దేశ విభజన |
–ప్రశాంత్ పోల్
10 ఆగస్ట్.. ఆదివారం.. ఉదయం.. సర్దార్ పటేల్ నివాసంలో కాస్త హడావిడి మొదలైంద. పటేల్ ఉదయం త్వరగానే నిద్ర లేస్తారు. ఆయన రోజువారీ కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి. బంగళాలో ఉండే అందరికీ ఇది అలవాటయింది. అందుకని అంత ఉదయమే జోధ్ పూర్ మహారాజా కారు వచ్చేసరికి అక్కడ ఉన్న పనివారు పెద్దగా ఆశ్చర్యపోలేదు.
జోధ్ పూర్ రాజా హనుమంత్ సింగ్.. ఇతను సాధారణ వ్యక్తి కాదు. ప్రసిద్ధి చెందిన రాజపుత్ర వంశానికి చెందినవారు. ఆయన వంశపు చరిత్ర 1250 కంటే ముందునుంచి ప్రారంభమయింది. 36 వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న ఈ రాజ్యంలో 25 లక్షలమంది ప్రజలు ఉన్నారు. కొద్ది రోజులుగా మహమ్మద్ ఆలీ జిన్నా ఈ సంస్థానాన్ని పాకిస్థాన్ లో విలీనం చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వి.కె. మీనన్ ఈ విషయాన్ని సర్దార్ పటేల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం గురించి చర్చించడానికే సర్దార్ పటేల్ జోధ్ పూర్ రాజా హనుమంత్ సింగ్ ను తన నివాసానికి ఆహ్వానించారు. హనుమంత్ సింగ్ ను తీసుకుని పటేల్ తన విశాలమైన హాలులోకి వచ్చారు. కుశల ప్రశ్నల తరువాత పటేల్ నేరుగా విషయాన్ని ప్రస్తావించారు. `మౌంట్ బాటన్ తో చర్చలు జరిగాయని విన్నాను. ఏం చేర్చించారు?’అని అడిగారు.
హనుమంత్ సింగ్: సర్దార్ సాహెబ్, సమావేశం అయితే జరిగింది కానీ పెద్దగా ఏమి చర్చించలేదు.
⧫ సర్దార్ పటేల్: అలాగే మీరు మహమ్మద్ ఆలీ జిన్నాతో కూడా చర్చించారని, మీ సంస్థానాన్ని స్వతంత్రంగానే ఉంచాలనుకుంటున్నారని విన్నాను?
⧫ హనుమంత్ సింగ్: నిజమే, మీరు విన్నది నూరుపాళ్లు సత్యం.
⧫ సర్దార్ పటేల్: మీరు స్వతంత్రంగా ఉండదలుచుకుంటే ఉండవచ్చును. కానీ అలాంటి నిర్ణయం తీసుకున్న తరువాత మీ జోధ్ పూర్ సంస్థానంలో ఎలాంటి తిరుగుబాటు జరిగినా భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఆశించలేరు.
⧫ హనుమంత్ సింగ్: కానీ జిన్నా మాకు అనేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏకంగా జోధ్ పూర్ ను కరాచితో కలుపుతూ రైలు మార్గం నిర్మిస్తామని కూడా చెప్పారు. అలా జరగకపోతే మా వ్యాపారం దెబ్బతింటుంది.
⧫ సర్దార్ పటేల్: మేము మీ జోధ్ పూర్ ను కచ్ తో కలుపుతాం. అప్పుడు మీ సంస్థానపు వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడదు. అన్నింటికంటే ముఖ్యంగా, హనుమంత్ సింగ్ జీ, మీ నాన్నగారు ఉమేశ్ సింగ్ నాకు మంచి మిత్రులు. మీ బాగోగులు చూసుకునే బాధ్యత వారు నాకు అప్పగించారు. మీరు సక్రమమైన మార్గంలో వెళ్ళాక పోతే అప్పుడు మిమ్మల్ని దారికి తీసుకురావడానికి నేను మీ నాన్నగారి పాత్ర పోషించవలసి వస్తుంది.
⧫ హనుమంత్ సింగ్: సర్దార్ పటేల్ జీ, మీకు అలా చేయవలసిన అవసరం రాదు. నేను జోధ్ పూర్ చేరుకున్న వెంటనే భారత విలీన పత్రంపై సంతకం పెట్టి పంపిస్తాను.
