Sri Potti SriRamulu |
ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు.
శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ నంబరు ఇంట పేద ఆర్య వైశ్య కుటుంబంలో పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1907 వ సంవత్సరంలో మద్రాసు జార్జి టౌన్ లోని ప్రోగ్రెసివ్ మిడిల్ స్కూల్ నందు వారి విద్యాభ్యాసం ప్రారంభమైంది. అనంతరం మింట్ స్ట్రీట్ లోని ది హిందూ థియోలాజికల్ హై స్కూల్ లో విద్యాభ్యాసాన్ని కొనసాగించిన శ్రీ శ్రీరాములు 1920వ సంవత్సరంలో బొంబాయి నగరంలో శానిటరీ ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందారు. 1924 నుంచి 1929 మధ్యకాలంలో ఐ.పి.జి లో రైల్వే శానిటరీ ఇంజనీరుగా పని చేశారు. 1926లో తన మేనకోడలు సీతమ్మతో వివాహమైంది. తొలి కాన్పు లోనే తల్లి, బిడ్డ మరణించడం శ్రీ రాములు హృదయాన్ని కలచివేసింది. వెనువెంటనే ఆయన మాతృమూర్తి కూడా పరమపదించారు.
స్వాతంత్ర్యోద్యమ కర్తగా…..
అనంతరం గాంధీజీ జాతికి ఇచ్చిన పిలుపు మేరకు తొలిసారిగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1930వ సంవత్సరంలో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. 1933 వ సంవత్సరంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో భూకంప బాధితులకు సేవలందించారు. 1936 – 37 మధ్యకాలంలో ఎర్నేణి సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో కృష్ణాజిల్లాలోని కొమరవోలు గాంధీ ఆశ్రమంలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే 1972లో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టై కలకత్తాలోని అలీపూర్ సెంట్రల్ జైలులో నిర్బంధించ బడ్డారు. 1943లో గుడివాడ టౌన్ నందు ‘ఫ్లాగ్ మార్చ్’ జరిపినందుకు అరెస్టయ్యారు. 1947లో ఆంధ్రప్రదేశ్ లో జరిగే పలు కార్యక్రమాలలో సంచాలకులుగా పనిచేశారు.
1944 – 1952 మధ్యకాలంలో నెల్లూరు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వీరికి ఆచార్య పి సి రెడ్డి, ఏనుగు పట్టాభిరామిరెడ్డి, ఆర్యసమాజానికి చెందిన పి. సుబ్రహ్మణ్యాచారి, సుంకు చెంగన్న ( అనాథ శిశు శరణాలయం), కుష్టు నివారణ సంఘం అప్పల ఆంజనేయులు, ప్రకృతి వైద్యశాల డాక్టర్ నాగేశ్వరరావు వంటి ప్రముఖులు ఎన్నో రకాలుగా సహకరించారు.
హిందూ సంఘ సంస్కరణ సమితి
ఈ సేవా సంస్థను 9/ 9/ 1945 వ సంవత్సరంలో ప్రారంభించి తద్వారా వితంతు పునర్వివాహాలు, వర్ణాంతర వివాహాలు, ఆర్య వివాహాలు, హరిజన అభ్యుదయము, హరిజన దేవాలయ ప్రవేశము, అనాథ శవాల దహన సంస్కారము, మద్యనిషేధ ప్రచారము, స్త్రీ సంక్షేమము, పాకీ పనివారితో సహపంక్తి భోజనాలు వంటి సాంఘిక సంస్కరణాత్మక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు.
- 28/ 2/ 1946 లో నెల్లూరులో ఆచార్య పి.సి.రెడ్డి అధ్యక్షతన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో హరిజన ప్రవేశము కొరకు శ్రీ పొట్టి శ్రీరాములు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గాంధీజీ అనుమతి లభించడంతో 7/ 3/ 1946 నుంచి 16/ 3/ 1946 వరకు నిరాహార దీక్ష ప్రారంభించి ఆ దేవాలయంలో హరిజన ప్రవేశానికి అనుమతి సాధించటంతో వారి దృఢ సంకల్పం దేశమంతా తెలియవచ్చింది.
- 16/ 6/ 1947 న హరిజనులకు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశం కోరుతూ నిరాహార దీక్ష చేపట్టటంతో ఆయనను టౌను న్యూసెన్స్ కేసు కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత అప్పటి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమండూరు రామస్వామి నేతృత్వంలో హరిజనుల ఊరేగింపుతో హరిజనుల ఆలయ ప్రవేశం జరిగింది.
- 1949వ సంవత్సరంలో మదరాసు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ‘హరిజన దినం’ జరపాలని కోరుతూ వార్ధాలోని ‘సేవాగ్రామ్’ ఆశ్రమంలో 28 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడంతో డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్పందించి అన్ని జిల్లాలలో ‘ హరిజన దినం’ అమలు జరిపించారు.
ప్రత్యేకాంధ్ర సాధనలో….
