ప్రపంచంలో అతిపెద్ద నరమేధం చైనాదే.. |
ప్రపంచంలో అతి పెద్ద మారణ కాండకు కారణమైన వారు ఎవరు? చాలామంది హోలోకాస్ట్ (యూదుల మారణకాండ )కు కారణమైన అడాల్ఫ్ హిట్లర్ అనుకుంటారు. లేకపోతే హిట్లర్ కంటే ఎక్కువమందిని చంపించిన రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్ అనుకుంటారు. కానీ వీరిద్దరిని మించిపోయి అమ్మయకుల్ని పొట్టన పెట్టుకున్నది మాత్రం మావో జెడాంగ్ అని చాలమందికి తెలియదు. 1958 నుండి 1962 వరకు ఆయన అమలు చేసిన `ముందడుగు’ విధానం వల్ల 45 మిలియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రికార్డులకు ఎక్కిన అతి పెద్ద మారణకాండ ఇదే.
రచయిత ఫ్రాంక్ డికోటర్ తన `మావోస్ గ్రేట్ ఫెమైన్’ అనే తాజా పుస్తకంలో ఆనాటి మారణకాండ గురించి వివరించారు. దేశంలోని గ్రామాలన్నిటిని కమ్యూన్ లు గా మార్చేస్తే అప్పుడు తమ దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని, ఇక ఎవరు తమతో పోటీపడలేరని మావో భావించాడు. ఈ రంగుల కలకోసం అన్నింటిని సామూహిక క్రియగా మార్చేందుకు ప్రయత్నించాడు. ప్రజల నుండి పని, ఇల్లు, భూమి, వారి ఉపాధి మొదలైనవాటన్నింటిని బలవంతంగా లాక్కున్నారు. సామూహిహక క్యాంటీన్ లలో ఆహారం `అర్హతను’ బట్టి ఎన్ని చెంచాలు ఇవ్వాలో నిర్ణయించేవారు. ఆ విధంగా పార్టీ `నియమనిబంధనలు’ అందరూ అంగీకరించేటట్లు చేసేవారు. పనికి ప్రోత్సాహకాలన్నీ తొలగించారు. రైతులనుండి బలవంతంగా భూములు లాక్కునేవారు. నీటిపారుదల సదుపాయాలు లేని భూముల్లో అద్భుతమైన పంటలు పండించాలంటూ నిర్బంధించేవారు.
దీనితో ప్రజలంతా పెద్ద విపత్తుకు గురయ్యారు. జనాభా లెక్కల పరిశీలన ద్వారా కొన్ని కోట్ల ఆకలి చావులు సంభవించాయని నిపుణులు అంచనా వేశారు. కానీ అసలు లెక్కలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆ లెక్కలను చూస్తే మావో కాలంలో ఎన్ని కోట్లమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో అర్ధమవుతుంది. 1950 నుండి 1962 మధ్యకాలంలో 45 మిలియన్ (4కోట్ల 50 లక్షలు ) చనిపోయారని తెలుస్తోంది. గత అంచనాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంతేకాదు వారు ఏ రీతిలో చనిపోయారన్నది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. కనీసం రెండు నుండి మూడు మిలియన్ (20 లేదా 30 లక్షలు) మందిని చాలా చిన్న కారణాలకే చంపివేశారనే విషయం కలచివేస్తుంది. హూనన్ గ్రామంలో ఒక పిల్లవాడు గుప్పెడు ధాన్యం దొంగిలించాడనే అభియోగంపై స్థానిక అధికారి గ్జియోంగ్ డెచాంగ్ అతనికి మరణశిక్ష విధించాడు. తండ్రి చేతులమీదుగానే పిల్లవాడిని సజీవ సమాధి చేయించాడు. ఈ ఘోరానికి తట్టుకోలేక ఆ పిల్లవాడి తండ్రి కూడా కొద్దిరోజులకే ప్రాణాలు వదిలాడు. వాంగ్ జియు సంఘటన కూడా ఇలాంటిదే. అతనికి విధించిన శిక్ష గురించి స్థానిక పరిపాలన యంత్రాంగం కేంద్ర నాయకత్వానికి రిపోర్ట్ చేసింది. జియు చెవులు రెండు కత్తిరించారు. కాళ్ళను ఇనుప తీగతో కట్టేశారు. వీపుకు 10 కిలోల రాయి వెల్లడదీశారు. ఇది చాలక అతనిపై పదునైన పనిముట్టుతో గుర్తు వేశారు. ఇంతకీ అతను చేసిన నేరం? భూమి నుండి బంగాళాదుంపను తవ్వి తీసుకోవడమే !
