వివేకానందుడు |
వివేకానందుడు హిందూ సమాజ పునరుజ్జీవనానికి, సాంస్కృతిక జాతీయవాదాన్ని శక్తిమంతం చేయటానికి కృషి చేశారు. వివేకానందుడు ఒక ఆధ్యాత్మిక వేత్త, దార్శనికుడు, సామాజిక పరివర్తకుడు. ఆయన భావజాలంతో సాగుతున్న జాతిపునర్నిర్మాణ కార్యంలో పాల్గొని ఆయన కలలుగన్న భారతాన్ని నిర్మిద్దాం.
పారిశ్రామిక విప్లవం ఒక పెనుమార్పును తీసుకు వచ్చింది. పాశ్చాత్యదేశాలలో జాతీయ భావాలు బలపడి జాతీయ రాజ్యాలు ఏర్పడుతున్న సమయమది. భారత దేశంలో కూడా బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ చైతన్యం బలం పుజుకుంటున్న సమయమది. ఎక్కడ చూసినా జాతీయభావాలు వేళ్లూనుకొంటున్న ఆ సమయంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు జన్మించారు: 1818లో పాశ్చాత్యదేశాల్లో కారల్‌మార్క్స్, 1863లో ప్రాచ్య దేశమైన భారత్‌లో వివేకానందుడు. ఒకరు మానవ చరిత్రను గతి తార్కిక భౌతికవాద పద్ధతిలో వ్యాఖ్యానించి భావి నాగరికతను విప్లవాత్మకం చేసేందుకు ప్రయత్నించగా; మరొకరు భౌతికవాద నాగరికత ఉత్థానపతనాలను పరిశీలించి మన మతవ్యవస్థలను హేతుబద్ధమైన, చైతన్యశీలమైన వేదాంతపు తర్కంతో విప్లవీకరించారు. మనిషి దోపిడీకి గురికావటానికి, దాస్యంలో నెట్టబడటానికి ఆర్థిక వ్యవహారాలే కీలకమని మార్క్స్; ఏ విప్లవానికైన మానవుని నైతిక, ధార్మిక ప్రవర్తనే కీలకమని వివేకానందుడు చెప్పారు. విలువల దార్శనికతతో సమాజాన్ని ఉన్నతస్థితికి తీసుకొనిపోలేకపోతే భౌతిక సంపద తెచ్చిపెట్టే ప్రగతి పతనం వైపు దారితీస్తుంది. అందుకే భౌతికవాదానికి కొనసాగింపుగా ఆధ్యాత్మికత అవసరమని వివేకానంద భావించారు.
భారతదేశంలో వేల సంవత్సరాలనుండే ఒక మనిషి జీవితానికి లక్ష్యం చతుర్విధ పురుషార్థాలుగా (ధర్మం, అర్థం, కామం, మోక్షం) చెప్పారు. భౌతికసుఖాలు, సంపదలు వద్దనలేదు. అక్కడే మునకలు వేయకుండా సత్యాన్వేషణలో మోక్ష సాధనకు కృషిచేయాలని చెప్పారు. కానీ, కారల్ మార్క్స్ ఆర్థిక వ్యవస్థ, రాజ్యవ్యవస్థ చేసే దోపిడీకి ఎదురుతిరిగి పోరాడాలని, కార్మిక నియంతృత్వం గురించి చెప్పారు. మనిషి జీవిత సమగ్రత గురించి చెప్పలేకపోయారు. తాను చెప్పిన విషయాలు తనకాలంలోనే వక్రీకరణకు గురికావటం చూసి బాధపడ్డారు. 1870లో అనేకసార్లు ‘నేను మార్క్సిస్టుని కాదు’ అని చెప్పారు. వివేకానందుడు తన జీవితం చివరిరోజున ‘వివేకా నందుడు ఈ ప్రపంచానికి ఏమిచ్చాడు? ఏం పనిచేసాడు? అన్నది అర్థం చేసుకోవటానికి మరో వివేకానందుడు ఉండవలసి ఉంటే..’ అని అంటూనే ‘రాబోవు రోజులలో మరెందరో వివేకానందులు జన్మిస్తారు’ అని స్వగతంగా పెద్దగానే అనేశారు. మార్క్స్ పాశ్చాత్యదేశాలలో వస్తున్న విపరిణామాలపై విశ్లేషణ చేస్తే, ఆ విపరిణామాల వల్ల, దానిపై జరిగే పోరాటాల వల్ల వచ్చే పతనం నుంచి ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వివేకానందుడు ప్రపంచాన్ని చైతన్యవంతం చేయటానికి ప్రయత్నించారు. వివేకానందుడు సామ్యవాదేకాని మార్క్సులాగా భౌతికవాది కాదు.
