దేశ విభజన |
— ప్రశాంత్ పోల్
ముంబై.. జూహు విమానాశ్రయం..
టాటా ఎయిర్ సర్వీసెస్ కౌంటర్ దగ్గర ఎనిమిది, తొమ్మిదిమంది మహిళలు నిలబడి ఉన్నారు. వాళ్ళంతా పద్దతిగా క్యూలో నిలుచుని ఉన్నారు. అందరిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వాళ్ళంతా రాష్ట్ర సేవికా సమితి సేవికలు. వాళ్ళ ప్రముఖ సంచాలిక లక్ష్మీబాయి కేల్కర్ (మౌసీజీ) కరాచీ వెళుతున్నారు. కరాచీలో, హైదరబాద్ (సింధ్)లో అరాచక పరిస్థితుల గురించి ఒక సేవిక ఆవిడకు ఉత్తరం వ్రాసింది. ఆ సేవిక పేరు జెఠి దేవాని. దేవానిది సింధ్ లో నివసించే ఒక సాధారణ సంఘ కుటుంబం.
జెఠి దేవాని ఉత్తరం చదివిన తరువాత మౌసీజీకి చాలా ఆందోళన కలిగింది. వెంటనే సింధ్ ప్రాంతంలోని సేవికల సహాయం కోసం అక్కడకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. రాష్ట్ర సేవికా సమితి ఏర్పడి అప్పటికి 11 సంవత్సరాలే అయింది. కానీ సమితి కార్యం వేగంగా విస్తరిస్తోంది. పంజాబ్, సింధ్, బెంగాల్ వంటి సరిహద్దు ప్రాంతాలలో కూడా రాష్ట్ర సేవికా సమితి పేరు వినిపిస్తోంది. పని సాగుతోంది. రేపు జిన్నా పాకిస్తాన్ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అక్కడ స్వతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. అయినా అక్కడకు వెళ్ళాలి. అందుకనే మౌసీజీ మరొక సహచరురాలు వేణుతాయి కల్మ్ కర్ ను వెంట తీసుకుని కరాచీకి వెళ్ళడం కోసం విమానాశ్రయానికి వచ్చారు.
40, 50మంది ప్రయాణించే ఆ చిన్న విమానంలో తొమ్మిది గజాల మహారాష్ట్ర చీర కట్టుకున్న మహిళలు వీరిద్దరే. యాత్రికుల్లో హిందువులు ఎక్కువగా లేరు. కాంగ్రెస్ లో సామ్యవాద సిద్ధాంతానికి ప్రతినిధిగా నిలచిన జయప్రకాష్ నారాయణ్ ఆ విమానంలోనే ఉన్నారు. అలాగే పునాకు చెందిన దేవ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన్ని మౌసీజీ గుర్తుపట్టారు. కానీ వాళ్ళిద్దరూ కూడా అహ్మదాబాద్ లో దిగిపోయారు. అక్కడ మరికొంతమంది ముస్లింలు ఎక్కారు. ఇలా ఎక్కువమంది ముస్లింలు ఉన్న ఆ విమానంలో ఇద్దరే మహిళలు…!
విమానంలో కొందరు ముస్లిం యాత్రికులు `పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు ఇచ్చారు. మరికొంతమంది మరింత ముందుకు వెళ్ళి `లడ్ కే లియే పాకిస్థాన్, హస్ కే లెంగే హిందూస్థాన్’(పోరాడి పాకిస్థాన్ సాదించుకున్నాం, నవ్వుతూ హిందూస్థాన్ కూడా తీసుకుంటాం) అంటూ నినాదాలు చేశారు. కానీ మౌసీజీ ఏమాత్రం తొణకలేదు. ఆమె ఆత్మవిశ్వాసం తగ్గలేదు. ఆమె మౌనంగా ఉన్నా గాంభీర్యం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన పాకిస్థాన్ సానుభూతిపరులు క్రమంగా చల్లబడ్డారు.
ముల్తాన్ – లాహోర్ రైలు మార్గం. నార్త్ – వెస్టర్న్ స్టేట్ రైల్వే .
