దేశ విభజన |
– ప్రశాంత్ పోల్
అది ఆగస్ట్ నెల ఐదవ రోజు ఆకాశం కొంత మేఘావృతంగా ఉంది. వాతావరణం కొంచెం చలిగా కూడా ఉంది. జమ్మూ నుండి లాహోర్ కు వెళ్లేందుకు రావల్పిండి మార్గం అనువైనదిగా భావించడంతో గాంధీ బృందం ఆ మార్గంలో లాహోర్ పయనమైంది. ఆ దారిలో ‘వాహ్’ అనే పేరు గల శరణార్థి శిబిరం ఉంది. గాంధీజీ ఆ శిబిరాన్ని దర్శించాలనుకున్నారు. వాహ్ వద్ద ఉన్న ఆ శరణార్థి శిబిరం ఘర్షణలు, కల్లోలాల నుండి బ్రతికి బయటపడిన హిందువులకు ,సిక్కులకు తాత్కాలిక వసతిగా ఉంది. అందువలన గాంధీజీ వెంటనున్న ఆ కార్యకర్తలు ఆయన అక్కడకు వెళ్లరాదని భావించారు. హిందువుల, సిక్కుల భాదాకరమైన స్వీయకథలు, హృదయాలను కలచి వేస్తుంది. నిన్నటి వరకు లక్షాధికారులైన ఈ శరణార్థులు అందరూ తమ ఇళ్ళను, సామానులను, ఆస్థిపాస్తులను వదలివేసి ఈ శిబిరంలో తలదాచుకునేందుకు వచ్చారు. వారి కుటుంబ సభ్యులు ఎందరో ముస్లిం గుండాలచే చంపబడ్డారు. అనేక మంది మహిళలు వారి కళ్ళముందే అత్యాచారాలకు గురి అయ్యారు. కోపాన్ని దిగమింగుకుంటూ ఆ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూడవలసివచ్చింది. అందువల్ల గాంధీపట్ల, కాంగ్రెస్ పట్ల శరణార్థి శిబిరాలలో ఈ కుటుంబాల ఆగ్రహం సహజంగానే కనిపించింది. గాంధీజీ అక్కడకు వెళ్ళడం క్షేమం కాదని కాంగ్రెస్ కార్యకర్తలు భావించారు. కాని, నేను వాహ్ శరణార్థి శిబిరానికి వెళ్ళి శరణార్థి కుటుంబాలను కలుస్తాను అని నిశ్చయంగా చెప్పడంతో, గాంధీజీ బృందం మధ్యాహ్న సమయానికి శిబిరానికి చేరే నిర్ణయం జరిగింది.
వాహ్ శరణార్థి శిబిరం ఒక విధంగా రక్త చరిత్రకు సజీవ తార్కాణంగా నిలిచింది. గత నెల వరకు ఈ శిబిరాలలో 15000 మంది దాకా శరణార్థులు ఉండేవారు. ఆగస్ట్ 15 దగ్గర పడుతుండడంతో శరణార్థుల సంఖ్య తగ్గసాగింది. ఈ ప్రాంతం పాకిస్తాన్ లో చేరుతుందని తెలిసిపోవడమే దీనికి కారణం. పాకిస్తాన్ లో ఉండడం తమకు క్షేమం కాదని హిందూ, సిక్కు కుటుంబాలకు అర్థం కావడంతో, వారికి వీలుదొరికినపుడు తూర్పు పంజాబ్ దిశగా పారిపోసాగారు.
గాంధీజీ శిబిరానికి చేరే సమయానికి దాదాపు 9000 మంది శిబిరంలో ఉన్నారు.ఎక్కువమంది పురుషులు, కొందరు పండు ముసలి మహిళలు కూడా అందులో ఉన్నారు. ముస్లిం నేషనల్ గార్డ్స్ కార్యకర్తల చేతిలో బందీలుగా అత్యాచారాలకు లేదా హత్యలకు గురికావడం మూలంగా ఈ మొత్తం శిబిరంలో కనీసం ఒక్క యువతి కూడా లేదు. ఈ శిబిరం ఒక శరణార్థి శిబిరంగా కాక చిత్రహింసల శిబిరంగా ఉంది. వర్షాల కారణంగా శిబిరం చుట్టూ నీరు, బురద చుట్టుముట్టాయి. శిబిరంలోని అనేక గుడారాలలో వర్షం కారుతోంది. ఆహారం కోసం నీటికోసం పెద్ద వరుసలు ఏర్పడ్డాయి.
