కుహనా సెక్కులర్ మీడియా |
ఒకపట్టణంలో గొప్ప మేధావిగా పేరొందిన ఒక వ్యక్తి వుండేవాడు. అదే పట్టణంలో మూర్ఖుడుగా చెలామణి అవుతున్న ఓ అవివేకి కూడా ఉన్నాడు. ఓరోజు ఈ అవివేకి తెలివిగల మేధావి దగ్గరకువచ్చి , తాను తెలివిగల వాడిగా కావడానికి ఏదైనా దారి చూపించమన్నాడు. అందుకు ఆ అపరమేధావి ‘నీవు తెలివిగలవాడిగా మారాలనుకుంటున్నావా! లేక అలా కన్పించాలనుకుంటున్నావా? అన్నాడు. ఎందుకంటే తెలివిగల వారిలా కావడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. అలా కన్పించడం చాలా తేలిక’ అన్నాడు. అవివేకి తనకు తేలికైన మార్గం చూపించమన్నాడు. అలా అనగానే అతను చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. అంతే! పదిరోజులు తిరక్కుండానే పట్టణ ప్రజలంతా ఈ అజ్ఞానిని మేధావిగా గుర్తించడం మొదలుపెట్టారు. మేధావి చెప్పిన ఆ రహస్యం ఏమిటిట?
అజ్ఞాని తాను విన్న ప్రతి ప్రకటన ఖండించాలి. ఎవరైనా విగ్రహారాధన గొప్పది అంటే వెంటనే ‘అందులో ఏమీ లేదు’ అనాలి. విషయం గురించి ఏమీ తెలియకున్నా ‘నేను దాని గురించి చెప్పాను గుర్తుందా!’ అని ఎదురు ప్రశ్నించాలి. కాళిదాసు కవిత్వం చాలా గొప్పది! అని ఎవరైనా అంటే ‘అదంతా వట్టి చెత్త’ అనాలి! వీలైతే ఎలా అద్భుతమో నిరూపించు అని ఎదుటివాడ్ని ప్రశ్నిస్తుండాలి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గానం గొప్పగా వుంది అని ఎవరైనా అంటే! ఎందుకు గొప్ప! ఏముంది అందులో అని ప్రశ్నించు. నువ్వు చెప్పింది కాదంటే అది నిరూపించమని సవాల్ చెయ్యి అంతే! నీవొక మేధావిగా ప్రసిద్ధి చెందుతావు అన్నాడు. రెండువారాల్లో ఆ మూర్ఖుడు పెద్ద మేధావిగా పేరుపొందాడు. కొందరు ఇలాంటి నకారాత్మక దృక్పథంతో మేధావులుగా చలామణి అవుతున్నారు. భారత్‌లో హిందువులను ఎంతగా నిందించగలిగితే అంత పెద్ద మేధావిగా పేరు తెచ్చుకోవచ్చు అనే వాదం కమ్యూనిస్టులు మన మెదళ్లలో బాగా నాటారు. పేరుప్రతిష్ఠలకోసం, అవార్డులకోసం ఇలాంటి భావ విధ్వంసం సరైనదేనా అని ఆలోచించాలి.
భారతదేశంలో మేధావులంటే వారు వామపక్ష గుంపునకు మాత్రమే చెంది వుండాలి. గొప్ప కవులు, జర్నలిస్టులుగా పేరు పొందాలంటే వాళ్ల పెన్నులో ‘ఎర్రసిరా’నే ఉపయోగించాలనే అభిప్రాయం కలిగిస్తున్నారు. ‘అసహనం’ పేరుతో అవార్డులు వాపసు ఇచ్చినపుడు తెలిసింది; ఇంతమంది ఒకే వర్గపు రచయితలు, కవులు అవార్డులు పొందారా అని! సమాజానికి మార్గదర్శనం చేసే వ్యక్తులు ఇలా విభజించబడ్డారా? ఈ ప్రమాదకర ధోరణికి సెప్టెంబర్ 5వ తేదీ జరిగిన గౌరీ లంకేశ్ అనే కవి, జర్నలిస్ట్ హత్య అద్దం పడుతుంది. ఆమె మరణించడం ఎవరికీ సంతోషం కాదు. నూటికి నూరు పాళ్లు ఖండనీయం. ఆమెను చంపిన దుండగులను పట్టుకుని శిక్షించాలి. కానీ ఆమె మరణించిన 15 నిముషాల్లోనే ఒక వర్గం మేధావులు, మీడియా ఈ హత్యకు పరోక్షంగా కొన్ని పార్టీలను, సంస్థలను వేలెత్తి చూపారు. రాజ్యాంగబద్ధ దేశంలో ఎలాంటి నేర పరిశోధన జరగకుండానే ఇలాంటి ముగింపు ఇవ్వడం మరో విషాదం! పోలీసుల ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేసు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది.