––––
బహుశా అది ఆదివారం కావడం వల్ల కలకత్తా శోధ్ పూర్ ఆశ్రమంలో ప్రార్ధనా సమావమేశానికి చాలామంది హాజరయ్యారు. గాంధీజీ ఎప్పటిలాగానే ప్రార్ధన పూర్తిచేసి అక్కడకు వచ్చినవారిని ఉద్దేశించి మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు. ఆయన సాధారణంగా కూర్చునే మాట్లాడతారు. ఆయన ఇలా మొదలుపెట్టారు -“నేను నౌఖాలికి బయలుదేరబోతుంటే కొందరు కలకత్తా ముస్లిం మిత్రులు కొద్ది రోజుల తరువాత వెళ్ళండంటూ అభ్యర్ధించారు. అందుకనే ఆగిపోయాను. ఒకవేళ నేను నౌఖాలీ వెళితే ఇక్కడ ఏదైనా జరిగితే అప్పుడు నా జీవితానికే ప్రయోజనం లేకుండా పోతుంది’’.
“కలకత్తాలోని అనేక ప్రదేశాలకు ముస్లిం బంధువులు వెళ్లడానికి వీలులేదని, అలాగే కొన్ని ప్రదేశాలకు హిందువులు వెళ్లలేకపోతున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. నేను ఈ ప్రాంతాలన్నిటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో స్వయంగా చూస్తాను. ఈ నగరంలో కేవలం 23శాతం ముస్లింలు ఉన్నారు. ఈ 23శాతం మంది ఎవరికైనా ఏం నష్టం చేయగలరు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందనే ధీమాతో కొందరు పోలీసులు ముస్లింలను ఇబ్బందిపెడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. పోలీసుల్లో కూడా ఇలాంటి మత ధోరణి నిండిపోతే ఇక భారత భవిష్యత్తు అంధకారమే ….” ప్రార్ధనా సమావేశానికి హాజరైనవారిలో హిందువులే ఎక్కువ. వారికి గాంధీజీ మాటలు ఏమాత్రం నచ్చలేదు. కేవలం 23శాతం ఉన్న ముస్లింలు గత సంవత్సరం `ప్రత్యక్ష చర్య’కు పాల్పడగలిగితే, ఇక వారు అధిక సంఖ్యాకులైతే తమ పరిస్థితి ఏమిటి? ఇదే ప్రశ్న అందరి మనస్సుల్లో మెదలింది.
ప్రార్ధనా సమావేశం తరువాత ప్రతిరోజూ స్వీకరించే స్వల్పమైన ఆహారం తీసుకుని గాంధీజీ లోపలి గదిలోకి వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ మంత్రులతో ఆయన చర్చిస్తారు. మెల్లమెల్లగా మంత్రులందరూ అక్కడికి చేరుకుంటున్నారు. 15నిముషాల్లో భావి ముఖ్యమంత్రి ప్రఫుల్ల చంద్ర ఘోష్, ఆయన మంత్రివర్గ సహచరులు వచ్చేశారు. గాంధీజీ తన సహజమైన నెమ్మది స్వరంలో వారితో మాట్లాడటం మొదలుపెట్టారు. “సుహ్రవర్దీ కాలంలో హిందువులపై ముస్లిములు అకృత్యాలకు పాల్పడి ఉండవచ్చును. కొందరు ముస్లిం పోలీసులు కూడా హిందువులను ఇబ్బందిపెట్టి ఉండవచ్చును. కానీ మనం కూడా అదేవిధంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకోవాలా? కలకత్తాలో ప్రతి ముస్లిం సురక్షితంగా ఉండాలి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.’’
––––
అక్కడ డిల్లీలోని మందిర్ మార్గ్ లోని హిందూ మహాసభ కార్యాలయంలో జరుగుతున్న అఖిల భారతీయ హిందూ పార్లమెంట్’ సమావేశాల రెండవ రోజు. అఖండ హిందుస్తాన్ కోసం ఈ సమావేశాలకు హాజరవుతున్న వారందరికి దేశ విభజన ఎంతో కోపాన్ని, ఆక్రోశాన్ని కలిగిస్తోంది. శరణార్ధులుగా మారిన, మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన హిందూ, సిక్ఖుల పట్ల బాధ కలిగింది.
