Meher-chand |
కొందరు నడుచుకుంటూ కొత్త కొత్త తీరాలు చేరుకుంటారు. కనీవినీ ఎరుగని విజయాలు సాధిస్తారు. తమ నీడ కూడా నేల మీద పడకుండా వారు వస్తారు, వెళ్లిపోతారు. తరువాత వారి పాద ముద్రలు సైతం మిగలవు. వారిని మనం మరిచి పోవొచ్చు కాని వారు చేసింది మాత్రం ఎప్పటికీ మరచిపోలేం.
మన కథానాయకుడూ అలాంటివాడే. ఆయన పుట్టింది నేటి హిమాచల్ లోని కాంగ్డా దగ్గర టిక్కాన గ్రోటా అనే ఊళ్లో. ఆయన చదువుకుంది లా¬ర్‌లో. వకీలుగా పనిచేసింది గురుదాస్‌పూర్‌లో. లాయరుగా ప్రాక్టీస్ చేసింది లాహోర్‌లోనే.
కాని నేడు జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అవిభాజ్య అంతర్భాగంగా ఉందంటే ఆయన తన నీడ కూడా పడకుండా చేసిన ప్రయత్నాలే కారణం. ఆయన పేరు మెహర్ చంద్ మహాజన్. జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ మహరాజా హరిసింగ్ వీలిన పత్రంపై సంతకం చేయడంలో ఆయనది కీలకపాత్ర. అటు సర్దార్ పటేల్, ఇటు పూజనీయ గురూజీ గోళ్వల్కర్‌ల మార్గదర్శనంలో ఆయన జమ్మూ కశ్మీర్‌కి ప్రధానమంత్రిగా అత్యంత క్లిష్ట ఘడియల్లో పనిచేశాడు.
అసలు మెహర్ చంద్ జీవితమే దురదృష్టంతో మొదలైంది. కానీ దాన్ని అతను దేశం కోసం అదష్ట శక్తిగా మార్చుకున్నాడు. మెహర్ చంద్ పుట్టగానే జ్యోతిష్కులు ‘ఇతనిది అత్యంత దురదష్టకరమైన జాతకం. పన్నెండేళ్లు తండ్రి ముఖం చూడకూడదు. చూస్తే తండ్రిచనిపోతాడు’ అని భయపెట్టారు. దాంతో ఆయనను తల్లిదండ్రులు వేరే వాళ్లకి ఇచ్చేశారు. పన్నెండేళ్లకిగానీ తిరిగి తండ్రి ముఖం చూడలేదు మెహర్.
మెహర్ చదువుల్లో మహా ఘటికుడు. బాగా చదువుకున్నాడు. ఆ రోజుల్లో పంజాబ్ విశ్వవిద్యా లయంలో న్యాయశాస్త్రం చదివి వకీలయ్యాడు. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. గురుదాస్‌పూర్‌లో వకాలతీ మొదలుపెట్టి తరువాత లా¬ర్ హైకోర్టుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన జమ్మూ కశ్మీర్ మహారాజా ప్రతాపసింగ్ తరపున పూంఛ్ రాజుకి వ్యతిరేకంగా కోర్టులో వాదించాడు. చివరికి కోర్టు వెలుపలే సామరస్య పూరితంగా ఆ సమస్యను పరిష్కరించాడు. అంతే ఆయనకు జమ్మూకశ్మీర్‌తో మరే సంబంధమూ లేదు.
కానీ ఆయనకు తెలియకుండా నడుస్తున్న చరిత్ర ఆయనను జమ్మూ కశ్మీర్ వద్దకు తీసుకువచ్చింది. జమ్మూకశ్మీర్ మహారాణి లలితా దేవి, యువరాజు కరణ్ సింగ్ మహారాజా హరిసింగ్ ఆదేశాల మేరకు ఆయన్ని కలిసి కశ్మీర్ ప్రధానమంత్రి బాధ్యతను చేపట్టమని కోరారు. అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్న రామచంద్ర కాక్ కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుగా ఉంచాలని వాదించేవాడు. ఆయన భార్య బ్రిటిషర్. ఆమె ఆయన్ను చాలా ప్రభావితం చేసేది. రామచంద్ర కాక్‌ను తొలగించి, మెహర్ చంద్ మహాజన్‌ను ప్రధానిగా పెట్టుకొమ్మని మహారాజాకి సర్దార్ పటేల్ సూచించారు. అందుకే ఆయన తన కుమారుడు, భార్యను ఆయన వద్దకు పంపించారు. అలా మెహర్ చంద్ మహాజన్ జమ్మూ కశ్మీర్‌కి ప్రధానమంత్రి అయ్యాడు.