సరే! జర్నలిస్ట్‌లను, మేధావులను, రచయితలను సమాజం ఈ రోజుకూ గౌరవిస్తుంది. కాబట్టి వాళ్ల దృష్టి నిష్పాక్షికంగా ఉండాలి. కానీ అందరూ పెన్నుల్లో ఎర్రరంగు నింపుకుని నిలబడడం ఎంతవరకు సబబు అని కొత్త కలాలు ప్రశ్నిస్తున్నాయి. భావ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో కోట్లాది మంది మనోభావాలు గాయపరచడం తగునా? కన్నడ నాట యూ.ఆర్.అనంతమూర్తి అనే స్వయం ప్రకటిత మేధావి ‘నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాని అయితే నేను ఈ దేశంలోనే వుండను’ అని 2014కు ముందే ప్రకటించాడు. ఆయన అంతకుముందే మరణించాడు. అది వేరే విషయం. ప్రజాస్వామ్య విధానాలకు మేధావులు ఇచ్చే గౌరవం ఇదేనా? కొందరు సంపాదకులు 2014 ఎన్నికలకు ముందు వెనుక మోదీకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాసాలు రాసారు. ఇదంతా గన్నులతో కాకుండా పెన్నులతో చేసే హత్యలు కాదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గతంలో కేవలం పత్రికలు మాత్రమే వుండడంవల్ల కొన్ని భావజాల వ్యక్తులు ఏది చెబితే అదే ఫైనల్! అదే విజ్ఞత! అన్న చందంగా సాగేది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు రావడం వల్ల తమ ఆలోచనలను కోట్లమందితో పంచుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ రచయితల, మేధావుల భావాలకు సరిసమానమైన కొత్త కలాలు, గళాలు మాట్లాడుతున్నాయి. ఇది జీర్ణిచుకోలేని రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి వామపక్ష మీడియా ప్రతినిధులు వీళ్లకు ‘నెట్ వీరులు’ అనిపేరు పెట్టారు. వాళ్లను ‘నెట్ హిందువులు’ అని తిడుతుంటారు.
1975-80 మధ్యకాలంలో జాతీయవాద భావజాలం వున్న కె.ఆర్.ముల్కానీ లాంటి అ ప్రసిద్ధ పాత్రికేయుడు మనందరికీ తెలుసు. అలాగే ఆనాటి కమ్యూనిస్టు మేధావి నంబూద్రి పాద్ కూడ అందరికీ తెలుసు. వీళ్లిద్దరూ అప్పటి ప్రసిద్ధ పత్రికల్లో రోజు విడిచి రోజు ఎన్నో విషయాలపై విస్తృత చర్చ చేసేవారు. ఎందరోకొత్త పాత్రికేయులను, మేధావులను ఆలోచింపచేసే విధంగా పత్రికా చర్చలు వుండేవి. మరి ఇప్పుడు! ఏ టీవీ చానల్ చూసినా ‘వార్‌రూమ్ యుద్ధాలే’ కన్పిస్తున్నాయి. అవతలి వాళ్లకు జ్ఞానం కలిగించాలన్న తృష్ణకన్నా, వాళ్లను జయించాలన్న ఆక్రోశమే ఎక్కువ కనిపిస్తుంది. 29 జూలై 2004నాడు భారత్‌లోకి బంగ్లాదేశ్ చొరబాట్లను సమర్ధిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకీయం రాసింది. ఇది ఎలాంటి పత్రికా రచన? దీని అర్ధం ఏమిటి?