ఈ రోజు సభలో తీర్మానం ఆమోదిస్తారు. చాలామంది వక్తలు మాట్లాడారు. బెంగాల్ నుంచి వచ్చిన న్యాయమూర్తి నిర్మల చంద్ర చటర్జీ ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. “3జూన్ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన దేశ విభజన ప్రస్తావనను స్వీకరించడం ద్వారా కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసింది. కోట్లాదిమంది భారతీయులకు వెన్నుపోటు పొడిచింది. విభజనను కాంగ్రెస్ అంగీకరించదమంటే ముస్లిం లీగ్ గూండాగిరి ముందు తల వంచడమే’’అని చటర్జీ గర్జించారు.
ఈ సమావేశాల్లో అందరికంటే చివర మాట్లాడినవారు వీర సావర్కర్. తన అద్భుతమైన వాగ్ధాటి, తర్కబద్దమైన విషయ ప్రతిపాదన ద్వారా ఆయన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. “ఇక ప్రభుత్వానికి విజ్ఞాపనలు, విన్నపాలు చేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చేసి చూపించాలి. అన్నీ పార్టీలలోని హిందువులు అఖండ హిందూస్థాన్ కోసం కలిసి పని చేయాలి. `రక్తపాతం, హింసలను నివారించేందుకే దేశ విభజనను అంగీకరించాం’ అంటూ నెహ్రూ చెపుతున్న పిరికి కారణాలు కేవలం హిందువులను మోసం చేయడానికే. ఎందుకంటే విభజన నిర్ణయం తీసుకున్న తరువాత కూడా హిందువులపై ముస్లింల దాడులు ఆగలేదు. అంటే వాళ్ళకు మరో విభజన కావాలా. ఈ ధోరణిని అడ్డుకోకపోతే ఈ దేశంలో 14 పాకిస్థాన్ లు తయారయే ప్రమాదం ఉంది. అందుచేత `రక్తపాతం జరిగిపోతుందనే’ భయం వదిలిపెట్టి `తగిన రీతిలో’సమాధానం చెప్పడానికి సిద్ధపడాలి. పార్టీ విభేదాలను పక్కన పెట్టి హిందువులంతా ఒకటి కావాలి. సమర్ధులు కావాలి. ఆ విధంగా దేశ విభజనను నివారించాలి.’’ అని సావర్కర్ తన ఉపన్యాసంలో పిలుపునిచ్చారు.
`పార్టీ భేదాలను పక్కనపెట్టి హిందువులంతా అఖండ భారత నిర్మాణం కోసం సంఘటితం కావాలి. భగవాధ్వజం మాత్రమే జాతీయ పతాకం కావాలి. హింది జాతీయ భాష కావాలి. అలాగే భారత్ ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. సాధ్యమైనంత త్వరగా దేశంలో సాధారణ ఎన్నికలు జరిపించాలి’అంటూ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
––––
ఆకాశం మేఘావృతమై ఉంది. చిరుజల్లులు పడుతుండడంతో కరాచీ నగరం తడి తడిగా ఉంది. సింధ్ ప్రాంత శాసన సభా ప్రాంగణంలో పాకిస్థాన్ రాజ్యాంగ సభ మొదటి సమావేశం ప్రారంభమయింది. ఈ రోజు ఎజెండా పెద్దగా ఏమి లేదు. ముఖ్యమైన పని రేపే పూర్తవుతుంది. ఎందుకంటే రేపు `కాయిదే – ఆజమ్’ జిన్నా అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడతారు.
సరిగ్గా 11 గం.లకు అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 72మంది సభ్యుల్లో 52మంది హాజరయ్యారు. పశ్చిమ పంజాబ్ కు చెందిన ఇద్దరు సిక్కు సభ్యులు అసెంబ్లీని బహిష్కరించారు కాబట్టి వాళ్ళు రాలేదు. ముందు వరుసలో కూర్చున్న, పాకిస్థాన్ గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించే బారిస్టర్ మహమ్మద్ ఆలీ జిన్నా లేచి వేదిక పైకి వెలుతున్నప్పుడు సభ్యులంతా కరతాళ ధ్వనులతో, బెంచిలను చరచి ఆయనకు స్వాగతం పలికారు. జిన్నా మొదట అసెంబ్లీ కార్యాలయ రిజిస్టర్ లో సంతకం చేశారు. పాకిస్థాన్ రాజ్యాంగ సభ అధ్యక్ష పదవికి బెంగాల్ కు చెందిన జోగింద్రనాధ్ మండల్ పేరు ప్రతిపాదించారు. దానిని సభ్యులంతా వెంటానే ఆమోదించారు.
