దేశ విభజన |
ఏ దేశానికైనా, ఏ ప్రజకైనా, ఏ వ్యక్తికయినా – గతంలేని వర్తమానం – ఉండదుగదా? ఎప్పుడో ఒకసారి, దాని అవసరం కలుగుతుంటుంది, అది తప్పదు. మన వ్యవహారమే తీసుకుందాం. మనకు స్వతంత్రం లభించి, కేవలం 70 సంవత్సరాలే అయింది. ఒక్కటి, నిజం. మనం తరతరాలబట్టీ, స్వతంత్రంగానే ఉన్నాం. ఎన్ని ఒడుదుడుకులొచ్చినా, శాశ్వత ప్రాతిపదికమీద, దేశ విభజనలను ఎరగం. విదేశస్థులు దండయాత్రలు చేశారు. వారి సామ్రాజ్యాలను స్థాపించుకున్నారు, కానీ బ్రిటిష్‌వారివలే, శాశ్వతంగా తిష్ఠవేసిన వారు లేరేమో!
వారినుంచి బయటపడేందుకు, మన స్వాతంత్య్ర సంపాదన కోసం, యుగయుగాలబట్టీ అఖండంగా ఉన్న దేశం రెండు ముక్కలు, మూడు ముక్కలయింది. బహుశా ఏ దేశమూ, ఇంత అఖండంగా లేదేమో! ఎవ్వరూ ఈనాడు, వేదాలు మా దేశంలోనే పుట్టాయి, మీకంటే మేమే ప్రాచీనులం అనరుగదా!
మరి ఈ విభజన ఎలా జరిగింది, అది తప్ప మనం స్వతంత్రులం అయ్యేందుకు వేరే దారే లేకుండా పోయిందా? ఈ చర్య అవసరమా అంటే, అప్పటి రాజకీయపక్షాలే ఈనాడు దేశంలో ఉన్నాయి. అప్పటి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లింలీగ్, రాజకీయాలలో జోక్యం చేసుకోని ఆర్.యస్.యస్ బోటి వ్యవస్థలూ ఉన్నాయి. వీరిలో ఎవరు దేశ విభజన కావాలన్నారు, ఎవ్వరు వద్దన్నారో తెలుసుకోవడంలో నష్టం లేదేమో! జిన్నా ముస్లింలీగ్‌తో, మేం ఏ పరిస్థితులలోనూ హిందువులతో కలసి ఉండలేం, మా జనాభా అధికంగాగల రాష్ట్రాలతో, మాకో ప్రత్యేక భాగం కావాల్సిందే అన్నాడు. పరోక్షంగా బ్రిటిష్‌వారు దానినే బలపరిచారు. కాంగ్రెసువారు చివరికి దానికి అంగీకరించడంతోనే గదా, విభజన జరిగింది. మరి కమ్యూనిస్టులో…స్పష్టంగా దేశ విభజననే బలపరిచారు.
ఈ విషయంలో వారిచ్చే కారణాలే అతి విచిత్రమైనవి సుమా! దానికి వారిచ్చే ఉదాహరణ, స్టాలిన్ తయారు చేసిన, 1936 రాజ్యాంగం, దాని ప్రకారం ఆయనగారు, సోవియట్ యూనియన్‌లోని 200 జాతులకు ‘స్వయం నిర్ణయాధికారం’ ప్రసాదించాడు, అంతేకాదు వారు విడిపోవాలనుకుంటే, విడిపోవచ్చుకూడా! అయితే అలా విడిపోదామనుకున్నవారి నాయకులను, ప్రజను స్టాలిన్ నిర్దాక్షిణ్యంగా కజకిస్తాన్, మధ్య ఆసియా, సైబీరియాలకు తరిమేశాడు సుమా!.. ఇంకొకటి, ఇందులో ఎవరూ, తమ మతం ఆధారంగా, విభజనను కోరలా! ఇక తరువాత, కమ్యూనిస్టులు – వాస్తవ స్థితిగతులను (concrete objective reality) ని సూత్రీకరించారు.
- ముస్లిం నాయకులు, వారి అనుచరులు, ప్రత్యేకత కోసమే మొగ్గుచూపుతున్నారు.
- జిన్నాగారు, తన ఈ కోరికకు రిఫరెండంకు అంగీకరించారు.
