హిందుత్వపై అసహనం ఎందుకంటే.. |
ఒక పట్టణంలో వ్యాపారి అయిన జీర్ణ్ధనుడు ఆర్థికంగా నష్టపోయి, తిరిగి సంపాదించడానికై ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. చివరకు తనకు మిగిలిన ఇనుప దూలాన్ని తన స్నేహితుడైన లక్ష్మణ్ దగ్గరుంచి భద్రపరచమని చెప్పి వెళ్లాడు. కొన్నాళ్ళకు తిరిగి వచ్చి తన ఇనుప దుంగను తిరిగి ఇవ్వమన్నాడు. ‘మిత్రమా! ఇనుప దుంగను ఎలుకలు తినేశాయి’ అన్నాడు లక్ష్మణ్. ‘అయ్యో! విధి విచిత్రం కాకపోతే ఇనుమును ఎలుకలు తినడమా!’ అని జీర్ణ్ధనుడు సరిపెట్టుకొన్నాడు.
‘సరేలే లక్ష్మణా.. సముద్ర స్నానానికి వెళ్తున్నాను. నా వస్త్రాలకు కాపలాగా నీ కొడుకును పంపించు’ అన్నాడు. సరేనని లక్ష్మణ్ తన కొడుకును స్నేహితుని వెంట పంపించాడు. ఆ పిల్లవాణ్ణి ఓ చోట భద్రపరచి, స్నానం చేశాక తిరిగి వచ్చి, ‘నీ కొడుకును గద్దలు ఎత్తుకుపోయాయి’ అని లక్ష్మణ్‌తో అన్నాడు. దాంతో లక్ష్మణ్ 15 ఏళ్ల కుర్రవాడిని గద్దలు ఎత్తుకు పోవడమేంటని న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఆగ్రహించి బాలుణ్ణి గద్దలు ఎత్తుకుపోవడమా? అని గద్దించాడు.
దానికి జీర్ణ్ధనుడు నవ్వి ‘ఇనుప దుంగను ఎలుకలు తిన్నపుడు బాలుణ్ణి గద్దలు ఎందుకు ఎత్తుకుపోవు?’ అన్నాడు. న్యాయమూర్తి అందులోని రహస్యం అడగ్గా జీర్ణ్ధనుడు మొత్తం వివరించాడు. దాంతో న్యాయమూర్తి లక్ష్మణ్‌పై ఆగ్రహించి ఇనుప దుంగను జీర్ణ్ధనుడికి ఇప్పించి, బాలుణ్ణి లక్ష్మణ్‌కు అప్పగించాడు. ఇది పంచతంత్రంలో కరటకుడు దమనకుడికి చెప్పిని కథ.
డెబ్బై ఏళ్ల నుండి ఇనుప దుంగలను ఎలుకలు తిన్నాయని అబద్ధం చెప్పే గుంపునకు ‘బాలుణ్ణి గద్ద ఎత్తుకుపోయింద’ని చెప్పగానే బాధ కలుగుతుంది. ‘సూడో సెక్యులరిజం’ అనే ఎలుకకు ఇన్నాళ్లు హిందుత్వ అనే ఇనుప దుంగను తినిపించే ప్రయత్నం చేశారు.
ఇప్పుడది సాగకపోవడంతో సెక్యులర్ గుంపు రకరకాల వేషాలు వేస్తోంది. హిందూ సమాజంలోని గొప్పతనాన్ని చెప్పకుండా, కేవలం నిందించడం ఓ ఫ్యాషన్‌గా పెట్టుకొన్న విదేశీ మనస్తత్వాలు తమను తాము పరిశీలించుకోవడం లేదు. గాంధీజీ రాజకీయాల్లోకి రాగానే ఆయన మెత్తదనాన్ని ఉపయోగించుకుని హిందువులను అణచడం మొదలైంది. అది స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ విధానాలతో సంతుష్టీకరణగా మారిపోయింది. మైనార్టీలు ఓట్లు వేస్తేనే గద్దెపై కూర్చోవచ్చు అనే భ్రమను కలిగించి, హిందూ సమాజాన్ని కులాలవారీగా విడగొట్టి పబ్బం గడుపుతున్నారు. 2014లో నరేంద్ర మోదీ జాతీయవాదంపై నిలబడి అఖండమైన మెజార్టీ సాధించడం ఓ చారిత్రాత్మక పరిణామం. దీన్ని జీర్ణించుకోలేని వ్య క్తులు, శక్తులు గత నాలుగేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. జాతీయవాద సంస్థలపై, ఆ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులపై సామాజిక, రాజకీయ దాడులను కొనసాగిస్తున్నారు. సామాజిక, పత్రికా రంగాల్లో మేధావులుగా చలామణి అవుతున్న వాళ్లు అంతులేని అసహనం ప్రదర్శిస్తున్నారు. వారి మేధో ఉగ్రవాదం ఎంతతీవ్ర స్థాయికి వెళ్లిందంటే ప్రతిదాంట్లో హిందూ జాతీయతను వ్యతిరేకించడమే.
