హిందూ |
భారత రాజ్యాంగం ప్రియాంబుల్‌లో ఇండియా దటీస్ భారత్ అని ఉంది. మరి ఈ ‘హిందూ’ శబ్దం ఎక్కడిది? భారతదేశానికి మొదట ‘అజనాభము’ అనే పేరు ఉండేది. దీనికి మేక – బ్రహ్మ దేవుడు అని సామాన్యార్థాలు. భూగోళానికి కేంద్ర నాభి అని విశేషార్థం. భూమి తనకు తెలియని కన్పడని ఒక ఇరుసు మీద తిరుగుతున్నది దానికి నాభి (నేమి) కేంద్ర బిందువు ఏది? అంటే అది భారతదేశంలో నైమిశారణ్య ప్రాంతంలో ఉన్నదని గణిత ఖగోళ శాస్తజ్ఞ్రులు నిర్ణయించారు.
నైమిశారణ్యం నేడు ఉత్తరప్రదేశ్‌లో ఉంది. భారతదేశానికి మరొక పేరు ఇండియా. ఇదే నేడు ప్రధానంగా రాజ్యాంగం చేత గుర్తింపబడింది. ఇండియా దటీస్ భారత్ అని భారత రాజ్యాంగం ప్రియాంబుల్‌లో రాసి ఉంది. హిందూ దేశం – హిందూస్థానం అని ఈ దేశాన్ని పిలుస్తున్నారు. సిందూ నదీ తీరంలో ఉన్న దేశానికి హిందూ దేశం అనే పేరు వచ్చింది అని ఒక నిర్వచనం. తామరిండ్ అనే మాట ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ఉంది. తమార్ ఎ హింద్ అంటే హిందూ దేశపు ఖర్జూరం, అంటే చింతకాయ అని ఈ మాటకు అర్థం. అరబ్బులకు ఖర్జూరం తెలుసు కాబట్టి చింతకాయను భారతీయుల ఖర్జూరం అని పిలిచారు.
ఇండియాలో నేడు ఎన్నో జాతుల వారు ఉన్నారు. గ్రీకులు భారతదేశం మీదికి దండయాత్ర చేసినప్పుడు అలగ్జాండరు వెంట వచ్చిన వారిలో కొందరు ఇక్కడే మిగిలిపోయారు. వారు ఏమైనారు? హిందువులలో కలిసిపోయారు. పార్సీలు ఏమైనారు? హిందువులతో కలిసిపోయారు. పహ్లవులు శే్వత హూణులు అరబ్బులు ఇలా ఎన్నో జాతుల వారు భారతదేశం మీదికి దండయాత్ర చేశారు. వారంతా ఏమైనారు? ఇస్లామిక్ దండయాత్రల తర్వాత ఆఫ్గనిస్థాన్ జమ్మూ కాశ్మీర్ బెలూచీస్థాన్ బంగ్లాదేశ్ తెలంగాణా వంటి ఎన్నో ప్రాంతాలు ముస్లింల స్వాధీనం అయినాయి. స్థానిక హిందువులు ముస్లిములుగా మార్చబడ్డారు. 1947కు ముందు కూడా లాహోరు హిందూ మెజారిటీ ప్రాంతం. ఇప్పుడక్కడ హిందువులు లేరు. వారిని తరిమివేశారు. లేదా చంపివేశారు. 1947లో కట్టుబట్టలతో ఢిల్లీ వస్తే ‘ఎందుకు వచ్చారు? అక్కడే చావండి’ అని పండిత జవహర్‌లాల్ నెహ్రూ అనటం గుర్తుండే ఉంటుంది.
సిందూ – సరస్వతి – వేద కాలం నుండి ప్రసిద్ధమైన నదులు. సింధూ నదీ తీరస్థులు హిందువులు అని ఒక నిర్వచనం.
హింసను దూషించేవాడు హిందువు అని మరొక నిర్వచనం. హిందూస్థాన్ జైహింద్ వంటి మాటలు చాలా ప్రచలితములైనవే కదా! ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ స్థాపించారు. ఇక భారత అంటే ఏమిటి? భగవద్గీతలో అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు ఓ భారతా! (భారతీయుడా) అని పిలిచాడు. భ అంటే కాంతి. రత అంటే కోరిక. భారత అనే పేరు శకుంతల కుమారునికి కూడా ఉంది. కాబట్టి వారి పేరు మీద ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అనటం సరికాదు.
