దేశ విభజన |
– ప్రశాంత్ పోల్
శుక్రవారం, 1 ఆగస్ట్, 1947. ఆ రోజు రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఆ రెండింటికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికి అవి రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయి.
1 ఆగస్ట్ కి గాంధీజీ శ్రీనగర్ చేరుకున్నారు. ఇది జమ్మూకాశ్మీర్ కు ఆయన మొదటి పర్యటన. అంతకు ముందు 1915లో కాశ్మీర్ రాజు హరిసింగ్ తమ రాజ్యాన్ని సందర్శించాలని స్వయంగా గాంధీజీని ఆహ్వానించారు. అప్పుడు హరిసింగ్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. గాంధీజీ అప్పుడే దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. మొదటి ప్రపంచయుద్ధం జరుగుతోంది. కానీ అప్పుడు గాంధీజీకి కాశ్మీర్ కు వెళ్ళడం కుదరలేదు. 1947నాటికి అంతా మారిపోయింది. ఇప్పుడు గాంధీజీ తమ ప్రాంతానికి రావడం రాజ హరిసింగ్ కుగాని, జమ్మూకాశ్మీర్ అధికారులకుగానీ ఏమాత్రం ఇష్టంగా లేదు. వైస్త్రాయ్ మౌంట్ బాటన్ కు వ్రాసిన ఒక లేఖతో మహారాజా హరిసింగ్ “.. పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తరువాత ఇప్పుడు మహాత్మా గాంధీ కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకోవడమే మంచిదని నేను చెప్పదలుచుకున్నాను. ఆయన రాదలుచుకుంటే శరదృతువు తరువాత రావచ్చును. నేను మళ్ళీ మరోసారి చెప్పదలుచుకున్నదేమిటంటే గాంధీజీగాని, మరెవరైనా గానీ కాశ్మీర్ కు రాదలచుకుంటే పరిస్థితులు పూర్తిగా చక్కబడినతరువాతనే రావాలి…’అని స్పష్టం చేశారు. ఇది ఎలా ఉందంటే ఇంటి యజమాని వద్దువద్దు అంటుంటే అతిధి వెళ్ళి అతని ఇంట్లో కూర్చున్నట్లుంది. కాశ్మీర్ అటు పాకిస్థాన్ , ఇటు భారత్ కు పరువుకు సంబంధించిన సమస్యగా పరిణమించిందని గాంధీజీకి కూడా అనిపించింది.
స్వాతంత్ర్యం ఒక్క అడుగు దూరంలో ఉంది. అయినా ఇప్పటివరకు కాశ్మీర్ తన నిర్ణయం ప్రకటించలేదు. అందుకనే తన పర్యటన వల్ల `గాంధీజీ కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అనే అపోహలు కలగడం ఆయనకు ఇష్టం లేదు. అలాంటి దురభిప్రాయాలు ఆయనకు చెడ్డ పేరు తెస్తాయి. జులై 29న కాశ్మీర్ పర్యటన కోసం ఢిల్లీ నుంచి బయలుదేరడానికి ముందు పాల్గొన్న ప్రార్ధనా సమావేశంలో ఆయన “నేను కాశ్మీర్ రాజాను కలిసి భారత్ లో కలవాలా, పాకిస్థాన్ లో కలవాలా అనేది చర్చించబోవడం లేదు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం కాశ్మీర్ ప్రజలకే ఉంది. అందుకనే అక్కడ నేను ఎలాంటి బహిరంగ సభలోను పాల్గొనను…అంతేకాదు ప్రార్ధన కూడా వ్యక్తిగతంగానే చేసుకుంటాను..’’