సహజంగా హిందువులది సెక్యులర్ మనస్తత్వం. దేశ విభజన జరిగిన తర్వాత, అంతకుముందు ఎన్నో మత ఘర్షణలు జరిగాయి. ప్రతిసారి హిందువులు తమ ప్రాణాలు, ఆస్తులు కోల్పోయారు. తమ మనోభావాలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ప్రవర్తించినా సర్దుకుపోయారు.
కాశ్మీర్ విషయంలో రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరుతో వేలాది మంది సైనికులను మనం కోల్పోయాం. కాశ్మీరీ పండిట్లపై అత్యాచారాలు చేసి, అక్కడి నుండి వెళ్లగొట్టినా కిమ్మనని భావదారిద్య్రంలో మనం బ్రతికాం. 2001 నుండి 2010 వరకే 1067మంది ప్రజలు, 590 మంది భద్రతా దళాల సైన్యం, 2850 మంది తీవ్రవాదులు మరణించారంటే కాశ్మీర్‌లో పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో మనం ఆలోచించవచ్చు. దీనికి ప్రధాన కారణం అక్కడి ముస్లింలలో ఎక్కువమంది తమను తాము ‘అంతర్జాతీయ సమాజం’గా ఊహించుకోవడం. పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలకు కాశ్మీర్‌లోని వేర్పాటువాదులు సహకరించడం ఈ రోజుకూ చూస్తున్నాం. జూన్ 2017లో మహమ్మద్ అయూబ్ పండిట్ అనే పోలీసు అధికారిని మతోన్మాద గుంపు ఎంత కిరాతకంగా చంపిందో మనం గమనించవచ్చు. వీటిని ఖండించకుండా ఈ దుర్మార్గాలన్నీ పెంచి పోషిస్తున్న కుహనా లౌకికవాద రాజకీయ ముసుగులు మెల్ల మెల్లగా తొలగిపోతున్నాయి. హిందువుల్లో చైతన్యం పెరిగి ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. గత డెబ్భై ఏళ్ళనుండి సాహిత్య, సాంస్కృతిక కళారంగాలన్నీ కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్నాయి. అందువల్ల మన పత్రికల్లో ‘హిందూ వ్యతిరేకతకు, ఇండియా వ్యతిరేకత’ సిద్ధాంతాలకు స్థానం ఎక్కువ. అలాగే గత డెబ్భై ఏళ్ళలో దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా క్రైస్తవ మిషనరీలు వచ్చాయి.
ధనం ఆశ జూపి, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని తీవ్రమైన మత మార్పిడి జరిగింది. దాంతో హిందూ సమాజంలో అంతఃకలహాలకు ఆస్కారం ఏర్పడింది. ‘దరిద్రమే లేకపోతే మీరు ఎవరికి సేవ చేస్తారు?’ అని బెర్‌ట్రాండ్ రస్సెల్ మిషనరీలను ప్రశ్నించాడు. సేవ పేరుతో జరిగిన మత మార్పిడివల్ల- మతం మారిన వారి చేతుల్లో బైబిల్ మిగిలింది, మారినవారి అనుయాయులకు రాజ్యాధికారం దక్కింది. ఈ పరిణామాలు కొత్తతరం హిందూ నాయకుల్లో, యువకుల్లో, మతాచార్యుల్లో అగ్నిలా మండి క్రొత్త క్రొత్త ఉద్యమాలకు ఊపిరిపోశాయి. హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు స్వాములు, పీఠాధిపతులు గతంలో లాగా ముక్కు మూసుకొని తపస్సులో మునగకుండా కొత్త తరహా ప్రబోధాలు మొదలుపెట్టారు.
1990 తర్వాత రామజన్మభూమి ఉద్యమం ఈ దేశంలో ప్రతి హిందువును తట్టిలేపింది. ఎక్కడికక్కడే హిందూ జాగృతి మొదలైంది. ఇపుడు సామాజిక మాధ్యమాలు హిందువులకు ప్రత్యామ్నాయ మీడియాగా మారిపోయాయి. పత్రికా రంగంలో పాతుకుపోయిన కమ్యూనిస్టు మేధావులు హిందువుల ఆచారాలను, సంప్రదాయాలను, రాజకీయాలను శీతకన్నుతో చూస్తూ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. హిందూ సమాజానికి సోషల్ మీడియా వరంలా అందివచ్చింది. సంప్రదాయ ప్రచార ప్రసార మాధ్యమాలకు సమాంతరంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు జాతీయ వాదులకు క్రొత్త వేదికలుగా మారిపోయాయి. దాంతో మీడియాలోని ఏకపక్ష వామపక్ష వాదానికి అడ్డుకట్టపడింది. హిందూత్వను ఎంత తిడితే అంతగొప్ప లౌకికవాదిగా చిత్రీకరించే ధోరణిని సోషల్ మీడియా గట్టిగా ఎదుర్కొంది. అందువల్లనే మేధావుల్లో అసహనం మొదలైంది.
