డా. మోహన్ భగవత్ జీ |
అయోధ్య శ్రీ రామమందిర భూమిపూజ కార్యక్రమంలో డా. మోహన్ భగవత్ జీ ప్రసంగం
నేడు ఎంతో ఆనందమయమైన రోజు. ఆ ఆనందం కూడా అనేక రకాలు. మనమంతా కలిసి ఒక సంకల్పం తీసుకున్నాం. అలా సంకల్పం తీసుకుని పని ప్రారంభించే సమయంలో అప్పటి సర్ సంఘచాలక్ బాలసాహెబ్ దేవరస్ ఒక హెచ్చరిక వంటి సూచన చేశారు. రాగల 20,30 ఏళ్ళు ఎంతో పరిశ్రమిస్తేనేగానీ ఈ సంకల్పం పూర్తికాదని ఆయన చెప్పారు. అలాగే 30 ఏళ్లపాటు పనిచేశాం. ఇప్పుడు 30వ ఏట ఆ సంకల్పం నెరవేరుతున్న ఆనంద క్షణాలను అనుభవిస్తున్నాము. అంతా తమ శక్తివంచన లేకుండా పనిచేశారు. అనేకమంది అనేక బలిదానాలు చేశారు. వారంతా ఇక్కడకు వచ్చి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల రాలేకపోయారు. రామ రధయాత్రకు నేతృత్వం వహించిన అద్వానీ జీ ఇంట్లోనే ఈ కార్యక్రమం తిలకిస్తూ ఉంటారు. అనేకమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నా పిలవలేని పరిస్థితి. వారంతా తమతమ స్థానాల నుంచే ఈ కార్యక్రమాన్ని చూస్తుంటారు. దేశం మొత్తంలో ఆనందమయ వాతావరణం నెలకొని ఉంది. వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కార్యం నేడు పూర్తి అవుతున్నది.
అయితే నేడు అన్నింటికంటే ఆనందకరమైన విషయం ఏమిటంటే ఆత్మనిర్భర భారత్ ను నిర్మించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం, ఆత్మభావనపు సగుణ, సాకార అధిష్టానాన్ని ఏర్పరచుకునే పవిత్రకార్య శుభారంభం నేడు జరిగింది. `సీతారాముడు సర్వత్ర ఉన్నాడు’(సియారామ మయ సబ్ జగ్ జానహి) అనే ఆధ్యాత్మిక దృష్టి ఆ అధిష్టానానికి చెందినది. సర్వ ప్రపంచంలో తనను, తనలో సర్వ ప్రపంచాన్ని చూడగలగడమే భారతీయ దృష్టి. దీని వల్లనే ఈనాటికీ భారతీయుల వ్యవహారం మిగిలినవారి కంటే ఎంతో ఉన్నతంగా, గౌరవవంతంగా ఉంటుంది. వసుధైవ కుటుంబకం అనే రీతిలో ఉంటుంది. అలాంటి స్వభావం, దానితోపాటు కర్తవ్య నిర్వహణ, మాయామయమైన భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే సందిగ్ధాల నుంచి బయటపడే మార్గం కనిపెడుతూ, వీలైనంతవరకు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళడమే మన పని. సర్వ సంపన్నమైన, ప్రపంచానికి మేలు కలిగించే భారత్ నిర్మాణం ఈ రోజుతో ప్రారంభమవుతోంది. అది కూడా కార్యకుశలత కలిగినవారి చేతుల మీదుగా ఆ పని ప్రారంభం కావడం మరింత సంతోషించదగిన విషయం.
నేడు అశోక్ సింఘాల్ జీ ఇక్కడ ఉంటే ఎంతో బాగుండేదని అందరికీ అనిపించడం సహజం. అలాగే పూజ్య మహంత్ పరమహంస దాస్ జీ కూడా గుర్తుకువస్తారు. కానీ పైవాడు ఏం తలుస్తాడో అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటున్నవారు తమ మనస్సులలో, ఈ ప్రపంచంలో లేనివారు సూక్ష్మ స్వరూపంలో ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నారని, ఈ సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తున్నారని నా విశ్వాసం. ఈ ఆనందంలో ఉత్సాహం, స్ఫురణ ఉన్నాయి.
ఏతద్దేశప్రసూతస్య సకాదాగ్రాజన్మనాః |
స్వం స్వం చరిత్రం శిక్షేరాన్శ్మృతియం సర్వమానవాః ||
మనం అందరికీ జీవించే విధానాన్ని నేర్పాలి. నేటి కరోనా సంకట స్థితిలో ప్రపంచమంతా అంతర్ముఖమయింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎక్కడ పొరపాటు జరిగిందనే యోచనలో పడింది. దీని నుంచి బయటపడటం ఎలాగని చూస్తోంది.
