ఆర్య – ద్రావిడల కల్పన ! |
ఉత్తర – దక్షిణ భారతాలు వేరు అనే వాదన ఇప్పుడు మరింత మసకబారింది. ప్రాచీన భారతీయ ప్రజానీకంపై హార్వర్డ్ , భారతీయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం భారతీయులందరి మధ్య జన్యు సంబంధం ఉందని, ముఖ్యంగా ఇప్పటి వరకు `యదార్ధం’గా చెలామణి అవుతున్న ఉత్తర, దక్షిణ భారతీయులను ఆర్య, ద్రావిడులుగా విభజిస్తున్న సిద్ధాంతం కూడా వట్టి కట్టుకథ అని తేలిపోయింది.
“అధ్యయనం ప్రకారం ….ఉత్తర – దక్షిణ విభజన నిజంకాదు’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ (CCMB) మాజీ డైరెక్టర్ లాల్జీ సింగ్ తెలిపారు.
భారత్ లో ఉత్తర, దక్షిణ భారతీయులు తమతమ స్థానాల్లో స్థిరపడిన కొన్ని వేల సంవత్సరాల తరువాతి కాలాన్ని గురించి ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం చెపుతుందని, కనుక ఈ విభజనలో సత్యం లేదని CCMB సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజన్ వెల్లడించారు.
ఈ అధ్యయనంలో భాగంగా 13 రాష్ట్రాలకు చెందిన 25 వివిధ సమూహాలలో 132మంది వ్యక్తుల జన్యువులకు సంబంధించిన 5,00,000 జన్యు లక్షణాలను విశ్లేషించారు. పరిశీలించిన వ్యక్తులంతా ఆరు భాష సమూహాలకు, సంప్రదాయ `ఉన్నత’, `నిమ్న’ కులాలు మరియు గిరిజన సమూహాలకు చెందినవారు.“జన్యు శాస్త్రం ప్రకారం జాతి వంటి వ్యవస్థల నుండి భారతీయ సమాజంలో కులాలు ఏర్పడ్డాయి’’ అని తంగరాజన్ వెల్లడించారు. జాతులు, కులాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం అసాధ్యమని , ఎందుకంటే జన్యుశాస్త్రం ప్రకారం అవి వ్యవస్థాపరంగా వేరువేరు కావని తంగరాజన్ అన్నారు.
ఈ అధ్యయనాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులతో కలిసి CCMB శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న జనాభా ప్రాచీన ఉత్తరాది భారతీయులు (ANI), ప్రాచీన దక్షిణాది భారతీయుల (ASI) జన్యు కలయిక కలిగి ఉన్నారని హార్వర్డ్ పరిశీలనలో తేలింది.
`మొట్టమొదటి వలస 65,000 ఏళ్ల క్రితం అండమాన్ దీవులలో, ప్రాచీన దక్షిణ భారతానికి జరిగిందని, దీనివల్లనే ఆ ప్రాంతాల్లో జనాభా పెరిగిందని తంగరాజన్ వెల్లడించారు. ఆ తరువాత 40,000 ఏళ్ళకు ప్రాచీన ఉత్తర భారతీయులు వచ్చారు, క్రమంగా వారి సంఖ్య పెరిగింది. ఆ తరువాత కాలగతిలో ఉత్తరాది, దక్షిణాది వారు కలిసిపోయారు. వీరివల్ల కొత్త తరహా జనాభా వచ్చింది. అదే ఇప్పుడు మనం చూస్తున్న జనాభా’’ అని ఆయన తెలిపారు.
భారత దేశంలో జన్యు సంబంధమైన వ్యాధులు మిగతా ప్రపంచం కంటే వేరుగా ఉండటానికి కూడా కారణాల తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ప్రయత్నించింది. 70 శాతం భారతీయులు జన్యుసంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారని, అలాగే కొన్ని జనాభాలు కొన్ని రకాల పరిస్థితులకే ఎందుకు పరిమితమయ్యాయనే విషయం కూడా ఈ అద్యయనం వల్ల తెలుస్తుందని సింగ్ చెప్పారు. ఉదాహరణకు పార్శీ మహిళల్లో వక్షోజ కాన్సర్ రావడానికి, తిరుపతి, చిత్తూరు ప్రజల్లో ఎక్కువమంది మెదడుకు సంబంధించిన నరాల వ్యాధికి గురికావడానికి లేదా కొన్ని మధ్య భారత్, ఈశాన్య ప్రాంతాల్లో గిరిజనుల్లో రక్తహీనతకు కారణాలు ఇప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తాయని పరిశోధకులు అంటున్నారు.
పరిశోధకులు ఇప్పుడు మరో విషయం మీద దృష్టి సారించారు. యూరేషియన్ లు ANI (ఉత్తరాది వారు)ల నుండి వచ్చారా లేక పశ్చిమ యూరేషియన్ లకు ANI ల మధ్య సంబంధం ఏమైనా ఉన్నదా అని పరిశీలిస్తున్నారు. అయితే ASI (దక్షిణాదివారికి) ప్రపంచంలోని ఏ ఇతర ప్రజలతో సంబంధం లేదు. భారతీయులు ముందుగా యూరోప్ వెళ్ళారా లేక యూరోపియన్లు భారత్ వచ్చారా అని తేల్చేందుకు శాస్త్రీయమైన ఋజువులు ఏవి లేవని పరిశోధకులు చెప్పారు.
ఆఫ్రికన్ ల వలస మార్గం:
1,35,000 నుండి 75,000 సంవత్సరాల మధ్య కాలంలో తూర్పు ఆఫ్రికా లో తీవ్రమైన కరవు వచ్చింది. మాలవి సరస్సు 95% ఎండిపోయింది. దీనితో ఆఫ్రికా వాసులు వలస పోయారు. వాళ్ళు ఏ మార్గంలో వెళ్లారు? వాళ్ళు భారత్ గుండా దక్షిణ తీరప్రాంత మార్గం గుండా వెళ్లారని స్పష్టమైంది. అండమాన్, నికోబార్ దీవులలోని గిరిజనుల, ప్రపంచంలోని ఇతర ప్రజల DNA చిత్రాలను పోల్చి చూసే ఈ విషయం తెలిసిందని పరిశోధకులు చెపుతున్నారు. దీనితో ఇప్పటి వరకు నమ్ముతున్నట్లుగా వలసలు మధ్య ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా గుండా భారత్ కు సాగాయన్న సిద్ధాంతం తప్పని తేలింది.
--- విశ్వ సంవాద కేంద్రము