Dr. Madhav Sadashiv Golwalkar ji - గురూజీ |
‘మన మాతృభూమి భారతమాత దాస్య శృంఖాలలో ఉంది. వేయి సంవత్సరాల విదేశీ పాలన కారణంగా భారతదేశం అన్ని విధాలా బలహీనమైంది. ఇలాంటి సమయంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, భారతదేశ పునర్ వైభవం కోసం పని చేస్తున్న సంఘ కార్యాన్ని వదలి వ్యక్తిగత మోక్షం కోసం హిమాలయాలకు వెళ్లాలన్న కోరిక స్వార్థం కాదా? ధర్మమా ?’ అని ఒక సందర్భంలో డాక్టర్జీ మాధవ సదాశివ గోళ్వాల్కర్‌ను ప్రశ్నించారు.
మాధవరావుకు పుట్టుకతో ఆధ్యాత్మిక ప్రవృత్తి లభించింది. దానికి తల్లిదండ్రులిచ్చిన సంస్కారం మరింత తోడైంది. ఆయన ఉత్తమ విద్యార్థి, జ్ఞాన సంపన్నుడూ కూడా. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రంలో ఎం.ఎస్.సి. పూర్తిచేశారు. న్యాయపట్టా పొందారు. ఆర్థిక కారణాలవల్ల జంతు శాస్త్రంలో పిహెచ్‌డి ఆపివేయ వలసి వచ్చింది. కాశీలోని హిందూ విశ్వ విద్యాలయంలో ఉండగా మాధవరావుకు 1934లో సంఘంతో పరిచయమైంది. మాధవరావును అక్కడి అందరు విద్యార్థులు ‘గురూజి’ అని పిలుస్తుండేవారు. ఆ పిలుపే తర్వాత ఎంతో ప్రసిద్ధి పొందింది. కాశీ విశ్వవిద్యాలయంలో సంఘం ప్రారంభం కావడానికి, బలోపేతం కావడానికి ఆయన సహకరించారు. గురూజీకి జన్మతః లభించిన ఆధ్యాత్మిక తృష్ణ కారణంగా నాగపూర్ రామకృష్ణ మిషన్ సహకారంతో విశ్వవిద్యాలయ అధ్యాపక పదవికి రాజీనామా చేసి, ఎవరికీ చెప్పకుండా బెంగాల్‌లోని సారగాచీలో గల అఖండానంద స్వామీజి వద్దకు వెళ్ళారు. వారికి సేవ చేస్తూ, వారి అనుగ్రహంతో ‘దీక్ష’ను పొందారు. అఖండానంద స్వామీజి సమాధి స్థితిలోకి వెళ్ళే ముందు గురూజీకి నాగపూర్ తిరిగి వెళ్ళమని సూచించారు. ఆ సూచన మేరకు స్వామీజి సమాధి పొందిన తర్వాత 1937లో గురూజి నాగపూర్‌కు తిరిగి వచ్చారు. సంఘంతో తిరిగి పరిచయం కొనసాగించారు. సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. సంఘ కార్య విస్తరణ కోసం విస్తారక్‌గా ముంబయి వెళ్ళి వచ్చారు. సంఘకార్యంలో చురుగ్గా పని చేస్తున్నా అన్నీ వదలి హిమాలయాలకు వెళ్ళి మోక్ష సాధనా మార్గంలో జీవించాలన్నది గురూజి బలమైన కోరిక.
