విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ |
రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే.
మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల గౌరవభావం చూపకపోవడం అహంకారపూరితం, సిగ్గుచేటైన విషయమని ఆయన అనేవారు. ధర్మాన్నే అన్నింటికీ ఆధారంగా జాతి పునర్ నిర్మాణం చేయాలని ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ త్యాగాలను, విజయాలను, సిక్కు గురువుల, బందాబైరాగి బలిదానగాథలను ఆయన శ్రద్ధాపూర్వకంగా వర్ణించారు. వారి వ్యాసాలన్నీ జాతీయవాదంలో ముఖ్యమైనవి. ‘ధర్మ’ శబ్దపు అర్థం రిలిజియన్ కాదని, రిలిజియన్ ‘ధర్మం’ శబ్దానికి పర్యాయపదం కాదని చెప్పారు. మన రాష్ట్ర (జాతి) భావన యూరప్ వారి ‘నేషన్’ భావనకు భిన్నమైనది. యూరపులో ప్రచారంలో ఉన్న భావాలు, భావనలు మన దేశంలో అసందర్భంగా, అర్థరహితంగా ఉంటాయి. భారతీయ ముస్లింలు, క్రైస్తవుల గుర్తింపు హిందుత్వమే. మన దేశం వివిధ మత సంప్రదాయాలు తో, భాషలతో మిళితమై ఉంది. భారత చరిత్ర పునర్లేఖన ఆవశ్యకత గురించి రవీంద్రనాథ్ టాగూర్ అనేక సందర్బాలలో దృడంగా చెప్పారు.
గీత, సంగీత రంగంలో రవీంద్రులు కొత్త శకాన్ని ఆవిష్కరించారు. వీరి సంగీతంలో జాతీయభావన స్పష్టంగా కనిపిస్తుంది. గీతం, సంగీతం, నాట్యం,కావ్యం,వ్యాసం మొదలైన వివిధ సాహిత్య కళారుపాలను సమాజ జాగరణ కోసం చాలా ప్రభావవంతంగా ఉపయోగించారు. స్వాతంత్ర్య సమరంలో ప్రజానీకానికి వీరి ఆలోచనలు ఎంతో ప్రేరణ కలిగించాయి. అంతేకాదు ఇప్పుడు కూడా దేశంలో జాతి, ధర్మం మొదలైన మౌలిక అంశాలలో వస్తున్న ప్రశ్నలకు అవి సమాధానాలుగా నిలుస్తున్నాయి. 1901 లో ప్రాచీన గురుకుల పద్దతిని అనుసరించి ‘శాంతి నికేతన్ ‘ ను స్థాపించారు. ఇక్కడ అనేకమంది శిక్షణ పొందారు. స్వామి వివేకానంద శిష్యురాలుగా భారత్ కు వచ్చిన మార్గరెట్ నోబెల్ ను మొట్టమొదట ‘అగ్నికన్యా నివేదిత’ అనే పేరుతో సంబోదించినది రవీంద్రుడే. ఈ పేరునే తర్వాత స్వామి వివేకానంద ఆమెకు శాశ్వత నామంగా స్థిరపరచారు. స్త్రీ విద్య గురించి నివేదిత కొనసాగించిన వివిధ ప్రయత్నాలను రవీంద్రుడు సమర్థించారు, సహకరించారు.
కర్జన్ బెంగాల్ ను విభజనకు వ్యతిరేకంగా సాగిన వందేమాతర ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రముఖులలో రవీంద్రుడు కూడా ఉన్నారు. 1905, అక్టోబర్ లో ఆయన ఆద్వర్యంలో కలకత్తాలో జరిగిన రక్షాబందన్ ఉత్సవం వందేమాతర ఉద్యమానికి నాంది పలికింది. ఈ ఉద్యమమే స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. తన రచనల్లో రవీంద్రుడు స్వదేశి సైద్దాంతిక భూమికను చాలా ప్రతిభావంతంగా ప్రతిపాదించారు. కాంగ్రెస్ మహాసభలో ఆయన స్వయంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు.
వేదం, ఉపనిషత్తుల తత్త్వం ఆధారంగా ఆయన 1912 లో ‘గీతాంజలి’ రచించారు. 1913 లో దానికి నోబెల్ పురస్కారం లభించింది. ఈ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఆయనే. జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్ హుడ్ బిరుదును ఆయన తిరిగి ఇచ్చేశారు. స్వాతంత్రం పొందిన తర్వాత వారు రచించిన జనగణమన గేయాన్ని మన జాతీయగీతంగా స్వీకరించాం. మతం ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు విధానాన్ని రవీంద్రనాథ్ టాగూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆచార్య జగదీశ్ చంద్రబోస్ విదేశీ పర్యటన నిమిత్తం ధనసేకరణకై రవీంద్రుడు త్రిపుర మహారాజుతో సహా అనేక మందిని కలిశారు. వీరి ఆలోచన, ఆచరణ ఒకే దారిలో సాగాయి. మహాత్మా గాంధీతో సహా అప్పటి జాతీయ నాయకులు తమకు ప్రేరణ గురుదేవ రవీంద్రుడేనని చెప్పారు. మహాత్మా గాంధీయే మొదటిసారి వారిని ‘గురుదేవుడి’ గా సంబోదించారు.
__ విశ్వ సంవాద కేంద్రము {full_page}