అఖండ భారత్ మధ్యంతర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న, దళిత నాయకుడు జోగేంద్రనాధ్ మండల్ పాకిస్థాన్ మొదటి రాజ్యాంగ సభ మొదటి అధ్యక్షుడయ్యారు. 1940లో కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన తరువాత జోగింద్రనాధ్ మండల్ ముస్లిం లీగ్ లో చేరారు. బెంగాల్ లో సుహ్రవర్దీ మంత్రిమండలిలో కూడా ఆయన ఉన్నారు. ముస్లిం లీగ్ `ప్రత్యక్ష చర్య’ పేరున హిందువులపై దాడులను సాగిస్తున్నప్పుడు ఈ జోగింద్రనాధ్ మండల్ బెంగాల్ అంతటా పర్యటిస్తూ `దళితులు ముస్లింలకు వ్యతిరేకంగా మారకూడదు’అంటూ ప్రచారం చేశారు. అప్పుడు జోగింద్రనాధ్ నిర్వహించిన ఈ `ఘనకార్యానికి’ బహుమతిగా ఆయనను జిన్నా మొదటి అసెంబ్లీకి అధ్యక్షుడిని చేశారు. అసెంబ్లీ మొదటి సమావేశం కేవలం గంటన్నర జరిగింది. అసెంబ్లీ బయట జనం పెద్దగా లేరు. ఈ సమావేశాల పట్ల వారికి ఎలాంటి ఆసక్తి, ఉత్సాహం లేవు.
––––
ఆదివారం..మధ్యాహ్నం. పాత డిల్లీలోని ముస్లిం లీగ్ కార్యలయం బయట గుమికూడిన కొందరు ముస్లింలు తీవ్రంగా వాదించుకుంటున్నారు. వారంతా ఆగ్రహంగా ఉన్నారు. వారు డిల్లీలోని ముస్లిం వ్యాపారులు. తమను ఇక్కడ వదిలిపెట్టి ముస్లిం లీగ్ పాకిస్థాన్ కు పారిపోతోందన్నది వారి ఆరోపణ. ప్రతిరోజూ పాకిస్థాన్ కు వెళ్ళే ప్రత్యేక రైలులో ఎవరో ఒక ముస్లిం నాయకుడు వెలిపోతున్నాడు. ఇలా తమను పట్టించుకోకుండా నాయకులు పాకిస్థాన్ కు పారిపోవడంపట్ల నిరసన తెలుపుతూ ముస్లిం వ్యాపారులు దరియాగంజ్ బజార్ లో దుకాణాలు మూసివేశారు. తమకు నాయకత్వం లేకుండా పోయిందని డిల్లీ ముస్లిములు భావించసాగారు.
––––
చిన్నచిన్న సమావేశాల కోసం డిల్లీ మునిసిపాలిటీ కమిటీ ఒక పెద్ద హాలును నిర్మించింది. మధ్యాహ్నం భోజనం తరువాత నెహ్రూ కొత్తగా కట్టిన ఈ హాలును చూడటానికి వచ్చారు.
––––
సాయంత్రం, తన 17, ఆర్క్ రోడ్ లోని నివాసంలో నెహ్రూ తన కార్యదర్శికి ఒక లేఖ డిక్టేట్ చేస్తున్నారు…
ప్రియమైన మౌంట్ బాటన్,
9 ఆగస్ట్ మీరు వ్రాసిన లేఖకు కృతజ్ఞతలు. ఆ లేఖలో మీరు వచ్చే సంవత్సరం 15 ఆగస్ట్ న ప్రభుత్వ కార్యాలయాలపై `యూనియన్ జాక్'(బ్రిటిష్ జెండా) ఎగరవేయడం గురించి ప్రస్తావించారు. మీరు సూచించిన ప్రకారమే వచ్చే ఏడాది నుంచి ఆగస్ట్ 15న అన్నీ ప్రభుత్వ కార్యాలయాలపై త్రివర్ణ పతాకంతో పాటు యూనియన్ జాక్ కూడా ఎగురవేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. __మీ విశ్వాసపాత్రుడు - జవహర్ లాల్ నెహ్రూ..
