దుర్గావాహిని మహిళా శక్తి |
యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
ప్రకృతి అంతా మాతృ స్వరూపమని తలుస్తూ అన్నింటినీ తల్లిలాగా భావించి పూజించే దేశం మనది. అందుకే గోవును గోమాతగా, మన దేశాన్ని భారతమాతగా, ఇక్కడ నదీ నదాలను గంగామా మాతగా, భూమిని భూమాతగా భావించి పూజిస్తాం. భారతీయ సమాజంలో తల్లి స్థానం చాలా గొప్పది. కానీ నేడు కొన్ని పాశ్చాత్య వింత పోకడల ప్రభావం వల్ల ఆ స్థానానికి ప్రమాదం ఏర్పడిందనే చెప్పవచ్చు. దానికి కారణం భారతీయ సంస్కృతే అని కొందరు విష ప్రచారం చేస్తున్నారు. కానీ మన దేశ సంస్కృతి ఎన్నో దేశాలకు ఆదర్శం. అసలు సమాజంలో ఇటీవల ఆడపిల్లలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తోంది.
ఎక్కడైతే స్త్రీ ఎక్కువగా గౌరవించబడుతుందో, అక్కడే సమాజం ఉన్నతమైన సమసమాజంగా గుర్తించబడుతుంది. నైతిక విలువలున్న సమాజంగా తెలుసుకోబడుతుంది. కానీ, నేడు, సమాజంలో, స్త్రీలను సెల్ ఫోన్ /కెమేరాలద్వారా చిత్రీకరించి (వారికి తెలియకుండానే), అభివృద్ధిచెందిన శాస్త్రసాంకేతిక విజ్ఞానం ద్వారా, వారి చిత్రాలను నగ్నంగా మార్పులుచేసి, బ్లాక్ మెయిల్ ద్వారా, మెయుల్స్ ద్వారా డబ్బును సంపాదించు కుంటున్నారు. వీరు చేసింది తప్పే అయితే, తమ వినోదం కోసం అటువంటి చిత్రాలను చూసేవారిదీ తప్పే అవుతుంది. తల్లి స్థానంలో ఉన్న మహిళ ఎందరో త్యాగధనులు చరిత్రను ఉగ్గుపాలతో రంగరించి చిన్ననాటి నుంచే తనపిల్లలకు నేర్పించి వారిని గొప్పదైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. స్వామీవివేకానంద, శివాజీ మహారాజ్ ఎందరో ధీశాలురైన వ్యక్తులు తయారు కావడానికి మూలకారణం స్త్రీనే అన్న విషయం మనం మరవకూడదు.
అలాంటి గొప్ప లక్షణాలున్న మహిళలు అభివృద్ధిపథంలోకి దూసుకుపోతున్నారన్నది ఎంత వాస్తవమో, సమాజంలోని విచ్చలవిడితనానికి, పాశ్చాత్య పోకడలకి అలవాటు పడుతున్నారన్నది కూడా అంతే వాస్తవం. ఇవాల్టి బాలలే రేపటి పౌరులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉగ్గుపాలలో ధీరుల చరిత్రలను రంగరించి పోషించింది ఒకప్పటి స్త్రీ కానీ ఇప్పటి కాలం మగువలకు ఉద్యోగ పరుగుపందంలో పిల్లలను చూసుకునే టైం కూడా లేదు. అందుకే రాజుల్లాగా పెరగాల్సిన పిల్లలు కొందరు రాక్షసంగా మారుతున్నారు. ఫలితంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయనేది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
ఇవన్నీ మారాలంటే సమాజంలో మార్పు రావాలని అంటుంటారు చాలామంది. సమాజంలో మార్పురావాలంటే అది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అందుకు ఇంట్లోని వ్యక్తులకు ముఖ్యంగా మహిళకు మన భారతీయ సంస్కృతి గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితంగా మనం నేర్చుకున్న విషయాల ద్వారా ఇతర స్త్రీలను, సమాజాన్ని జాగృతపరచవచ్చు. ఇప్పటికే స్త్రీలు అనేక రంగాలలో చొచ్చుకుని పోతూ సమాజ సేవలో దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడం మనం చూస్తున్నాం. ఇదిచాలదు ఇంకా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ రాబోయే సమస్యలను అధిగమించగలగాలి
– లతా కమలం - లోకహితం సౌజన్యం తో __విశ్వ సంవాద కేంద్రము