విశ్వకర్మ |
విశ్వశ్రేయుడు 'విశ్వకర్మ'
శిల్పాచార్యాయ దేవాయ నమస్తే విశ్వకర్మణే మనవే మయాయ త్వ్టేచ శిల్విన్ దైవజ్ఞతే నమః పురుషసూక్తంలో విరాట్ పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. అష్టావసువులలో ఒకరైన ప్రభావను కుమారుడు, తల్లి యోగసిద్ధి. పురాణకథల్లో అనేక చోట్ల విశ్వకర్మ ప్రస్తావన కనిపిస్తుంది. అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు (నిర్మాణ)శాస్త్ర స్థాపకుడు (గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్) వాస్తు పురుషుడు. 'విశ్వకర్మా సహంస్రాంశౌ అని ప్రమాణం. తొలిరోజులలో విశ్వకర్మను అపర బ్రహ్మ అనీ వ్యహరించేవారు. అప్పరస ఘృతాచిని, విశ్వకర్మ పరస్పరం శపించుకోవడంతో మానవులుగా ప్రయాగలో)జన్మించారు. ఇద్దరూ ఒకసారి తటస్థ పడినప్పుడు పూర్వ జన్మవృత్తాంతం తెలుసుకొని ఒక్కటయ్యారు. అలా జన్మించిన వారే విశ్వబ్రాహ్మణులని ఐతిహ్యం.
మానవ జన్మకు పూర్వం ఇంద్రసభలో ఉన్న విశ్వకర్మ దుష్టశిక్షణ కోసం దేవతలకు శక్తిమంతమైన ఆయుధాలు, దేవతలకు, భూలోకపాలకులకు రాజప్రసాదాలు నిర్మించి ఇచ్చాడు. నిర్మాణాల విషయంలో అసురుల పట్ల పక్షపాతవైఖరి చూపలేదు. ఐతిహ్యం ప్రకారం, సూర్యపత్ని అయిన తన పుత్రిక సంజ్ఞ భర్త తేజస్సుకు తట్టుకోలేకపోవడంతో సూర్యుని సానబట్టాడట. అలా రాలిన చూర్ణంతోనే చక్రాయుధం తయారు చేసి శ్రీహరికి కానుకగా సమర్పించుకున్నాడట. ఇంద్రుడికి విజయం అనే ధనస్సు, యోగాగ్నితో దహించుకుపోయిన ముని దదీచి ఎముకలతో వజ్రాయుధాన్ని రూపొందించాడు. శివునికి త్రిశూలాన్నీ, ఆదిశక్తికి గండ్రగొడ్డలిని, త్రిపురాసుర సంహారంలో శివుడికి రథాన్ని తయారుచేశాడు. పుష్పక విమానాన్ని రూపొందించాడు. యమవరుణులకు సభా మందిరాలను, రావణునికి స్వర్ణ లంక, శ్రీకృష్ణుడికి ద్వారకా నగరాన్ని షాండవులకు ఇంద్రప్రస్థ నిర్మాణం ఇలా ఎన్నో దివ్య సంపదల సృష్టికర్త విశ్వకర్మే. ఆయన
అంశతో జన్మించిన వారు, వారసులు కూడా వాస్తులో విశేష ప్రతిభ కనబరిచారని పురాణగాథలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో సుగ్రీవుని కొలువులోని నలుడు ఈయన కుమారుడే. రామరావణ యుద్ద సమయంలో నలుడు పర్యవేక్షణలోనే సేతువు నిర్మితమైందని రామాయణం చెబుతోంది. ఇతడు వాస్తుశిల్పే కాకవీరుడు కూడా. ఆ సంగ్రామంలో పాల్గొన్నాడు.
విశ్వకర్మ వంశీయులు వాస్తుశాస్త్ర ప్రవర్తకులు పురాణ ప్రసిద్ధ నిర్మాణాలు చేసిన మేధావులు
తపస్సంపన్నులుగా పేరుపొందారు. వివిధ నిర్మాణాలు, వస్తువుల తయారీ, ఉత్పత్తులలో
సేవలందించి లోకోపకారులుగా వినుతికెక్కారు. విశ్వకర్మ పంచముఖాల నుంచి మను, మయ, త్వష్ట శిల్పి, దైవజ్ఞుడు ఉద్భవించి వారు వరుసగా ఇనుము కర్ర, తామ్రం, రాయి, బంగారం తదితర ధాతువుల ద్వారా వన్తు సామగ్రి నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. పూరీక్షేత్రంలోని జగన్నాథ, సుభద్ర, బలభద్ర విగ్రహాల సృష్టికర్త ఆయన వంశీయుడేనని చెబుతారు. పాండవుల రాజనూయయాగం సందర్భంగా మయుడు నిర్మించిన రాజప్రాసాదం పురాణప్రసిద్ధం. ఉన్నవి లేనట్లు, లేనవి ఉన్నట్లు చేసిన అద్భుత నృష్టే దుర్యోధనుడి అనూయకు అవమానాలకు, చివరికి కురుక్షేత్ర సంగ్రామానికి కారణాలలో కీలకమైంది. దీనినే బట్టే దానినిర్మాణంలో మయుని నిర్మాణం చాతుర్యం వెల్లడవుతోంది. అందుకే అద్భుత, విలాస కట్టడాలకు 'మయసభ' ఉపమానంగా నిలిచిపోయింది. అతడే అసురులకు స్వర్ణ, రజత, కాంస్యాలతో మూడు నగరాలను (త్రిపురాలు) నిర్మించి ఇచ్చాడు. ఈ సామాజకవర్గంలో ఆవిర్భవించిన శ్రీమద్విత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కులవృత్తిని పాటిస్తూనే 'కాలజ్ఞానం' బోధనతో జగద్విఖ్యాతులయ్యారు.