లాహోర్ కంటే ముందు స్టేషన్ రియాజాబాద్. ఉదయం 11 గం.లు అవుతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. వర్ష సూచన ఏమి లేదు. స్టేషన్లో వంద, రెండువందలమంది ముస్లింలు చేతుల్లో కత్తులు, ఇతర ఆయుధాలు పట్టుకుని నిలబడి ఉన్నారు.
అమృత్ సర్ , అంబాల వైపు వెళ్ళే ఈ రైలు మెల్లగా స్టేషన్ లోకి ప్రవేశించింది. ప్లాట్ ఫామ్ మీద ఆయుధాలు పట్టుకున్న ఈ ముస్లిం మూకలు తప్ప ఇతరులు ఎవరు కనిపించడం లేదు. స్టేషన్ మాస్టర్ భయంతో తన క్యాబిన్ లో తలుపు వేసుకుని దాక్కున్నాడు. అతని సహాయకుడు మోర్స్ కోడ్ ద్వారా తమ ప్రధాన కార్యాలయానికి సమాచారం పంపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ భయంతో అతని చేతులు కూడా వణుకుతున్నాయి. దానితో అతను పంపదలుచుకున్న టెలిగ్రఫీ సందేశాన్ని పంపలేకపోతున్నాడు.
రైలు ప్లాట్ ఫామ్ పైకి వచ్చే వరకు భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది. రైలు మెల్ల మెల్లగా స్టేషన్ లోకి వస్తోంది. రైలు కూతతోపాటు `దీన్ దీన్, అల్లా హొ అక్బర్’ అంటూ దిక్కులు పిక్కటిల్లే నినాదాలు కూడా వినిపించాయి..చంపు, నరుకు..అంటూ కేకలు..ముల్తాన్, పశ్చిమ పంజాబ్ లోని గ్రామాల నుంచి అన్నీ కోల్పోయి భారత్ లో తలదాచుకునేందుకు వస్తున్న హిందువులు, సిక్కు శరణార్ధులు ఈ కేకలతో భయకంపితులయ్యారు. వారి భయాన్ని నిజం చేస్తూ ముస్లిం మూకలు ఒక్కసారిగా రైలు పెట్టెలలోకి దూరి కనిపించిన వారిని కనిపించినట్లుగా తమ కరకు కత్తులకు ఎర చేశాయి.
తన గదికి ఉన్న కిటికీ గుండా ఈ మారణకాందను స్టేషన్ మాస్టర్ చూస్తూనే ఉన్నాడు. కానీ ఏమి చేయలేదు. ముస్లిం మూకలు మొదటి దాడిలోనే 21 మంది హిందువులు, సిక్కులను చంపేశారు. భయంతో కేకలు పెడుతున్న ఆడవాళ్ళను, పిల్లలను ముస్లిం గూండాలు భుజాలపైకి ఎత్తుకుని విజయోత్సాహంతో పరుగులు పెట్టారు. ఇంకా ఎంతమంది హిందువులు, సిక్కులను చంపేశారో తెలియదు. ఇక్కడ జరిగిన నరసంహారం గురించి పై అధికారులకు టెలిగ్రాఫ్ ద్వారా తెలియజేయమని తన సహాయకుడిని ఆదేశించాడు స్టేషన్ మాస్టర్. పంజాబ్ అంతటా సెన్సార్ షిప్ అమలులో ఉండడం వల్ల ఇలాంటి ఘోర సంఘటనలు ఇంకెన్ని బయటకు రాకుండా దాచిపెట్టరో…!
కరాచీ..
రేపు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందడానికి ముందు భారత్, పాకిస్థాన్, బ్రిటిష్ అధికారుల మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది.
భారత, పాకిస్థాన్ ల మధ్య అధికార విభజన సులభంగా జరపడం కోసం ఈ సమావేశం ఏర్పాటుచేశారు. వాణిజ్యం, సమాచార ప్రసార, మౌలిక సదుపాయాల కల్పన, రైల్వేలు, కస్టమ్ మొదలైన శాఖల గురించి కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం సంయుక్త భారత్ (విభజనకు ముందు ఉన్నది) లో ఈ శాఖలకు సంబంధించి ఏ విధానాలు, పద్దతులు అవలంబిస్తున్నారో వాటినే మార్చ్ , 1948వరకు యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించారు. మార్చ్ తరువాత రెండు దేశాలు తమ తమ విధానాలు, పద్దతులను రూపొందించుకుని అమలు చేసుకుంటాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ వ్యవస్థ కూడా మార్చ్ వరకు రెండు దేశాలకు ఒకటే ఉంటుంది. అప్పటి వరకు రెండు దేశాల పౌరులు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించవచ్చును.
