దత్తోపంత్ ఠేంగ్డీ జీ |
మన పూర్వులు ఎప్పుడూ మానవుడిని గురించి మానవుడు అన్న దృష్టితోనే భావన చేశారు 'కృణ్వంతో విశ్వమార్యమ్' అనే సందేశం కూడా ప్రపంచ ప్రజల సాంస్కృతిక స్థాయిని ఉన్నతం చేయాలనే ఆకాంక్షతో చేసిన ఉద్దోష మాత్రమే. ఋుగ్వేద కాలపు ప్రార్థనల నుంచి ఇటీవల ప్రకటించిన పండిత దీనదయాళ్ జీ 'ఏకాత్మ మానవ దర్శన్' వరకు కూడా సంపూర్ణ మానవజాతి, సమస్త విశ్వశ్రేయస్సును గురించిన చింతననే, మన భారతీయ తాత్త్వికులు చేశారు. ఏదో ఒక జాతిని గురించిన ఒక మతం గురించిన, ఒక దేశం గురించిన ప్రస్తావనే అందులో రాదు. మనువు కూడా తన ధర్మశాస్త్రాన్ని హిందూ ధర్మశాస్త్రం అనలేదు. 'మానవ ధర్మశాస్త్రం' అనే అన్నాడు.
మనం ఎప్పుడూ మన ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆరాటపడలేదు. సంపూర్ణ మానవ జాతితో ఏకాత్మత గల వారిగానే మనను మనం భావించుకున్నాం. “పుమాన్ పుమాంసం పరిపాతుః విశ్వతః” (ఋగ్వేదం 6-75-14) అన్నది మన ప్రార్థన.
అనంతర కాలంలో హిందూ దేశానికి వెలుపల గల కొన్ని ప్రాంతాలలో తమను తాము తక్కిన మానవాళితో ఏకాత్ములుగా కాక, వేరుగా భావించుకొంటూ, తమ వేరైన గుర్తింపును నిలబెట్టుకోవాలనుకునే ప్రజలు తయారైనారు. ఈ వేర్పాటుతో కూడిన గుర్తింపును ఇతర ప్రజలపై రుద్దడానికి, ఆ పని కత్తి బలంతో చెయ్యడానికి కూడా సిద్దపడే ప్రవృత్తి గలవారుగా వారు తయారైనారు. అటువంటి జాతుల ప్రజలు భారతదేశంలోకి వచ్చినపుడు వారి ధోరణికి భిన్నమైనవారం అని మనను మనం స్పష్టంగా తెలియజెప్పుకోవలసిన అవసరం భారత ప్రజలకు ఏర్పడింది. అందుకని మన ప్రత్యేకమైన గుర్తింపును తెలియజేసే పదాన్ని వాడుకలోకి తేవటం అవసరమైంది.
ఆ పదం కూడా మనం తయారుచేసుకున్నది కాదు. మనకు 'హిందూ' అన్న పేరును ఇతరులే పెట్టారు. తమ నుంచి మన సంస్కృతీ సభ్యతల భిన్నతను గ్రహించిన ఇతర దేశస్థులు సింధూనదీ తీరంలోను, దానికి ఇటువైపు దిశలోను ఉన్న భారత ప్రజలను సింధు శబ్దంలోంచి జన్మించిన 'హిందు' శబ్దంతో మనలను పిలువనారంభించారు. నిజానికి ఇతరుల కన్నా భిన్నమైన వారమని చెప్పుకోవటం మన మనస్తత్వం కాదు. తీవ్రమైన హిందువుగా పిలిచే స్వాతంత్ర్య వీర సావర్కర్ ఇలా అన్నారు - “నీవు ముసల్మానువని, నేను హిందువునని నువ్వు అంటున్నావు, కనుక నేను హిందువునని, నువ్వు ముసల్మానువని నేనూ అంటున్నాను. లేకపోతే నేను విశ్వనరుడిని".
