శ్రీ రామకృష్ణ పరమహంస - Sri Ramakrishna Paramahamsa |
‘ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నేను అవతరిస్తూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ బోధించి ఉన్నారు. ఆ మాటను నిలుపుకోవటానికి ద్వాపరయుగ కాలం నుంచి ఈ వేదభూమిలో, అన్నిసార్లు పూర్ణావతారంగా కాకపోరునా, కాలానుగుణంగా ఋషుల రూపంలో, ధర్మాచార్యుల రూపంలో భగవానుడు భువిపై అవతరిస్తూనే ఉన్నాడు. కలియుగంలో ధర్మం ఒక్కపాదంపై నిలుస్తుంది అని మనం పురాణాలలో చదువుకున్నాం. అంటే కలియుగంలో ధర్మ సంస్థాపన కార్యాన్ని నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. వేదాంతంలో ఏ మోహశక్తిని మాయగా పేర్కొంటారో ఆ మాయ తన విశ్వరూపాన్ని చూపించే కాలం కలియుగం. అలాంటి పరిస్థితులలో మళ్ళీ ప్రజలను నివృత్తి ధర్మాసక్తులను చేసి మోక్షపథం వైపుకు నడిపించటానికి భువిపై అవతరించిన పరాశక్తి స్వరూపమే శ్రీరామకృష్ణుడు. మనిషిని భగవంతునికి చేరువగా తీసుకువెళ్ళటానికి కావలసిన సాధన సామాగ్రిని అందరికి అందించటానికి భువిపైకి దిగిన వైకుంఠవాసి శ్రీరామకృష్ణుడు.
అవతరణం అసాధారణం :
భగవాన్ శ్రీరామకృష్ణుని జీవితం, సందేశాల ప్రాముఖ్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఆయన ప్రధాన శిష్యుడైన స్వామి వివేకానంద ఇలా అంటారు – ‘సనాతనధర్మం యొక్క అవధులెరుగని విస్తృతిని సమస్తం శ్రీరామకృష్ణుని అసాధారణ మార్గదర్శకంలో, ఆయన ప్రసాదించిన దివ్యజ్ఞాన ప్రకాశంలో దర్శించవచ్చు. మహర్షులు, ఇతర అవతారాలు ఏమి బోధించారో ఆయన తమ జీవితం ద్వారా వాటిని నిరూపించారు. గ్రంథాలు కేవలం సిద్ధాంతాలే, కాని ఆయన వాటికి సజీవ తార్కాణం. ఈ మహనీయుడు తన యాభై సంవత్సరాల జీవితకాలంలో 5 వేల సంవత్సరాల జాతి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించి చూపాడు. భావితరాల వారికి సుబోధకమయ్యేలా తన జీవితాన్ని చక్కని పాఠంగా మలిచాడు’.
The Life of Sri Ramakrishna అనే పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ మహాత్మా గాంధీ ఇలా పేర్కొన్నారు ‘శ్రీరామకృష్ణ పరమహంస జీవిత కథ మతాన్ని ఆచరణలో చూపే కథ. ఆయన జీవితం భగవంతుణ్ణి మనకు ముఖాముఖి దర్శింపచేస్తుంది. ‘భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా భ్రమ’ అనే విశ్వాసం లేకుండా ఎవరూ ఆయన జీవిత చరిత్రను స్పృశించలేరు’.
భారతదేశపు మహామహిమాన్వితులైన ఈ ఇద్దరు మహాత్ముల పలుకులు శ్రీరామకృష్ణుల జీవితం, సందేశం యొక్క ప్రధాన ఇతివృత్తంపై మన దృష్టిని కేంద్రీకరించేలా చేస్తారు. మనిషిలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పి, వ్యక్తి తన నిజస్వరూపాన్ని తెలుసుకొని, అమృతత్వ ప్రాప్తిని పొందటానికి సహకరించటానికి భగవంతుడు మనిషి రూపంలో అవతరిస్తాడు. ప్రబలమైన మాయాశక్తికి పూర్తిగా లోనై తన ప్రాభవాన్ని మరచిన మనిషికి స్వకీయ జన్మ వైశిష్ట్యాన్ని తెలియజేయాల్సిన అవసరం కాలానుగుణంగా ఏర్పడుతుంది. అందుకే భగవానుడు మనిషిగా మనుషుల మధ్యలో వచ్చి మానవరూప జీవిత ఔన్నత్యాన్ని ఆ జీవికి గుర్తుచేస్తాడు.