––––
ఢిల్లీ..
నెహ్రూ ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు ఏమిటంటే దేశం వదిలి పోతున్న బ్రిటిష్ అధికారుల స్థానంలో యోగ్యులైన భారతీయ అధికారులను ఎంపిక చేసి, నియమించడం. అఖండ భారత్ లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన విలియం పాట్రిక్ స్పెంజ్ పదవి విరమణ చేస్తారు. ఆ స్థానంలో ఎవరిని నియమించాలి?… కొన్ని పేర్లు వచ్చాయి. అయితే వాటిలో నుంచి గుజరాత్ కు చెందిన హరిలాల్ జయకిషన్ చంద్ కానియాను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించారు.
సూరత్ కు చెందిన కానియా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారు. 1930లో ఆయన ముంబై హై కోర్ట్ లో న్యాయమూర్తిగా ఉన్నారు. 57 ఏళ్ల కానియా ప్రస్తుతం హై కోర్ట్ లో ఉప న్యాయమూర్తిగా ఉంటున్నారు. ప్రస్తుతపు న్యాయమూర్తిగా ఉన్న పాట్రిక్ స్పెంజ్ భారత పాకిస్థాన్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యూనల్ కు ఛైర్మన్ గా కానియానే నియమించారు.
–––––
ప్యారిస్…
ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా పోరాటం చేస్తున్న అనేకమంది భారతీయ సైనికులు జర్మనీ లోని బ్రిటిష్ , ఫ్రెంచ్ ప్రాంతాల్లో సమావేశమయ్యారు. ఈ సైనికులు ఇప్పుడు ఎలాంటి వీసా లేకుండా ఎక్కడికైనా వెళ్లవచ్చును. ప్యారిస్ లోని భారతీయ సైనిక కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సైనికుల్లో హరవంశ లాల్ కూడా ఉన్నారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ లో లెఫ్టినెంట్ గా ఉన్నారు. మిగిలిన సైనికులతోపాటు ఆయన కూడా భారత్ వస్తారు.
–––––
151, బెలియాటాక్, కలకత్తా…
హైదరి భవనం….మధ్యాహ్నం 3 గం.లు..
సోధెపూర్ ఆశ్రమం నుంచి గాంధీజీ కారులో హైదరి మహల్ కు చేరుకున్నారు. ఆయనతోపాటు మను, మహదేవ్ భాయ్, మరో ఇద్దరు కార్యకర్తలు కూడా ఉన్నారు. వారి వెనుక వస్తున్న మరో కారులో ఇంకో నలుగురు కార్యకర్తలు ఉన్నారు. ఈ మధ్యనే వర్షాలు బాగా కురిసాయి. దారి అంతా బురదగా ఉంది. హైదరి మహల్ ఎదురుగా అనేకమంది గుమికూడారు. వారిలో ఎక్కువమంది హిందువులే.
గాంధీజీ కారు వచ్చి ఆగిన వెంటనే ఆయన పేరుతో పెద్ద పెట్టున నినాదాలు మొదలయ్యాయి. అయితే అవి ఆయన స్వాగతం చెపుతూ మాత్రం కాదు. తిట్లు, శాపనార్ధాలతో ఆ నినాదాలు ఉన్నాయి. ఇలాంటి నినాదాలు విన్న వెంటనే గాంధీజీ కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. `గాంధీజీ వెళ్లిపొండి, నౌఖాలి వెళ్ళి హిందువులను రక్షించండి, మొదట హిందువులకు రక్షణ – ఆ తరువాతే ముస్లింలకు స్థానం, హిందూ ద్రోహి గాంధీ, వెళ్లిపో, వెళ్లిపో’ అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. ఈ నినాదాలతోపాటు రాళ్ళు, సీసాల వర్షం కూడా ప్రారంభమయింది. మెల్లగా నడుస్తూ వెలుతున్న గాంధీజీ శాంతంగా ఉండమని చేతితో సంజ్ఞ చేశారు. ప్రజలు కాస్త తగ్గారు. తక్కువ స్వరంలో గాంధీజీ ఇలా అన్నారు – “నేను ఇక్కడకు హిందువులు, ముస్లిములకు సమానంగా సేవచేయడానికి వచ్చాను. మీకు రక్షణగా నేను ఇక్కడే ఉంటాను. మీకు కావాలంటే నాపై నేరుగా దాడి చేయవచ్చును. నేను మీతోనే ఉంటాను. ఇక్కడ ఉంది నౌఖాలి హిందువుల ప్రాణాలను కూడా రక్షిస్తున్నాను. ముస్లిం నాయకులు నాకు మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా కలకత్తా ముస్లింలకు ఎలాంటి హాని తలపెట్టకండి.’’ ఇలా చెప్పి గాంధీజీ నెమ్మదిగా హైదరాలీ మహల్ లోకి వెళ్ళిపోయారు …..!