ఇప్పటికే రెండు జీవన పద్దతులను, మార్గాలను ప్రపంచం చూసేసింది. ఇక మూడవ, ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా? అంటే ఉంది. అది మనదగ్గర ఉంది. ఆ మార్గమేమిటో మనమే చెప్పాలి, చూపించాలి. ఆ పని కోసం మనని మనం సిద్ధం చేసుకునేందుకు సంకల్పం తీసుకునే రోజు కూడా ఇదే. దానికి కావలసిన తపస్సు, కృషి మనం చేశాం. శ్రీరామునిలో కనిపించే పురుషార్ధం, పరాక్రమం, శౌర్యం వారసత్వంగా మనలో కూడా నిండి ఉన్నాయి. వాటిని మనం కోల్పోలేదు. వాటిని ప్రకటించాలనుకుంటే చాలు. అటువంటి స్ఫురణ ఈ రోజున, ఈ సందర్భంగా కలుగుతున్నది. ఇది భారతీయులందరికి కలుగుతుంది. ఎందుకంటే రాముడు అందరివాడు, రాముడు అందరిలో ఉన్నాడు.
భవ్యమందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎవరు ఏ పని చేయాలన్నది నిర్ణయమైపోయింది. ఎవరికి ఏ పని అప్పచెప్పారో వారు ఆ పని పూర్తిచేస్తారు. కానీ మనం ఏం చేయాలి? మనమంతా మన మనస్సులనే అయోధ్యగా మార్చుకోవాలి. మందిరాలుగా మలచుకోవాలి. అందరినీ కలిపిఉంచే, అందరూ అనుసరించే, ఉన్నతిని తెచ్చే, అందరినీ తనవారుగా భావించగలిగే, శ్రీరామచంద్రుడు ఆచరించి చూపిన ధర్మాన్ని మనమంతా అనుసరించవలసి ఉంది. తద్వారా ప్రపంచం మొత్తానికి సుఖ శాంతులను కలిగించే భారత్ ను నిర్మించాలి. అందుకోసమే మనమంతా మన మనస్సులను అయోధ్యగా మార్చుకోవాలి.
ఇక్కడ రామమందిర నిర్మాణం ఎలా కొనసాగుతుందో ఆలాగే మన మనస్సులలో కూడా అయోధ్య నిర్మాణం సాగాలి. రామమందిర నిర్మాణం పూర్తయ్యేనాటికి మన మనోమందిరాలు కూడా సిద్ధం కావాలి.
మనోమందిరాలు ఎలా ఉంటాయో తులసీదాస్ తన రామచరిత మానస్ లో ఇలా చెప్పారు-
కామ్ కొహ్ మద్ మాన్ న మొహా | లోభ్ నా ఛోభ్ న రాగ్ న ద్రోహా ||
జిన్హ్ కె కపట్ దంభ్ నహి మాయా | తిన్హ్ కె హృదయ్ బసహు రఘురాయ ||
జాతి పాంతి ధను ధరము బడాయి | ప్రియ పరివార్ సదన్ సుఖ్ దాయీ ||
సబ్ తజి తుమ్హాహి రహాయి ఉర్ లాయి | తెహి కె హృదయ్ రహహు రఘురాయీ ||
మన హృదయాల్లో కూడా రాముడు నివసించాలి. అన్ని దోషాల నుంచి, శతృభావన నుంచి విముక్తులం కావాలి. మనస్సుల నుంచి అన్ని రకాల భేదభావాలను తొలగించుకుని, తన దేశానికి చెందినవారినేకాక సంపూర్ణ ప్రపంచాన్ని తనదిగా భావించే మానసిక స్థితిని, సామర్ధ్యాన్ని సంపాదించుకోవడమే మన పని. ఈ సమాజాన్ని ఒకటిగా నిలిపిఉంచే ఒక సగుణ, సాకార మూర్తి ఇక్కడ నిలుస్తాడు. ఆయన మనకు ఎల్లప్పుడు ప్రేరణను, స్ఫూర్తిని ఇస్తాడు. ఈ రామమందిరం దేశంలో ఉన్న అనేక వేల మందిరాలవంటిది మాత్రమే కాదు. నిజానికి దేశంలోని అన్ని రామమందిరాల నిర్మాణం వెనుక ఉన్న ఆశయపు పునర్ ప్రకటికరణ, పునర్ స్థాపన కార్యం ఇక్కడ, ఈ రోజున సమర్ధులైన వారి ద్వారా జరుగుతోంది. ఈ మంగళమయ, ఆనందమయ సమయంలో మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను.
Source: www.rss.org
__విశ్వ సంవాద కేంద్రము