Fragmented Communists |
ఢిల్లీ కోటపై ‘ఎర్ర’జెండా పగటికలే!
హిందూ మతంగా ప్రచారంలో ఉన్న ‘హిందూ ధర్మం’ ఒక జీవన విధానమని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. భారతీయ సమాజంలో నేటికీ హిందూమతం ఘనంగా కొనసాగుతోంది.
హిందూ ధర్మంలోని వారు ఆచరించే విభిన్న మతాలను వైదిక మతాలంటారు. వైదిక మతాల్లో వైవిధ్యాలే తప్ప వైరుధ్యాలు ఉండవు. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, కుమారస్వామి, గణపతి వంటి దేవుళ్లంతా ఒకే పరివార వారన్న విషయాన్ని విస్మరించరాదు. ఈ దేవతలను హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఆరాధిస్తారు. విభిన్న ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నా, భక్తులంతా దేవుళ్లందరినీ పూజిస్తారు. ఇస్లాం, క్రైస్తవ మతాల్లో విభిన్న తెగలు ఉంటాయి. విభిన్న తెగలకు సంబంధించి మసీదులు గానీ, చర్చిలను గానీ ఒకే ప్రాంగణంలో నిర్మించరు. ఒక తెగవారు మరో తెగవారికి చెందిన మందిరాల్లో ప్రార్థన చేయరు. వైదిక మతాల వారు తమ మతమే ప్రపంచమంతటా ఉండాలని కాంక్షించరు. కాని ఇస్లాం, క్రైస్తవ మతాల వారు మాత్రం తమ మతమే విశ్వవ్యాప్తంగా కొనసాగాలంటారు. అందుకోసం వారు తమ మతాన్ని ప్రచారం చేస్తుంటారు. మతమార్పిడులు చేస్తుంటారు.
ప్రపంచంలో ఏ మతం వారైనా ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారితే వారు సంబంధిత మతస్థులుగానే మారుతారు. కాని వైదిక మతాల్లోకి మారేవారికి కులాలు అడ్డు వస్తుంటాయి. కాబట్టి ఏ ఇతర మతాలవారు వైదిక మతాలలోనికి మారలేరు. పరమతస్తులు తమ మతంలోనికి రావాలని వాంఛికపోవడమే గాక, ఎవరి మతాన్ని వారు పవిత్రంగా ఆచరిస్తూ, ఇతర మతస్థులను గౌరవించాలన్నదే వైదిక మతస్తుల సహనశీలతకు హిందూధర్మం మార్గదర్శనం చేస్తోంది. హిందూ ధర్మం అనేది మతం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ- విదేశీ మతాలకు అమ్ముడుపోయిన వారు, విదేశీయులకు తొత్తులుగా మారినవారు హిందూ సంస్కృతిని చిన్నాభిన్నం చేసి, హిందూ దేశాన్ని ఇతరుల పాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా హిందూ సమాజంలోని దళితులు, ఆదివాసీలను బలహీనులుగా చిత్రీకరిస్తూ- వీరు హిందూ సమాజానికి అతీతులన్నట్లు జాతీయ స్రవంతి నుంచి దూరం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆమధ్య కోరేగావ్‌లో జరిగిన అల్లర్లకు ప్రధాన కారకులు మేధావి వర్గమైన అర్బన్ మావోయిస్టులు. దేశ పరిపాలకులను హతమార్చేందుకు ప్రణాళికలు తయారుచేసిన రోనావిల్సన్, సుధీర్ ధావలే, సురేంద్రగాడ్ లింగ, మహేష్ రావత్, సోమాసేన్‌లను నిర్బంధంలోనికి తీసుకోగా, ‘విరసం’ నేత వరవరరావు, స్వామి అగ్నివేశ్, ఇంకొందరు మేధావులు మావోల చర్యలను సమర్ధించారు. వీరి అసలు ఎజెండా ఏమిటో జనం తెలుసుకోవాలి. గతంలో అడవులకే పరిమితమైన మావోయిజం ఈనాడు పట్టణాలలో కలాలు పట్టుకొన్న వారిలోను, కొందరు కాషాయ వస్తధ్రారుల్లోనూ కనిపిస్తోంది. జాతీయ నాయకులను అంతం చేయాలన్న కుట్రలను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతునివ్వాలి.