మరొక సందర్భంలో సావర్కర్ ఇలా అన్నారు, "నిజానికి ఈ భూప్రపంచం మన మాతృభూమి, సమస్త మానవాళి మన జాతి. కాని ధైర్యం, బలం గల వారికి పిరికి వారు, బలహీనులు బలి కావలసిందేనని పరిణామ సిద్ధాంతం కర్కశంగా చెబుతున్నంతవరకూ జాతీయవాదం వెనక్కు తొలగి విశ్వమానవతావాదానికి చోటివ్వటం సాధ్యం కాదు". అంతేకాదు, ఇస్లాం, క్రైస్తవం మొదలైన పేర్లను విడిచి పెట్టడానికి, ఇతర జాతుల ప్రజలు సిద్దమైతే నా హిందూత్వం కూడా విశ్వమానవతలో విలీనమై పోతుంది. అదేవిధంగా ఆంగ్లేయత, జర్మనీయత మొదలైన జాతీయతలన్నీ మాయమైపోయి, మనసులలో కేవలం మానవత ఒక్కటే మిగిలి ఉన్నపుడు మాత్రమే నా భారత జాతీయత కూడా విశ్వమానవతలో లీనం కాగలదు. నేడు కూడా నిజమైన మానవతావాది ఎవరైనా ఉంటే, వారితో సకల భేదభావాలను విడచి పెట్టి వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాను.
మనం ఎప్పుడూ లోకం, విశ్వం అనే పరిభాషలోనే చింతన చేశాం. చీమలకు కూడా చక్కెర తినిపించే మనస్తత్వం మనది. అందుకనే మనం 'వసుధైక కుటుంబకం' అంటూ వచ్చాం. “సర్వేపి సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయాఃళ” అనేది సమస్త మానవ జాతి పట్ల మనకు గల శుభప్రదమైన కోరిక.
ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మార్గంలో సుఖం పొందగిలిగి ఉంటాడు. అయినా ప్రతి వ్యక్తికి సుఖాన్ని పొందే అవకాశం ఉండాలన్నది మన ఆశయం..... ఒకరు సుఖాన్ని పొందే పద్దతి మరొకరి సుఖాన్ని హరించే విధంగా ఉండకూడదని కూడా మన సంస్కృతి మనకు చెప్పింది. సంత్ జ్ఞానేశ్వర్ తన జ్ఞానేశ్వరీయం అనే గ్రంథంలో చివరి భాగం 'పసాయదాస్'లో ఈ ఆదర్శాన్ని విశదం చేశాడు.
'దురితాంచే తిమర జావో విశ్వస్యధర్మ, సూర్యోపాహో జోజోవాంఛిల్ తే లాహో ప్రాణిజాత'
(నేను నా కోసం ఏమీ అడగడం లేదు, సూర్యకిరణాలు ఏవిధంగా లోకంలోని సమస్త జీవరాశుల మీద ప్రసరించి ఉత్తేజితం చేస్తాయో అదేవిధంగా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న యావత్ ప్రజానీకంపై నీ జ్ఞాన కిరణాలను ప్రసరింపచేయడం ద్వారా వారి స్వధర్మం గుర్తెరిగేటట్లు చేయమని” సంత్ జ్ఞానేశ్వర్ భగవంతుని ప్రార్థిస్తున్నారు.)
ఈ దృష్టితో చూస్తే, 'పసాయిదాన్' హిందూ దేశపు మేనిఫెస్టో అని చెప్పవచ్చు. ఇదే మన భారత జాతీయతకు ఆరంభం. ఇదే విశ్వ సంస్కృతి ప్రారంభం కూడా. మన దేశమే ప్రపంచంలో సంస్కృతి విలసితమైన మొదటి దేశం. ఈ కారణంవల్లనే మన జాతీయత, ప్రపంచ సంస్కృతి
ఈ రెండింటికీ సంబంధించిన చింతన మన దేశంలో ఒకదానితోపాటు మరొకటిగా సాగుతూ వచ్చింది. తమను తాము ఇతరుల కన్నా వేరుగా భావించుకొనే సమాజాల సంబంధం కలిగిన తర్వాతనే మనం వేరు అని సూచించే 'హిందూ' పదం మనకు లభించింది. ఇందువల్ల మన జాతీయత హిందూత్వం అయ్యింది.