- జిన్నాగారు, ఇదివరకే పాకిస్తాన్ సెక్యులర్ రాజ్యంగానే ఉంటుందన్నాడు.
అతి ముఖ్యమైనది 4వ సూత్రం.. ఈ స్వయం నిర్ణయాధికారం వలన మాతృభూమి విభజనకు దారితీయదు (can never lead to vivisection of the mother land…no separate pakisthan and no separate hindustan can never rise, but a happy family of free and autonomous states of various nationalities united in an Indian union, that far from dismembaring the country the plan would lead to a still greater and more glorious unity the like of which, India has not such in her history, to a greater and more glorious unity of India than we have ever had till now’)
దీని సారాంశం ఏమిటంటే, ఇంతవరకు ఈ దేశంలో కనివినీ ఎరుగని అఖండత్వం వస్తుందని సుమా!… బహుశా గుప్తుల కాలం నాటి ‘స్వర్ణయుగం’ చూస్తామన్నారు. అంతకుముందు, అవసరమయితే ముస్లింలవలె, అన్ని ‘జాతులకూ’ కర్నాటక, ఆంధ్ర, తమిళ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, సింధీ బెలూచీ, పఠానులకూ విభజనాధికారాన్ని ఈయమన్నారు. ఏమందాం? విచిత్రమేమంటే, సాక్షాత్ జిన్నాయే, తన 1943 డిసెంబరు కరాచీ ముస్లింలీగ్ సభలలో, దీనిని ఎగతాళి చేశాడు. ‘కమ్యూనిస్టులకు, అనేకానేక పతాకాలున్నాయి. వారికి ఎఱ్ఱజెండా, రష్యన్‌జెండా, సోవియట్ జెండా, కాంగ్రెస్ పతాకాలున్నాయి. ఇప్పుడు మన పతాకం కూడా చేర్చుకున్నారు’ అనడంతో సభలో నవ్వులు కురిసాయట, ఏమందాం?
ఇదంతా గతం, మరి వర్తమానమో? ఇంతా పాకిస్తాన్ వాదాన్ని భుజం మీద మోసిన ఆ పాకిస్తాన్‌లోనే కమ్యూనిస్టులు లేరు. అంతేకాదు, ‘ప్రపంచ కార్మికులంతా ఏకం కండి’ అన్న కమ్యూనిస్టులు, నాకు తెలిసినంతవరకు, ఏ క్రిస్టియన్ దేశంలోనూ కనపడరు.. అమెరికా, ఇంగ్లండ్, యూరప్ దేశాల్లో.. సరే ఇక ముస్లిం ప్రపంచం సంగతి చెప్పనే అవసరం లేదు. ఆ ‘కమ్యూనిజం’, ‘కమ్యూనిస్టు పార్టీలు’ ఉన్నది రష్యా, చైనాలోనే మాత్రమేమో! ఇక తరువాత, అఖండ భారతంలో, తరువాత ఖండ భారతంలోనే ఉన్నారు. దీనికి కారణం.. నా దృష్టిలో భారతదేశంలో, ఇంకా హిందువులు మెజారిటీ ఉండటమే సుమా! ఈ హిందువులు, తమ చరిత్రలో ఇంతవరకు ఏ ఇతర దేశం మీదా దానిని ఆక్రమిద్దామని గాని, దానిని దోపిడీ చేద్దామని గాని దండెత్తలా!
అలాగే తమ దేశంలోని హిందువులు కానివారిని మతం రీత్యా ఒత్తిడికి గురిచేసి, వారిని హిందువులుగా మార్చేందుకు ప్రయత్నించలా.. కాదంటారా? సరే ఇదంతా ఎక్కడిది? ప్రముఖ పాత్రికేయులు అరుణ్‌శౌరీ 1991లో ఒక గ్రంథం వ్రాశారు. “(the only fatherland communists, quit India and the soviet union). అందులోనిదే ఈ సమాచారమంతా. అందులో స్పష్టంగా తాము, కమ్యూనిస్టుల ఏయే పత్రికల మీద ఆధారపడింది అతి వివరంగా.. ఆగస్టు ఉద్యమం సంగతి, వీలయితే ఆగస్టు మాసంలో చూద్దాం..
-చాణక్య - ఆంధ్రభూమి సౌజన్యం తో _ విశ్వ సంవాద కేంద్రము