కాలావశ్యకత :
భౌతికవాద శక్తుల పెనుతుఫానులో చిక్కుకొని అల్లాడుతున్న ఆధ్యాత్మిక నావను సురక్షిత తీరానికి చేర్చటానికి భగవానుడు ఒక మలయమారుతంలా ఆవిర్భవిస్తాడు. లక్ష్యం తెలియక తుఫానులో కొట్టుకుపోతున్న సమాజ నావను ప్రమాదం నుండి రక్షించి చక్కటి మార్గనిర్దేశం చేసే దీప స్తంభమే లీలామానుషధారియైన దేవదేవుడు. ఇది ప్రపంచ చరిత్రలో మరల మరల పునరావృతమయ్యే ఇతివృత్తం. శతాబ్దాల అద్భుత చరిత్ర కలిగిన భారతావనిలో మార్గదర్శకు లైన అనేకమంది దైవాంశ సంభూతులు కాలానుగుణంగా ప్రభవించి దేశంలో ధర్మస్థాపన చేశారు, చేస్తున్నారు, ఇక ముందూ చేస్తారు. ఎప్పుడైనా జాతి ఆధ్యాత్మిక జీవనంపై తీవ్ర దుష్ప్రభావం చూపే విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు, నిరాశ నిస్సత్తువలు ఆవరించి ఉన్నప్పుడు దేవకీ నందనుడు ఈ ఇలపై అవతరిస్తూనే ఉన్నాడు.
19వ శతాబ్దపు మధ్యభాగంలో ఈ ఆధ్యాత్మిక పునరుజ్జీవన ఆవశ్యకత ఏర్పడింది. జనులకు తళుకు బెళుకుల పాశ్చాత్య భౌతికవాద జీవన విధానం ప్రబల ఆకర్షణగా మారింది. జాతి ఆధ్యాత్మిక స్ఫూర్తి నిద్రాణమై పోరుంది. అజ్ఞేయవాదం, భోగవాదం, నాస్తికవాదం.. మూడూ ఆక్టోపస్ లాగా సమాజాన్ని ఆసాంతం ఆక్రమించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయం. అమూల్యమైన జాతి ఆధ్యాత్మిక వారసత్వం తెరమరుగు కానున్నదా? అన్న స్థితి. ఆ తరుణంలో దేశప్రజలను అప్రమత్తులను చేసి వారి మూలాలను, సంస్కృతి వైభవాన్ని, తరతరాలుగా ఎంచుకొన్న మహోన్నత ఆదర్శాలను గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ చారిత్రక అవసరాన్ని భగవాన్ శ్రీరామకృష్ణులు పూరించారు. జాతిజీవనాన్ని పునరుజ్జీవింపజేసే శిక్షణను గడపటానికి, భారతీయ ఆత్మ నూతన జవజీవాలను, పవిత్రతను సంతరించుకొని పూర్వవైభవాన్ని పొందడానికి శ్రీరామకృష్ణులు మార్గనిర్దేశం చేశారు. శతాబ్దాల తరబడి ఈ నేలపై పోగుచేయబడిన ఆధ్యాత్మిక శక్తులను కూడగట్టుకొని, నిరంతరం దివ్య చైతన్యంతో పరవశించే ఈ సమున్నత ఆధ్యాత్మిక తరంగం విశాల భారతదేశాన్ని ముంచెత్తింది. ఇంద్రియపర జీవితమే జీవిత చరమలక్ష్యంగా భావించే జనులతో బీడు వారిన ఈ ధర్మధరిత్రి శ్రీరామ కృష్ణులు సంప్రోక్షించిన ఆధ్యాత్మిక జలాలతో తడిసి మళ్ళీ పునీతమైనది. సౌశీల్యవంతులైన, దివ్యభావ ప్రేరితులైన, ఆధ్యాత్మిక తత్పరులైన, ఉదారవంతులైన మానవాళిని సమాజానికి అందించటానికి రంగం సిద్ధమైంది.