గాంధీజీ శిబిరం చేరిన ఆతర్వాత, బురద తక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక చిన్నసమావేశం ఏర్పాటు జరిగింది. శిబిరంలో ఉన్న దాదాపు 9000 మందిలో ఆయన మాటలు వినడానికి సుమారు 1000-1500 మంది అక్కడకు చేరారు. చుట్టూ మురికినీరు, దుర్గంధం ఉన్న ఆ ప్రదేశంలో ప్రార్థనతో సమావేశం ప్రారంభించిన గాంధీజీ శిబిరవాసులతో సంభాషణ ప్రారంభించారు. ఈ గుంపులో నుండి ఇద్దరు సిక్కులు లేచి “ ఆగస్ట్ 15 తర్వాత ఈ ప్రాంతం పాకిస్తాన్ పాలనలోకి అంటే ముస్లిం లీగ్ పాలనలోకి వెళ్తోంది. బ్రిటిష్ పాలనలో ఈ ముస్లింలు ఎంతో మందిని చంపి, మరెంతో మందిపై అత్యాచారాలు చేసారు, వారి పాలనలో ఏం చేయబోతున్నారో కనీసం ఉహించలేకపోతున్నాము. కాబట్టి ఈ శిబిరం ప్రాంతాన్ని తాత్కలికంగానైనా తూర్పు పంజాబ్ లో చేర్చాలని” కోరారు. ఇది విన్న గాంధీజీ చిరునవ్వుతో, మృదుస్వరంతోఇలా అన్నారు ”ఆగస్ట్ 15 తర్వాత ఘర్షణలు, తలెత్తుతాయని మీరు భయపడుతున్నారు.కానీ నాకు అటువంటి భయాలు లేవు. ముస్లింలు పాకిస్తాన్ కోరుకున్నారు.వారికి అది దొరికిన తర్వాత వారు ఘర్షణలు ప్రారంభిస్తారని నేను భావించడం లేదు. అంతేకాక, శాంతి, స్నేహాలకు జిన్నాతో పాటు అనేక మంది ముస్లిం నాయకులు వాగ్దానం చేసారు. పాకిస్తాన్ లో హిందువులు, సిక్కులు సురక్షితంగా ఉండగలరని వారు నాకు భరోసా ఇచ్చారు.వారి మాటలను మనం విశ్వసించాలి.
ఈ శరణార్థి శిబిరాన్ని తూర్పు పంజాబ్ కు ఎందుకు తరలించాలో నాకు అర్థం కావడం లేదు. మీరు ఇక్కడ క్షేమంగా ఉండగలరు. ఘర్షణల భయాన్ని వదలివేయండి. నౌఖాలికి నా సందర్శన ముందుగానే నిర్ణయం కాకపోయి ఉంటే ఆగస్ట్ 15న నేను మీతోనే ఉండే వాడిని కాబట్టి మీరు ఏమీ భయపడవద్దు.( మహాత్మా సంపుటి 8; మోహన్ దాస్ కే గాంధీ జీవితం –డి.జి.టెండూల్కర్ )
గాంధీజీ ఈ శిబిరంలో ఈ విషయాలు మాట్లాడుతున్నపుడు అక్కడి సమావేశానికి హాజరైన వారి ముఖాలలో కోపం, చికాకు, నిస్సహాయత ప్రస్ఫుటంగా కనిపించాయి. అప్పటికీ ఈ శిబిరవాసుల మనస్సులో ముస్లింల పట్ల ఉన్న కోపాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయారు. డా. సుశీల నాయర్ ను ఆ శిబిరంలోనే తన ప్రతినిధిగా ఉండవలసిందిగా కోరారు.
