ఉమ్మడి కుటుంబ వ్యవస్థ |
ఈ మధ్యకాలంలో దినపత్రికలు చదవాలన్నా, టి.వి.లో వార్తలు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ‘ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య’, ‘ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడు’, ‘పరీక్ష సరిగా రాయలేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని’ ఇలాంటి వార్తలు నేటి సమాజంలో సర్వసాధారణమై పోయాయి.
నిన్న కాక మొన్న హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పట్టపగలు ఇంటర్ పరీక్షలు రాయటానికి వెళుతున్న విద్యార్థిపై పాత కక్షల కారణంగా కొందరు దుండగులు (అందరూ 16 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సువారే) నడిరోడ్డు మీదే అందరూ చూస్తుండగానే కత్తులతో దాడిచేసి, నరికి చంపారు. ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత సగటు భారత పౌరుడికి తానున్నది నాగరిక సమాజంలోనేనా ? అనే సందేహం రాకమానదు.
సుదీర్ఘకాలం పాటు బానిసత్వంలో మగ్గిన తర్వాత 70 సంవత్సరాల క్రితం స్వాతంత్య్రం పొందిన తరుణంలో భావి భారతదేశానికి చక్కని పునాది నిర్మించే ఒక ఆదర్శ విద్యావిధానాన్ని రూపొందించాలని కొంతమంది నాయకులు సంకల్పించారు. అయితే దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశానికి నేతృత్వం వహించిన ప్రభుత్వాధినేతలు ఈ దేశాన్ని తమ మాతృభూమి అని, ఇక్కడి సనాతన భారతీయ సంస్కృతి తమదని భావించని కారణంగా బ్రిటిషు వారు తమ పాలనాకాలంలో మనమీద రుద్దిన విద్యా విధానాన్నే కొనసాగించారు. తత్ఫలితంగా గత 70 సంవత్సరాల కాలంలో భారతీయ విలువలకూ, ప్రాచీన కాలం నుండి మనదేశంలో వర్ధిల్లుతూ వస్తున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే సూత్రాలకు ఏ మాత్రం స్థానం లేని విద్యావిధానాన్ని మనదేశంలో అమలు జరిపారు. ఫలితంగా రెండు మూడు తరాలకు చెందిన భారతీయులు ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని తెలియజెప్పే ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు క్రమంగా దూరమమై ‘నేను.. నాది..’ అనే స్వార్థ చింతనను ప్రోత్సహించే పాశ్చాత్య దేశాల తరహా చిన్న కుటుంబాల వ్యవస్థను స్వీకరించారు. దాని ఫలితమే మనం ప్రస్తుతం చూస్తున్న ‘సామాజిక విలువల పతనం’. పాశ్చాత్య నాగరికతను గుడ్డిగా అనుకరించ దలచుకున్న నవశకానికి చెందిన భారతీయులు ఉమ్మడి కుటుంబాల వల్ల తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందనో లేక ఆర్థిక భారం పెరుగుతుందనో ఆలోచించారే తప్ప, ఉమ్మడి కుటుంబాలలో సహజంగా ఉండే పరస్పర సహకారం, భద్రత వంటి వాటికి దూరమవుతామనే విషయాన్ని గ్రహించలేక పోయారు.
సమాజ సంక్షేమానికి ఊతకర్రలు ఉమ్మడి కుటుంబాలు :
వెయ్యి సంవత్సరాల పాటు విదేశీ మూలాలున్న ఇస్లాం, క్రైస్తవ మతాలు మన హిందూ సమాజం మీద సాంస్కృతిక దాడి జరిపినా, బ్రిటిషు పాలకులు మన దేశాన్ని అన్ని విధాలా నిలువు దోపిడీ చేసినా నేటికీ భారతదేశంలో హిందూ సమాజం సంఖ్యాదిక సమాజంగా విలసిల్లడానికి ‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ’ కూడా ఒక కారణమంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి కుటుంబం ఒక అద్భుతమైన సామాజిక వ్యవస్థ. ఒకే ఇల్లు. ఒకే ఇంటి పెద్ద. ఐదారు కుటుంబాలు. ఒకే పొయ్యి. అమ్మ చేతి కమ్మని వంట. పెద్దలు, పిల్లలు అందరూ కలిసే భోజనం చేసేవారు. ఉన్నంతలోనే సర్దుకునేవారు.