రావల్పిండి గుండా ఆగస్ట్ 1న గాంధీజి కాశ్మీర్ చేరుకున్నారు. ఈసారి మహారాజ నుంచి ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతో ఆయన కొశోరి లాల్ సేఠ్ ఇంట్లో బస చేశారు. అది అద్దె ఇళ్ళైనప్పటికి పెద్దగానే ఉంది. సేఠ్ అడవుల కాంట్రాక్టర్. ఆయనకు కాంగ్రెస్, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటితోనూ సత్సంబంధాలు ఉండేవి. కానీ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ అబ్దుల్లాను మహారాజా జైలులో పెట్టించారు. అలాగే చాలామంది నాయకుల్ని కాశ్మీర్ నుంచి బహిష్కరించారు. వీరంతా షేక్ అబ్దుల్లాతో కలిసి మహారాజాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారన్నది ఆరోపణ.
అందుకనే గాంధీజీ ఆగస్ట్ 1న రావల్పిండి మార్గంలో శ్రీనగర్ వస్తున్నప్పుడు చక్ లాల్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఇద్దరు నాయకులు గులాం మహమ్మద్, గులాం మహమ్మద్ సాదిక్ లు ఆయనతోపాటు కేవలం కొద్ది దూరం వరకు వచ్చి తిరిగి లాహోర్ వెళ్ళిపోయారు. గాంధీజీతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్, ఇద్దరు మేనకోడళ్ళు మాత్రమే ఉన్నారు. శ్రీనగర్ చేరుకున్న వెంటనే గాంధీజీ నేరుగా కిశోరిలాల్ సేఠ్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ఆయన్ని దాల్ సరస్సుకు తీసుకువెళ్లారు.
గాంధీజీ పర్యటన మొత్తంలో నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు మాత్రం ఆయన వెన్నంటే ఉన్నారు. ఎందుకని? ఎందుకంటే ఈ పర్యటనకు ముందే గాంధీజీ కాశ్మీర్ గురించి నెహ్రూను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. కాశ్మీర్ లో నెహ్రూ అత్యంత సన్నిహితుడు షేక్ అబ్దుల్లా. అతను ఇప్పుడు జైలులో ఉన్నాడు. అయినా అబ్దుల్లా భార్య, ఇతర అనుచరులు గాంధీజీకి సకల ఏర్పాటు చేశారు.
కాశ్మీర్ లో గాంధీజీతో అధికారిక స్థాయిలో కలిసిన మొట్టమొదటి వ్యక్తి రామచంద్ర కాక్. ఈయన రాజా హరిసింగ్ కు అత్యంత విశ్వాసపాత్రుడు. కాశ్మీర్ మంత్రి కూడా. నెహ్రూకు ఏమాత్రం నచ్చని వ్యక్తుల జాబితాలో మొట్టమొదటి పేరు ఈయనదే. ఎందుకంటే 15 మే, 1946న కాశ్మీర్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాదంటూ షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పుడు నెహ్రూ అతని తరఫున కోర్టులో వాదించడానికి సిద్దపడ్డాడు. కానీ నెహ్రూ కాశ్మీర్ లో ప్రవేశించడానికి వీలులేదంటూ రామచంద్ర కాక్ ఆజ్ఞలు జారీ చేశారు. అంతేకాదు ముజాఫరాబాద్ దగ్గర నెహ్రూను అరెస్ట్ చేయించారు కూడా. అప్పటి నుంచి రామచంద్ర కాక్ అంటే నెహ్రూకు కోపం. రాజా హరిసింగ్ వ్రాసిన ఒక లేఖను రామచంద్ర కాక్ గాంధీజీకి అందజేశారు. అది సీల్డ్ కవరు. నిజానికి ఈ లేఖ గాంధీజీకి ఆహ్వాన పత్రం. మహారాజాకు చెందిన హరినివాసంలో ఆగస్ట్ 3న సమావేశానికి రావాలంటూ పంపిన ఆహ్వానం అది.
నెహ్రూ సూచనల మేరకే గాంధీజీని వెన్నంటి నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు తిరుగుతున్నారు. షేక్ అబ్దుల్లా భార్య, ఆయన కుమార్తె మూడురోజుల పర్యటనలో గాంధీజీని అనేకసార్లు కలుసుకున్నారు. కానీ ఆగస్ట్ 1న గాంధీజీ ఒక్క జాతీయవాద హిందూ నాయకుడిని కూడా కలుసుకోలేదు.