————-
లాహోర్ లో ఒక మధ్యాహ్నం
లాహోర్ – శ్రీరామచంద్రుని కుమారుడు లవుడి పేరు మీద స్థాపించిన నగరం, పంజాబీ సంస్కృతికి కేంద్రం, షాలిమార్ ఉద్యానాల నగరం, నూర్జహాన్, జహంగీర్ ల సమాధులున్న నగరం , మహారాజా రంజిత్ సింగ్ నగరం. అనేక దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు ఉన్ననగరం. కామిని కౌశల్ నగరం. పంజాబ్ శోభ, కుతూహలాలతో శోభిల్లే నగరం లాహోర్.
నగరంలోని హిందూ, సిక్కు వ్యాపారులు ఆ రోజు నగరవ్యాప్తంగా బంద్ పిలిపునిచ్చినందున 1947 ఆగస్టు 5 నాటి మధ్యాహ్నం విచారంతో నిండి నిస్తేజంగా కనిపించింది. హిందువులు,సిక్కులపై తరుచుగా జరుగుతున్న దాడులు, ఆకృత్యాలకు నిరసనగా ఈ బంద్ పిలుపు ఇవ్వబడింది. దీనికి ముందు హిందూ, సిక్కు ప్రతినిధుల సంఘాలు తమ పరిస్థితిని వివిధ స్థాయిలలో గట్టిగా తెలియజేసాయి. దాదాపు మూడు, మూడున్నర నెలల క్రితం, అంటే ఏప్రిల్ నెలలో లాహోర్ రావాల్సిన సమీప ప్రాంతాలలో ముస్లింలు చేసిన దాడులు, వాటి ప్రభావం వీరి జ్ఞాపకాలలో ఇంకా తాజాగానే ఉన్నాయి. ఈ దాడులు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించలేదు.
ముస్లిం నేషనల్ గార్డ్స్ చేస్తున్న దాడులు పెరిగిపోతున్నాయి. వారి బెదిరింపులు,హింస రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముస్లిం నేషనల్ గార్డ్స్ కు ముస్లిం లీగ్ తో ఎటువంటి సంబంధం లేనట్లు కనిపించినప్పటికీ అదంతా ఒట్టి నాటకమే. యధార్ధానికి, ముస్లిం నేషనల్ గార్డ్స్, ముస్లిం లీగ్ పతాకాలే వాడుతున్నారు.నిజానికి ముస్ల్లిం లీగ్ అజ్ఞాత హింసాత్మక విభాగమే ముస్లిం నేషనల్ గార్డ్స్. హిందూ, సిక్కు వ్యాపారులను పాకిస్థాన్ నుండి బలవంతంగా తరిమివేయడం, వారి యువతులను అపహరించడం వీరి ముఖ్యోద్దేశ్యం.
మంగళవారం, ఆగస్టు 5న గవర్నర్ నివాసంలో ఎటువంటి బద్ధకం ఛాయలు కనిపించలేదు. గవర్నర్ ఇవాన్ జాన్ కిన్స్ తన కార్యాలయంలో ఎంతో ఒత్తిడిలో పనిచేస్తున్నారు. బ్రిటిష్ సేవకుడైన జాన్ కిన్స్ పంజాబ్ సంస్కృతిలో పూర్తిగా మమేకం అయారు. పంజాబ్ గురించి ఆయన జ్ఞానం సంపూర్ణమైనది, ఖచ్చితమైనది. అందువలననే విభజన జరగకూడదని వారు మనస్పూర్తిగా కోరుకున్నారు. లాహోర్ లో ఆరోజు జరిగే సంఘటనలపై ఆయన ప్రత్యేకమైన నిఘా ఉంచారు. వ్యాపారులు ప్రారంభించిన బంద్ ఘర్షణలకు దారితీస్తుందేమోనని ఆయనకు నిఘా సమాచారం అందింది. ఇటువంటి కల్లోల పరిస్థితిలో స్వల్ప సందర్శన కొరకు గాంధీజీ రేపు లాహోర్ వస్తున్నారు అనే వర్తమానం ఆయనకు అందింది. దీంతో ఆయన కంగారు మరింత పెరిగింది.
