Sri Valluri Ramakrishna, a senior RSS activist |
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ వల్లూరి రామకృష్ణ నిన్న (9 జూన్) రాత్రి గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. వారి వయస్సు 72 సంవత్సరాలు. ప్రస్తుతం జాగృతి వారపత్రిక కార్యాలయ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. వల్లూరి రామకృష్ణ ఆదర్శ స్వయంసేవక్, కార్యకర్త. బాపట్లలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1968లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నగర ప్రచారక్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో పశ్చిమగోదావరి జిల్లా ప్రచారక్ గా పనిచేశారు. ఆ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఆరెస్సెస్ శాఖల సంఖ్య చాలా తక్కువగా ఉండేవి. అయినప్పటికీ జిల్లాలో శాఖల విస్తరణకలో విశేషమైన కృషి చేసారు. ఎమెర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించి జైలుకెళ్లారు. ఎమర్జెన్సీ అనంతరం గృహస్తు జీవితంలో ప్రవేశించారు. భాగ్యనగర్ బర్కత్ పురా సంఘ కార్యాలయంలోని సాహిత్యానికేతన్ లో అనేక సంవత్సరాలు పనిచేసి, అందులోనే రిటైర్ అయ్యారు. ఈ సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది స్వయంసేవకులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
సాహిత్యానికేతన్ లో పదవీ విరమణ అనంతరం జాగృతి వారపత్రిక కార్యాలయ మేనేజర్ గా వ్యవహరించారు. ఇటీవలి కాలంలో వారి బైపాస్ సర్జరీ జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభావం పనిమీద పడకుండా చూసుకునేవారు. జాగృతితో పాటు భోగాది దుర్గాప్రసాద్ స్మారక సమితిలో కూడా క్రియాశీలక సభ్యులుగా వ్యవహరించేవారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలోగల జ్యేష్ట స్వయంసేవకుల జీవితాలను పుస్తకరూపంలోకి తీసుకురావడంలో వల్లూరి రామకృష్ణ గారు విశేషంగా కృషి చేశారు. ఈ కృషి కారణంగా తెలుగు రాష్ట్రాలలో సంఘ కార్యం కోసం అనేకమంది గృహస్తులు, ప్రచారకులు, కార్యకర్తలు చేసిన త్యాగాలు వెలుగులోకి వచ్చాయి.
రామకృష్ణ గారికి ఇద్దరు సంతానం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వారి ధర్మపత్ని రాష్ట్ర సేవికా సమితి కార్యకర్త. వారిది సంఘ కుటుంబం. రామకృష్ణ గారి సోదరులిద్దరూ సంఘ ప్రచారకులుగా పనిచేశారు. వారి పెద్ద సోదరులు వల్లూరి పార్ధసారధి గారు ఐదేళ్ల పాటు సంఘ ప్రచారక్ గా పనిచేసిన అనంతరం విజ్ఞాన భారతి పాఠశాలల్లో సేవలందించారు. వారి చిన్న సోదరుడు ఏడాది పాటు ప్రచారక్ గా సేవలందించారు.
అఖిల భారతీయ సమన్వయ ధర్మజాగరణ సహ సంయోజక్ మాననీయ శ్యామ్ కుమార్ జీ, వనవాసీ కళ్యాణ్ పరిషద్ అఖిల భారతీయ విద్యా ప్రముఖ్ శ్రీ కె. రామచంద్రయ్య గారు, ఉభయ రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్ ప్రముఖ్ భాస్కర్ జీ, అనేక మంది జ్యేష్ట స్వయంసేవకులు, శ్రీ వల్లూరి రామకృష్ణ గారి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
__విశ్వ సంవాద కేంద్రము