————-
దేశ విభజన - హింస |
ఆగస్ట్ 1న మరో సంఘటన కూడా జరిగింది. అది భారత ఉపఖండంలో అశాంతి, అలజడికి కారణమైంది. అలాగే అది కూడా కాశ్మీర్ కి సంబంధించినదే. మహారాజా హరిసింగ్ పాలనలోని కాశ్మీర్ రాజ్యం పెద్దది. ఇందులోని గిల్గిట్ ఏజెన్సీ ప్రాంతాన్ని 1935లో బ్రిటిష్ వాళ్ళు విడగొట్టి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపారు.
కాశ్మీర్ ప్రాంతమంతా ఒకప్పుడు స్వర్గధామంలా ఉండేది. అంతేకాదు సైనిక పరంగా చూసినా అది ఎంతో కీలకమైనది. మూడు దేశాల సరిహద్దులు ఈ రాజ్యానికి ఆనుకుని ఉన్నాయి. 1935 రెండవ ప్రపంచ యుద్ధం భారత భూభాగానికి దూరంగా జరిగినప్పటికి ప్రపంచమంతటా కీలక రాజకీయ పరిణామాలు సంభవించాయి. రష్యా బలపడింది. ఇది గమనించిన బ్రిటిష్ వారు రష్యాతో కలిసే కాశ్మీర్ లోని భాగమైన గిల్గిట్ ను మహారాజా పాలన నుంచి తప్పించి తమ రాజ్యంలో కలిపేసుకున్నారు. ఆ తరువాత చాలా కాలం గడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం కూడా పరిసమాప్తమయింది. ఆ యుద్ధంలో పాల్గొన్న దేశాలన్నీ అన్ని విధాలుగా దెబ్బతిన్నాయి. భారత్ నుంచి తప్పుకోవాలని బ్రిటిష్ పాలకులు అప్పుడే నిర్ణయించుకున్నారు. అలాంటి పరిస్థితిలో గిల్గిట్ – బాల్టిస్తాన్ వంటి దుర్గమమైన ప్రాంతంపై అధికారం నిలబెట్టుకోవడంలో బ్రిటిష్ వారికి ఎలాంటి ఆసక్తి మిగలలేదు. అందుకనే అదికారికంగా భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించడానికంటే ముందు ఆగస్ట్ 1న గిల్గిట్ ప్రదేశాన్ని తిరిగి మహారాజా హరిసింగ్ కు అప్పగించారు. దానితో ఆ రోజు ఉదయం గిల్గిట్ – బాల్టిస్తాన్ ప్రాంతంలోని అన్నీ రాజ భవనాలపై బ్రిటిష్ పతాకమైన యూనియన్ జాక్ ను దింపి రాజ ధ్వజం ఎగరవేశారు. కానీ ఈ అధికార మార్పుకు రాజా హరిసింగ్ ఎంతవరకు సంసిద్ధులుగా ఉన్నారు? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. అందుకు కారణం?
ఎందుకంటే ఈ ప్రాంతం రక్షణ కోసం బ్రిటిష్ వాళ్ళు `గిల్గిట్ స్కౌట్’ అనే పేరుగల ప్రత్యేక రెజిమెంట్ ను ఇక్కడ ఉంచారు. ఈ రెజిమెంట్ లో కొద్దిమంది బ్రిటిష్ అధికారులను మినహాయిస్తే ఎక్కువమంది ముస్లింలే. ఆగస్ట్ 1న అధికార బదిలీతో ఈ ముస్లిం రెజిమెంట్ కూడా మహారాజా హరిసింగ్ అధికారంలోకి వచ్చింది. బ్రిగేడియర్ ధంసార సింగ్ ను ఈ ప్రాంతపు గవర్నర్ గా నియమించారు. ఆయనకు సహకరించేందుకు గిల్గిట్ రెజిమెంట్ కు చెందిన మేజర్ డబ్ల్యూ ఏ బ్రౌన్, కెప్టెన్ ఎస్. మేథిసన్ లను నియమించారు మహారాజా హరిసింగ్.