మానవ జీవనానికి విశ్వకర్మీయుల కులవృత్తులు ప్రధాన ఆధారంగా ఉండేవి, ఉన్నాయి. విశ్వకర్మ సంతతి తమ వృత్తులను బట్టి స్వర్ణకారులు, ద్రంగం, కంచర పనులతో మానవ మనుగడలో కీలక పాత్రగా మారారు. వాస్తు శిల్పులు వంశపారంపర్యంగా కరోరశిక్షణ, తపశ్చక్తితో సాంకేతిక పరిజ్ఞానం పొంది ఎన్నో ఆలయాలు, అద్బుత కట్టడాలను ఆవిష్కరించారు. సమాజానికి వారు అందించిన సేవలకు తగిన గౌరవం దక్కేది. ఆలయాల నిర్మాణం నుంచి విగ్రహాల తయారీ, ప్రతిష్ఠ వరకు వీరి పాత్ర కీలకం. రథోత్సవాల సందర్భంగా వీరి ప్రమేయం లేకుండా దైవకార్యాలు సాగవని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. గ్రామాలలోని దేవాలయాలలో కల్యాణోత్సవాల సందర్భంగా మేళతాళాలతో స్వర్ణకారుల ఇళ్లకు వెళ్లి అమ్మవారి మెట్టెలు మంగళసూత్రాలు సేకరించే ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది.
మనిషికి ప్రధాన అవసరాలైన కూడు,గూడు, గుడ్డ సమకూరడంలో వీరి భూమిక కాదనలేనిది వ్యవసాయంలో ఆధునిక పరికరాలు రాకపూర్వం బండ్లు, నాగళ్లు, కొడవళ్లు లాంటి పనిముట్ల తయారీలో ఊపిరిసలపకుండా ఉండేవారు. అందులోనూ మన దేశం వ్యవసాయ ప్రధాన వృత్తి కావడంతో వారి అవసరం ఎంతో ఉండేది. పొలం దున్నేముందు వారితోనే నాగళ్లకు వూజలు చేయించేవారంటే వారికి దక్కిన గౌరవం తెలుస్తుంది. నేటికీ నిర్మాణ రంగంలోనూ వారి ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. వంశానుగత స్పూర్తితోనే 'వాస్తు కన్సల్టెంట్' పేరుతో సేవలు అందిస్తున్నారు.వీరు కులవృత్తులతో పాటు జ్యోతిషం, పౌరోహిత్యం విద్య, వైద్యం లాంటి వివిధ రంగాలలోనూ రాణిస్తున్నారు.
వాన్తువూర్వక నిర్మాణాలే కాదు, అన్నిచేతివృత్తులకు విశ్వకర్మను 'ఆదిపురుషుడు'గా చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే 'విశ్వకర్మ మనిషి నిత్యజీవితంతో మమేకమయ్యారు. అందుకే అన్ని వృత్తుల వారు 'విశ్వకర్మ జయంతి' లేదా విశ్వకర్మ పూజ'గా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, అస్సోం, త్రిపుర, ఒడిశా, కర్ణాటకలలో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరువపుకుంటారు. వాటిలోనూ పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాల అంతస్తులలో ఈ పూజ నిర్వహించి గాలిపటాలు ఎగరేసారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే ఆయుధపూజకు, విశ్వకర్మ జయంతి పూజకు కొంత పోలిక కనిపిస్తుంది. తామ చేయబోయే యుద్దాలలో విజయం సాధించాలని పూర్వ కాలంలో రాజులు దసరా సందర్భంగా ఆయుధపూజ చేసేవారు. పనులు సజావుగా సాగాలని కోరుతూ ఈ కాలంలోనూ వివిధ వృత్తుల వారు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, విశ్వకర్మ పూజతో సమాజ ప్రయోజనం మరింత ముడిపడి ఉంది. మానవ మనుగడకు అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పనకు ఉపకరించే పరికరాలను పూజిస్తారు. ఇది ఏ ఒక్క సామాజిక వర్గానికో సంబంధించిన పండుగ కాదు. కులవృత్తిదారులు అందరికి పండుగే. తమతమ వృత్తులకు సంబంధించిన పరికరాలు సరిగా పనిచేయాలని అన్ని వర్గాల వారు కోరుకుంటూ చేసే పూజ.
వ్యాసకర్త : డాక్టర్. ఆరవల్లి జగన్నాధస్వామి, సీనియర్ జర్నలిస్ట్ - జాగృతి.. {full_page}