ఇక పత్రికల్లో కొన్ని ప్రత్యేకమైన భావజాలాల చట్రంలో రాస్తేనే ప్రచురితం అవుతుందనే వాదం పాఠకులు ఎపుడో గ్రహించారు. అన్ని పత్రికా సంస్థల్లో తిష్టవేసిన వాళ్లు మేధావులుగా చెలామణి అవుతున్నారు. గౌరీలంకేశ్ హత్య తర్వాత ఆమె శ్రద్ధాంజలి సభ ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియ కార్యాలయంలో జరిగింది. గౌతమ్ లాహిడీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన డి.రాజా, కన్హయ్య కుమార్ ప్రసంగాలు చేస్తున్నారు. బయట కన్హయ్య కుమార్‌తో కలిసి పనిచేసే జర్నలిస్టుగా ముద్రపడ్డ శోహలా రాషీద్ అనే జర్నలిస్టు రిపబ్లిక్ టీవీ చానల్ ప్రతినిధిని లోపలికి అడుగుపెట్టనివ్వలేదు. పత్రికలతో సంబంధం లేని వ్యక్తులు లోపల ఉపన్యాసాలు దంచుతుంటే టీవీ చానళ్లను వెళ్లగొట్టడం ఎలాంటి స్వేచ్ఛ? ఇదేనా భావ స్వేచ్ఛకు కొత్త భాష్యం!
ఒక హత్యను తమ సైద్ధాంతిక భావజాలానికి వినియోగించుకోవడం శవాలపై పేలాలు ఏరుకోవడంలాంటిదని ఎందరో మేధావులు విమర్శిస్తున్నారు. గౌరీలంకేశ్ మరణించి రెండురోజులు కాకముందే ఓ ప్రసిద్ధ రచయిత తన పుస్తకాన్ని ‘గౌరీ అనువాదం చేసిందని’ అక్కడే అమ్మకాలు మొదలుపెట్టాడని అందరూ ముక్కున వేలేసుకున్నారు. రచయితలు చేయాల్సిన ఘనకార్యం ఇదా! అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా దేశంలో స్వేచ్ఛను సాధించడానికి చేస్తున్నాం అని చెప్తారు. సోకాల్డ్ మేధావులకు, రచయతలకు, కవులకువుండే స్వేచ్ఛ మిగతా ప్రజలకు కూడా వుంటుందని వాళ్లు గ్రహించరు. ఎందుకని? కోట్లాదిమంది మనోభావాలు వీళ్లకు పట్టవు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ హరించలేరు. ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేయడం నవతరం సహింలేకపోతున్నది. 20 ఆగస్టు 2013లో మహారాష్టల్రో నరేంద్ర దబోల్కర్ అనే హేతువాది హత్యకు గురైనాడు.
ఆంధ్ర శ్రద్ధాసమితి పేరుతో ఓ సంస్థను స్థాపించి దాని ద్వారా హిందూమతంలోని అంధ విశ్వసాలను తొలగిస్తానని చెప్పాడు. సతీ సహగమనం అనే దురాచారంపై రాజారామమోహన్‌రాయ్ ఉద్యమం చేస్తే యావత్ హిందూ సమాజం స్వాగతించి దానిని లేకుండా చేసింది. జాతికి అపకారం చేసేవి ఏవైనా ఈ సమాజం వదిలించుకుంటుంది. కానీ ఒక మతంలోని అన్ని విషయాలను అంధ విశ్వాసాలని చెప్పలేం! ఒకవేళ అవి అంధ విశ్వాసాలైతే ప్రజలే తిరస్కరిస్తారు. దభోల్కర్ లాంటి మేధావి ఒక మతం ప్రజల ప్రతి విశ్వాసాన్ని తిరస్కరించాడు. ఇది అక్కడ అతివాదులకు కోపం తెప్పించే అతడ్ని హత్య చేసారని ఓ వర్గం మీడియా, మేధావులు కోడై కూశారు. కానీ హత్య జరిగిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఈనాటి భాజపా ప్రభుత్వం గానీ నిందితులు ఎవరన్నది చెప్పలేకపోయాయి. ఎవరి విశ్వాసాలు వారికుంటాయి. సర్ సివి రామన్ లాంటి శాస్తవ్రేత్తనే గ్రహణంపై పరిశోధన చేసి, గ్రహణం విడిచినపుడు స్నానం చేస్తే ’మీరు ఒక సైంటిస్టు కదా స్నానం ఎందుకు చేస్తున్నారు’ అని అడిగారు. దానికి రామన్ జవాబు ఇస్తూ ‘దట్ ఈజ్ సైన్స్ దిస్ ఈజ్ సెంటిమెంట్’ అన్నారు. మేధావులుగా చెప్పుకునేవాళ్లు రామన్‌కన్నా ఎక్కువ పరిశోధన చేశారా? ఉపగ్రహాలను ప్రయోగించే వేళ అక్కడి దేవతల ముందు, తిరుమల వెంకన్న స్వామి ముందు మొక్కిన ఇస్రో చైర్మన్‌లకన్నా గొప్ప శాస్తవ్రేత్తలా వాళ్లు!