‘పెద్ద ముందడుగు‘ గురించి ప్రాధమికమైన విషయాలు నిపుణులు, అధ్యాయనవేత్తలకు ఇంతకుముందే తెలుసు. అయితే డికోటర్ రచన వల్ల ఇంతకు ముందు అంచనాలకంటే ఎంతో ఎక్కువగా మరణాలు సంభవించాయని, అదికూడా ఇప్పటివరకు అనుకుంటున్నట్లుగా అన్నీ కేవలం ఆకలి చావులు కావని, చాలా మందిని చిత్రహింసలకు గురిచేసి, చంపేశారని తెలుస్తోంది. అంతేకాదు ఇదంతా మావో ఆజ్ఞ మేరకు జరిగిందని కూడా తెలుస్తుంది. ఇంతకు ముందటి అంచనాల ప్రకారమే 30 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రకారం చూసిన అది అతిపెద్ద మారణకాండే అవుతుంది.
‘పెద్ద ముందడుగు’ వల్ల ఇంతటి నష్టం జరిగిన బయటి ప్రపంచానికి ఏమి తెలియదు. కేవలం సాంస్కృతిక ప్రభావం మాత్రమే ఉందని చాలామంది భావిస్తారు. ప్రపంచ చరిత్రలో జరిగిన ఘోరాల గురించి చెప్పేటప్పుడు పాశ్చాత్య చరిత్రకారులు కూడా ఈ మారణకాండను పరిగణలోకి తీసుకోరు. హోలోకాస్ట్ గురించి పుస్తకాలు, సినిమాలు, ప్రదర్శనశాలలు, స్మృతి దినాలు మొదలైనవి ఉన్న ఈ చైనా మారణకాండ గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. అలాగే దానినుండి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం లేనేలేదు. జాతి వివక్ష లేదా సెమిటిజం వ్యతిరేకతను
ఖండించాలని నినాదాలు తరచూ వినిపిస్తాయి కానీ చైనా ఘోరాన్ని గురించి ఎవరు మాట్లాడరు.
హిట్లర్ అకృత్యాలకంటే మావో మూక హత్యలకు గురైనవారి సంఖ్యే చాలా ఎక్కువ. దీనికి కారణం హిట్లర్ కంటే మావో ఎక్కువకాలం, ఎక్కువ ప్రజానీకాన్ని పరిపాలించాడు. హోలోకాస్ట్ లో నా (డికోటర్) బంధువులు చాలామంది బాధితులు. కాబట్టి దాని దుష్ప్రభావాన్ని నేనే తక్కువ చేయడం లేదు. కానీ చైనా కమ్యూనిస్టు ఘోరాలు దానికంటే అన్నీ రకాలుగా మించిపోయినవి. ఇప్పుడు చెప్పుకుంటున్నదానికంటే ఎక్కువగా వాటి గురించి చెప్పుకోవలసిన అవసరం ఉంది.
చైనా మారణకాండ గురించి అంత తక్కువ తెలియడానికి కారణం ఏమిటి ?
చైనా మారణకాండ గురించి అంత తక్కువ తెలియడానికి కారణం ఏమిటి ?
దీనికి ఒక కారణం చనిపోయినవారంతా చైనా రైతులే కావడం. వీళ్ళకు సాంస్కృతికంగా కానీ, సామాజికంగా కానీ పాశ్చాత్య మేధావులు, మీడియాతో ఎలాంటి సంబంధం లేదు. దానితో వీరి కష్టానష్టాలు బయటి ప్రపంచానికి తెలియలేదు. అయితే దీనికంటే పెద్ద కారణం ఏమిటంటే `పెద్ద ముందడుగు’ గురించి తెలుసుకునే ప్రయత్నం మన నుండి ఏమాత్రం లేకపోవడమే. అలాగే కమ్యూనిస్టు అకృత్యాలను పట్టించుకోకపోవడం, లేదా తగ్గించి చూపడం వంటి ధోరణి ఇందులో భాగం. మావో కాలం కంటే ఇప్పుడు పాశ్చాత్య మేధావులకు కమ్యూనిజం పట్ల ధోరణి మారిపోయింది. అప్పుడు కమ్యూనిజం గురించి మాట్లాడినట్టుగా ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. అంతేకాదు ఇప్పుడు కొద్దిమంది మేధావులు కమ్యూనిజానికి మద్దతునిస్తున్నారు. మొత్తానికి కమ్యూనిజం ఎంతటి ప్రమాదకరమైన, ఎంతటి భయంకరమైన సిద్ధాంతమో ఎవరు గుర్తించలేకపోయారు.
