్ని కోరుకునే దేశంగా రూపొందాలి. మన 'విజన్ డాక్యుమెంట్' ఆవిధంగా ఉండాలి. అది కేవలం ఆర్థికశక్తిని పెంచుకునేందుకు, మన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు కాదు. అది వెనుకబడిన దేశాలు, బలహీనపడిన సమాజాలను కూడా అందరితోపాటు ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశ్యంతో రూపొందినదై ఉండాలి. ఎవరికీ హాని చేయకుండా, అందరినీ కలుపుకుని పోయే విధంగా మన విజన్ డాక్యుమెంట్ ఉండాలి. అలాంటి దేశంగా మనం రూపొందాలి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి భారతదేశం సంజీవని కావాలి. సమన్వయం, సంతులనం, అనుశాసనం అనే మార్గంలో ప్రపంచాన్ని నడపాలి. అది కూడా పెత్తనం చెలాయించే పద్ధతిలో కాకుండా స్వీయఉదాహరణ ద్వారా అందరి గౌరవాన్ని పొందుతూ ఆ పని చేయాలి. అయితే ఇవి నేను చెపుతున్న మాటలా ? కానేకాదు. ప్రాచీనకాలం నుంచి ఈ దేశపు సంస్కృతి, సంప్రదాయం. వీటి గురించి ఎవరు చెప్పినా, ఇది ఇవే మాటలు చెప్పారు.
- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:
రెండవ రోజు ఉపన్యాసం:
మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..