ఈ దేశంలో సామ్యవాద భావజాల వికాసంలో వివేకానందుని ప్రాముఖ్యతను మొట్టమొదటగా గుర్తించిన వారు కె. దామోదరన్ అనే భారతీయ కమ్యూనిస్టు మేధావి. ‘ఇండియన్ థాట్’ అనే పుస్తకంలో ‘రష్యాలో సామ్యవాద విప్లవం రావటానికి రెండు దశాబ్దాల ముందే వివేకానందుడు సామ్యవాద నినాదాన్ని లేవనెత్తాడు. నవతరానికి ఆయన గొప్ప స్ఫూర్తిదాయకుడు’ అని వివరించారు. వివేకానందుని వ్యక్తిత్వాన్ని, సందేశాన్ని సామ్యవాద దేశాలు కూడా ప్రస్తుతించాయి. రష్యా, చైనాలలో వివేకానందుని 120వ జయంతిని అధికారికంగా నిర్వహించారు.
సామాజిక పరివర్తన అనే ఇంజనుకు తగిన ఇంధనం వేదాంతమేనని వివేకానందుని స్పష్టమైన అభిప్రాయం. ఆయన సామాజిక చింతనలో మరో స్పష్టత– ‘జాతీయ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థానంలో ఉన్న వారిని పడగొట్టటం కాదు, దిగువన ఉన్న వారిని ఉన్నతస్థితికి తీసుకొనివెళ్ళటం’ అన్నది. మార్క్స్ మాత్రం, భారమంతటినీ కేంద్రీకృత సమాజం పైన, సామూహిక జీవనంపైనా ఉంచారు. మార్క్స్‌కు భౌతికవాదమే మూలాధారం. వివేకానందునికి సత్యసిద్ధాంతమైన వేదాంతం ముఖ్యం. ‘ఈ దేశం బాగుపడాలంటే జనసామాన్యాన్ని జాగృతపరచాలి. మన జాతి చేసిన అతిపెద్ద పాపం జన సామాన్యాన్ని నిర్లక్ష్యం చేయడం. వారిని ఎదగనిస్తే సమాజం బాగుపడుతుంది. వారికి సకారాత్మకమైన విద్య నందిస్తూ జాగృతం చేయటం మనందరి కర్తవ్యమని’ వివేకానందుడు చెప్పేవారు. అందుకే ‘దరిద్రదేవోభవ’ అన్నది ఆయన మంత్రమయ్యింది.
19వ శతాబ్దం ప్రపంచమంతటా జాతీయభావాలు ఉప్పొంగిన కాలం. ఆ కాలంలో మార్క్స్ మాత్రమే జాతీయభావంపై అంతగా దృష్టి పెట్టలేదు. భావోద్వేగపు దృక్పథం జోలికి పోకుండా ఆర్థిక దృక్కోణానికే పరిమితమైనాడు. వివేకానందుడు సాంస్కృతిక జాతీయవాదానికి పెద్దపీట వేసాడు. జాతీయతకు సంస్కృతే ఆధారం. భౌతికవాద భావజాలంతో దేశ ప్రజల బుర్రలను నింపివేసి వారికి దేవునిపైన, ఆత్మపైన, ఉత్తర గతులపైన నమ్మకాలను ధ్వంసం చేయటానికి వర్గపోరాటం పేరుతో, కార్మికవర్గ నియంతృత్వం పేరుతో హింసాత్మక చర్యలను దేశ విద్రోహకర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి జాతీయ ఐక్యతను కాపాడుకోవాలని వివేకానందుడు చెప్పేవారు.
హిందుత్వంపై వివేకానంద ‘‘గర్వసే కహో హమ్ హిందూ హై’’ అని చెప్పారు. అలా చెబితే వేల సంవత్సరాల మన మహాపురుషుల పరంపర, చరిత్ర, సంస్కృతులు మనకు గుర్తువస్తాయి. వివేకానం దుడు హిందూ సమాజ పునరుజ్జీవనానికి, సాంస్కృతిక జాతీయవాదాన్ని శక్తిమంతం చేయటానికి కృషి చేశారు. ఆయన ఒక ఆధ్యాత్మిక వేత్త, దార్శనికుడు, సామాజిక పరివర్తకుడు. ఆయన భావజాలంతో సాగుతున్న జాతిపునర్నిర్మాణ కార్యంలో పాల్గొని ఆయన కలలుగన్న భారతాన్ని నిర్మిద్దాం.
రాంపల్లి మల్లికార్జునరావు - ఆంధ్రజ్యోతి సౌజన్యం తో