గోమతి నగర్, కిషన్ నగర్, రాం గలి, రాజ్ గడ్ మొదలైన హిందూ నివాస ప్రాంతాలలో వ్యాపారుల సమ్మె విజయవంతం అయింది. వీధులలో సైతం కొద్ది మందే కనిపించారు. ఈ ప్రాంతాలలో హిందువులు, సిక్కులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలు విస్తృతంగా ఉన్నాయి. వివిధ స్థలాలలో ఉన్న సంఘశాఖలకు ప్రతి సాయంత్రం కనీసం 100 నుండి 300 వరకు హిందూ, సిక్కు యువకులు హాజరవుతూ ఉంటారు. మార్చి నెలలో ఇటువంటి శాఖల సంఖ్య దాదాపు 150 మించిపోయింది. మార్చి, ఏప్రిల్ నెలలలో జరిగిన ఘర్షణల తరువాత ఈ శాఖలకు హాజరవుతున్న హిందువులు చెల్లాచెదురు కావడంతో ఈ ప్రాంతాలలో శాఖలు మూసివేశారు. గత 3 నెలలలో ఇక్కడ ఉంటున్న 3లక్షల హిందూ, సిక్కులలో ఒక లక్షకు మించి తూర్పు పంజాబ్ కు(అంటే భారతదేశానికి ) వలస వెళ్లారు.
———
కరాచి
ఘర్షణలు, దోపిడీలు, ధ్వంసాలు, అత్యాచారాలు, అశాంతుల నడుమ లాహోరేకు 600 మైళ్ళ దూరంలో ఉన్నసింద్ లో ఒక కొత్తరకమైన ఆత్రుత కనిపించింది. సాధారణంగా సందడిగా ఉండని కరాచి విమానాశ్రయానికి అసాధారణ సంఖ్యలో జనం వచ్చారు. సరిగ్గా 12:55 కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సర్ సంఘ్ చాలక్ శ్రీ గోల్వాల్కర్ గురూజీ, టాటా విమానంలో ముంబై నుండి కరాచి రానున్నారు. ఈ విమానం ముంబై జుహు విమానాశ్రయం నుండి 8:00 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. ప్రయగరాజ్ (అలహాబాద్) లో కొద్ది విరామం తర్వాత కరాచి చేరుకోనుంది. ఈ విమానంలో శ్రీ గురూజీ తో పాటు డాII అభాజి తాథే కూడా ప్రయాణిస్తున్నారు. పాకిస్తాన్ ఏర్పడుతున్న నేపథ్యంలో చెలరేగిన కల్లోల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని గురూజీ రక్షణకు సంబంధించిన విషయాలను కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ కార్యకర్తలు విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు. కరాచి సహాయ కార్యదర్శి లాల్ కృష్ణ అద్వానీ కూడా ఈ కార్యకర్తలలో ఉన్నారు. కొంత మంది గురూజీ కారు వెంబడి వెళ్లేందుకు తమ మోటార్ సైకిళ్ళతో సిద్దమయ్యారు.