17/ 4/ 1948లో అప్పటి ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ, హోంమంత్రి శ్రీ వల్లభాయ్ పటేల్, డాక్టర్ పట్టాభి సీతారామయ్యల జె.వి.పి రిపోర్టు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించలేదు కానీ మదరాసు ప్రెసిడెన్సీలోని తెలుగు జిల్లాలను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అంగీకరించింది. కానీ రాజధాని విషయమై ఆంధ్రులు అందుకు అనుమతి తెలుపక పోవడంతో జె.వి.పి రిపోర్టు ప్రతిపాదన అలాగే ఆగిపోయింది.
ఆంధ్ర రాష్ట్రం కోసం 10/ 9/ 1952లో శ్రీ అర్జునరావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. అలాగే స్వామి సీతారాం గారు సైతం తన ఆశ్రమంలో 15/ 08/ 1951న ఆమరణ దీక్షను ప్రారంభించి 10 రోజుల తర్వాత వినోభా భావే జోక్యంతో విరమించుకోవడం జరిగింది. దీంతో యావత్ ఆంధ్రదేశంలో నైరాశ్యం చోటు చేసుకుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శ్రీ పొట్టి శ్రీరాములు తన సన్నిహితులతో చర్చలు జరిపి 19/ 10/ 1952 వ తేదీన ఉదయం 10 గంటల 15 నిమిషాలకు మదరాసు వీరభద్రం వీధిలోని శ్రీ బులుసు సాంబమూర్తి గారి 126 వ నంబరు ఇంటిలో దీక్షను ప్రారంభించారు. దీక్ష సుమారుగా 35వ రోజుకి చేరడంతో మెల్లగా ఆంధ్రులలో ఆందోళన మొదలైంది. ప్రధానమంత్రికి ఉత్తరాలు, టెలిగ్రామ్ లు వేల సంఖ్యలో వెళ్ళాయి. అయినప్పటికీ మద్రాసు ప్రభుత్వం లో కానీ, ప్రధాన మంత్రిలో కానీ ఎటువంటి చలనం లేదు.
దీక్ష 45 వ రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పులు వచ్చాయి. డాక్టర్లు ఆయనను పరీక్షించి పరిస్థితి విషమిస్తున్న ట్లుగా ప్రకటించారు. వార్తా పత్రికలు ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని వివరించ సాగాయి. ప్రజలలో అలజడి మొదలైంది. దీక్ష 50వ రోజుకు చేరడంతో ప్రధానమంత్రి నూతన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతి తెలియజేస్తూ ప్రకటన చేశారు. ప్రధాని నెహ్రూ హామీ ఇచ్చిన దరిమిలా దీక్ష విరమించమని శ్రీరాములును మిత్రులు కోరగా ….. “స్వామి సీతారాం నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా నెహ్రూ ఇలాంటి ప్రకటనే చేసి నిలబెట్టుకోలేక పోయారు. కావున నేను ఆయన మాటలు నమ్మలేను.” అని శ్రీ పొట్టి శ్రీరాములు తెగేసి చెప్పారు.
దీపం ఆరినా వెలుగు ఆగలేదు….
15/ 12/ 1952 …… దీక్ష 58వ రోజుకు చేరింది. పొట్టి శ్రీరాములుకు స్పృహ తప్పింది. ఆ రాత్రి 11 గంటల 20 నిమిషాలకు శ్రీ పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారు.
శ్రీ పొట్టి శ్రీరాములు మరణ వార్త రాష్ట్రమంతటా దావానలంలా వ్యాపించింది. రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆయన దీక్ష ఎంత బలమైనదో ప్రధానమంత్రికి అప్పుడు తెలిసింది. రాష్ట్రమంతటా ధర్నాలు, హర్తాళ్ళు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం…… ఆంధ్రుల ఆగ్రహావేశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వణికిపోయాయి. రాష్ట్రంలో దాదాపు మూడు రోజుల తర్వాత గాని ప్రశాంత వాతావరణం ఏర్పడలేదు. అప్పుడు ప్రధాని నెహ్రూ రాష్ట్ర నిర్మాణ ప్రకటన చేశారు.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అంతిమయాత్ర డిసెంబర్ 16 మధ్యాహ్నం బులుసు సాంబమూర్తి ఇంటి నుండి ‘ఆంధ్ర రాష్ట్రం కావాలి’ అనే నినాదాల మధ్య, మరోవైపు గోవింద నామ జపంతో సుమారు ఎనిమిది మైళ్ళు, నాలుగు గంటల పాటు సాగింది. నాటి నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు అఖిల ఆంధ్రుల హృదయాలలో అమర జీవిగా నిలచిపోయారు. ఆ విధంగా ఆ అమర జ్యోతి ఆగిపోయినా వారందించిన పోరాట స్ఫూర్తితో తెలుగు జాతి యావత్ ప్రపంచానికి వెలుగులు పంచుతూ ముందుకు సాగుతోంది.
– సేకరణ శ్రీ మాటేటి రత్నప్రసాద్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా.: 8317649078.
_ విశ్వ సంవాద కేంద్రము..