హైందవ వీరుడు మహా రాణా ప్రతాప్ |
మహా రాణాప్రతాప్ మేవారు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో ఛిత్తోడ్‌ను స్వతంత్రం చేసేవరకు ‘బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, రాజప్రాసాదంలో నిద్రించనని’ మహా రాణాప్రతాప్ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. మొగలు పాదుషా అక్బర్ గుండెల్లో నిద్రించిన ధీశాలి, ధీరోదాత్తుడు, మేవారు రాజు మహారాణాప్రతాప్. భారతదేశ చరిత్రలో మహారాణా ప్రతాప్ సాహసం, శౌర్యం, త్యాగం, బలిదానం, భావి స్వాతంత్య్ర పోరాటానికి ప్రేరణగా నిలిచాయి.
క్రీ.శ.6వ శతాబ్దం వరకు భారతదేశం విదేశీ దురాక్రమణదారులతో పోరాడి, గెలిచి తన అస్థిత్వాన్ని చాటుకుంది. క్రీ.శ.6వ శతాబ్దంలో దేశంలో అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్టచివరి చక్రవర్తి శ్రీహర్షుడు. శ్రీ హర్షుని మరణానంతరం హిందూ రాజులలో అనైక్యత వ్యాపించింది. అహంకారంతో పరస్పరం కలహించుకుంటూ ఎవరికివారే స్వతంత్రంగా వ్యవహరించసాగారు.
అదే సమయంలో విదేశీ ఆక్రమణకారుల దృష్టి భారత్‌పై పడింది. ముస్లిం సేనానులు మహ్మద్ గజని, మహ్మద్ ఘోరీ వంటివారు భారత భూభాగంపై వరుసగా దాడులు కొనసాగించారు. విదేశీ ఆక్రమణకారులతో సమైక్యంగా పోరాడాల్సిన హిందూరాజులు నిష్క్రియులయ్యారు. దేశంలోని రాజుల మధ్య నెలకొన్న విభేదాలు, అనైక్యత ముస్లిం రాజులకు వరంగా మారాయి. క్రమంగా ముస్లిం సేనానులు దేశంలో ఒక్కో రాజును జయిస్తూ తమ రాజ్యాన్ని విస్తరించసాగారు.
ఈ దురాక్రమణ చరిత్ర సుమారు 700 సంవత్సరాల పాటు కొనసాగి మొగలాయిల పాలనకు నాంది పలికింది. మొగలాయి పాదుషా అక్బర్ కాలం నాటికి భారతదేశంలోని 50 శాతం భూభాగం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. ఈ 700 సంవత్సరాల కాలంలో విదేశీ ఆక్రమణకారులను స్వదేశీ పాలకులు ఎదిరించినా సమైక్యంగా పోరాటం చేయని కారణంగా విఫలమైంది. అదే భారతదేశానికి శాపం అయింది.
మొగలు పాదుషా అక్బర్ అమలు చేసిన కుటిలనీతి కారణంగా అనేకమంది రాజపుత్ర రాజులు అతని అధికారానికి తలవంచి, అతని ఆశ్రయం పొందారు. వారంతా ప్రాణసమానమైన స్వాతంత్య్రాన్ని పోగొట్టుకొని అక్బర్‌కు సామంతులయ్యారు. మరికొంతమంది అక్బర్ సైన్యంలో సేనానులుగా చేరారు. మహా పరాక్రమశాలి అయిన రాజా మాన్‌సింగ్ అక్బర్ సైన్యానికి సర్వ సేనాధిపతిగా మొగలాయీల రాజ్య విస్తరణకు కృషి చేశాడు. నిత్యం శివపూజ చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని రాజామాన్‌సింగ్ విదేశీ పాలకుల వద్ద గులాంగిరీ చేయటం హిందూ రాజుల ఆత్మవిస్మృతికి నిదర్శనం.