..అంటే ఏ యూనియన్ జాక్ ను తొలగించడానికి వందలాదిమంది విప్లవ వీరులు, సత్యాగ్రహులు తుపాకి గుళ్ళకు ఎదురువెళ్ళారో, బ్రిటిష్ అకృత్యాలను సహించారో, అదే యూనియన్ జాక్ ను స్వాతంత్ర్య దినోత్సవంతోపాటు 12 ఇతర ప్రముఖ జాతీయ ఉత్సవాల సమయంలో ప్రభుత్వ కార్యాలయాలపై ఎగరవేస్తారన్నమాట.. !
––––
మధ్యాహ్నం నీడలు క్రమంగా పొడుగవుతున్నాయి. లాహోర్ లోని బారుద్ ఖానా అనే ప్రాంతంలో ముస్లింలు గుమికుడుతున్నారు. వారిలో ఎంతో ఉత్సాహం , హడావిడి కనిపిస్తున్నాయి. హిందువులు, సిక్కులు కనీసం అడుగుపెట్టడానికి కూడా ధైర్యం చేయని ప్రాంతం ఇదే. ఇక్కడ ముస్లింలదే రాజ్యం. ఇది లాహోర్ ప్రధమ పౌరుడు (మేయర్)ఉండే ప్రదేశం. ఇక్కడ ఒక సత్రం ఉంది. ఇందులో హిందువులు, సిక్కులపై దాడులు చేసి, వారి ఇళ్లకు చెందిన యువతులను ఎత్తుకువచ్చే ముస్లిం మూకల సౌకర్యార్ధం 24 గం. లు ఆహారం అందుబాటులో ఉంచుతారు.
ఈ రోజు `మియా కు చెందిన భవంతి’లో ఆగస్ట్ 14 న అమలు చేయవలసిన ఒక కుట్ర రూపుదిద్దుకుంటోంది. 14 ఆగస్ట్ తరువాత లాహోర్ లో ఒక్క హిందువు, సిక్కును కూడా ఉండనివ్వరాదని ఏకగ్రీవంగా అంగీకరించారు. అందుకు తగిన ప్రణాళిక అక్కడ సిద్ధమవుతోంది.
–0–0–0–
భారత విభజనకు ఇక నాలుగు రోజులే మిగిలి ఉంది. అక్కడ అస్సామ్, కలకత్తాల్లో సాయంత్రం దీపాలు వెలిగించే వేళ అయింది. ఇక్కడ పెషావర్, మావుంట్ గోమరి లో పూర్తిగా సాయంత్రం కాలేదు.
ఇలాంటి సమయంలో అల్వార్, లాయల్ పూర్, అమృత్ సర్ ప్రాంతాలలో భయంకర అల్లర్లు చెలరేగిన వార్తలు వస్తున్నాయి. హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడం కోసం మంట అంటించిన బట్టలు గాలిలోకి ఎగరవేస్తున్నారు. అనేక హిందూ దుకాణాలు దోపిడీకి గురయ్యాయి. వాటిని ఖాళీ చేయిస్తున్నారు.
–––
లాహోర్ జైల్ రోడ్ లో ఉండే వీర్ భాన్ చాలా పరోపకారి, మంచివాడు. ఆయన పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్నవాడు. నగరంలో చెలరేగుతున్న అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఆ ఆదివారమే నగరం వదిలిపెట్టి పోవాలని నిశ్చయించుకున్నాడు. ఇల్లు ఖాళీ చేయడం కోసం రెండు ట్రక్ లు కూడా మాట్లాడాడు. ఎంతోకాలం అతని దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ముస్లిమే. ట్రక్ ల్లో సామాను నింపడం కోసం కూలీలను తీసుకురావడం కోసం ఆ ముస్లిం డ్రైవర్ నే పంపాడు. విశ్వాసపాత్రుడైన ఆ ముస్లిం డ్రైవర్ వెళ్ళి మొఝంగా ప్రాంతంలోని కొందరు ముస్లిం గుండాలను కూలీలుగా తీసుకువచ్చాడు. సాయంత్రానికల్లా వారంతా వీర్ భాన్ ఇంట్లో సామాను ట్రక్ లకు ఎక్కించారు. చివరికి వారికి కూలీ డబ్బులు ఇవ్వడానికి వీర్ భాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. కత్తులతో అనేకసార్లు అతన్ని పొడిచారు. భర్త రక్తపు మడుగులో ఒరిగిపోవడం చూసిన వీర్ భాన్ భార్య స్పృహతప్పి పడిపోయింది. ఆమెను కూడా ట్రక్ లో వేసి దుండగులు తమ స్థావరాల వైపు వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు వీర్ భాన్ ఇద్దరు కుమార్తెలు వెనుక వైపు తలుపు గుండా పారిపోయి హిందువులు ఎక్కువగా ఉండే కిషన్ నగర్ చేరుకున్నారు. దానితో ప్రాణాలతో బయటపడ్డారు.