అందరూ కలిసి మెలిసి జీవించేవారు. ఆడపిల్లలకు కావలసినంత భద్రత ఉండేది. ఆడపిల్ల పెళ్ళి చేసేందుకు తలా ఒక చేయి వేసేవారు. పిల్లలకు ఇంట్లో ఉండే పెద్దలు జీవన విలువల గురించీ, ధర్మ సూత్రాల గురించీ బోధించేవారు. పురాణ గాథలూ, ఆధ్యాత్మిక విషయాలూ చెప్పేవారు. ‘అబ్బాయి అంటే శ్రీరామునిలా ఉండాలి, అమ్మాయి అంటే సీతలా ఉండాలి. అసత్యం చెప్పకూడదు. అన్యాయంగా ఇతరుల సొమ్మును అపహరించకూడదు’ అని పిల్లలు గ్రహించేవారు. అలాంటి కుటుంబాలలో భేషజాలు లేవు. స్వార్థం లేదు. ఈర్ష్య అసూయలు లేవు. ¬టల్‌కి వెళ్ళాలంటే సిగ్గుపడేవారు. పైగా వీధిలో ఎవరైనా ఆకలితో ఉంటే వారిని పిలిచి మరీ అన్నం పెట్టేవారు. అతిథి సత్కారం ఎలా చెయ్యాలో, ఇంట్లో వృద్ధులు ఉంటే వారికి ఎలాంటి సేవలు చేయాలో, పెద్దలు, అతిథుల ముందు ఎలా ఉండాలో పిల్లలు చక్కగా నేర్చుకొనేవారు. అదీ మన సంస్కృతి. సుసంపన్న భారతీయ సంస్కృతి. స్వార్థ చింతనా, దురహంకారమూ లేని సంస్కృతి. ఇలాంటి జీవన విధానాన్ని చూసే ఈ మధ్య పాశ్చాత్య దేశాలకు చెందిన మహిళలు భారతీయ పురుషులను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
చిన్న కుటుంబాల్లో ఇబ్బందులుండవా ?
నేటి సమాజంలో భర్త భార్యకి ఫోన్ చేసి ‘హాలో బియ్యం స్టవ్ మీద పెట్టు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుండి మిగిలిన ఐటమ్స్ తెస్తా’ అని అంటాడు. ‘బాబూ ఇంట్లో నీళ్ళు లేవు కొంచెం నీళ్ళు పట్టవూ’ అని తల్లి అడిగితే ‘నాకు టైం లేదు అదేదో నువ్వే చూసుకో’ అంటూ కొంపలు మునిగిపోతున్నట్లు ఫోన్ నుండి దృష్టి మరల్చకుండా సమాధానం చెప్తాడు. రోడ్డు మీద ఒక్క నిమిషం ట్రాఫిక్ జామ్ అయినా సరే చిరాకు తెచ్చుకొని హారన్ మోతలు మోగిస్తారు. ఇక కుటుంబాల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు చోటేది ? మనం ఎటువైపు వెళుతున్నాం ? మన గమ్యమెటు ? ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కూలదోసి ఆశల హరివిల్లులా ఉంటుందని మనం ‘చిన్న కుటుంబ వ్యవస్థ’ను స్వీకరించాం. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికో, పల్లెటూరుకో పరిమితం చేశాం. టెక్నాలజీ మోజులోకి, టి.వి. కార్యక్రమాల కృత్రిమ వాతావరణంలోకి మనల్ని మనం మన పిల్లలతో సహా తోసేసుకుంటున్నాం. ఫలితమేమిటి ? స్కూలుకెళ్ళిన ఆడపిల్లకు రక్షణ ఉంటుందా ? బయటికెళ్లిన పిల్లవాడు ఇంటికి క్షేమంగా తిరిగొస్తున్నాడా ? ఇదేనా మన ఆశల హరివిల్లు ? ఇదేనా మన ఇంద్ర ధనుస్సు? మన నిర్ణయాన్ని మనం సమీక్షించుకుందామా ? మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తలుపులు తీద్దామా ?
– లక్ష్మణసేవక్, 9493190689 - జాగృతి సౌజన్యం తో - విశ్వ సంవాద కేంద్రము {full_page}