కరాచి విమానాశ్రయం అంత పెద్దదేమీ కాదు. దాంతో కార్యకర్తల సమూహం పెద్దదిగా అనిపించింది. సరిగ్గా ఒంటిగంటకు గురూజీ, అభాజీ విమానం దిగారు. సమావేశమైన కార్యకర్తలలో ఎటువంటి తొక్కిసలాట జరగలేదు. అందరు కార్యకర్తలు ఆదేశానుసారం పని చేస్తున్నారు. బురఖా ధరించి వచ్చిన ముగ్గురు కార్యకర్తలు బురఖాలోని రంధ్రం ద్వారా విమానాశ్రయం పరిసరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అభాజీ తో కలసి గురూజీ విమానాశ్రయం ప్రధాన భవనం వద్దకు చేరగానే “భారతమాతా కి జై” అనే నినాదాలు మిన్నంటాయి. గురూజీతో పాటే సంఘ్ కార్యకర్తల పెద్ద బృందం కరాచి వెళ్ళింది. పూర్తి సంఘ గణవేష్ లో భారీ కవాతు నిర్వహించడానికి, ప్రధాన కూడలిలో గురూజీ పాల్గొనే బహిరంగ సభకు ప్రణాళిక వేశారు. ప్రస్తుత పాకిస్తాన్ రాజకీయ రాజధాని, ఇంకో తొమ్మిది, పది రోజులలో పాకిస్తాన్లో భాగం కానున్న కరాచిలో గురూజీ రాక సందర్భంగా కవాతు, బహిరంగసభ నిర్వహించడం అంత సులభం కాదు. ముస్లిలకు ఒక గట్టి సందేశం ఇవ్వడానికి, హిందువుల, సిక్కుల మనసులో నమ్మకం పెంపొందించడానికి సంఘం అటువంటి నిర్ణయం తీసుకుంది. సాయంత్రం కవాతు ప్రారంభమయ్యింది. కవాతు రక్షణకై ప్రత్యేక ఏర్పాటు చేసారు. 10,000 మంది కార్యకర్తలతో జరిగిన ఆ శక్తివంతమైన కవాతుపై ఏ ముస్లిం దాడి చేయడానికి సాహసించలేదు.
భారతదేశ తూర్పు, పశ్చిమ సరిహద్దులలో హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న ఘర్షణలకు చాలా దూరంగా, శరణార్థి శిబిరాలలోని కోపం, విచారం, నిరాశలకు చాలా దూరంగా, ఢిల్లీ 17, యార్క్ వీధిలోని భారత ప్రథమ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ నివాసంలో మంత్రులు, ప్రభుత్వ విధుల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 5 వ తేదీ సాయంత్రం తనకు వచ్చిన ఉత్తరాలకు నెహ్రూ జవాబులు ఇస్తున్నారు.
ఆగస్ట్ 1 నాడు మౌంట్ బాటన్ వ్రాసిన ఉత్తరం నెహ్రూ ముందు ఉంది. ప్రస్తుత ఆడిటర్ జనరల్ బర్టీ స్టాగ్ స్వతంత్ర భారతదేశంలో తన ప్రస్తుత పదవిలో కొనసాగావచ్చా?లేదా?ఆయన పదవీ కాలం పొడిగిస్తారా? అని తెలుసుకోవాలనుకున్నారు. అయితే బర్టీ స్టాగ్ కు ఇక్కడే పని చేసే ఆసక్తి ఉందని, మౌంట్ బాటన్ ఆ ఉత్తరంలో తెలియజేశాడు.
ఈ ఉత్తరాన్ని ముందుంచుకుని నెహ్రూ తన సచివునికి సమాధానం వ్రాయమని ఈ విధంగా చెప్పారు. సర్ బర్టీ స్టాగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు సలహాదారు, అంతే కాక భారతదేశ ఆడిటర్ జనరల్ గా కూడా ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో తమ సేవలను కొనసాగించుకోవలనుకునే ఆంగ్ల అధికారుల పదవీ కాలాన్ని పొడిగించే విషయం గురించి మేము ఆలోచిస్తున్నామని మీకు తెలుసు. కాని సమర్థులైన భారతీయులు ఉన్నపుడు ఆయా స్థానాలలో వారినే నియమిస్తాము. అయితే కొంతకాలం వరకు అధికారులు వారిప్పుడు ఉన్న స్థానంలోనే కొనసాగించేందుకు అనుమతించే నియమం అమలులో ఉంది. ఆడిటర్ జనరల్ గా బర్టీ స్టాగ్ కొనసాగడంపై నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
నెహ్రూ ముందు మౌంట్ బాటన్ రాసిన 14 జూలై నాటి మరో లేఖ ఉంది. ఇందులో మౌంట్ బాటన్ రేండు విషయాలు ప్రస్తావించాడు. అందులో ఒకటి – తన సిబ్బంది భవిష్యత్తు గురించి కాగా రెండవది – ప్రభుత్వం కోరినట్లయితే ప్రస్తుతం తన విశాలమైన వైస్రాయి నివాసాన్ని వదలి వేరే ఇంకొక చిన్న భవనానికి మారగలనని తెలిపారు. ఈ లేఖకు సమాధానం ఇచ్చేముందు నెహ్రూ కొంతసేపు ఆలోచనలో మునిగి పోయి, నెమ్మదిగా తన సచివునికి సమాధానం చెప్పసాగాడు.