ఇలా ఒక పెద్ద ప్రభుత్వోద్యోగిని, పంజాబ్ రాజధానిలో, జనబాహుళ్యం బాగా ఉన్న బస్తీలో, 10 ఆగస్ట్ సాయంత్రం హత్య చేస్తే, అతని ఇల్లు దోచుకునే అడిగే నాధుడే లేడు.
––––
లాహోర్ లో వీర్ భాన్ రక్తపు మడుగులో ప్రాణాలు వదిలినప్పుడు, అతని భార్యతో సహా మొత్తం సామగ్రిని దుండగులు దోచుకుపోయినప్పుడు….సరిగ్గా 100 మైళ్ళ దూరంలో కరాచీలో పాకిస్థాన్ వజీర్ – ఏ – ఆజమ్ గా బాధ్యతలు స్వీకరించే లియాఖత్ అలీ ప్రకటన ప్రచురణార్ధం పత్రికల కార్యాలయాలకు చేరింది.
తన పత్రికా ప్రకటనలో లియాఖత్ అలీ ఇలా పేర్కొన్నాడు – “పాకిస్థాన్ లో ముస్లిమేతరులకు పూర్తి రక్షణతోపాటు వారికి కూడా పూర్తి హక్కులు లభిస్తాయని హామీ ఇస్తున్నాను. హిందువులు ఇక్కడ పూర్తి సురక్షితంగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తూ హిందూస్థాన్ లోని బహుసంఖ్యాక హిందువులు ఇలా ఆలోచించడం లేదు.”
లియాఖత్ అలీ ఇంకా ఇలా పేర్కొన్నాడు -“భారత్ కు చెందిన వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తల ప్రకారం..ముఖ్యంగా పంజాబ్, పశ్చిమ బెంగాల్, సంయుక్త ప్రాంతాలనుంచి వస్తున్న వార్తల ప్రకారం మా ముస్లిం బంధువులపై అధిక సంఖ్యాక హిందువులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. సింధ్ ప్రాంతంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడే స్వయంగా హిందువులను మాపైకి ఉసిగొలుపుతున్నారు. హిందువులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, బీహార్ లో జరిగిన సంఘటనలే సింధ్ లో కూడా పునరావృతమవుతాయని కృపలానీ అన్నట్లుగా మాకు అనేక వార్తాపత్రికల సమాచారం ద్వారా తెలిసింది…”
––––
లాహోర్ లోని సంఘ కార్యాలయం… పూర్తిగా కార్యకర్తలు, స్వయంసేవకులతో నిండిపోయి ఉంది. 10 ఆగస్ట్, ఆదివారం, రాత్రి పది గంటలకు కూడా కార్యాలయంలో హడావిడిగా ఉంది. అంతా ఉద్రిక్తంగా ఉందని స్వయంసేవకులను చూస్తే అర్ధమవుతోంది. హిందువులు, సిక్కులను భారత్ వైపున ఉన్న పంజాబ్ కు సురక్షితంగా ఎలా తరలించాలని స్వయంసేవకులు ఆందోళన పడుతున్నారు.
కార్యలయం బయట సంఘ స్థాపకులు డా. హెడ్గేవార్ విగ్రహం ఉంది. పక్కనే ఉన్న ఇంట్లో వెలుగుతున్న బల్బ్ నుంచి వచ్చిన కాంతి ఆ విగ్రహంపై పడుతోంది. దేశంలో డా. హెడ్గేవార్ మొదటి విగ్రహం ఇది. గత కొన్ని రోజులుగా హిందువులు, సిక్కులను కాపాడటంలో స్వయంసేవకులు చూపిన అపారమైన ధైర్య సాహసాలకు ఆ విగ్రహం మౌన సాక్షిగా ఉంది..
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}