డోలాయమాన మనఃస్థితిలో డాక్టర్జీ దిశాదర్శనం
గురూజి మనస్సులోని కోరికను గుర్తించిన సంఘ సంస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్, గురూజీతో అన్నవి పై మాటలు. ప్రతి వ్యక్తి కొన్ని సమయాలలో నాలుగు మార్గాల కూడలి వద్ద నిలబడి వలసి వస్తుంది. తానుగా గాని, తన హితైషుల సలహాతోగాని సరైన జీవన మార్గాన్ని ఎంచుకో వలసి వస్తుంది. తండ్రి ఆకస్మిక మరణానంతరం నరేంద్రునికీ ఈ డోలయమాన స్థితి ఏర్పడింది. కుటుంబ బరువు బాధ్యతలను వదలి శ్రీరామకృష్ణుల సందేశాన్ని ప్రపంచానికి అందించడమే తన జీవన కార్యంగా స్వీకరించి నరేంద్రుడు, వివేకానందు డయ్యాడు. హిందూ ధర్మరక్షకుడయ్యాడు. ప్రపంచానికే వెలుగు చూపాడు. డాక్టర్జీ వ్యక్తిత్వం, ఆయన చేస్తున్న సంఘ జీవన కార్యంతో ఎంతో ప్రభావితులైన గురూజీ డాక్టర్జీ ప్రశ్నతో ‘హిందూ సమాజ సంఘటన’ అనే దైవీయ కార్యం కోసం తన జీవితం ఉద్దేశించబడినదని అర్థం చేసుకుని, ఆ దిశలోనే తన జీవనాన్ని సమర్పించుకుని భారతదేశ పునర్వైభవానికి ఒక మూలస్థంభం అయ్యారు పూజనీయ శ్రీ గురూజి.
ముళ్ల మార్గలో నడచినా ఏ సమయంలోనూ గురూజి వెనుతిరిగి చూడలేదు. తాను ఆ విధంగా జీవిస్తూ ఎంతోమంది సమర్థత కలిగిన యువకులు ఏ పరిస్థితిలోనూ వెనుతిరిగి చూడకుండా తమ జీవనాన్ని భారతమాత సేవలో సమర్పించుకునేట్లు ప్రేరణ కల్గించిన దీపస్తంభం, స్ఫూర్తి ప్రదాత శ్రీ గురూజి.
Dr. Madhav Sadashiv Golwalkar |
గురూజీలోని నేతృత్వాన్ని గుర్తించిన డాక్టర్జీ
డాక్టర్జి గురూజీలోని అపారమైన జ్ఞానాన్ని, నాయకత్వ లక్షణాలను, సమర్పణ భావాన్ని గుర్తించారు. గురూజీ ప్రసంగించడానికి అవకాశమిచ్చి తాను మౌనంగా వారి బౌద్ధిక్‌లను విన్నారు. వారికి సంఘ కార్యానికి సంబంధించిన చిన్న, పెద్ద పనులను కేటాయించారు. వారి కార్య కౌశలాన్ని గుర్తించారు. సంఘ కార్య పద్ధతి నిర్ణయం కోసం నాగపూర్ వద్ద గల ‘సింధి’ గ్రామంలో వారం రోజుల పాటు 1939 లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆనాటి సంఘ పెద్దలందరూ గురూజీ వ్యక్తిత్వపు విశేషతను గుర్తించ సాగారు. 1940లో డాక్టర్జి తనువు చాలిస్తూ సంఘ నావను నడిపే బాధ్యత అయిన సర్‌సంఘచాలక్ బాధ్యతను శ్రీ గురూజీకి అప్పచెప్పారు.