కానీ ప్రజలలో సహనం కొద్దిసేపే ఉంది. సుహ్రవర్దీ అక్కడికి రావడంతోటే అక్కడ గుమికూడిన జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయిదువేలమంది హిందువుల హత్యకు కారణమైన సుహ్రవర్దీ ఎదురుగా కనబడితే ఏ హిందువైన ఎలా శాంతంగా ఉండగలుగుతాడు? దానితో జనం హైదరి మహల్ చుట్టూ చేరారు. వారిలో కొద్దిమంది యువకులు రాళ్ళు విసిరారు. భారత్ లో గాంధీజీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు, తిట్లు, చీవాట్లు ఇంతకు ముందు ఎప్పుడూ ఎదురుకాలేదు….!
–––––
ఉదయం 10.30 గం.లకు జూహు విమానాశ్రయం నుంచి బయలుదేరిన మౌసీజీ విమానం అహ్మదాబాద్ లో కొద్ది సేపు ఆగిన తరువాత నాలుగున్నర గంటలు ప్రయాణించి 3.గం.లకు కరాచీ విమానాశ్రయంలో దిగింది. మౌసీజీ అల్లుడు చోల్కర్ విమానాశ్రయానికి వచ్చారు. మౌసీజీ కుమార్తె వాత్సల భర్త చొల్కర్. వత్సలకు చదువుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. అది గమనించిన మౌసీజీ టీచర్ ను ఇంటికే పిలిపించి చదువు చెప్పించారు. వత్సల కూడా రాష్ట్ర సేవికా సమితి కార్యంలో నిమగ్నమయింది. కరాచీలో సమితి శాఖ పెట్టడంలో ఆమె చాలా కృషి చేసింది. విమానాశ్రయానికి 15, 20 మంది సేవికలు కూడా వచ్చారు. రక్షణ దృష్ట్యా కొద్దిమంది స్వయంసేవకులు కూడా ఉన్నారు. ఒక సేవికకు చెందిన కారులో మౌసీజీ బయలుదేరారు. ఆమె వెనుకనే వీరంతా వెళుతున్నారు…
–––––
రాష్ట్ర సేవిక సమితి సంచాలిక మౌసీజీ కరాచీ విమానాశ్రయానికి చేరిన సమయంలోనే గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ విమానం కూడా కరాచీలో దిగింది. మౌంట్ బాటన్, ఆయన భార్య ఎడ్విన మౌంట్ బాటన్లు విమానం నుంచి దిగారు. వారికి స్వాగతం చెప్పడానికి కొత్తగా ఏర్పడనున్న పాకిస్థాన్ కు చెందిన ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ జిన్నా మాత్రం లేరు. జిన్నా, ఆయన సోదరి ఫాతిమా అధికార నివాస భవనంలో తమ కోసం ఎదురుచూస్తున్నారని అధికారులు మౌంట్ బాటన్ దంపతులకు తెలియజేశారు. కరాచీలో ఉన్న సింధ్ గవర్నర్ బంగాళాయే ప్రస్తుతం జిన్నా అధికారిక నివాసం. విక్టోరియా రాజా పద్దతిలో నిర్మించిన ఈ భవంతిని ఈ రోజు ప్రత్యేకంగా అలంకరించారు. బంగాళా మొత్తం హాలీవుడ్ సెట్టింగ్ మాదిరిగా కనిపిస్తోంది. అలాంటి అట్టహాసం మధ్య జిన్నా, అతని సోదరి ఫాతిమా మౌంట్ బాటన్ దంపతులకు ఘనస్వాగతం పలికారు…!