భారతదేశానికి ఆర్యావర్తము అని మరొక పేరు ఉంది. ఆర్య శబ్దం అత్యంత ప్రాచీనమైనది. ‘కృణ్యంతో విశ్వమార్యమ్’ అని ఋగ్వేదంలో ఉంది. అంటే ప్రపంచ మానవులందరినీ శ్రేష్టులను చేసెదము గాక – అని ఈ మంత్రానికి అర్థం. సీత రాముణ్ణి ఆర్య పుత్ర అని పిలుస్తుంది. ఆర్యులు ఒక జాతివారని ఒక నిర్వచనం ఉంది. ఆర్యన్ స్పీచ్ అంటే సంస్కృతం. అంటే సంస్కరింపబడిన భాష అని అర్థం. ఆర్యులు ఇండియా నుండి బయలుదేరి శ్రేష్ట జీవనాన్ని ప్రపంచమంతా బోధించారు. ఋగ్వేదం, సింధూ నదీ తీరంలో సరస్వతీ నదీ పరీవాహక ప్రాంతంలో పుట్టింది. కాబట్టి ఆర్యులు మధ్య ఆసియా నుండి ఇండియాకు వచ్చారు అనే సిద్ధాంతం సరికాదు.
➣ ఇండియా నుండే మధ్య ఆసియా రష్యా గ్రీకు మెక్సికో వంటి ప్రాంతాలకు వెళ్లారు. (ఓల్గా సే గంగా తక్ అని రాహుల్ సాంకృత్యాయన్ ఒక గ్రంథం రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ గంగా సే ఓల్గా తక్ అని ఆఱు నదులు పేరుతో మరొక గ్రంథం సమాధానంగా వ్రాశారు.)
➣ అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ ద్రవిడ ఆంధ్ర ప్రాంతాలు భారతదేశంలో ఉండేవి. ఇవి వేరే వేరు స్వతంత్ర రాజ్యాలే అయినా మొత్తం భారతదేశంలో ఒక సంస్కృతి ప్రవహించేది. కాకతీయ ప్రతాప రుద్రుడు తాను ‘ఆంధ్ర చక్రవర్తి’ని అని చెప్పుకున్నాడు. ఆంధ్ర శబ్దము ఐతరేయ బ్రాహ్మణములో ఉంది. వీరు క్షత్రియులు విశ్వామిత్రుని పుత్రులు.
➣ అరబ్బులు వేయేండ్లు పాలించటం వలన ముస్లిం మతము ఉర్దూ భాష వచ్చింది. బ్రిటీషు వారు పాలించటం వలన క్రైస్తవ మతం ఇంగ్లీషు భాష వచ్చింది. స్వభావసిద్ధంగా భారతదేశంలో హిందువులు – సంస్కృత భాషీయులు ఉండేవారు. ‘హిందూ దేశం. హిందీ భాష. ఉత్తర భారతంలో కంట్రీ అనే (నేషన్) పదాన్ని ‘రాష్ట్ర’ అంటారు. తెలుగులో ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర ప్రాంతం (ప్రావిన్స్) అని మాత్రమే అర్థం.
‘రేరే ఘార్జర జర్జరోసి సమరే
లంపాక కింకం ఫత్సే
వంగ! త్వంగసి కిం
ముదా బలరక్షః
కాణోసి కింకోంకణ
హూణ ప్రాణ పరాయణోభవ
మహారాష్ట్రాప రాష్ట్రోస్యమీఁ
యోద్ధారో వయమిత్యరీన భిభవం
త్యంధ్ర క్షమా భృద్భటాః’
ఇది విద్యానాథుడు రచించిన ‘ప్రతాపరుద్ర యశోభూషణము’లోని శ్లోకము. ఇతడు రెండవ ప్రతాపరుద్ర కాకతీయ ప్రభువు కాలంనాటివాడు. కాబట్టి క్రీ.శ.1300 ప్రాంతము ఇందులో వరుసగా గుజరాతు, లంపాకము, బెంగాల్, (కర్ణాటక), ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్ర సామ్రాజ్యాలు పేర్కొనబడ్డాయి. ఈ పేర్లు నేటికీ మనకు సుప్రసిద్ధములే. ఇందులో ఢిల్లీ సుల్తానులను ‘హూణ’ శబ్దముతో సంబోధించారు. కాని హూణులు అంటే శే్వత జాతీయులు (ఆంగ్లేయులు) అనే అర్థమే తర్వాత స్థిరపడిపోయింది.
సారాంశం ఏమంటే మొత్తం భారతదేశంలో భిన్నభిన్న ప్రాంతాల్లో నాడూ నేడూ భిన్నభిన్న రాజ్యాలు ఉన్నాయి. దీనిలో పరస్పర వైషమ్యాలూ ఉన్నాయి – వీటి అన్నింటి మధ్య అంతస్సూత్రం అనుసంధాన హేతువుగా ‘హిందూత్వం’ లేదా భారతీయత ఉంది.
-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ - ఆంధ్రభూమి సౌజన్యం తో