సమైక్యతకు వారధి.. సంస్కృతం - The bridge to unity .. Sanskrit |
మన దేశం భిన్న మతాల, విభిన్న భాషల సమాహారమైనప్పటికీ అనాదిగా సంస్కృతి పరంగా ఒక్కటే. ఈ పుణ్యభూమిపై దండయాత్రలు చేసి, భూభాగాలను ఆక్రమించుకొని కొంతకాలంపాటు పరిపాలన చేసిన యవణులు, కుశాణులు, శకులు, హూణులు, ఇస్లాంలు, క్రైస్తవులు మొదలైన వారంతా విదేశాల నుండి వచ్చిన దోపిడీ ముఠాలు మాత్రమే. విదేశీ దురాక్రమణదారుల్లో కొందరు పలాయన మంత్రం పఠించగా, మిగిలిన వారు భారతీయ జీవన స్రవంతిలో విలీనమయ్యారు. భారతీయుల ఉద్యమాలకు, బలిదానాలకు కంపించిపోయిన బ్రిటీష్ వారు ఈ దేశం నుంచి వెళ్లిపోతూ మత ప్రాతిపదికన అఖండ భారత్‌ను రెండు ముక్కలుగా చీల్చివేశారు.
దేశ విభజన సమయంలో పెద్దరికం వహించిన కొందరు నేతలు తాము ఉదార భావం కలిగిన విశాల హృదయులుగా హిందువులలో భ్రమలు కలిగించారు. పాకిస్తాన్‌లోని మైనారిటీ మతస్థులైన హిందువులు ఆ దేశంలోను, భారత్‌లోని ముస్లింలు ఇక్కడే నివసించేందుకు అనుమతి ఇచ్చారు. 1947 ఆగస్టు 15న మత ప్రాతిపదికన విభజన జరిగిన నాటికి భారత్‌లో 6 శాతం ముస్లింలు ఉండగా, నేటికి వారి సంఖ్య 20 శాతంగా మారింది. పాకిస్తాన్‌లో 22 శాతంగా ఉన్న హిందువులు ఈనాటికి 2 శాతంగాను, బంగ్లాదేశ్‌లో 28 శాతంగా ఉన్న హిందువులు 8 శాతానికి తగ్గిపోయిన విషయాన్ని గత 70 ఏళ్లుగా భారతదేశాన్ని పాలిస్తున్న పాలకులు గుర్తించకపోవడం దారుణం. దీంతో స్వదేశంలోనే మైనారిటీలుగా మారే ప్రమాదం హిందువులకు ముంచుకొస్తోంది. స్వార్థపరులైన రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకొనేందుకు ‘సెక్యులర్’ ముసుగులో ప్రజలను కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొడుతూనే ఉన్నారు.
విదేశీ భావజాలాన్ని పుక్కిట పట్టుకొని నిరంతరం నీతులు వల్లించే కమ్యూనిస్టులు తాము నాస్తికులమని చెప్పుకుంటూ ఆస్తికుల కార్యకలాపాలలో పెత్తనం చెలాయిస్తున్నారు. వీరు నిరంతరం హిందుత్వాన్ని దునుమాడుతూ కుహనా సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్‌తో- ‘పరిపాలన మీది.. పెత్తనం మాది’ అనే ఒప్పందం మేరకు పాఠ్యాంశాల రూపకల్పనలో, విద్యాసంస్థలలో, గ్రంథాలయాలలో, మీడియాలో చొరబడి పోయారు. హిందూ స్వచ్ఛంద సేవా సంస్థలతో, హిందూ ధార్మిక సంస్థలతో దేశానికి ముప్పు వాటిల్లుతోందని కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలకు రక్షణ లేకుండాపోతోందని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్లు, రాయితీల పేరిట కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ఉపాధి పేరుతో విదేశాలకు వలసలను ప్రోత్సహించడం, భారతీయ భాషలను కనుమరుగుచేసే ప్రయత్నంలో ఆంగ్ల భాషకు పెద్దపీట వేయడం కమ్యూనిస్టులకు అలవాటుగా మారింది. పాలనా సౌలభ్యం ముసుగులో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. రాజకీయ లబ్ధి పొందడానికి, సమగ్ర భారతాన్ని బలహీనపరచడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నారు. భారతీయులందరినీ ఆంగ్లభాష మానస పుత్రులుగా, విదేశీ భావజాలానికి కట్టుబానిసలుగా మార్చుతున్నారు. ప్రభుత్వ విభాగాలలోను, న్యాయస్థానాలలోను స్థానిక భాషలకు తిలోదకాలిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల్లో తీర్పులు ఆంగ్లభాషలో కొనసాగించడంతో పరాయిజాతి పాలనే కొనసాగుతోందని చెప్పకతప్పదు. దేశ ప్రజలు భౌతికంగా స్వతంత్రులైనప్పటికీ, బౌద్ధికంగా బానిసలుగానే కొనసాగడం పాలకుల పెడ ధోరణులకు పరాకాష్ఠ. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యావిధానాన్ని, చరిత్ర పాఠ్యాంశాలను ఇకనైనా అడ్డుకోని పక్షంలో- రాబోయే తరాల వారికి మాతృభాష ఆంగ్లమే అవుతుంది. స్వాభిమానం, స్వావలంబన కోల్పోయి ‘కసబ్’, ‘యాకూబ్ మెమెన్’ లాంటి తీవ్రవాదులను జనం క్రాంతికారులుగా భావించే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశంలోని పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ‘క్రాంతికారుల’ పేరుతో వేర్పాటువాదులకు నిలయాలుగా మారుతున్నాయి.