జననం
మహారాణాప్రతాప్ సుమారు 475 సంవత్సరాల క్రితం రాజస్తాన్‌లోని చిత్తోడ్‌లో క్రీ.శ.1540 మే 9వ తేదీన జన్మించాడు. సిసోడియా వంశానికి చెందిన మహారాణా ఉదయ్‌సింగ్ రాణాప్రతాపుని తండ్రి. తల్లి రాణి జయవంత్‌బాయి. ఉదయ్‌సింగ్‌కు 25 మంది కుమారులు. అందరిలోకి పెద్దవాడు రాణాప్రతాప్. ఉదయ్‌సింగ్ తన ముద్దుల రాణి ధీర్‌భాయి కుమారుడు జున్‌మల్‌సింగ్‌ను తన వారసునిగా ప్రకటించాడు. అయితే ఉదయ్‌సింగ్ మరణానంతరం మేవారు రాజ్యంలోని మంత్రులంతా చర్చించుకొని పరాక్రమవంతుడైన రాణా ప్రతాప్‌సింగ్‌ను మేవారు రాజుగా అభిషేకించారు. దాంతో ఆగ్రహించిన జన్‌మల్‌సింగ్ అక్బర్ సైన్యంలో సేనానిగా చేరి తన మాతృభూమిపైనే యుద్ధం చేశాడు. ఆనాటి రాజపుత్రుల రాజ్యకాంక్ష దేశ సంక్షేమాన్ని విస్మరించింది.
మట్టి నుంచి మాణిక్యాలు
అటువంటి విపత్కర పరిస్థితుల్లో క్రీ.శ.1572లో మేవారు రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్‌సింగ్ మాతృభూమి రక్షణకై నడుంబిగించాడు. అక్బర్ పాదుషాను ఎదిరించడానికి శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో నివసించే భిల్లు యువకులను సమీకరించి వారిలో స్వాతంత్య్ర పిపాస రగిలించి ధైర్య సాహసాలుగల సైనికులుగా తీర్చిదిద్దాడు. మాతృభూమి కోసం ప్రాణాలు సైతం అర్పించే అరవీర భయంకరులైన సైనికులు మహా రాణాప్రతాప్ సైన్యంలో ఉండేవారు.
మహా రాణాప్రతాప్ మేవారు సింహాసనాన్ని అధిష్ఠించేనాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువు వద్ద అపార ధనం, ఇతర సాధనాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో ఛిత్తోడ్‌ను స్వతంత్రం చేసేవరకు ‘బంగారు పళ్ళెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై నిద్రించనని, రాజప్రాసాదంలో నిద్రించనని’ మహా రాణాప్రతాప్ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. సుమారు 25 సంవత్సరాల పాటు అక్బర్‌తో పోరాటం చేసిన మహా రాణాప్రతాప్ ఒక సామాన్య సైనికునివలె జీవించాడు. ఒక దశలో తినడానికి తిండి కూడా సరిగాలేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవాడని చిత్తోఢ్‌గఢ్‌లో నేటికీ అనేక కథలు ప్రచలితంలో ఉన్నాయి.
మహా రాణాప్రతాప్ జీవనశైలి, పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన శీతల్ అనే కవి రాణాపై ఓ ప్రేరణ దాయకమైన గేయకవిత్వం రచించాడు. రాణాప్రతాప్ తన తలపాగాను శీతల్‌కు తొడిగి సన్మానించాడు. శీతల్ కవి గ్రామాల్లో పర్యటిస్తూ మేవారు రాజు శౌర్యగాథలను గానం చేసేవాడు. చివరకు ఆగ్రాలోని అక్బరు పాదుషా కొలువులో కూడా శీతల్ కవి రాణాప్రతాపుని శౌర్యాన్ని గానం చేశాడు.