ప్రియమైన మౌంట్ బాటన్,...
14 జూలై నాటి మీ లేఖలో మీ సిబ్బంది గురించి, మీ భవిష్య నివాసం గురించి రెండు అంశాలు ప్రస్తావించారు. వీటిలో మీ సిబ్బంది గురించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ అవసరం మేరకు సిబ్బందిని ఉంచుకుంటే, స్వతంత్ర భారతదేశం తరపున వారు మీ సేవలో కొనసాగుతారు. మీ స్థాయినిబట్టి చూస్తే ఒక చిన్నభవనం గురించిన మీ ఆలోచన ప్రశంసనీయం. అయితే, ప్రస్తుత పరిస్థితులలో మీ గౌరవానికి తగిన భవంతిని వెదకడం కష్టం. ఏదేమైనా ప్రస్తుత భారత ప్రభుత్వానికి వైస్రాయి నివాసం అవసరం లేదు కనుక మీ దంపతులు ఇరువురు ప్రస్తుతానికి వైస్రాయి నివాసంలోనే కొనసాగాలని మా కోరిక .
———
కరాచిలోని ప్రముఖ కూడలిలో సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వేదిక పైన మూడు కుర్చీలతో ఒక వేదిక ఏర్పాటు జరిగింది. కుర్చీలకు ముందు గ్లాసులు, కూజాలతో నీరు ఉంచారు. వేదికపై ఒక మైకు సెట్ మాత్రం ఉంది. వేదిక ముందు కార్యకర్తలు తమ తమ స్థానాలలో కూర్చున్నారు. వేదికకు ఇరువైపులా సాధారణ ప్రజానీకం కూర్చునేందుకు ఏర్పాటు చేసారు. వేదిక కుడి వైపున నాటి సమావేశ కార్యదర్శి సాధు టి.ఎల్ వాస్వానిజీ ఆసీనులయ్యారు. సాధు వాస్వానిజీ సింధీ ప్రజల గురువు. సింద్ ప్రజలలో ఆయన పట్ల అపార గౌరవం ఉంది. ఎడమవైపున సింద్ ప్రాంతం అధినేత అసీనులయ్యారు. గురూజీ ఉపన్యాసం వినడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా సాధు వాస్వానిజీని తొలి పలుకులతో పరిచయం చేసారు. సింధీ హిందువులకు మద్దతుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక భారీ పర్వతంలా నిలుచున్న ఈ క్షణం, ఈ ప్రదర్శన చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తాయని అన్నారాయన.
