" గోమాత " |
ఏనుగు ఘీంకారాన్ని ‘బృంహితం’ అంటారు. గుర్రం సకిలింపు- హేష. ఈ రెండింటికీ లేని ఒకానొక పవిత్రత - ఆవుల అంబారవానికి దక్కింది! ‘అంబ’ అంటే తల్లి. ‘నేను ఈ లోకానికే తల్లిని’ అనేది దాని సంకేతం. కన్నతల్లికి తోడుగా నేలను, ఆవును అమ్మగా సంభావిస్తూ- భూమాతగా, గోమాతగా ఆరాధించే ఆచారానికి అదే పునాది.
‘పాల నొసగు తల్లి పంటల సుమవల్లి కర్షకులకు పెరటి కల్పవల్లి’ అని కవులు స్తుతించడంలోని ఆంతర్యం అదే! వాటిని ‘సొమ్ములు’ అనడం తెలుగునాట పరిపాటి. ఈ దేశంలో ఒకప్పుడు పశు సమృద్ధే నిక్కమైన సంపద! దేవతలు ఆరాధించే ధేనువును ‘సురభి’ అంటారు. ‘అరకొరగ గరికపరకలు కొరికిన పుణ్యాన నీవు కూర్మిని పాలన్ కురియుచు అసువుల నిలిపెదు! సురభికి సమమౌదు వీవు స్తుతులను గొనుమా’ అన్నది పల్లెప్రజల గుండెచప్పుళ్లకు పద్య అనువాదం. గోవు అనే పదానికి ఇంద్రియాలు అనే అర్థం ఉంది. ‘ఇంద్రియ వాంఛలను నియంత్రించేవాడు’ అనే అర్థంలో శ్రీకృష్ణుడికి ‘గో’ పాలకుడు అన్న పేరు స్థిరపడింది. ‘జీవన వాహినీ రుచిర జీవనముల్ కనలేక నిస్పృహన్…’ నిర్లిప్తంగా మనుగడ సాగించే ‘జీవులపై దయామృతము చిల్కగ చేతను వేణువూదుచున్ ‘గో’వులనెల్ల కాచితివో’ అని కవులు ప్రశ్నించడంలోని చమత్కారం అదే. ‘ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి ఏల?’ అన్న పోతన పద్యంలో రుక్మిణీదేవి- పంచప్రాణాలతోపాటు వరసగా పంచేంద్రియ సంపుటిని ప్రస్తావించడం- ఆయన ‘గో’పాలకుడు కావడం వల్లనే అన్నారు ప్రవచనకర్తలు! గోపాలకుడు- అనేది కృష్ణుడికి ఇష్టమైన సంబోధనగా చాలామంది భావిస్తారు.
గోమాత |
మానవజాతికి గోవులు నేర్పిన గొప్ప గుణం - వాత్సల్యం! వత్సం అంటే లేగదూడ. దానిపై తల్లిగోవు చూపించే అపురూప ఆత్మీయ భావాన్ని వాత్సల్యం అంటారు. ఒకప్పుడు గురుకులాల్లోని విద్యార్థులకు దక్కిన అమూల్య వరమది. ‘చర్ల బ్రహ్మయ్యశాస్త్రి చవులూర బోధించె అమిత వాత్సల్యాన ఆదరించె’ అని తి.వేం.కవులు తమ విద్యాగురువులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించేవారు. పిల్లలు అడిగినవల్లా అమర్చినా చాలదు, అమ్మానాన్నల ‘వాత్సల్యమదిలేక వట్టిపోవు’ అని కవులు తీర్మానించారు. పరిపాలకులు ప్రజలపట్ల వాత్సల్యం కలిగి ఉండాలన్నాడు భర్తృహరి! రాజు గోమాతలా ఉంటే- ఆయన పాలనలో భూమాత- కల్పలత అవుతుందన్నాడు. ‘ధరణి ధేనువు పితుకంగ (రాజ్యం ఏలాలని) తలచితేని, జనుల పోషింపుము అధిప! ‘వత్సముల’ మాడ్కి, జనులు పోషింపబడుచుండ, జగతి కల్పలత తెరంగున సకల ఫలములు నొసగు’ అని హితవు చెప్పాడు. సాయంసంధ్యను ‘గోధూళివేళ’ అనడం నేవళీకపు సౌరు. గోధూళికి మన పెద్దలు ఎనలేని విలువను ఆపాదించారు.
