' దత్తోపంత్ ఠేంగ్డీజీ ' |
10 నవంబరు 1920న దీపావళి రోజున జన్మించిన దత్తోపంత్ ఠేంగ్డీజీ ఆ దీపావళి ప్రకాశాన్ని ప్రపంచానికి అందించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఎన్నో విషయాల మీద అధ్యయనం చేశారు. స్వయం సేవక్ సంఘ ప్రచారక్ గా ఆదర్శ జీవనాన్ని గడిపారు. ఎన్నో వివిధ క్షేత్రాలను ప్రారంభించి ఆ పనిలో నిత్యం తలమునకలై ఉండి కూడా ప్రతిరోజు శాఖ ప్రార్థన నిష్టతో చేసేవారు. ప్రతి విషయాన్ని హిందూ దృక్పథంతో ఆలోచించేవారు. అన్ని సమస్యలకు హిందూ దృష్టితో పరిష్కారం చూపించేవారు. ఎవరితోనైనా సులభంగా కలసిపోయే వ్యక్తిత్వం ఆయనది. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలతోనూ ఆయనకు మంచి స్నేహం ఉండేది. ఆయనను అందరూ గౌరవించేవారు.
కార్మికరంగంలో పనిచేయవలసిందిగా సూచించి నపుడు కార్మికుల పని ఎలా ఉంటుంది? ఆ
రంగంలోని లోతుపాతులు, వారి సమస్యల గురించి అర్థం చేసుకోవడం కోసం 1950లో ఐ.ఎన్.టి.ఎ.సి సభ్యులయ్యారు. తర్వాత రాష్ట్రీయ పరిషత్ సభ్యులుగా కూడా పనిచేశారు. అనంతరం కమ్యూనిస్టుల బ్యాంకు యూనియన్ అయిన ఎఐబిఇఎలో సంఘటనా మంత్రిగా పనిచేసి కార్మికుల పని గురించి, వారి సమస్యల గురించి క్షణ్ణంగా అర్థంచేసుకుని వారి సంక్షేమం కోసం బిఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్)ను స్థాపించారు. అప్పటి నుండి నేటి వరకు ఈ సంస్థ ఆయన బాటలోనే కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది. విద్యార్థులలో దేశభక్తి, జాతీయవాదం పెంపొందించే దిశగా అఖిలభారత విద్యార్థి పరిషత్వ్య వస్థాపకులలో ఒకరిగా ఆయన తన పాత్రను నిర్వహించారు. 1979లో రైతుల సంక్షేమం కోసం భారతీయ కిసాన్ సంఘ్ ను ప్రారంభించారు.
గ్లోబలైజేషన్'లో భాగంగా విదేశీ కంపెనీలకు, పెద్దపీట వేస్తే భారత ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి దెబ్బతినే ప్రమాదముంది. అంతేకాదు, మనలో సృజనాశక్తి తగ్గిపోతుంది. దేశభక్తి భావన తగ్గుతుంది. మళ్లీ బానిసత్వం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దిశగా ముందే ఆలోచించిన ఠేంగ్డీజీ ప్రజలలో దేశభక్తి, స్వదేశ అభిమానం నిర్మాణం చేయడం కోసం 'స్వదేశీ జాగరణ్ మంచ్'ను స్థాపించారు. దీని ద్వారా స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలనే ఆలోచనను ఆనాడే చేశారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త నిర్వచనం చెబుతూ మూడవ ఆర్థిక విధానాన్ని ప్రజల ముందుంచారు. ఆయన రచించిన 'ద థర్డ్ వే' పుస్తకంలో ఈ విధానం గురించి స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఈ పుస్తకంలో మనదేశ ఆర్థిక వ్యవస్థలో హిందువుల కోణాన్ని గురించి ఆవిష్కరించారు. సమాజంలోని భిన్న కులాల మధ్య సామరస్యత దిశగా 'సామాజిక సమరసతా మంచ్'ను ప్రారంభించారు. దేశంలోని భిన్నవర్గాల సంప్రదాయల మధ్య ఆదరాభిమానాలు నింపేందుకై 'సర్వ పంథ సమాదరణ మంచ్'ను స్థాపించారు.
ఠేంగ్డీజీ ఏ క్షేత్రంలో పనిచేసినా సంఘ కార్యపద్ధతి ప్రకారమే చేశారు. కార్మిక సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఏ పేరు పెట్టాలనే చర్చ సందర్భంగా ఆయన మనసులో 'భారతీయ శ్రామిక్ సంఘ్' అనే పేరు ఉంది. కానీ సమావేశంలో పాల్గొన్నవారిలో అత్యధిక మంది 'భారతీయ మజ్జూర్ సంఘ్' పేరును సూచించారు. కలిసి చర్చించడం కలిసి నిర్ణయించడం సంఘ కార్యపద్దతిలో భాగం కాబట్టి అందరి సూచన మేరకు తన మనసులోని పేరును పక్కన పెట్టి భారతీయ మజ్గూర్ సంఫఘ్ నే ఖరారు చేశారు. ఠేంగ్డీజీ రచించిన 'కార్యకర్త' అనే పుస్తకం సంఘ కార్యకర్తలకు భగవద్గీత వంటిది. ఇది సంఘం, వివిధ క్షేత్రాల కార్యకర్తలకే కాదు.. వ్యాపార, వాణిజ్య ఆధ్యాత్మిక, సామాజిక రంగాల వారికి ఎవరికైనా మార్గదర్శనం చేస్తుంది.
సంఘ కార్యకర్తలనుద్దేశించి 'మీరు మూర్ఖులు' అనే పుస్తకంలో - కుటుంబం, పిల్లలు, సంపాదన సుఖసంతోషాలకు ప్రాధన్యమివ్వకుండా అన్నిటినీ వదిలేసి కేవలం జాతి ఐక్యతను దృష్టిలో పెట్టుకొని పిచ్చివానిలా తిరిగే కార్యకర్తలు పిచ్చివాళ్లు (మూర్ఖులు) కాక మరెవరు? ఇలాంటి పిచ్చివాళ్ల పరంపర ఈ దేశంలో అనాదిగా వస్తున్నది కాబట్టి ఈ దేశం ధర్మం, జాతి నిలబడిందని చమత్కరించారు.
సమాజాన్ని జాగృతం చేయడం, వారిలో దేశభక్తి జాతీయభావాలు నిర్మాణం చేయడం వలనే పరివర్తన వస్తుందని భావించారు. కేవలం నినాదాల వలన ఏ ప్రయోజనం ఉండదని చెప్పారు. ఠేంగ్డీజీకి భవిష్యత్ గురించి ముందుగానే ఒక స్పష్టమైన ఆలోచన ఉండేది. 1975లో ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదముందని ఆయన ముందుగానే ఊహించారు. 2000 జనవరి 1 నాటికి దేశమంతటా కాషాయం రెపరెపలాడు తుందని చెప్పారు. ఆయన చెప్పినదే జరిగింది. సామ్యవాదం సమసిపోయింది. హిందుత్వ భావన దేశ ప్రజల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బలపడింది.
వ్యాసకర్త: ధర్మజాగరణ్ అఖిల భారత - సహ సంయోజక, చెన్నై - జాగృతి