శ్రీరామకృష్ణులు ఒక అసాధారణ వ్యక్తి. కేవలం ఆయన బోధలు కాదు. ఆయన జీవితం మహా మహిమాన్వితమైనది. ఆధ్యాత్మిక సాధకునిగా ఆయన జీవితం విలక్షణమైనది. ఆయన ఇచ్చిన సందేశం కూడా అసాధారణ ఔన్నత్యాన్ని కలిగి ఉంది. స్వామి వివేకానంద తన గురువుల ఈ ప్రత్యేకతను గురించి చెబుతూ ‘ఇతర ఆధ్యాత్మిక గురువు లందరూ తమ పేరుమీద ప్రత్యేక మతాలను స్థాపించారు. కానీ ఈ నవీన అవతారం మాత్రం తనకంటూ ఒక మతాన్ని స్థిరపరచుకోలేదు. ఆయన ఏ మతాన్నీ కించపరచ లేదు. ఎందుకంటే వాస్తవానికి అన్ని మతాలు ఒకే విశ్వమతంలోని భాగాలే అని ఆయన అనుభూతి పొందారు’.
సర్వధర్మ స్వరూపం :
శ్రీరామకృష్ణుని జీవితం బాల్యం నుండే అసాధారణ సంఘటనలు, స్ఫూర్తిదాయక సందేశాలతో గడిచింది. ఆయన ప్రతి జీవితఘట్టం ఎన్నో ధార్మిక జీవిత సమస్యలకు, సందేహాలకు పరిష్కారాలను సూచించింది. భగవదున్మత్త స్థితులు, భావపారవశ్య అనుభూతులు, కాళీమాత దర్శనంకై ఆయన తపించిన తీరు, పడిన వేదన, చెందిన వ్యాకులత ఆయన జీవిత తొలిదశలోని అపూర్వ ఘట్టాలు. కాళీమాత బిడ్డగా ఆయన విభిన్న ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి అతిస్వల్ప కాలంలో ప్రతి సాధనలోనూ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం; విభిన్న మతాలను అవలంబించి ‘మతాలెన్నో మార్గాలన్ని’ అని చాటడం ఈ ధర్మ సంస్థాపనాభిలాషికే చెల్లింది. శ్రీరామకృష్ణులకి కలిగిన వివిధ దేవీదేవతల దర్శనాలు, సాక్షాత్కారాలు, ఇంకా ఆయన ప్రవచనాలు అన్నీ కూడా మతాలన్నిటి మధ్య ఉన్న ప్రాథమిక ఐక్యతా సందేశాన్ని చాటి చెబుతున్నారు. సంకుచిత భావనలతో అడ్డుగోడలు నిర్మించుకొని అనేక వర్గాలుగా మతాలుగా విడిపోరు ఉన్న సమకాలీన సమాజానికి ‘మతాలెన్నో మార్గాలన్ని’ అనే ఆయన ప్రబోధం సామరస్య శాంతిని అందించింది. సమాజాన్ని సుస్థిరం చేసింది.
ఈ సందేశం యొక్క అనువర్తనం మతపరిధులను దాటి ‘మానవత్వం’ అనే పునాదులపై విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రతిష్ఠిస్తుంది. శ్రీరామకృష్ణుని జీవితం, సందేశం దివ్యత్వం ప్రతి మానవునిలోనూ అంతర్గతంగా ఉందని, విభిన్నమతాలు ఒకే సత్యం యొక్క వేరు వేరు అభివ్యక్తీకరణలని మనకు తెలియజేస్తారు. ఆయన జీవితాన్ని చదివితే మనం మతాల పేరుతో, కులాల పేరుతో ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం అవివేకపు, అజ్ఞాన సంజనిత కార్యమని మనకు స్పష్టమవుతుంది.
