సమరసతా సాధనలో దత్తోపంత్ ఠేంగ్డీ జీ |
డా|| వడ్డి విజయసారథి
1983లో నూతన సంవత్సరాది ఏప్రిల్ 14న వచ్చింది. ఉగాది - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపకులైన డా॥ హెడ్డెవార్ జన్మదినం. ఏప్రిల్ 14 భారత రాజ్యాంగ నిర్మాతలలో ప్రముఖులైన డా॥ అంబేడ్కర్ జన్మదినం. అలా ఇద్దరు మహానుభావుల జయంతులు ఒకే రోజు వచ్చిన ఆ సుదినాన మహారాష్ట్రలోని పుణే నగరంలో సామాజిక సమరసతా మంచ్ కి అంకురార్పణ జరిగింది.
సామాజిక సమరసతా మంచ్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని దత్తోపంత్ జీ వివిధ సందర్భాలలో వివరించారు. సంకేత రేఖా గ్రంథంలో ఆయన వ్యక్తీకరించిన అంశాలు ఇలా ఉన్నాయి. హిందూ ధర్మం, తత్త్వజ్ఞానం అత్యంత శ్రేష్ఠమైనదనే విషయంలో ఎవరికీ ఏ విధమైన అనుమానం లేదు. వివాదమూ లేదు. అయితే, ఇప్పటి దైనందిన వ్యవహారాల్లో అది కనిపించటం లేదు. "పురాణాల్లో చెప్పే మాటలు పురాణాల వరకే పరిమితం” వంటి నానుడులను ఇప్పటి మన మాటలకూ చేతలకూ సంబంధం లేని స్థితిని గ్రహించవచ్చు. డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ కి కూడా ఈ విషయం చిరాకు కలిగించేది. హిందూ తత్త్వజ్ఞానం ప్రకారం బ్రహ్మ సర్వే సర్వత్ర వ్యాపించి ఉండగా, చర్మకారునిలోనూ, శుచికారుని లోనూ బ్రహ్మ తప్పక ఉండి ఉంటాడు గదా! మరి ఈ స్పృశ్యాస్పృశ్య భావనలూ, అంటరానితనమూ ఎందుకు వస్తున్నాయి?" అని ఆయన అనేవారు. “కమ్యూనిస్టులను మినహాయించి ధర్మం అవసరం లేదనేవారు ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా ఉండరు. మనందరికీ ధర్మం కావాలి. సామాజిక సమరసత ఉన్న చోటనే ధర్మం ఉంటుంది. వాస్తవానికి అదే ధర్మం, మిగిలినవన్నీ "అధర్మాలే” అని ఆయన వివరించి చెప్పేవారు.
హిందువులు పలుకుతున్న ధార్మిక సిద్ధాంతాలకు, వారి సామాజిక వ్యవహారానికి మధ్య ఉన్న దూరం కారణంగా వ్యక్తమవుతున్న వ్యధ డా|| బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనల్లో ఎంతగా కనిపించేదో, డా|| హెగ్డేవార్ ఆలోచనలలోనూ అంతగా తొంగి చూస్తుంది. ఈ విషయం తెలియక, అధ్యయనం చేయక, తాము మాత్రమే ప్రగతివాదులమని, మిగిలిన వారందరూ తిరోగమన వాదులేనని ఊహించుకొనే స్వకేంద్రిత అహంకారం కారణంగా స్వయం ప్రకటిత ప్రగతివాదులు సంఘానికి మసిపూసే ప్రయత్నాలు చేస్తుంటారు. హిందూ సమాజంలో తరతరాలుగా అస్పృశ్యత వంటి వివక్షకు గురై, అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్నవారికి పాజిటివ్ డిస్క్రిమినేషన్ (పైకి అసమానతగా కనబడే సమానతా సూత్రం) విధానం ద్వారా చేయూతనివ్వడానికి విద్యాలయాల ప్రవేశాల్లోను, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించారు.