అయితే మావో కొన్ని `తప్పులు’ చేశాడని చెప్పడం ద్వారా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం దేశ చరిత్రపై కొంత చర్చకు ముందుకు వచ్చింది. కానీ సామూహిక మారణకాండ జరిగిందని కానీ, అదికూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందని కానీ అంగీకరించడానికి ఇప్పటికీ సిద్ధంగా లేదు. అంతేకాదు ఎవరైనా `నిజాన్ని’ బయట పెట్టేందుకు ప్రయత్నిస్తే వారిపై `కఠిన’ చర్యలకు పాల్పడుతోంది.
ఈ పరిస్థితి చూస్తే చైనాలో ఇప్పటికీ కరకు కమ్యూనిస్టు పాలనే సాగుతోందని సులభంగా చెప్పవచ్చును. ఇప్పటి ప్రభుత్వం మావో రూపొందించిన కొన్ని విధానాలను పక్కకు పెట్టినా, ఇప్పటికీ ఆయన ధోరణినే అనుసరిస్తోంది. నేను (డికోటర్) 2004లో చైనా విశ్వవిద్యాలయంలో సందర్శన ఆచార్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావిద్దామని అనేకసార్లు ప్రయత్నించాను. అయిన అక్కడి అధికార యంత్రాంగం అందుకు ప్రతిసారి అభ్యంతరం చెపుతూనే ఉన్నారు.
ఆనాటి మారణకాండ గురించి ఎందుకు చెప్పుకోవాలి ?
‘పెద్ద ముందడుగు’ గురించి నిజాలను తెలుసుకోకపోతే చైనా తో పాటు పాశ్చాత్య దేశాలు కూడా నష్టపోతాయి. ఆనాటి దారుణ మారణకాండను ప్రత్యక్షంగా చూసిన కొద్దిమంది ఇప్పటికీ జీవించి ఉన్నారు. వాళ్ళకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సి ఉంది. మావో, ఇతర కమ్యూనిస్ట్ పాలకులు సాగించిన ఘోరాలను పట్టించుకోకపోతే అవే విధానాలు, పద్దతులు భవిష్యత్తులో పునరావృతమయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. నాజీ ఇజాన్ని ఎలాగైతే ప్రమాదకరమైన, దుష్ట విధానంగా గుర్తించారో అలాగే చైనా, యు ఎస్ ఎస్ ఆర్, వాటి సహచర దేశాలు సాగించిన దుశ్చర్యలను కూడా గుర్తించాలి. కానీ ఆ పని ఇప్పటివరకు జరగలేదు.
ఇటీవలనే వెనెజూలా సోషలిస్ట్ ప్రభుత్వం జనాభాలోని అధికసంఖ్యాకులను వెట్టిచాకిరి కార్మికులుగా మార్చింది. ఈ విషయాన్ని మీడియా ప్రపంచానికి తెలియజేసినా ఈ విధానం వెనుక సోషలిస్ట్ సిద్ధాంతం, సోవియట్ యూనియన్, చైనా, క్యూబా మొదలైన కమ్యూనిస్టు దేశాలలో జరిగిన ఇలాంటి సంఘటనల గురించి మాత్రం చెప్పలేకపోయింది. అంతేకాదు `సోషలిజం వల్ల ఇబ్బంది ఏమీలేదు. ఇది వెనెజూలా తరహా సోషలిజం వల్ల వచ్చిన నష్టం. ఇది దుష్టమైన ఆర్ధిక విధానాలు, నిరంకుశ అధికారాన్ని ప్రోత్సహిస్తుంది’ అంటూ అంతా వెనెజూలాదే తప్పు అన్నట్లుగా విశ్లేషణలు సాగాయి. నిజానికి దుష్ట ఆర్ధిక విధానాలు, నిరంకుశత్వం అనేవి సోషలిస్ట్ దేశాలలో కనిపించే సామాన్య లక్షణాలు. సాధారణంగా స్కాండినేవియా దేశాలను సోషలిస్ట్ దేశాలని అంటుంటారు. కానీ ఆ దేశాల్లో ప్రభుత్వాలకు సామూహిక ఉత్పత్తి వ్యవస్థపై ఎలాంటి అధికారం ఉండదు. నిజానికి అనేక పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా అక్కడ కూడా స్వేచ్చా మార్కెట్ ఉంది.
నేటి వెనెజూలా పరిస్తితి చూస్తే ఒకప్పటి చైనా `పెద్ద ముందడుగు’ గుర్తుకువస్తుంది. ఆనాటి దారుణ మారణకాండ గుర్తుకువస్తుంది.
– ఇల్యా సోమిన్ -ప్రొఫెసర్, జార్జ్ మాసన్ యూనివర్సిటీ. _వాషింగ్టన్ పోస్ట్ సౌజన్యం తో _విశ్వ సంవాద కేంద్రము.