ఆ తర్వాత గురూజీ గోల్వాల్కర్ ప్రధాన ప్రసంగం ప్రారంభం అయ్యింది. నెమ్మదిగా అయినప్పటికీ, ధృడమైన స్వరంతోను, స్పష్టమైన ఉచ్చారణతోను సింద్ ప్రజల సంక్షేమం కొరకు వారి హృదయాలలో ఆత్రుతతో కూడిన ప్రేమతోను గురూజీ ప్రసంగించారు –
`మన మాతృభూమికి భారీ విపత్తు వచ్చింది. బ్రిటిష్ వారి విభజించి పాలించే నీతికి తార్కాణమే దేశ విభజన. ముస్లిం లీగ్ హింసతో, దౌర్జన్యంతో పాకిస్తాన్ తీసుకున్నారు. ముస్లిం లీగ్ ముందు కాంగ్రెస్ సాగిలపడటం మన దురదృష్టం. ముస్లిములతోపాటు వారి నాయకులు కూడా తప్పుదారిలో వెళ్లారు. వారు ఇస్లాంను అనుసరిస్తారు కనుక వారికి కొత్త దేశం కావాలని అన్నారు. కానీ నిశితంగా పరిశీలిస్తే వారి ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ప్రాథమికంగా భారతీయమైనవే. అవి అరేబియావి కావు. సింధు నది లేనివిధంగా మన మాతృభూమిని విడగొడుతుండడం ఊహించడం సైతం కష్టం. ఇది ఏడవ సింధు ప్రాంతం. ఈ ప్రాంతం రాజా దాహిర్ తెలివైన పాలనలో ఉండేది. పవిత్రమైన హింగలాజ్ దేవి గుడి ఉన్న ప్రాంతాన్ని మనం త్యాగం చేస్తున్నాము. ఈ దురదృష్టకరమైన సమయంలో హిందువులు అందరూ స్నేహంగా ఉంటూ పరస్పరం సహకరించుకోవాలి. కష్టకాలం ముగిసిపోయింది అని నేను నమ్ముతున్నాను’ చరిత్రాత్మకమైన గురూజీ ఉపన్యాసం విన్న శ్రోతలు ఉద్వేగానికి లోనయ్యారు, పులకరించిపోయారు. హిందువులలో కొత్త ఉత్సాహం నిండింది. ఈ సమావేశం అనంతరం కరాచిలోని ప్రముఖులు గురూజీని కలిసేందుకై తేనీటి విందు ఏర్పాటు చేయబడింది. తన ప్రయాణాలలో వారిని అందరిని కలిసే అలవాటు ఉండటంతో ప్రముఖులలో చాలా మందితో వారికి పూర్వపరిచయం ఉంది. రంగనాథ గరిద్, డా. ఛేత్ రాం, ప్రొఫెసర్ ఘన శ్యాం, ప్రొఫెసర్ మాల్ఖానీ, లాల్జీ మల్హోత్రా, నిశ్చల్ దాస్ వజ్రాని, డా.హేమంత్ దాస్ భగ్వాని, ముఖ గోవిందం, ఇంకా ఎందరో ఇతరులవంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు.
ఈ తేనీటి సమావేశంలో గౌరవనీయులు, కరాచీ నుండి వెలువడే దినపత్రిక `సింధ్ అబ్జర్వర్’ సంపాదకుడు కె. పున్నయ్య పాల్గొని గురుజీని ఇలా అడిగారు “విభజనను సంతోషంగా అంగీకరించడానికి మనకు కష్టం ఎందుకు? మన ఒక కాలు పనిచేయకపోతే దానిని తొలగించడం వలన ఏమి హాని కలుగుతుంది? కనీసం వ్యక్తి సజీవంగా ఉంటాడు కదా!’’. గురుజీ వారికి తాత్కాలికమైన సమాధానం ఇచ్చారు “ఔను, నిజమే మీరన్నది కూడా సరియే…ముక్కు కోసివేసినా మనిషే బ్రతికే ఉంటాడు కదా!’’. ఆ ప్రాంత హిందూ సోదరులు తమ బాధలను, కష్టాలను గురుజీకి చెక్కుకోవాలనుకున్నారు. వారు ఎంతో విచారంగా ఉన్నారు. తమ దుస్థితి వారిని ఎంతో విచారానికి గురిచేసింది. గురుజీతో వారు ఎన్నో విషయాలు చేర్చించాలనుకున్నారు. కానీ సమయం లేకపోయింది. ఎంతో పని చేయవలసి ఉన్నది. ఆ ప్రాంతంలోని ప్రచారకులు,కార్యదర్శులతో కూడా సమావేశం, కావలసి ఉంది.గురూజీ దృష్టి సారించవలసిన మరెన్నో విషయాలు ఉన్నాయి.
5 ఆగస్ట్,రాత్రి సమయంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంతంగా నిద్రలో ఉంది. అదే సమయంలో పంజాబ్,బలూచిస్తాన్,బెంగాల్ లో మరోవిడత అల్లర్లు చెలరేగాయి. ఇక ఇక్కడ కరాచిలో ఉన్న తపస్వి విభజన మూలంగా ఏర్పడిన దుస్థితిని చూస్తూ, హిందువుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు.
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}