ఈ రెజిమెంట్ కు చెందిన మేజర్ బాబర్ ఖాన్ కూడా వాళ్ళతో ఉన్నాడు. కానీ రెండునెలల, మూడు రోజుల్లోనే ఈ రెజిమెంట్ తిరుగుబాటు చేస్తుందని మహారాజా హరిసింగ్ ఏమాత్రం ఊహించి ఉండరు. కానీ అదే జరిగింది. ఈ రెజిమెంట్ గవర్నర్ ధంసార సింగ్ ను బంధించింది. అలా ఆగస్ట్ 1న జరిగిన పరిణామాలు భవిష్యత్తుపై ఎంతో ప్రభావాన్ని చూపనున్నాయనే సూచనలు కనిపించాయి.
——
హిందూస్థాన్ ఖండిత స్వాతంత్ర్య పొందిన సమయంలో తూర్పు, పశ్చిమ సరిహద్దులో ఘోరమైన మారణకాండ జరిగింది. స్వాతంత్ర్య ప్రకటన రోజు దగ్గర పడుతున్న కొద్ది ఈ మారణకాండ తీవ్రరూపం దాలుస్తుందని బ్రిటిష్ అధికారులు ముందుగానే ఊహించారు. అందుకనే ఈ అల్లర్లను తగ్గించడానికి హిందూ, ముస్లిం, సిఖ్ లు కలిసిన సైనిక దళాలను ఏర్పాటు చేయాలని వాళ్ళు భావించారు. దాని ప్రకారమే `పంజాబ్ సరిహద్దు దళం’ పేరుతో ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పరచారు. ఇందులో 11వ ఇన్ఫెంట్రి దళం ఉంది. 50వేలమంది సైనికులు ఉన్నారు. మహమ్మద్ అయూబ్ ఖాన్, నాసిర్ అహమద్, దిగంబర్ బరార్, తిమ్మయ్య అనే నలుగురు బ్రిగేడియర్ లు వారికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ నలుగురు బ్రిగేడియర్ లు ఆగస్ట్ 1న లాహోర్ లోని సైనిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కానీ 15రోజుల్లోనే తామ సైనిక కార్యాలయం అగ్నికి ఆహుతైపోతుందని అప్పుడు వాళ్ళలో ఎవరు ఊహించలేకపోయారు.
——
ఇదే సమయంలో సుందరమైన కలకత్తా నగరంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి…
ఆగస్ట్ 1న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సుభాష్ చంద్ర బోస్ అన్నగారైన శరత్ చంద్ర బోస్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. శరత్ చంద్ర బోస్ ది విశిష్ట వ్యక్తిత్వం. 40 సంవత్సరాలపాటు కాంగ్రెస్ లో ఆయన విశేష సేవలు అందించారు. 1930 బ్రిటిష్ గూఢచారి నివేదికల్లో ఆయన పేరు కూడా ఉంది. శరత్ చంద్ర బోస్, జవహర్ లాల్ నెహ్రూలకు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరు ఒకే సంవత్సరంలో జన్మించారు. అలాగే ఇద్దరు ఇంగ్లండ్ లోనే చదువుకున్నారు. న్యాయశాస్త్రాన్ని ఇద్దరు అక్కడే అభ్యసించారు. యువకులుగా ఉన్నప్పుడు ఇద్దరి ఆలోచనలు వామపక్షానికి దగ్గరగా ఉండేవి. ఆ తరువాత ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి.
