పౌరసత్వ సవరణ బిల్లు, 2019 |
1) పౌరసత్వ సవరణ బిల్లు ఏమిటి?
31 డిసెంబర్, 2014కు ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని హిందూ, సిఖ్, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ వర్గాలకి చెందిన వారెవరైనా భారత్ లో ప్రవేశించి ఉంటే వారిని ఈ చట్టం ప్రకారం అక్రమ చొరబాటుదారులుగా పరిగణించరు.
2) భారత్, పాకిస్తాన్ ల మధ్య విభజన సమయంలో ప్రజల వలసల గురించి కుదిరిన ఒప్పందం ఏమిటి?
భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీలు 1950 ఏప్రిల్ లో ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ నెహ్రూ – లియాకత్ ఒప్పందం ప్రకారం :
- - శరణార్ధులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు
- - ఎత్తుకుపోయిన స్త్రీలను, దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చివేయాలి
- - బలవంతపు మతమార్పిడులకు గుర్తింపు ఇవ్వరాదు
- - మైనారిటీల హక్కులను కాపాడాలి
ఒప్పందం ఇలా కుదిరినా పాకిస్థాన్ మాత్రం దానికి విరుద్ధంగానే వ్యవహరించింది. తమ దగ్గర ఉన్న దళితులను భారత్ కు వెళ్లకుండా అడ్డుకుంది. “వాళ్ళు వెళ్లిపోతే కరాచీలో వీధులు, మూత్రశాలలు ఎవరు శుభ్రం చేస్తారు?’’ అని ప్రధాని లియాకత్ అలీ భారత హై కమిషనర్ ను ప్రశ్నించాడు.
ఇస్లామిక్ ఛాందసవాదం పెరగడం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఇస్లామిక్ రిపబ్లిక్ లుగా ప్రకటించడంతో ఆ రెండు దేశాల్లో మైనారిటీలపై దాడులు, అణచివేత పెరిగిపోయాయి. బలవంతపు మతమార్పిడులు, మైనర్ బాలికల అపహరణ, ప్రార్ధనామందిరాల విధ్వంసం, మత దూషణకు పాల్పడ్డారంటూ దాడి చేసి చంపివేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ముస్లిమేతరుల జీవితాలు దుర్భరంగా మారాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధుల్లో ఎక్కువ శాతం దళితులే.
3) 1955 పౌరసత్వ చట్టాన్ని ఎందుకు సవరించారు?
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ల రాజ్యాంగం ప్రకారం ఇస్లాం ఆ దేశాల అధికారిక మతం. అందువల్లనే ఆ దేశాల్లో హిందువులు, సిఖ్, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మతస్తులపై మతం పేరుతో అత్యాచారాలు సాగుతున్నాయి. మైనారిటీ వర్గానికి చెందినవారికి తమ మత సాంప్రదాయాలను అనుసరించే, ఆచరించే ప్రాధమిక హక్కు కూడా లేకుండా పోయింది. దానితో చాలామంది ఆ దేశాల నుంచి పారిపోయి భారత్ కు వచ్చేశారు. వారిలో చాలామంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా వాటి కాలవ్యవధి ఎప్పుడో పూర్తైపోయింది. ఇలాంటివారికి సరైన గుర్తింపు ఇవ్వడం కోసం 1955 చట్టానికి సవరణ చేయవలసి వచ్చింది.
4) విదేశస్థులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఇప్పటికే ఉండగా ఈ మూడు దేశాల శరణార్ధుల కోసం ప్రత్యేక సవరణ ఎందుకు?
31 డిసెంబర్, 2014 ముందువరకు ఇక్కడకు వచ్చిన శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ ప్రత్యేక సవరణ అవసరమైంది. ఈ సవరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం వీరికి గుర్తింపు పత్రాలు అందించే వీలు కలుగుతుంది. చాలామంది శరణార్ధులు ఎంతోకాలం క్రితమే ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి పరిచ్ఛేదం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది.
5) భారత పౌరసత్వం లభించాలంటే ఈ శరణార్ధులు ఇక్కడకు వచ్చి ఎంతకాలం పూర్తైఉండాలి?
పేర్కొన్న మూడు దేశాలకు చెందిన ఈ మైనారిటీ వర్గాలకు చెందినవారు కనీసం ఐదు సంవత్సరాలు(ఇది ఇంతకు ముందు 11 సంవత్సరాలుగా ఉండేది) భారత్ లో ఉంటున్నట్లు చూపగలిగితే దేశీయకరణ ప్రక్రియ ప్రకారం వారికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుంది.
6) ప్రభుత్వం తెస్తున్న చట్ట సవరణలు ముస్లిం వ్యతిరేకమైనవా?
కాదు. ఇవి కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీ వర్గానికి చెందినవారికి సంబంధించినవి మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్ లో ఉంటున్న ముస్లిం లుగానీ, మరే పౌరులకుగాని ఎలాంటి సంబంధం లేదు. మూడు దేశాలలో ఇస్లాం అధికారిక మతం కాబట్టి ఆయా దేశాలకు సంబంధించిన ముస్లింలను ఈ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే ఇస్లామిక్ దేశంలో ముస్లింలపై అణచివేత, అత్యాచారాలు జరిగే అవకాశం లేదు.
7) పౌరసత్వ సవరణ బిల్లు, 2019 భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందా?
ఈ విషయంలో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఇలా చెప్పారు -“ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. అలాగే కొందరు చెపుతున్నట్లుగా అధికరణం 14,15 లను అతిక్రమించడం లేదు. దేశీయకరణ లేదా పౌరసత్వ గుర్తింపు ఇవ్వడంలో మూడు దేశాలలో అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి కలిగిస్తున్న ప్రత్యేక సదుపాయం, హోదా మాత్రమే. దీనికి ఇతర వర్గానికి చెందినవారి దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణలు అధికరణం 14ను ఏమాత్రం ఉల్లంఘించడం లేదు.’’
పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం దేశాలుగా గుర్తింపు పొందిన మూడు దేశాలలోని మతపరమైన అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి మాత్రమే ఉద్దేశించినది. ఆయా దేశాల్లో అధికసంఖ్యాకులు(ముస్లింలు) మతపరమైన అణచివేతకు గురయ్యే అవకాశం లేదుకాబట్టి వారిని ఇందులో చేర్చలేదు. అలాగే ఈ చట్టం రాజకీయ, ఆర్ధిక శరణార్ధులకు సంబంధించినది కూడా కాదు. అందువల్ల కూడా ముస్లింలకు ఇందులో స్థానం కల్పించలేదు.
-సహదేవ్ __విశ్వ సంవాద కేంద్రము