1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్థానిక భాషల మాధ్యమంగా విద్యాబోధన జరగాలి. కనీసం 4వ తరగతిలో సంస్కృత భాషను ప్రవేశపెట్టాలి. 5వ తరగతి నుండి ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టాలి. ఇంటర్ మీడియట్ నుండి ఆపై ఉన్నత విద్యను సంస్కృత భాష మాధ్యమంగా విద్యాబోధన జరగాలి. ఉన్నత విద్యను, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక విద్యను కూడా స్థానిక భాషల్లోకి పూర్తిగా మార్చాలి. కాబట్టి సంస్కృత భాషను అనుసంధాన బోధనా భాషగా కొనసాగించవచ్చు. ఇంటర్ మీడియట్‌లో, డిగ్రీ స్థాయిలో సంస్కృతం, ఆంగ్లం, స్థానిక భాష అనే మూడింటిలో రెండు భాషలను తప్పనిసరిగా మొదటి సంవత్సరంలో కొనసాగించాలి. రెండవ సంవత్సరంలో ఈ మూడు భాషలలో ఏదేని ఒక భాషను ‘ఆప్షనల్’ సబ్జెక్టుగా తప్పనిసరి చేయాలి. ఇంటర్ మీడియట్, డిగ్రీ స్థాయిలో ‘ఆప్షనల్’గా చదివిన భాషను ఉపాధ్యాయ శిక్షణ కోర్సులలో బోధనా విషయంగా తీసుకోవాలి. ఇలాంటివారినే భాషా బోధకులుగా గుర్తించాలి. భాషా పండిట్ కోర్సులను రద్దుచేయాలి. మిగతా అధ్యాపకుల మాదిరి భాషా బోధకులకు సమాన వేతనం ఇవ్వాలి.
1వ తరగతి నుండి ప్రారంభించి, ఉన్నత విద్యలో ప్రతి కోర్సులోను మానవ విలువలను కాపాడే పాఠ్యాంశాలు తప్పనిసరి పొందుపర్చాలి. దీంతో బాల్యం నుండే విద్యార్థులకు మానవ విలువలు అలవడుతాయి. ఫలితంగా వారిని నేరప్రవృత్తికి దూరంగా ఉంచవచ్చు. అలాగే పదవ తరగతి నుండి డిగ్రీస్థాయి వరకు భాషా బోధన సబ్జెక్టుల్లో రామాయణ, మహాభారతాలను, పురాణేతిహాసాలను చేర్చాలి. వీటిద్వారా భరత జాతి సంస్కృతితో పాటు న్యాయం, ధర్మం, పరిపాలనా సామర్థ్యం వంటివి తెలుస్తాయి. కులం, మతం, భాష, ప్రాంతాల ప్రాతిపదికన విభేదాలను రగిలించే విషయాలను పాఠ్యాంశాలలో చేర్చరాదు. టి.బి. మెకాలే మన దేశంలో 1935న ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ భాష 1966 వరకు కేవలం 31 సంవత్సరాలలో భారతీయులనందరినీ ఆంగ్ల మానస పుత్రులుగా తయారు చేసింది. అయితే- భారతీయ భాషలన్నిటికీ మూలభాష అయిన సంస్కృతాన్ని బోధనా భాషగా ప్రవేశపెడితే మన జాతి మూలాలను తిరిగి కాపాడుకొనగలం. మన రుషి పరంపర అందించిన శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక సాంస్కృతిక ఇతి హాసాలను పునరుద్ధరించుకొనగలం. భారత్ మళ్లీ ‘జగద్గురువు’గా భాసిల్లగలదు. ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే. దేశ హితం ఆశించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకొన్నా ప్రజలందరూ ఆమోదిస్తారు.
-బలుసా జగతయ్య 90004 43379 - ఆంధ్రభూమి సౌజన్యం తో)