దేశానికి, సంఘానికి కష్టకాలంలో గురూజీ నేతృత్వం
డాక్టర్జి చిన్నప్పటి నుండి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎన్నో సంస్థల్లో పని చేశారు. సమాజ జీవన అనుభవం మెండుగా వారికుంది. ఈ నిండైన అనుభవంతో వారు సంఘ కార్యాన్ని ప్రారంభించారు. డాక్టర్జి ఉత్సాహంగా, ఉద్రేకంగా మాట్లాడే వ్యక్తి కాదు. కాని వారు వ్యక్తులలో అంతర్లీనంగా ఉన్న సద్గుణాలను గుర్తించి, వాటిని వికసింపచేసి దేశ పునర్వైభవం కొరకు జీవిస్తూ, పనిచేసే ర్యకర్తల నిర్మాణాన్ని చేయగల నేర్పరి, సంఘటనా కుశలురు. సంఘటనా శాస్త్ర ద్రష్ట. అత్యంత సంఘటనాకుశలురైన డాక్టర్జి సంఘం శైశవ స్థితిలో ఉండ గానే స్వర్గస్తులయ్యారు. దీంతో సంఘం పని అయిపోయిందని చాలామంది సంఘ విమర్శకులు జోస్యం చెప్పారు. డాక్టర్జీతో పోలిస్తే గురూజీకి సమాజ కార్యంలో అంత అనుభవం లేదు. సంఘ కార్యంలోనూ వారు జూనియరే. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో నాయకత్వం వహిస్తున్న గాంధీజి, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, సావర్కర్ వంటి ఎంతోమంది ప్రజా హృదయాలను చూరగొన్న నాయకుల మధ్య, దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ఆర్.ఎస్.ఎస్. సర్‌సంఘచాలక్‌గా గురూజీ, దేశం ముందు మార్గదర్శకులుగా నిలబడ్డారు. బి బి సి
1940-49 మధ్యకాలం దేశానికి, సంఘానికి కూడా గడ్డుకాలం. ఒకపక్క ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న స్వాతంత్య్ర ఉద్యమపు అలలు. మరోపక్క మతపరంగా ముస్లింలు ప్రత్యేక దేశంగా ‘పాకిస్థాన్’ కావాలంటూ జిన్నా డిమాండ్. హిందూ మహాసభకు ఆర్.ఎస్.ఎస్. పూర్తి మద్దతు నివ్వాలనీ సావర్కర్ వంటి నాయకుల నుండి వచ్చే ఒత్తిడి. ‘హిందూ సమాజ సంఘటన అంటే సంకుచితమైనదనీ, మతతత్వ పరమైనదనీ కాంగ్రెసు, సోషలిస్టు, కమ్యూనిస్టు నాయకులు తీవ్ర విమర్శలు. ఇలాంటి సమయంలో సమర్థత గల్గిన యువకులను సమీకరించి, హడావిడి లేని ఆర్.ఎస్.ఎస్. శాఖ కార్యపద్ధతి కోసం పని చేసేట్లు చేయడం కంటకాకీర్ణ మార్గం కాక మరేమిటి? సంఘ కార్య విస్తరణకు ముందుకు రావలసిందిగా 1942లో గురూజీ ప్రత్యేకంగా పిలుపు నిచ్చారు. మరొకపక్క గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ సమయంలో పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ, ప్రొ.రాజేంద్ర సింహ వంటి ఎంతోమంది యువకులు సంఘ ప్రచారక్‌గా ముందుకు వచ్చారు. కొందరు గృహస్తులు కూడా ప్రచారకులుగా వచ్చారు. 1940-47లో సంఘశాఖలు అత్యంత వేగంగా విస్తరించాయి. వందల సంఖ్యలో విద్యార్థులు, యువకులు సంఘ శాఖలకు రాసాగారు. హిందువులకు రక్షణ కల్పించేది సంఘమేనన్న విశ్వాసం ప్రజల్లో ఏర్పడసాగింది. ప్రజల హృదయాన్ని చూరగొని, ప్రజా సంస్థగా బలపడుతున్న ఆర్.ఎస్.ఎస్.ను చూసి, ఆంగ్లేయ పాలకుల విభజన కుట్రలను, ముస్లింలీగ్ వేర్పాటు ఉద్యమాలను గుర్తించి ఆపలేని పండిత నెహ్రూ సంఘాన్ని అణిచి వేయడానికి మాత్రం అన్ని విధాలా ప్రయత్నించడం దురదృష్టకరం. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే, గాంధీజి హత్యకు ముందే, 1946లోనే జాతీయ కాంగ్రెస్ సంఘాన్ని నిషేధించాలని తీర్మానించడం గమనార్హం.
నిషేధపు చీకటి నుండి వెలుగులోకి సంఘం
భారతదేశ విభజన అనంతరం అత్యంత దుఃఖకర పరిస్థితులను చూసి ఆవేదన, ఆక్రోశంతో నాధూరాం గాడ్సే అనాలోచితంగా గాంధీజీని హత్య చేశాడు. గాంధీజీ భౌతికంగా మరణించారు. గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెసు అవలంబించిన ముస్లిం సంతుష్ట విధానాల దుష్ప్రరిణామాలనూ ప్రజలు మరిచిపోయారు. నెహ్రూ అవలంబించిన అవాస్తవ ఆరోపణల ప్రభావం వల్ల ‘గాంధీజీ హత్యకు కారకులు ఆర్.ఎస్.ఎస్. వారు’ అనే అసత్యపు ఆరోపణలను, నిందను సంఘం దశాబ్దాల పాటు, అంటే దాదాపు 1980 వరకు మోయవలసి వచ్చింది. సంఘం విస్తరణ వేగం మందగించింది.