నిజానికి 'హిందువు' అనే పదం, 'మానవుడు అనే పదం మన దేశంలో పర్యాయపదాలుగానే వ్యవహరిస్తారు. మానవ జాతిలో ఎన్ని ఈశ్వరారాధన రీతులు ఉన్నాయో, అన్నింటినీ హిందూత్వం స్వీకరిస్తుంది. తమ తమ ప్రత్యేకతలను నిలబెట్టుకొంటూనే అవన్నీ హిందుత్వం పరిధిలో సామరస్యంతో కలిసి ఉండగలవు. ఇంతా చేస్తే హైందవ చింతనకు, హైందవేతర చింతనకూ మధ్య భేదం ఎంతటిది? “కేవలం ఏసుక్రీస్తు ద్వారానే” అనేది హైందవేతర భావన. “ఏసుక్రీస్తు ద్వారా కూడా" అనేది హైందవ భావన. “మహమ్మద్ ప్రవక్త ద్వారా మాత్రమే” అనేది హైందవేతర భావన. “మహమ్మద్ ప్రవక్త ద్వారా కూడా” అనేది హైందవ భావన. ఇది మాత్రమే అనేది హైందవేతర ధోరణి. “ఇది మరియు అది” అనేది హైందవ ధోరణి. ఈ హిందూ ధోరణిలో మాత్రమే సమస్త మానవజాతిని సంఘటితం చేయటం సాధ్యమవుతుంది. మానవులంతా ఒక కుటుంబం అనే భావనను నిర్మాణం చేయటం వీలవుతుంది.
విశ్వకల్యాణం అనే మన ఈ మహోన్నత ధ్యేయంపై నేడు మనతోపాటు ప్రపంచంలోని మేధావులెందరో విశ్వాసం కలిగి యున్నారు. వారిలో సుప్రసిద్ధుడైన ఆర్నాల్డ్ టాయిన్ బీ ఒకరు. ఆయన ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు, ఉప సంస్మృతుల గురించి లోతుగా అధ్యయనం చేశారు. అలా అధ్యయనం చేసిన తర్వాత ప్రపంచానికి మార్గదర్శనం చేయగల్గిన సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉన్నదని నిర్ధారణకు వచ్చారు. 'ప్రపంచంలో ఉన్న సమస్త భేదవిభేదాలు భారతదేశంలో ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విశేషం కూడా భారతదేశంలో ఉంది. అదేమిటంటే విభేదాలను వైవిధ్య దృష్టితో చూడటం వాటిలో అంతర్గతంగా ఉన్న ఏకాత్మతను దర్శించటం అన్నారాయన. అంటే కనబడేది భిన్నత్వమే అయినా మూలంలో ఉన్న ఏకత్వాన్ని దర్శించటమన్న మాట ఈ సుగుణం వల్ల భారత్ తన సమస్యలన్నిటినీ పరిష్కరించుకోగల్గుతుంది. ప్రపంచం ముందు ఒక ఆదర్శంగా నిలబడుతుంది అని నమ్మారాయన అందువల్లనే ఆయన మనలను “మీరు మీ శ్రేయస్సు త్వరగా సాధించుకోండి. దానిపైనే విశ్వశ్రేయస్సు ఆధారపడి ఉంది” అన్నారు.
ఆర్నాల్డ్ టాయిన్ బీ పిలుపును మనం సరిగా అర్థం చేసుకోవలసి ఉంది. మన సాంస్కృతిక వారసత్వాన్ని ఆధారం చేసుకొని ఆరోగ్యప్రదం సుసంపన్నం, శక్తిమంతమైన మానవ సమాజానికి ఉదాహరణగా ప్రపంచం ముందు నిలిచి భారతీయ సమాజం జగద్గురు స్థానంలో విలసిల్లాలనేది మన విశ్వజనీనన ధ్యేయం. మనం ఇలా తరతరాలుగా చెపుతూనే ఉన్నాం. కాని దుర్భల సమాజం చెప్పే దానిని లోకంలో ఎవరూ చెవిన పెట్టరు. అందుచేతనే టాయిన్ బీ “మీరు మీ శ్రేయస్సును త్వరగా సాధించుకోండి; సమర్థులు, శక్తిమంతులూ అవ్వండి అంటున్నారు
వ్యాస మూలము: దత్తోపంత్ టెంగ్డీ "కార్యకర్త" పుస్తకం నుంచి) - జాగృతి {full_page}