విద్యావకాశాలను, ఉద్యోగావకాశాలనూ పొందటంలో విఫలమవుతున్నవారు ఈ రిజర్వేషన్ల విధానం కారణంగానే తాము వంచనకు గురవుతున్నామని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అటువంటి ఆక్రోశాన్ని ప్రకటించే ఒక ఉద్యమం 1985లో గుజరాత్ లో పెద్ద ఎత్తున సాగిపోతున్న సమయంలో కొందరు యువకులు దత్తోపంత్జీని ఈ ప్రశ్న అడిగారు.
అప్పుడు ఆర్ఎస్ఎస్ తృతీయవర్ష శిక్షణ శిబిరం నాగపూర్‌లో జరుగుతుంది. దత్తోపంత్ జీ శిక్షార్థుల సందేహాలకు సమాధానమిచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అప్పటికి రిజర్వేషన్ల వ్యవస్థను మొత్తానికి మొత్తంగా రద్దు చేయాలని కోరుతూ గుజరాత్ లో జరుగుతున్న ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉత్తరాదిన కూడా కొద్ది కొద్దిగా రాజుకొంటుంది. కొందరు విద్యార్థులు తమ ఒంటికి నిప్పంటించుకున్న ఘటనలు కొన్ని జరిగాయి. చదువులో చురుకుగా ఉండే స్వయం సేవకుల మీద ఈ ఉద్యమానికి సంబంధించిన వార్తల ప్రభావం ప్రసరిస్తూ ఉంది. అటువంటి సమయంలో ఒక శిక్షార్థి ఆవేశపూరితమైన భాషలో - కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొనేవారికి వృత్తి విద్యా కళాశాలల్లో ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం లభించక పోవటమూ, కనీస స్థాయి మార్కులు కూడా రానివారికి ప్రత్యేకంగా రాయితీలిచ్చి విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించటమూ ఎలాంటి న్యాయమని, ఈ విధమైన వివక్ష కారణంగా తెలివితేటలుండి, బాగా కష్టపడి చదివే స్వభావం ఉన్నవారు కూడా జీవితంలో కష్టాలపాలవుతున్నారని, అవమానాలూ ఎదుర్కోవడం వల్ల నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని చెపుతూ తన బాధను వెళ్లగక్కాడు.
సంఘ కార్యక్రమాల్లో ఒకరు మాట్లాడుతూ ఉండగా, మిగిలినవారు తమలో తాము మాట్లాడు - కోరు. కాని శిక్షార్థులు తమలో తాము గుసగుసలాడు కోవడం ప్రారంభించారు. ఆ శిక్షార్థి అడిగిన ప్రశ్న గురించి అతని ఆవేదన, ఆవేశాల గురించి పక్క వారితో తమ భావాన్ని పంచుకొనేవారు కొందరైతే, దత్తోపంత్ జీ ఏమి చెప్తారో వినాలని ఆసక్తిని చూపించినవారు కొందరు. దతోపంజ్ ఇరుకున పడినట్లున్నారని పక్కవారితో చెప్పినవారూ లేకపోలేదు.