రాణాకే ప్రాధాన్యం ఇస్తాను
అక్కడొక ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఒకటి జరిగింది. సాధారణంగా అక్బర్ అస్థానంలోకి ప్రవేశించగానే ఎవరైనా తల వంచి, కుడి చేత్తో చక్రవర్తి అక్బర్‌కు సలామ్ చేయాలి. శీతల్ కవి అక్బర్ ఆస్థానంలోకి ప్రవేశించగానే రాణాప్రతాప్ తన శిరస్సున తొడిగిన తలపాగాను తీసి కుడి చేత్తో పట్టుకొని, తల వంచి, ఎడమ చేత్తో సలామ్ చేశాడు. ఎడమ చేతి సలామ్ చక్రవర్తికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క క్షణం తన కోపాన్ని అణచిపెట్టుకుని ఎందుకు అలా చేశావని అడిగాడు శీతల్ కవిని. అప్పుడు శీతల్ కవి ఇలా చెప్పాడు..
‘పాదుషా జి.. ఎడమ చేత్తో మీకు సలామ్ చేసిన నా తప్పును మన్నించండి. దానికి బలమైన కారణమే ఉంది. నెత్తిన ఉన్న ఈ తలపాగాను నాకు మహా వీరుడైన రాణా ప్రతాప్ సింగ్ బహూకరించి, స్వయంగా తన చేతులతో నా శిరస్సుకు తొడిగారు. కాబట్టి ఆ తలపాగా ఉన్న నా శిరస్సును మీ ముందు వంచటం అంటే ఇంతవరకు మీకు లొంగని ఆ వీరుని అవమానించటమే అవుతుంది. అందుకని ఆ తలపాగాను తీసి చేత్తో పట్టుకుని మీ ముందు తల వంచాను. అంతటి మహావీరుని తలపాగాను ఎడమ చేత్తో పట్టుకోవటమంటే కూడా అతనిని అవమానించటమే అవుతుంది. అందుకే తలపాగా కుడిచేత్తో పట్టుకుని మిగిలిన చేత్తో మీకు సలామ్ చేశాను. మీకు భయపడటం కన్నా మహా రాణాప్రతాప్ వీరత్వాన్ని చాటడానికే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను’ అన్నాడు శీతల్ కవి ధైర్యంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ. శీతల్ ఆత్మస్థైర్యాన్ని చూసి అక్బర్ పాదుషా నిశ్చేష్ఠుడయ్యాడు.
హల్దీఘాటీ పోరాటం
హల్దీఘాటీ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం ఉంది. రాణా ప్రతాప్‌ను తన అధికార పరిధిలోకి తీసుకురావడానికి అక్బర్ పాదుషా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. రాయబారం విఫలం కావడంతో యుద్ధం అనివార్యమైంది. అక్బర్‌కు రాణాప్రతాప్ ఒక సమస్యగా తయారయ్యాడు. రాణాప్రతాప్‌తో యుద్ధం చేయడానికే అక్బర్ నిశ్చయించాడు. రాణాప్రతాప్‌పై పోరాటానికి అక్బర్ రెండు లక్షల సైనికులతో పెద్ద సైన్యాన్ని సిద్ధంచేసి దానికి రాజా మాన్‌సింగ్‌ను సేనాధిపతిని చేశాడు. ఒక హిందూ రాజుపై విదేశీయ పాలకుని తరపున మరో హిందూ రాజు పోరాటం చేయడానికి రంగం సిద్ధమైంది. రాజా మాన్‌సింగ్‌కు సహాయకులుగా యువరాజు సలీం, మొఘలులతో కలిసి పోరాడిన రాణాప్రతాప్ తమ్ముడు శక్తిసింహుడిని నియమించాడు. ఈ సైన్యం మేవారు దిశగా కదిలింది.
అక్కడ రాణాప్రతాప్ పరిస్థితిని అంచనా వేసాడు. రాజధానిని దుర్గమమైన కొండల నుంచి కుంభావ్‌గఢ్‌కు మార్చాడు. మేవారు స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోడానికి రాజపుత్ర సర్దారులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. సుశిక్షితులైన సైన్యాన్ని తీసుకొని కీలకమైన హల్దీఘాటీ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ హల్దీఘాటీ ఎత్తైన కొండలమధ్య ఉంది. రాణాప్రతాప్ వద్ద 3 వేల మందితో అశ్విక దళం, 400 ఏనుగులతో సహా 22 వేల మంది సైన్యం మాత్రమే ఉంది. ఈ సైన్యం రెండు లక్షలమంది ఉన్న అక్బర్ సైన్యంతో పోరాడటం అత్యంత సాహసమే అవుతుంది.