–––––
లాహోర్,
మధ్యాహ్నం…4 గం.లు…
ముజాహిద్ తాజ్దీన్ మందిర్ మార్గ్ లో రొట్టెలు అమ్ముకునే ఒక సాధారణ వ్యాపారి. ఈ రోజు అతని మనస్సు అల్లకల్లోలంగా ఉంది. అతని స్నేహితులంతా ముస్లిం నేషనల్ గర్డ్స్ కార్యకర్తలే. వారితోపాటు అక్కడ పనిచేసే ముస్లిం కానిస్టేబుళ్ల ద్వారా అతనికి ఒక సమాచారం తెలిసింది. మందిర్ మార్గ్ లోని పెద్ద గురుద్వారాను ఈ రోజు పూర్తిగా ధ్వంసం చేయబోతున్నారని. పైగా అది కూడా పుణ్యకార్యమేనని వాళ్ళు అతనికి చెప్పారు కూడా. తాజ్దిన్ కు రొట్టెల అమ్మకం తప్ప ఏమి తెలియదు. కానీ తాను విన్న విషయం అతనిపై ప్రభావం చూపింది. మధ్యాహ్నానికే దుకాణం మూసేసి గురుద్వారాపై దాడికి ఇతరులతోపాటు సిద్ధమయ్యాడు.
లాహోర్ లోని మందిర్ మార్గ్ లో ఉన్న గురుద్వారా సిక్కులకు చాలా విశేషమైనది. మహారాజా రంజిత్ సింగ్ ఈ గురుద్వారాను కట్టించారు. 1619లో గురు హరగోవింద్ సింగ్ జీ, దివాన్ చందు తో పాటు లాహోర్ వచ్చారు. అప్పుడు ఆయన ఎక్కడ నివసించారో ఆ స్థానంలోనే ఈ గురుద్వారా నిర్మించారు.
గురుద్వారాలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా అర్దాస్, లంగర్ జరుగుతాయి. గురుద్వారా రక్షణ కోసం నిహంగ్ సంత్ లు కత్తులతో పహారా కాస్తుంటారు. కానీ వాళ్ళు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. చాలా మంది సిక్కులు వ్యాపారులే. ఉదయం పూట వ్యాపారం జోరుగా సాగుతుంది. అందుకని దాదాపు అందరూ రాత్రిపూటే గురుద్వారాకు వస్తారు. ఇప్పుడు అక్కడ చాలా తక్కువమంది ఉన్నారు. సరిగ్గా 4. గం.లకు ముస్లిం నేషన గార్డ్స్ ఈ గురుద్వారపై దాడి చేశారు. తాజ్దిన్ అందరికంటే ముందున్నాడు. అందరికంటే ముందు పెట్రోల్ బాంబు అతనే విసిరాడు. అన్నీ రకాల ఆయుధాలతో హఠాత్తుగా విరిచుకుపడిన 40, 50 మంది ముస్లిం గూండాల ముందు నలుగురు నిహంగ్ సంత్ లు ఎంతసేపు నిలవగలుగుతారు…? అయినా అసామాన్యమైన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ వాళ్ళు ముగ్గురు, నలుగురు ముస్లింలను నరికారు. ఎనిమిదిమందిని గాయపరచారు. కానీ ఆ నలుగురు నిహంగ్ సంత్ లు రక్తపు మడుగులో ఒరిగిపోయారు. మహారాజ రంజిత్ సింగ్ ద్వారా నిర్మితమైన ఈ పవిత్ర గురుద్వారా నిర్దోషులైన సిక్కుల రక్తంతో తడిసిపోయింది.
–––––
పెషావర్..
`నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్’(NWFP) రాజధాని. పెషావర్ కోటలోని తన విశాలమైన నివాసంలో 70ఏళ్ల ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నారు… చుట్టూ ఎవరు లేరు.. ఆయన మాత్రం విచారంగా ఉన్నారు.. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ది పేరులాగానే చాలా భారీ వ్యక్తిత్వం. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ కు చెందిన ముఖ్యమైన నాయకుడు. ఆయన గాంధీగారి పరమ భక్తుడు. అందుకనే ఆయనకు `సరిహద్దు గాంధీ’ అనే పేరు కూడా వచ్చింది. కానీ పఠాన్ లలో ఆయన `బాద్షా ఖాన్’ అనే తెలుసు. ఈ కొండ ప్రాంతంలోని గిరిజన తెగలకు చెందిన వారందరినీ కాంగ్రెస్ జెండా కిందకు తీసుకు వచ్చింది గఫార్ ఖాన్ గారే.
అందుకనే 1945 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్నప్పటికి కాంగ్రెస్ గెలుపొందింది. ముస్లిం లీగ్ కు పెద్దగా సీట్లు రాలేదు. ఇక ఇప్పుడు విభజన తప్పదని స్పష్టమైపోయిన తరుణంలో ఎటువైపు వెళ్ళాలి అనేది పఠాన్ ల ముందున్న ప్రశ్న. పఠాన్ లు, పాకిస్థాన్ పంజాబ్ ల మధ్య వైరం ఈనాటిది కాదు. అందువల్ల ఈ ప్రాంతానికి చెందిన పఠాన్ లంతా భారత్ లో కలవాలని భావించారు. ప్రాంతీయ అసెంబ్లీలో కూడా అందరూ దీనికే సమ్మతి తెలిపారు. ఒక్క భౌగోళికమైన దూరం ఒక్కటే సమస్య. అయితే మరి తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ ల మధ్య కూడా వందల మైళ్ళ దూరం ఉందికదా అనే ప్రశ్న వచ్చింది. కాశ్మీర్ భారత్ లో విలీనం అయిపోతే ఈ భౌగోళిక సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. ఎందుకంటే గిల్గిట్ దక్షిణ ప్రాంతం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ సరిహద్దునే ఉంది.
కానీ వాళ్ళ మొత్తం ప్రణాళికకు నెహ్రూ మోకాలు అడ్డుపెట్టారు. `అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయించాలి’అన్నది నెహ్రూ వాదన. కాంగ్రెస్ సమావేశంలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణను సర్దార్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఏ దేశంలో విలీనం కావాలో ప్రాంతీయ అసెంబ్లీ నిర్ణయిస్తుందని పటేల్ అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరించాము కాబట్టి ఇక్కడ కూడా అలాగే చేయాలని ఆయన అన్నారు. ఎక్కడెక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు పాకిస్థాన్ లో విలీనం అవుతున్నట్లుగానే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ రాజ్యం భారత్ లో విలీనం కావాలి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పాలనలో ఉంది. కానీ నెహ్రూ తన పట్టు వదలలేదు. `నేను ప్రజాస్వామ్యవాదిని’ అంటూ నెహ్రూ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనని వాదించారు.
బాద్షా ఖాన్ కు తమ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని నిర్ణయించినట్లు పత్రికల ద్వారా తెలిసింది. ఏ వ్యక్తి ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ను గెలిపించాడో, ఆ ప్రాంతాన్ని గురించి నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఆ వ్యక్తిని సంప్రదించాలన్న ఆలోచన కూడా నెహ్రూకు కలగలేదు. అందుకనే ప్రజాభిప్రాయ సేకరణ వార్త విన్నవెంటనే విచారంలో మునిగిపోయిన గఫార్ ఖాన్ ` కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి ముస్లిం లీగ్ కు అప్పగిస్తోంది’ అని బాధపడ్డారు…!
ఈ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ 20 జులై, 1947 న ప్రారంభమయింది. పది రోజులపాటు సాగింది. ఈ ప్రక్రియకు ముందు, తరువాత కూడా ముస్లిం లీగ్ మతపరమైన భావనలను బాగా రెచ్చగొట్టింది. దానితో కాంగ్రెస్ పూర్తిగా పక్కకు తప్పుకుంది. `నెహ్రూ తప్పిదానికి ఇక్కడి ప్రజలు ఎలాంటి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో’ అంటూ గఫార్ ఖాన్ విచారించారు.