కొంచెం సుదీర్ఘంగా సాగిన ప్రశ్న ముగిసిన తర్వాత, శిక్షార్థులందరివైపు ఒకసారి కలయ జూసి దత్తోపంత్ జీ రెండే రెండు వాక్యాలు చెప్పారు. మొదటిది : “సంఘం మొత్తం హిందూ సమాజాన్ని ఒకే కుటుంబంగా భావిస్తుంది. ఈ కుటుంబంలోని అందరి సమస్యలూ తన సమస్యలుగానే భావిస్తుంది.” గుసగుసలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అందరూ ప్రతి ఒక్కమాటనూ, అత్యంత శ్రద్ధగా వింటున్నారు. రెండవది : రిజర్వేషన్లు ఊతకర్రల వంటివని అంబేడ్కర్ స్వయంగా చెప్పారు. నడవడానికి అశక్తులై ఇబ్బంది పడుతున్న వారు తాము నడవటం కోసం ఊతకర్రల్ని ఉపయోగించుకోగలరు గాని, పరుగెత్తాలనుకునేవారికి అవి ఏ రకంగానూ ఉపయోగపడవు గదా, అవి ప్రతిబంధకాలవుతాయి. ఆ విషయం గ్రహించుకొన్నవారు పరుగెత్తే స్థితికి వచ్చినపుడు తమంత తాముగా వాటిని దూరంగా విసరివేయక తప్పదు." మొదటివాక్యం శిక్షార్థులకు తెలియని కొత్త అంశమేమి కాదు. అయితే దత్తోపంత్జీ దానిని సముచితమైన రీతిలో గుర్తుచేశారు. ఆ దశలోనే చాలామందికి సమాధానం లభించింది. రెండవ వాక్యం రిజర్వేషన్లకున్న పరిమితిని వివరించటంతో ఏ మూలనన్నా ఆందోళన మిగిలి ఉంటే, అదీ తొలగిపోయింది. అందరి హృదయాలూ తేలికపడ్డాయి.
రిజర్వేషన్ల వంటి సంక్లిష్ట సమస్యల గురించి వాటి పట్ల డా|| అంబేడ్కర్ వైఖరి గురించి దత్తోపంత్జీ అంత స్పష్టంగా చెప్పడానికి ఆయనకు ప్రత్యక్షంగా అంబేడ్కర్ తో గల సంబంధమే పునాది. మొదటి సార్వత్రిక ఎన్నికల నాటి నుండి 1956లో డా|| అంబేడ్కర్ స్వర్గస్థులయ్యేవరకూ వారిద్దరి మధ్య సన్నిహితమైన ఆత్మీయ సంబంధం ఉండేది. కాబట్టే దత్తోపంత్ జీ నేరుగా డా|| అంబేడ్కర్ను ప్రశ్నించి బౌద్ధమత స్వీకారానికి కారణం, అయన మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకొన్నారు. 'సంకేత రేఖా గ్రంథంలో 'పిఛడే బంధూ' అనే అధ్యాయంలో ఈ విషయం వివరంగా ఉంది.
దత్తోపంత్ జీ - డా|| అంబేడ్కర్ |
1956 అక్టోబరు 14 విజయదశమినాడు నాగపూర్ లో బౌద్ధమతాన్ని స్వీకరించడానికి ముందు ఒక హోటల్లో రిపబ్లికన్ పార్టీ ఏర్పాటు గురించి కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల ఏర్పాట్లకు బాధ్యత వహిస్తూ దత్తోపంత్జీ అక్కడ ఉన్నారు. అంబేడ్కర్ తీరిగ్గా ఉన్నపుడు దత్తోపంత్జీ ఇలా ప్రశ్నించారు. “గతంలో అస్పృశ్యత వగైరా అన్యాయాలు జరిగినమాట వాస్తవమే. అయితే ఈనాడు కొందరు యువకులు ఈ దోషాలను తొలగించి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడానికి చేస్తున్న ప్రయత్నం మీ దృష్టికి రాలేదా?"