హల్దీఘాటీకి ఇరుకైన కొండ మార్గాల వెంట వచ్చే మొగలు సైన్యంపై రాళ్ళ వర్షం కురిసింది. భిల్లుల విల్లుల నుంచి దూసుకొచ్చే పదునైన బాణాల తాకిడికి మొఘలాయి సైన్యం కకావికలమైంది. అయితే చివరకు మొఘలాయీ సైన్యానిదే పైచేయి అయింది. ఈ పరిస్థితిని గమనించిన ఝలాకు రాజు మాన్‌సింగ్ మొఘలు సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేశాడు. అతని సూచనతో రాణా ప్రతాప్ యుద్ధభూమిని విడనాడి సురక్షిత ప్రాంతానికి పయనమయ్యాడు. వాయువేగంతో పయనించే తన గుర్రం చేతక్‌ను మరోవైపు దౌడు తీయించాడు.
వేలాదిమంది రాజపుత్ర వీరులు మాతృభూమి రక్షణలో అమరులయ్యారు. రాణా ప్రతాప్‌ను ఇద్దరు ముస్లిం సర్దారులు వెంబడించారు. వారి వెంటే వున్న శక్తి సింహునిలో పశ్చాత్తాపం మొదలైంది. మేవారు సింహాసనాన్ని రక్షించడానికి పోరాడుతున్న అన్న రాణాప్రతాప్‌కు సహకరించదలుచుకున్నాడు. వెంటనే తన కరవాలంతో ఇద్దరు ముస్లిం సర్దారుల తలలు నరికేసాడు. అన్న రాణాప్రతాప్ కాళ్ళపైబడి శరణువేడాడు. రాణాప్రతాప్ శక్తిసింగ్‌ను హృదయానికి హత్తుకొని ఓదార్చాడు. క్రీ.శ.1576 జూలైలో జరిగిన హల్దీఘాటీ పోరాటం రాజపుత్రుల శౌర్య ప్రతాపాలకు సాక్షిగా నిలిచింది.
హల్దీఘాటీ పోరాటం తరువాత కూడా రాణాప్రతాప్ అక్బర్ సైన్యంతో అనేక యుద్ధాలు చేశాడు. సుమారు 25 సంవత్సరాలపాటు రాణాప్రతాప్ మొగలు సైన్యంతో పోరాడాడు. కుటుంబంతో సురక్షితమైన సింధూఘాటికి బయలుదేరాడు. దారిలో గతంలో మేవారు మంత్రిగా పనిచేసిన భామాషా ఎదురై తన సర్వసంపదను రాణాప్రతాప్ పరంచేసి తిరిగి సైన్యాన్ని పునర్నిర్మించమని కోరాడు. కొత్త ఉత్సాహంతో రాణాప్రతాప్ తిరిగి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే చిత్తోఢ్‌ను గెలవకుండానే క్రీ.శ.1597వ సంవత్సరం జనవరి 17న అస్తమించాడు.
ప్రాతఃస్మరణీయుడైన మహారాణాప్రతా పసింహుడు దేశం, ధర్మం, సంస్కృతి, స్వాతంత్య్రం కోసం పోరాడి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన హైందవ వీరునిగా వీరస్వర్గమలంకరిం చాడు. తరువాతి కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజుకు రాణాప్రతాప్‌సింహుడి యుద్ధ వ్యూహమే స్ఫూర్తి అయింది.
– వేదుల నరసింహం - జాగృతి సౌజన్యం తో __విశ్వ సంవాద కేంద్రము {full_page}