వెయ్యేళ్ల బానిసత్వ బాధలు హిందూ యువకులను ఏకం చేసి, వివిధ హిందూ సంస్థలను పటిష్టపరిచాయి. ఇందులో కూడా హిందూ చైతన్యం కన్నా హిందుత్వంపై జరుగుతున్న తీవ్ర దాడులే వారిని ఏకం చేశాయి. మతోన్మాదం ఏదైనా తప్పు అని చెప్పాల్సిన మేధావులు మైనారిటీ మతోన్మాదాన్ని పట్టించుకోకుండా ఎంతసేపూ మెజారిటీ మతవాదంపై ఒంటికాలిపై లేస్తారనే సత్యం హిందూ సమాజం మెల్ల మెల్లగా గుర్తించడం మొదలుపెట్టింది. హిందుత్వం సర్వమత సమాభావనను తన పునాదుల్లో తరాల నుండి నింపుకొంది. కాబట్టే అబ్దుల్ కలాం జాతీయతను ముస్లింలకన్నా హిందువులే ఎక్కువ ఇష్టపడతారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయి వాద్యాన్ని హిందువులు తమ గుండెలనిండా నింపుకొన్నారు. ఖ్వాజా గరిరీ బన్నవాజ్, ఖ్వాజా బందేనవాజ్ వంటి సూఫీ గురువులను హిందూ సమాజం గౌరవించింది. అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, జావేద్ అక్తర్‌లను మన సినీ ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారు. కానీ కులౌకికవాదులు హిందుత్వను ఎప్పుడూ మతోన్మాదంగానే చిత్రీకరించారు. ఇప్పటికీ అదే పని నిరంతరాయంగా కొనసాగుతోంది.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సిపిఎం జాతీయ మహాసభలు ‘మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తాం’ అనలేదు. ‘హిందూ మతోన్మాదాన్ని మాత్రమే వ్యతిరేకిస్తాం’ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయాలను హిందువులు బాగా గమనిస్తున్నారు. హిందువులను సహనశీలురుగా, అణచివేతను సహించే వ్యక్తులుగా ఉండాలని సూడో సెక్యులర్ వాదుల భావన.
మన దేశంలో 20 వేల జనాభానే ఉన్న ఫార్సీలు ఈ దేశంలో గొప్ప పదవులు నిర్వహించారు. జస్టిస్ కపాడియా సుప్రీంకోర్టు సిజెగా, మానెక్ షా మిలట్రీ అధికారిగా, సోలీ సొరబ్జీ అటార్నీ జనరల్‌గా పనిచేసి ఈ దేశ ఖ్యాతిని నిలబెట్టారు. మీకు ఏమైనా ప్రత్యేక అధికారాలు కావాలంటే ఇస్తాం అని స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో బ్రిటీష్ వారు అడిగితే ‘మమ్మల్ని ఇక్కడి హిందువులు బ్రహ్మాండంగా గౌరవించారు. మాకేమీ వద్దు’ అని వారు సున్నితంగా తిరస్కరించారు. అలాంటి హిందూ సమాజంపై నిరంతరం అభాండాలు వేస్తూ ‘నేను హిందువును’ అని చెప్పుకోవడం నేరం అన్నట్లుగా తయారుచేసిన వాతావరణం ‘హిందువునని గర్వించు’ అనే నినాదం వరకు ఎందుకు వెళ్లింది?
దేశంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను యావత్ హిందూ సమాజంపై మోపడం కూడా ‘సెక్యులర్ వాదుల’ కుట్రలో భాగమే. ఏదైనా సంఘటనను కులాలకు, మతాలకు ఆపాదించి చేసే దుష్ప్రచారం ఇంకెంతో కాలం సాగదు. లౌకికవాదం పేరుతో హిందూ అస్తిత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించినంతకాలం హిందూ జాతీయవాదాన్ని ఎవరూ ఆపలేరు. ఇనుప దుంగలను ఎలుకలు తింటే 15 ఏళ్ల బాలుణ్ణి గ్రద్ద ఎత్తుకుపోవడం నిజమే కదా అన్న పంచతంత్ర నీతిని కుహనా లౌకికవాదులు గ్రహించాలి!
-డాక్టర్ పి.భస్కరయోగి - ఆంధ్రభూమి సౌజన్యం తో - _విశ్వ సంవాద కేంద్రము