అప్పటికి దేశ విభజన జరిగిపోయింది. జమ్మూ కశ్మీర్‌ను కబళించేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోంది. సైన్యంలోని ముస్లింలు తిరుగుబాటు చేసి గిల్గిత్ బల్తిస్తాన్‌లను పాక్ పరం చేశారు. పూంఛ్‌లో తిరుగుబాటు మొదలైంది. పులిమీద పుట్రలా పాకిస్తాన్ తన సైన్యాన్ని మారు వేషంలో జమ్మూకశ్మీర్‌లోకి పంపించింది. భారత్‌లో విలీనం అయ్యే విషయంలో మహారాజు తటపటాయిస్తున్నారు. ఆ సమయంలో మహారాజుకు భారత్‌లో విలీనం కమ్మని సలహా ఇచ్చింది మెహర్ చంద్ మహాజనే. ఆయన సర్దార్ పటేల్‌తో నిత్యం సంభాషించేవాడు. అక్టోబర్ నెల రెండో వారంలో ఆర్.ఎస్.ఎస్.
రెండో సరసంఘచాలక్ గురూజీ గోళ్వల్కర్ మెహర్ చంద్‌తో మహారాజును కలిసి భారత్‌లో విలీనం కమ్మని కోరాడు. గురూజీ సలహా మేరకు పటియాలా మహారాజు తన సైన్యాన్ని భారత సైన్యానికి ముందే జమ్మూకశ్మీర్‌లోకి పంపించారు. ఈ సమయంలో మెహర్ చంద్ అద్భుతమైన పాత్రను పోషించి, జమ్మూకశ్మీర్ విలీనంలో కీలకపాత్ర వహించాడు. విలీన పత్రంపై సంతకం చేసిన మరుక్షణం శ్రీనగర్ నుంచి మహారాజు జమ్మూకు వచ్చేలా ఏర్పాట్లు చేసింది కూడా ఆయనే. ఈ విధంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత చాతుర్యాన్ని ప్రదర్శించి జమ్మూ కశ్మీర్ విలీనాన్ని సుసాధ్యం చేశాడు. జమ్మూకశ్మీర్ విలీనం కోసం ఆయన తన పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. మహారాజా హరిసింగ్ నెహ్రూ ఒత్తిడిపై షేక్ అబ్దుల్లాను కశ్మీర్ ప్రధానిగా ప్రకటించేందుకు ఆయన ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఒక కర్తవ్యాన్ని నిర్వహించిన కార్యసాధకుడిగా ఆయన నిష్క్రమించారు.
మెహర్ చంద్ మహాజన్ జమ్మూకశ్మీర్‌కి చేసిన సేవ మరొకటి కూడా ఉంది. దీని గురించి ఎవరికీ తెలియదు. భారత పాకిస్తాన్ విభజన రేఖను నిర్ధారించిన రాడ్ క్లిఫ్ కమిషన్‌లో ఆయన హిందువుల పక్షాన సభ్యుడు. మెహర్ గురుదాస్‌పూర్‌ను భారత్‌లోనే ఉంచాలని చాలా గట్టిగా వాదించాడు. నిజానికి అప్పట్లో గురుదాస్‌పూర్ ముస్లిం మెజారిటీ జిల్లా. కాబట్టి మొత్తం గురుదాస్ పూర్ జిల్లా తమకే చెందుతుందని పాకిస్తానీలు ధీమాగా ఉన్నారు. కానీ రావీనది రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉండాలని సహేతుకంగా మెహర్ చంద్ వాదించాడు. అంతే కాదు. మహారాజా రంజిత్ సింగ్‌కి చెందిన నలభై వేల మంది సిక్కు సైనికులు రావీ నది కాలువను తవ్వారని ఆయన గుర్తుచేసి, ఈ కాలువ పట్ల సిక్కులకు, హిందువులకు భావాత్మక సంబంధం ఉందని ఆయన చాలా చక్కగా వాదించాడు. ఫలితంగా గురుదాస్‌పూర్ భారత్‌లో మిగిలి పోయింది. ఇది పాకిస్తాన్‌కు చావుదెబ్బ లాంటిది. ఎందుకంటే జమ్మూకు భారత్ నుంచి వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం గురుదాస్‌పూర్ జిల్లాలోని పఠాన్ కోట్ మీదుగా ఉండేది. అది పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్తే జమ్మూకశ్మీర్‌ను దిగ్బంధనం చేయడం చాలా సులువు. కానీ మెహర్ చంద్ ఈ మార్గాన్ని పాకిస్తాన్ చేజిక్కకుండా చేశాడు. ఫలితంగా జమ్మూకశ్మీర్‌ను ఆయన కాపాడాడు.
ఆయన ఈ దేశానికి సుప్రీంకోర్టు మూడవ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు. ఆర్య సమాజ్ నేతగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. జమ్మూ కశ్మీర్‌ను కాపాడి, కర్తవ్య నిర్వహణ చేసి, తన నీడను కూడా మిగల్చకుండా వెళ్లిపోయిన మెహర్ చంద్ మహాజన్ డిసెంబర్ 1954లో చనిపోయాడు. భవంతి శిఖరంపై రుజువులా కాక, పునాదిలో రాయిలా ఉండటమే మెహర్ చంద్‌కు సంతోషం. స్మృతి చిహ్నాలు కూడా మిగల్చని ఆయన స్మతులను కాపాడుకోవడం మనందరి బాధ్యత !
– ప్రభాత్ (జాగృతి సౌజన్యం తో)