ఆవుగిట్టల నుంచి ఎగసిపడే దుమ్ములో మునిగిపోయిన కృష్ణుడు పోతన మహాకవికి- ఒంటినిండా బూడిద పూసుకొన్న పరమ శివుడిలా తోచాడు. ‘తనువున అంటిన ధరణీ పరాగంబు(ధూళి) పూసిన నెరిభూతి పూత కాగ… గోపబాలకుండు… శివుని పగిదినొప్పె’ అన్నాడు. రుషులకైతే గోవు- కామధేనువే! అది వారు అడిగినవన్నీ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు గాధేయుడిగా ఉన్న రోజుల్లో అఖండ సేనాసమేతుడై వసిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళాడు. వసిష్ఠుడు హోమధేనువు శబలను పిలిచి అద్భుతమైన విందుభోజనాలను అంతమందికీ క్షణాల్లో ఏర్పాటు చేశాడు. ‘వసిష్ఠులు చెప్పినయంతలోన కామధేనువు పొదుగు పాలు కారికారి… ఒక్కటి అన్నపురాశి, మరొక్కటి భక్ష్యములరాశి, ఒక్కటి సూపంబు, ఒక్కండు ఇక్షురసాపగ (చెరకురస వాహిని), ఒక్కడు దధికుల్య (పెరుగుకాల్వ)…’గా మారి ఎవరి రుచులకు తగినట్లు వారికి ఆహారం అందిందని విశ్వనాథ వర్ణించారు. యజ్ఞవేదికల వద్ద భోజన ఏర్పాట్ల కోసం రుషులకు కామధేనువులే ఆధారం!
జంతు ఆరాధికుడు " యోగి ఆదిత్యనాథ్" |
సమస్త అవయవాలనే కాదు, గోవుల మలమూత్రాలను సైతం పవిత్రంగా భావించడం మనదేశంలో ఆనవాయితీ. అవి ఆరోగ్యకారకాలని ఎందరికో గట్టి నమ్మకం. ఆవుపేడతో ఇల్లు అలకడం, గోమూత్ర సేవనం- ఆ పాదులోంచి మొలచిన అలవాట్లు. ‘గో సేవావ్రతం’ గొప్ప వ్రతంగా పేరుపడింది. దిలీపుడు ఆ వ్రతం ఆచరించి సంతానాన్ని పొందాడని, దాన్ని వసిష్ఠులు ఉపదేశం చేశారని- రఘువంశంలో కాళిదాసు మహాకవి వివరించాడు. హోమధేనువు మరణిస్తే యజ్ఞం భగ్నం కావడం- ఆముక్తమాల్యదలోని ఖాండిక్యకేశి ధ్వజోపాఖ్యానంలో ముఖ్యాంశం! ‘గోవు నిజాయతీకి గొప్ప చిహ్నం’ అన్నాడు అనంతామాత్యుడు. పులి తనను సంహరించబోతే, ‘మునుమునుపుట్టె నాకు ఒక ముద్దులపట్టి… ఇంతియ పూరియ(గడ్డి) మేయనేరడు, ఏ జని(నేను వెళ్ళి) కడుపార చన్గుడిపి చయ్యన వచ్చెద’ అని బతిమాలుకున్న ఆవు- నిజాయతీగా తిరిగొచ్చిన వైనాన్ని ‘భోజరాజీయం’లోని గోవ్యాఘ్ర సంవాదం ప్రకటించింది.
ఆవువల్ల లోకానికి అలవడే సుగుణాలు, సమకూరే ఎన్నో ప్రయోజనాలపై తాజాగా పరిశోధన జరపాలని కేంద్రం నిర్ణయించింది. శాస్త్రసాంకేతిక పరిజ్ఞాన శాఖమంత్రి నేతృత్వంలో 19మంది సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆవుల రంగులను భారతం అరణ్యపర్వం అందంగా వర్ణించింది. ‘శంఖ, చంద్రహార(వెన్నెల), నీహార(మంచు), డిండీర(నురుగు), పటీర(చందనం), ముక్తాహార(ముత్యం), హీర(వజ్రం), సంకాశం(కాంతి)’తో తులతూగే తెల్లని ఆవులు ‘ప్రౌఢ బంధూక పల్లవ భాసితములు’ (మంకెన చెట్టు చిగుళ్లలా) ‘వికచ కాంచన చంపక విస్ఫుటములు’ (బంగారు, సంపెంగ వర్ణాలు) అంటూ ఎన్నో రంగులు చెప్పింది. వేమన చెప్పినట్లు ‘పసుల వన్నెవేరు పాలు ఒకటి’ కాబట్టి రంగులేవైనా గోవుల మౌలిక తత్వాన్ని, సేవాగుణాన్ని, ప్రయోజనాన్ని ఈ బృందం ఆవిష్కరిస్తుందేమో చూడాలి!
___(ఈనాడు సౌజన్యం తో)