మీరు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు కదా! నేను ఈ విషయంలో ఆలోచించనే లేదని మీకు అనిపిస్తుందా? అని ఎదురు ప్రశ్నించారు అంబేడ్కర్. దత్తోపంత్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అని ఆయనకు తెలుసు. “చూడు, 1925లో మీ సంఘం ప్రారంభమైంది. ఇప్పటికి 28 సంవత్సరాల తర్వాత దేశమంతటా మీ సంఖ్య 27 లేదా 28 లక్షలు ఉండోచ్చు. ఈ లెక్కన విశాలమైన సమాజాన్ని ఏకసూత్రంతో బంధించడానికి ఎంత సమయం పట్టుతుందో ఆలోచించు. అప్పటిదాకా పరిస్థితి వేచి ఉంటుందా? నేను బ్రతికి ఉండగలనా? నా ముందున్నది ఒకే ఒక లక్ష్యం. నేను పోవడానికి ముందే నా ప్రజలకు ఒక నిశ్చితమైన మార్గం చూపించటం. 'నా ప్రజలను ఇప్పటివరకు దూరంగా ఉంచారు. పీడనకు గురిచేశారు. దోచుకొన్నారు. వారిలో ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఫలితంగా ఆవేశం, ఆక్రోశం కల్లటం సహజమే. అటువంటి ప్రజలు చాలా త్వరగా కమ్యూనిజానికి ఎర అవుతారు. అయితే నా ప్రజలు అలా బలికావటాన్ని నేను ఒప్పుకోను. మన దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి దారి చూపించాలి. మీరు సంఘం ద్వారా దేశహితం కోసమే ప్రయత్నిస్తున్నారు, అయితే నేను ఇప్పుడు గనుక నా ప్రజలకు చూపించకపోతే, వారు కమ్యూనిస్టుల మాయాజాలంలో చిక్కుకుంటారు. బహుశా అప్పుడు మీరెంతగా ప్రయత్నించినా వారిని మళ్లీ జాతీయ ప్రవాహంలోకి తీసికొని రాలేరు. ఎందుకంటే, మీరు చెప్పేది మంచిదా, చెడ్డదా అనే ప్రశ్న కాదు. మీరేమి చెప్పినా నా వాళ్లు మీ మాట వినే స్థితిలో ఉండరు.
అందుకే నేను పోవడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, సవర్ణ హిందువులకూ కమ్యునిజానికీ మధ్య గురూజీ (డా హెగ్డేవార్) ఏ విధంగా అడ్డుగోడగా నిలిచారో, అదేవిధంగా దళిత ప్రజలకు కమ్యూనిష్టులకూ మధ్య అంబేడ్కర్ ఒక అభేద్యమైన గోడగా నిల్చోని ఉన్నాడు." అని వివరించారు అంబేడ్కర్.
ఆ రోజుల్లో కమ్యూనిజం మన దేశంలోని దేశభక్తులను ఎంతగా భయపెట్టిందో, నేటి తరానికి అర్థం కావటం సులభం కాదు. ఆనాటి కొన్ని వాస్తవాలను గమనిస్తే నాటి పరిస్థితి మన అంచనాలకు అందుతుంది. అప్పటికి కేరళలో కమ్యానిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంలోనూ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. యూరోప్లోని సగం దేశాలు సోవియెట్ రష్యాకు ఉపగ్రహాలైనాయి. కాబట్టి కమ్యూనిస్టుల మాయాజాలంలో తగుల్కొనకుండా తన ప్రజలను రక్షించుకొనేందుకే అంబేద్కర్ లక్షలాది అనుచరులను బౌద్ధమతం వైపు నడిపించారని, విదేశీ
మతాలకు, విదేశీ తత్వాలకు దూరంగా నడిపించారని దత్తోపంత్జీ అవగతం చేసుకున్నారు.
దత్తోపంత్జీ నుండి లభించిన ఈ సమాచార్ం దృష్టిలో ఉంచుకొనే శ్రీ గురూజీ తన ప్రయత్నాలను ప్రారంభించి 1964లో విశ్వహిందూపరిషత్ సంస్థాపన సమావేశంలో పరిషత్ వేదికపై ధర్మా చార్యులతో 'న హిందుః పతితోభవేత్' 'అనీ మమదీక్షా హిందు రక్షా, మమ మంత్ర స్సమానతా" అని పలికించి హిందూ సమాజంలో చైతన్యం నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించారు.
వ్యాసకర్త : డా|| వడ్డి విజయసారథి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు, భాగ్యనగర్ _జాగృతి సౌజన్యంతో {full_page}