కాగా, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆరెస్సెస్ సమావేశంలో పాల్గొనడాన్ని వ్యతిరేకించిన ‘సెక్యులర్ మేధావి’ కంచె ఐలయ్య గత చరిత్రను మరచిపోవడం, ప్రజల ఐక్యతను దెబ్బతీయాలని కుట్ర చేయడం జాతి విద్రోహక చర్యలో భాగమే. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ పటేల్, ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ వంటి ఎందరో ప్రముఖులు ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొన్నారన్న విషయాన్ని ఐలయ్య స్ఫురణకు తెచ్చుకోవాలి. ఆనాటి పరంపరనే ప్రణబ్ కొనసాగించారు. కశ్మీర్ విలీన విషయంలో ఆనాటి ఉప ప్రధాని, హోమ్ మంత్రి పటేల్ చొరవ చూపి ఆర్‌ఎస్‌ఎస్ ద్వితీయ సంఘ్ సంచాలక్ శ్రీగురూజీని కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో పంపారు. గణతంత్ర దినోత్సవ కవాతులో అప్పటి ప్రధాని నెహ్రూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ఆహ్వానించారు. పాకిస్తాన్‌తో యుద్ధం జరిగిన సమయంలో ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు ట్రాఫిక్ బాధ్యతను అప్పగించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక బాధితులకు సహాయక చర్యలను అందించారు. ఈ విషయాలు తెలిసి ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌కు ఐలయ్య తప్పక మద్దతు ఇచ్చేవారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, కుటుంబ పాలనకు అలవాటుపడిన రాజకీయ పార్టీలకు తప్ప- దేశంలోని మిగతా వర్గాల ప్రజలు ఆరెస్సెస్ కార్యకర్తల త్యాగాలను తమ హృదయంలో భద్రపరుచుకున్నారు.
ప్రస్తుతం దేశంలో కేరళలో మాత్రమే కమ్యూనిస్టుల కిచిడీ ప్రభుత్వం కొనసాగుతోంది. అంటే ప్రజల విశ్వాసం కోల్పోయిన కమ్యూనిజం కనుమరుగవుతున్నట్టే భావించాలి. కేరళలో దళితులు, గిరిజనులు మిగతా వర్గాలతో సమానంగా హక్కులు అనుభవిస్తున్నారని ఐలయ్య అంటున్నారు. అందుకే లాల్ (ఎరుపు), నీల్ (నీలం) జెండాలను కలిపి ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేయాలని అనడం ఐలయ్య అవివేకం. కేరళలో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ గురించి ఆయన ప్రస్తావించకపోవడం దిగజారుడుతనం. ‘కోమాలో ఉన్న వ్యక్తి ధ్యానంలో ఉన్నట్లు’ ఇటీవల విశాఖలో దళిత, ఆదివాసీ సమతా జాతర పేరిట జరిగిన జాతీయ సెమినార్‌లో మాట్లాడిన ఐలయ్య ప్రజలను భ్రమింపజేసేందుకు యత్నించారు. ‘దింపుడు కళ్లెం ఆశ’తో ఉన్న కమ్యూనిజాన్ని దళితుల ముసుగులో- నీలం జెండా కింద ఎర్రజెండాను రెపరెపలాడిద్దామనే ఆయన బౌద్ధమతం గొప్పదంటూ బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తాడు. ఇస్లాం మతాన్ని పొగుడుతూ, క్రైస్తవ మిషనరీల నుంచి లబ్ది పొందుతున్న ఐలయ్య- హిందువులను, హిందూ దేవతలను అవమానించడం వెనుక ‘ఆదాయం’ తప్ప మరో కారణం లేదు. హిందూ మతాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన తాను గొప్ప మేధావిననే భ్రమలో ఉన్నారు.
__బలుసా జగతయ్య (ఆంధ్రభూమి సౌజన్యంతో)