గాంధీజి హత్యారోపణతో నెహ్రూ ప్రభుత్వం 1948లో సంఘాన్ని నిషేధించింది. గాంధీజి హత్యకు – ఆర్.ఎస్.ఎస్.కు సంబంధం లేదని వాస్తవాలు వెలుగు చూసినా, కేంద్ర ప్రభుత్వం సంఘంపై నిషేధం ఎత్తివేయలేదు. ఎన్నో కుంటు సాకులు చూపసాగింది. ఆర్.ఎస్.ఎస్. నాయకులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మధ్య చర్చలు అర్థాంతరంగా ముగిసాయి. 65వేల మందికి పైగా స్వయంసేవకులు సంఘంపై నిషేధం ఎత్తివేయాలంటూ సత్యాగ్రహం చేశారు. ప్రజా స్వామ్యానికి మూలస్థంభమయిన పత్రికల్లో ఈ వార్తలు అసలు ప్రచురితం కాలేదు. శాసనసభలు, పార్లమెంటులో ఈ సత్యాగ్రహంపై చర్చే జరగలేదు. స్వాతంత్య్ర ఉద్యమంలో సైతం ఒకేసారి ఇంతమంది సత్యాగ్రహంలో పాల్గొనలేదు. సంఘ నియమావళి అందచేసిన తర్వాత ఎలాంటి షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం సంఘంపై నిషేధం ఎత్తివేసింది. నిషేధానంతరం గురూజీ పర్యటన సందర్భంగా దేశంలో వివిధ కేంద్రాల్లో లభించిన అఖండ స్వాగతాన్ని చూసి ‘దేశంలో నెహ్రూతో సమానంగా జనాదరణ కల్గిన నాయకులు శ్రీ గురూజీ’ అంటూ అనేక పత్రికలు గురూజీ నాయకత్వ పటిమను గుర్తించాయి. దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుండి తరలి వస్తున్న హిందువులను సురక్షితంగా భారత్‌కు చేర్చడంలో, భారత్‌కు కాందిశీకులుగా వచ్చిన హిందువులకు పునరావాసం కల్పించడంలో శ్రీ గురుజి నాయకత్వంలో స్వయంసేవకులు వ్యవహ రించిన తీరు చారిత్రాత్మకం.
విభిన్న సమయాల్లో గురూజీలో సందేశాలు
‘పాకిస్తాన్‌లోని హిందువుల్లో చివరి వ్యక్తి కూడా సురక్షితంగా తరలి వెళ్ళేవరకు మీరు అక్కడే ఉండండ’ని ఈనాటి పాకిస్థాన్ భూభాగంలోని స్వయంసేవకులకు గురూజీ అందించిన సందేశం; అన్యాయంగా, అవాస్తవ ఆరోపణలతో సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించి, డాక్టర్జీ సమాధిపై దాడిచేసి, అనేకమంది స్వయంసేవకుల ఇండ్లపై దాడులు చేస్తూ, గురూజీని నిర్బంధించిన సమయంలో ‘అన్ని విధాలా సంయమనం పాటించండి’ అంటూ స్వయంసేవకులకు గురూజీ ఇచ్చిన ఆదేశం; నిషేధానంతరం ”వయం పంచాధికతం శతం’ ఈ ప్రభుత్వం మనది, పళ్ళవల్ల నాలుకు గాయమైందని పళ్ళను ఊడగొట్టుకుంటామా? పళ్ళు, నాలుకా రెండూ మనవే ! ఈ ప్రభుత్వంపై ఆగ్రహం తగదు’ అని స్వయంసేవకులకు ఇచ్చిన సందేశం వంటివి గురూజీ విశిష్ఠ నాయకత్వానికి మచ్చుతునకలు.
