మహర్షి వాల్మీకి - Maharishi Valmiki |
నిత్యజీవితంలో నీతినియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కుల గోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అంత్యజుడై పుట్టినా పావనుడై చరిస్తే చేకొనక మానడు. ఇలా ఆ ఘనాఘన సుందరుడికి మన గుణగణాలే ప్రధానం కాని కులమతాలు కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి.
‘సత్త్వ రజస్తమోగుణ విభాగమును, తత్సంబంధిత కర్మవిభాగమును అనుసరించి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను నాలుగు వర్ణములను నేను సృష్టించితిని’ అన్నాడు శ్రీ కృష్ణపరమాత్మ. అందువలన ఒక వ్యక్తి పుట్టుకతోనే ఒక కులంలో పుడతాడనేది మిథ్య. మన సనాతన ధర్మంలో ఈ కుల విభజన వారి వారి గుణాలను బట్టి, వారాచరించే వృత్తులను బట్టి ఏర్పడింది కాని, పుట్టుకతోనే కుల నిర్ధారణ చేయడమనేది అప్పట్లో లేదు. ఆ తరువాత కాలంలో మన వాళ్ళు బుద్ధిపూర్వకంగా తమ ఆధిక్యతను చాటుకోవడానికి ఈ కుల కట్టుబాట్లు ఏర్పరచారని భావించడంలో ఎటువంటి దోషం లేదు. కొన్ని యుగాలకు పూర్వం ఈ కులాల కారణంగా ఒకరిని ఉన్నతులుగాను వేరొకరిని నీచులుగాను చూసారనడానికి పురాణా లలో ఎటువంటి ఋజువులు లేవు. కన్నప్ప శివుడికి మాంసాన్ని అర్పించాడని, శ్రీరాముడికి శబరి ఎంగిలి పండ్లు తినిపించిందని; కాబట్టి వారు భక్తులు కాదని ఎవరైనా అన్నారా? వారు పుట్టినది శూద్ర కులమైనా వారిని ఎవరూ ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు.
శ్రీ మద్రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి బోయకులంలో జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు. యువకుడైన రత్నాకరుడు ఒకనాడు తమసా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అదే సమయంలో ఎవరో కిరాతకుడు క్రౌంచ మిథునంలోని ఒక పక్షిని తన బాణంతో కొట్టాడు. అది నేల పడి గిలగిలా తన్నుకొని చని పోయింది. చనిపోయిన తన జంటపక్షిని చూసి రెండవ పక్షి దుఃఖించడం రత్నాకరుడు చూసాడు. దానికి అతని హృదయం ద్రవించిపోయింది. అప్పుడతని నోటి వెంట దుఃఖంతో
‘మా నిషాద ప్రతిష్టామ్ త్వమగమః శాశ్వితోః సమాః
యత్క్రౌంచ మిథనదేకమ్ అవదీః కామమోహితమ్’
అన్న మాటలు వచ్చాయి. ఇలా అశువుగా అతని నోటి వెంట వచ్చిన పదాలనే శ్లోకం అన్నారు. అప్పటినుండి రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు.
బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని రామకథను రామాయణ కావ్యంగా రాయమని ఆదేశించాడు. కావ్య రచన పూర్తయ్యాక బ్రహ్మదేవుడు ఆ కావ్యం గురించి ఇలా అన్నాడు – ‘ఈ మహీతలంలో పర్వతాలు, నదులు ఎంత కాలం నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీరామాయణ కథ కూడా లోకాలన్నింటిలోనూ ప్రచారంలో ఉండగలదు’. ఎందుకంటే రామాయణంలో హృదయాన్ని ద్రవింపజేసే చక్కని కథ ద్వారా మానవాళికి మార్గదర్శనం చేసే సుభాషిత రత్నాలు ఎన్నో చెప్పారు వాల్మీకి. మానవుడి జీవితాన్ని సుఖమయం చేసే ధర్మాలను, ధర్మసూక్ష్మాలనూ ఎన్నింటినో రామాయణం విశదపరుస్తుంది.
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరూహ్య కవితా శాఖమ్ వందే వాల్మీకి కోకిలమ్ ||
వాల్మీకేర్ముని సింహస్య కవితా వనచారినః
శ్రున్యన్ రామకథా నాదం కోనయాతి పరాంగతిమ్ ||
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని దివ్యచరిత్రను మరియు శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షికి మానవాళి యావత్తు ఋణపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
శ్రీమద్రామాయణం ఇతిహాసమే (ఇతిహాసం అంటే చారిత్రిక గ్రంథం అని అర్థం) కాక, ఆదికావ్యంగా ప్రశస్తి గాంచింది. మానవాళిని కర్తవ్య పథంలో నడిపించే కార్యంలో వేదము ప్రభువు వలె శాసించేది కాగా పురాణం మిత్రుని వలె సూచించేది. అయితే కావ్యము కాంత వలె ఉపదేశాత్మకమై మానవుని కర్తవ్యోన్ముఖుని చేస్తుంది. ‘రామవత్ వర్తితవ్యం, న రావణవత్’ అనే దివ్య సందేశాన్ని మనకు అందించి, తరించే మార్గం చూపిన మహనీయులు వాల్మీకి మహర్షి.
ధర్మాత్ముడు, కరుణా సింధువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరునగధీరుడు అయిన శ్రీరాముని దివ్యచరితమును కావ్యరూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి విశేష వృత్తాలతో, అర్థవంత మైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సంధులు, మధురమైన, అర్థవంతమైన వాక్యాలతో కూడిన శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయంలోని అంశాలన్నీ సత్యాలే.
రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భాతృ ధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు.
ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.
ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి వందనీయుడు. ఆయనకు మనం చేతులెత్తి నమస్క రించాలి. ప్రతివారు, రామాయణ కావ్యం చదివి చక్కని గుణవంతులై శ్రీరాముని అనుగ్రహం పొందితే, వాల్మీకి మహర్షి ఋణం తీర్చుకున్నట్లే.
– గుమ్మా ప్రసాదరావు - జాగృతి సౌజన్యం తో
_ విశ్వ సంవాద కేంద్రము {full_page}