శివజ్ఞానే జీవసేవ :
‘నువ్వు భగవంతుణ్ణి పొందాలనుకుంటున్నావా? అరుతే జీవిని సేవించు. సాక్షాత్తు భగవంతుని అభివ్యక్తీకరణగా భావించి జీవిని సేవించు’ అంటారు శ్రీరామకృష్ణులు. ఈ ఒక్క ఉపదేశం నేడు కొన్ని లక్షలమందిని సేవాయజ్ఞం దిశగా ప్రేరేపించి, జీవనభారాన్ని మోయలేక అలుపు, అలసటకు గరవుతున్న అసంఖ్యాక జనావళికి సాంత్వన చేకూరుస్తున్నది. అద్వైత అనుభూతి పొందిన శ్రీరామకృష్ణులకు సమస్త చరాచరములందు ఒకే దివ్యత్వపు ఉనికి కనపడింది. అందుకే ఆయనకు ఈ సృష్టిలో పూజించ తగనిది, గౌరవింప తగనిది అంటూ ఏదీ కనబడలేదు.
ఒకరోజు శ్రీరామకృష్ణుడు కలకత్తాలోని దక్షిణేశ్వరంలో ఉండగా కొందరు ‘భూతదయ’ను గురించి మాట్లాడసాగారు. ఈ మాట విన్నంతనే ప్రగాఢ భావపారవశ్యానికి లోనయ్యారు శ్రీరామకృష్ణులు. తిరిగి బాహ్యస్మృతికి వస్తూ ‘జీవులపై దయ చూపడమా? ఇతరులపై జాలి చూపడానికి ముందు మీరెవరు? ఎంత మూర్ఖత్వం! జీవుని మానవ రూపంలో అవతరించిన భగవంతునిగా భావించి సేవించండి, ఇదే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం’ అని పలికారు. దయచూపడం అనేది వ్యక్తిలో ‘నేను ఉన్నతుడను’ అనే భావన కలిగిస్తుంది. అందుకే సేవించడం అని చెప్పడం ద్వారా మరింత నమ్రతతో కూడిన వైఖరిని సూచించారు శ్రీరామకృష్ణులు.
ఈ పలుకులను ఉద్దేశించి కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా అంటారు – ‘గురుదేవుల ఈ పలుకుల వెనుక నేను ఒక వినూత్న వెలుగును దర్శించాను. భక్తిమార్గంపై అవి ఒక సరికొత్త కాంతిని ప్రసరింపచేశారు. జీవునిలోను, జీవుని సేవించటం ద్వారానూ భగవంతుని దర్శించటం నిజమైన భక్తిని పెంపొందిస్తుంది. దేహధారి ఎవరైనా కూడా క్షణమైనా ఏ పనీ చేయకుండా ఉండలేడు. అందుకే భగవంతుని అత్యున్నత అభివ్యక్తీకరణ అరున మానవుని సేవించే దిశగా తన కార్యకలాపాలను మళ్ళించటం, లక్ష్యం దిశగా జరిగే అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ‘జీవుని సేవించటమే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం’ అనే సత్యాన్ని ఏదో ఒకరోజు విశ్వవేదికపై చాటి చెబుతాను. దీనిని అందరి ఉమ్మడి ఆస్తిగా మార్చివేస్తాను’.
రామకృష్ణ-వివేకానందుల ఈ భావచైతన్యం గత పన్నెండు, పదమూడు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జాతి జనజీవనాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్నది; దేశము, సమాజము, కుటుంబము, వ్యక్తిగతం అని కాకుండా చేసే ప్రతి కార్యాన్ని భగవదర్పితంగా చేస్తూ, ఆధ్యాత్మికంగా పరివర్తన మొనర్చటం ద్వారా ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ఉపకరిస్తున్నారు. ఈ భావధార ఇంకా విస్తరించి అధిక సంఖ్యాకులు తమ జీవితాలను ధన్యం చేసుకోవడానికి ఉపకరించుగాక!
– బ్రహ్మచారి శ్యామ్, రామకృష్ణ మఠం - జాగృతి సౌజన్యం తో
__విశ్వ సంవాద కేంద్రము {full_page}