స్వాతంత్య్రానంతరం సంఘ శాఖలు అవసరమా?
దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఇంకా శాఖలు అవసరమా? సంఘం ఒక బలమైన రాజకీయ పక్షంగా మారాలని కొందరు స్వయం సేవకులు బలంగా వాదించినప్పుడు, ‘వ్యక్తి నిర్మాణ కార్యం నేడు అవసరమే’ అని చెప్పి, స్వయంసేవకు లందరి దృష్టిని సంఘం శాఖ వైపు మర్చలడంలోనూ, కార్యకర్తలకు నచ్చ చెప్పడంలోనూ శ్రీ గురూజి వ్యవహ రించిన తీరు, విధానం మనం గమనించ వలసినది.
వివిధ రంగాల్లో సంఘం
1949-75 మధ్య కాలంలో (శ్రీ గురూజి హయాం) వరకు ఒకపక్క శాఖను సంస్కార కేంద్రంగా తీర్చిదిద్దుతూ, శాఖలను విస్తరింపచేశారు. గురూజీ పర్యటనల్లో సంఘ సీనియర్ కార్యకర్తలను సైతం ప్రార్థన గురించి అడగడం, సూర్యనమస్కార మంత్రాలు చెప్పమనడం వంటి వాటి ద్వారా సంఘ పని మూలాల వైపు అందరి దృష్టిని మళ్ళించారు. భారత పునర్‌వైభవ స్థితి కొరకు వివిధ రంగాల్లో సమర్తులైన కార్యకర్తలను పంపి వివిధ సంస్థలు ప్రారంభం అయ్యేట్లు చూసారు. సైద్ధాంతికంగా, కార్యపద్ధతిలో ఆ సంస్థలు వికసించడానికి గురూజీ అందించిన మార్గదర్శనం అద్వితీయం. విద్యార్థిపరిషత్, భారతీయ జనసంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, వనవాసీ కళ్యాణాశ్రమం, విద్యాభారతి (శిశుమందిరాలు), వివేకానంద శిలా స్మారకం ఇలా ఎన్నో సంస్థలు జన్మించి వికసించాయి.
వివిధ రంగాల్లో సంఘం |
పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ రాజకీయ రంగంలో, దత్తోపంత్ ఠేంగ్డే కార్మిక రంగంలో, ఎస్.సి. ఆప్టే ధార్మిక రంగంలో, బాలాసాహెబ్ పాండే వనవాసీ రంగంలో, ఏకానథ్‌రానడే వివేకా నంద శిలాస్మారకం.. ఇలా ఎందరో సంఘ సేనాధి పతులకు వారి రంగాల్లో గురూజీ మార్గదర్శనాన్ని అందించారు.
శ్రీ గురూజీ మహా ప్రస్థానం చేస్తూ వ్రాసిన ఉత్తరాల సంక్షిప్త సందేశం:
➣ సంఘ కార్యం వ్యక్తిపూజితం కాదు. ధ్యేయ పూజితం. సంఘ నిర్మాతకు తప్ప మరెవ్వరికి స్మారక నిర్మాణం ఆవశ్యకం లేదు.
➣ నాకేమి తెలియకపోయినప్పటికీ పాత కార్యకర్త లందరూ ప్రేమాభిమానాలతో సహకరించి మార్గదర్శనం చేయడం వల్ల నేను ఈ బరువు బాధ్యతలను 33 సంవత్సరాల సుదీర్ఘ కాలం వహిస్తూ వచ్చాను. నా స్వభావం వల్ల ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించమని రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను.
➣ కడకొక్క విజ్ఞప్తి – కలదయ్య వినుడు – మరువ బోకుము నన్ను మహనీయులారా – పలు మాటలింకేల పలుకంగలవయు – కాళ్ళ కరగుచు తుకారము పలికే నను కృపచూడుడు నా దేవులారా !
– కె.శ్యాంప్రసాద్, సామాజిక సమరసత అఖిల భారత సంయోజకులు - __విశ్వ సంవాద కేంద్రము{full_page}