ఈ ప్రజాభిప్రాయ సేకరణ వట్టి మోసమే. ఏ గిరిజన ప్రాంతాలపై గఫార్ ఖాన్ ప్రభావం బాగా ఉందో ఆ ప్రాంతాల ప్రజలకు ఓటింగ్ లో పాల్గొనే అవకాశమే ఇవ్వలేదు. మొత్తం 35 లక్షల జనాభాలో కేవలం ఐదు లక్షల 72వేల మందికి మాత్రమే ఓటింగ్ హక్కు ఉన్నదని తేల్చారు. సవత్, అంబా, చిత్రాలయిన్ తాలూకాల్లో ఓటింగే జరగలేదు. ఎంతమందికి ఓటు హక్కు ఉన్నదో వారిలో కూడా కేవలం 51శాతం మాత్రమే ఓటు వేశారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో విలీనం చేయాలని కోరుకునేవారికోసం పచ్చ డబ్బా, భారత్ లో కలవాలనేవారి కోసం ఎర్ర డబ్బా పెట్టారు. పచ్చ డబ్బాలో 2 లక్షల 89 వేల వోట్లు, ఎర్ర డబ్బాలో 2 లక్షల 87 వేల ఓట్లు పడ్డాయి. అంటే 36 లక్షల ప్రజల్లో కేవలం మూడు లక్షల మంది మాత్రమే పాకిస్థాన్ కు ఓటు వేశారు. `నెహ్రూ, గాంధీజీ మమ్మల్ని అనాధాలుగా వదిలేశారు. అదికూడా ఈ పాకిస్థానీ తోడేళ్ళ ముందు…’అంటూ గఫూర్ ఖాన్ మనస్సులో తీవ్రమైన అసంతృప్తి ఆగ్రహం పెల్లుబికాయి…పెషావర్, కోహట్, బాను, స్వాత్ ప్రాంత ప్రజలు మనం భారత్ లో కాలుస్తున్నామా అంటూ ప్రశ్నించినప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో సరిహద్దు గాంధీకి అర్ధం కాలేదు.
–––––
కరాచీ..
జిన్నా ఇల్లు…రాత్రి తొమ్మిదయింది..
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం ముందు రోజు సాయంత్రం జిన్నా ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మౌంట్ బాటన్ దంపతులతోపాటు కొన్ని దేశాల రాయబారులు కూడా ఆ విందుకు హాజరయ్యారు. ఖరీదైన మధ్యం ఎరులై పారింది. కానీ ఆ విందు ఏర్పాటు చేసిన జిన్నా మాత్రం అన్య మనస్కంగా ఉన్నారు. విందు ప్రారంభం కావడానికి అతిధి ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. జిన్నా ఇలా మొదలు పెట్టారు – “యువర్ ఎక్సలేన్సీ, యువర్ హైనెస్, హిజ్ మేజేస్టి సామ్రాట్ దీర్ఘ, ఆరోగ్యవంతమైన జీవనాన్ని కోరుకుంటూ ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. జూన్ 3న జరిగిన సమావేశంలో నిర్ణయించిన అంశాలను మీరు ఎంత చక్కగా, నైపుణ్యంతో అమలు చేశారో, అందుకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పాకిస్థాన్, అలాగే హిందూస్థాన్ లు తమ కృషిని ఎప్పటికీ మరచిపోవు..’’ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇస్లాం కోసం, ఇస్లాం సిద్ధాంతాల కోసం ఏర్పడుతున్న దేశపు స్వాగతం మద్య ప్రవాహం మధ్య పలుకుతున్నారు…!
–––––
ఆకాశవాణి, లాహోర్ కేంద్రం. రాత్రి 11గం.ల 50 నిముషాలు అయింది. ఇలా ప్రకటన వెలువడింది – “ఇది ఆకాశవాణి లాహోర్ కేంద్రం. తదుపరి ప్రకటన కోసం వేచి ఉండండి.’’ తరువాత 10 ని.లు వాయిద్య సంగీతం ప్రసారమయింది.
సరిగా 12 గం.ల 1 ని.కి…..“అస్లామ్ ఆలేకుమ్. పాకిస్థాన్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ కు స్వాగతం. లాహోర్ నుంచి ప్రసారాలు…కుబూల్ – ఏ – సుబహ్ – ఆజాదీ ‘’!! ఆ విధంగా పాకిస్థాన్ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన జరిగింది….!
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}