కానీ 1937లో జరిగిన బెంగాల్ ప్రాంత ఎన్నికల్లో ఈ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 54 స్థానాలు గెలుచుకుంది. `కృషక్ ప్రజా పార్టీ’, ముస్లిం లీగ్ లు తరువాతి స్థానంలో ఉన్నాయి. రెండింటికీ 37 చెరో స్థానాలు లభించాయి. అప్పుడు పార్టీలో ముఖ్య నాయకుడైన శరత్ చంద్ర బోస్ ఒక ప్రస్తావన చేశారు. కాంగ్రెస్, కృషక్ ప్రజా పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాగుంటుందని కాంగ్రెస్ సమావేశంలో ఆయన సూచన చేశారు. కానీ నెహ్రూకు ఈ ప్రస్తావన నచ్చలేదు. దానితో ఆ సలహాను పట్టించుకోలేదు.
అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికి కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైతే ముస్లిం లీగ్ తో కలిసి కృషక్ ప్రజా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. `షేర్ ఏ బంగాల్’ గా పేరుపడిన ఏ కె. ఫజలుల్ హక్ బెంగాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి బెంగాల్లో కాంగ్రెస్ బలం క్రమంగా క్షీణిస్తువచ్చింది. చివరికి ఈ తప్పిదమే ఆ తరువాత తొమ్మిదేళ్లలో బెంగాల్ లో ముస్లిం లీగ్ బలపడటానికి మతఛాందసవాది అయిన సుహ్రావర్దీ ప్రధాని కావడానికి కారణమైంది. ఈ సుహ్రవర్దీ నేతృత్వంలోనే 1946నాటి `ప్రత్యక్ష చర్య’ లో ముస్లిం లీగ్ మూకలు 5వేల మంది అమాయక హిందువులను ఊచకోత కోశాయి.
పై సంఘటనలన్నీ శరత్ చంద్ర బోస్ ను కలతకు గురిచేశాయి. ఈ ప్రమాదకర పరిణామాల గురించి ఆయన కాంగ్రెస్ కు, ముఖ్యంగా నెహ్రూను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఏమి లాభం లేకపోయింది. ఈ విషయాలను నెహ్రూ ఏ మాత్రం పట్టించుకోలేదు. 1939 త్రిపురి (జబల్ పూర్) కాంగ్రెస్ సమావేశాలలో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అందులో సుభాష్ చంద్ర బోస్ కు వ్యతిరేకంగా నెహ్రూ విస్తృత ప్రచారం చేశారు. ఇది శరత్ చంద్ర బోస్ ఆగ్రహానికి మరింత కారణమైంది. వీటన్నిటికి తోడు బెంగాల్ విభజనకు గాంధీ, నెహ్రూలు ఆమోదం తెలుపడం శరత్ బాబు అసంతృప్తిని తారస్థాయికి తీసుకువెళ్లింది. చివరికి ఆగస్ట్ 1న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అదే రోజు `సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ’ పేరుతో ఒక పార్టీని స్థాపించారు. దేశ విభజన, ఆ తరువాత దేశంలో జరిగిన మారణకాండకు కారణం పూర్తిగా నెహ్రూ అసమర్ధతేనని ఆయన ప్రజలకు తెలియజేశారు.
అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్న ఆగస్ట్ 1 సూర్యాస్తమయంతో గడిచిపోయింది. కానీ పంజాబ్ ప్రాంతం పూర్తిగా హింసాత్మక జ్వాలల్లో మాడిపోయింది. చిమ్మ చీకటిలో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్ లలోని వేలాది గ్రామాల నుంచి ఇల్లు దగ్ధమవుతుంటే వెలువడిన అగ్ని కీలలు సుదూర ప్రాంతాలకు కూడా కనిపించాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన 58 వేలమంది స్వయంసేవకులు హిందువు, సిక్ఖుల రక్షణ కోసం రాత్రిపగలు ప్రాణాలొడ్డి పోరాడారు. మరోపక్క బెంగాల్లో కూడా అరాచక మూకలు విజృంభించాయి.
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
మూలము: విశ్వ సంవాద కేంద్రము {full_page}