అలాగే గోవింద్ పండరీనాధ్ పన్సారే అనే సిపిఐ పార్టీకి చెందిన నాయకుడిని 20 ఫిబ్రవరి 2015 నాడు హత్య చేశారు. ఇతను ఒక పార్టీకి చెందిన తనను తాను హేతువాదిగా, చరిత్రకారుడుగా అభివర్ణించుకున్నాడు. పుత్ర కామేష్టీ యాగాన్ని వ్యతిరేకించాడు. పూనాలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్‌ను తగలబెట్టే ప్రయత్నం చేసాడు. 2004లో జేమ్స్‌లెన్ రాసిన ‘శివాజీ-హిందూ కింగ్ ఇన్ ఇస్లామిక్ ఇండియా’ అనే పుస్తకంపై వివాదం రాజేశాడు. ఇవన్నీ తన హేతువాద చర్యలుగా, లౌకిక వాద రక్షణగా చెప్పుకున్నాడు. ఇవన్నీ అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించి చేసినవేనా?
గతంలో కర్నాటకలో 77 ఏళ్ల ఎం.ఎం.కల్బుర్గి హత్య చేయబడ్డాడు. ఇతను లింగాయత్‌ను అని చెప్పుకుంటునే చెన్న బసవేశ్వరుడిని తిట్టిపోసాడు. శివలింగంపై, దేవతా విగ్రహాలపై మూత్రం పోస్తాను అన్నాడు. ఇంత తీవ్ర వ్యాఖ్యలు ‘్భవ స్వేచ్ఛ’ కిందకు ఎలా వస్తాయి? హత్యలు ఎవరు చేసినా ముమ్మాటికీ తప్పే. కానీ దానికి ముందు జరిగిన సంఘటనల మాటేమిటి? తెలుగునాట కూడా కంచ ఐలయ్య అనే సామాజిక రచయిత చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా వున్నాయో ఆయన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అంబేద్కర్ లాంటివాళ్లు కూడా శాస్ర్తియంగా, తర్కబద్ధంగా తన రచనల్లో విస్తృతమైన అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా ‘కుల నిర్మూలన’ అనే పుస్తకంలో ‘కులంపేరుతో ఓ జాతిని, నీతిని నిర్మూలించలేం’ అని ఆయన అన్నాడు. మరి ఐలయ్య చేస్తున్నదేమిటి? ఇంత ఆధునిక సమాజంలో శాస్ర్తియంగా జీవించాల్సిన మనం కులం కుళ్లులో మగ్గమని చెప్పడం విజ్ఞులు హర్షిస్తారా? దీనివెనుక ఏదో కుట్ర దాగుందని ప్రజలకు అనుమానాలు కలిగిస్తున్నారు!
విచిత్రం ఏమిటంటే ఇదంతా భావ స్వేచ్ఛ అని దబాయిస్తున్నారు. ఇది భావ స్వేచ్ఛ ఎలా అవుతుంది? హిందువులను, ఆ మతంలోని ఆచారాలను, సంప్రదాయాలను, గొప్పవాళ్లను తిట్టడం భావస్వేచ్ఛ ఎలా అవుతుంది? ప్రజాస్వామ్య దేశంలో ఆరోగ్యకరమైన చర్చ చేయాలి. అంతేకానీ సంయమనం పాటించకుండా విచక్షణ కోల్పోయి రచనలు చేయడం ఏవర్గంవారు చేసినా అది సరైన వ్యవహారం కాదు. మనం చెప్పే విషయాలకు ‘రంగు‘ వేసుకుని రక్షణ కల్పించుకుని ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. ‘నీ భావాలు-నాభావాలు పరస్పర విరుద్ధం కావచ్చు కానీ నీ భావ వ్యక్తీకరణకు నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం అన్న సూక్తిని విజ్ఞులు ఆలోచించాలి.
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125 bhaskarayogi.p@gmail.com