జీవన స్ఫూర్తి - మహిళా శక్తి
మహిళలు అబలలు కాదు.. సబలలు అని నిరూపించే విధంగా ఎందరో భారతీయ మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచపు నలుమూలల చాటుతున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరు అని ముద్ర పడిపోయిన వృత్తి పనులను వారు కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా వాటిలో ఉత్తమ నైపుణ్యాన్ని కూడా కనబరుస్తున్నారు.
క్షవరవత్తి కాదది జీవనోపాధి
తమ తండ్రులు అనారోగ్యంతో మంచాన పడితే.. కుటుంబం రోడ్డున పడుతుందన్న ఆవేదనతో.. కన్నవారికి భారం కావద్దనే ఆలోచనతో.. కుటుంబ సభ్యుల ఆకలి తీర్చే బాధ్యతతో తమ కులవత్తి అయిన క్షవరాన్ని ఎంచుకున్నారు వారిద్దరు. ఎన్నో అవమానాలు,. హేళనలు.. వెక్కిరింపులు ఎదురైనా విధికి తలవంచక నిలుచున్నారు. తాము కూడా ఎందులో నూ తీసుపోమని, జీవనోపాధికి వివక్ష ఉండదని నిరూపించారు. కేవలం పురుషులు మాత్రమే చేపట్టే వత్తిగా భావించే క్షవరాన్ని తమ జీవన సంగ్రామానికి ఆయుధంగా మలచుకున్నారు. నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో మొదటి వారు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం, మొండిగుంట గ్రామానికి చెందిన హిమబిందు. తండ్రి రాజేశ్‌కు మెదడు సంబంధిత వ్యాధి రావడంతో అతను మంచాన పడ్డాడు. ఆ సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న హిమబిందు తన తండ్రి వత్తిని తన వత్తిగా మార్చకుంది. రోజు క్షవరం చేయగా వచ్చే సొమ్ముతో కుటుంబాన్ని పోషించడం ప్రారంభించింది. తన తండ్రికి అయ్యే వైద్య ఖర్చులను కూడా తానే భరిస్తోంది. తన అక్కను డిగ్రీ చదివిస్తూ తాను కూడా తన చదువును కొనసాగిస్తోంది.
ఇక రెండవ వ్యక్తి తమిళనాడు పల్లాడమ్, తిరుప్పూర్కు చెందిన దేవి.. చదువురీత్యా పట్టభద్రురాలు.. తండ్రి అనారోగ్య కారణాలతో తన సెలూన్ నడపలేకపోయాడు. చిన్నప్పటి నుంచి క్షవర వత్తిపై అవగాహన ఉన్న ఆమె తన కుటుంబ బాధ్యతలను మోయడానికి సిద్ధమైంది. చదువుకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉన్నప్పటికీ క్షవరాన్నే ఉపాధిగా మలచుకొంది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఎంత నచ్చ జెప్పినా.. వారిని వారించి సెలూన్ బాధ్యతలను చేబుచ్చు కుంది. తొలినాళ్ళలో మహిళ గడ్డం గీయడం, జుట్టు కత్తిరించడం ఏమిటి? అనే అవమానాలు ఎదుర య్యాయి. కానీ ఇప్పుడు ఆమె వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోంది. కులవత్తులు కేవలం పురుషులు మాత్రమే కాదు.. మహిళలు కూడా చేయగలరని నిరూపించింది.
అబలలు కాదు ఆడ పులులు:
గుజరాత్‌లోని గిర్ అడవి ప్రాంతంలో ఒక మహిళా దళం పనిచేస్తోంది. ఆసియా జాతికి చెంది న అరుదైన సింహాల పరిరక్షణ ఈ మహిళల బాధ్య త. ఇది దేశంలోనే ఏకైక మహిళా అటవీ అధికారుల దళం కావడం విశేషం. ఈ దళానికి రసిలా వాదేర్ నాయకత్వం వహిస్తారు. తమ దళం ఇప్పటి వరకు 800లకు పైగా రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. వాటిలో 200ల వరకు సింహలను రక్షించారు. వన్య ప్రాణుల మధ్య సాధారణంగా జీవించడానికే భయపడే చోట.. వీరు ఉండడం గొప్ప విషయమే కదా..? ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 2007సంవత్సరంలో అటవీ శాఖలో 33శాతం మహిళా కోటాను ఇచ్చారు. అందులో ఎంపికైన తొలి 43మంది మహిళా అధికారులను వివిధ ప్రాంతాల్లో నియమించారు. వారిలోని 12మంది గిర్ అడవులకు వచ్చి తమ సేవలను ఇలా అందజేస్తున్నారు. సింహాల నుండి గ్రామస్తులను, వేటగాళ్ళ నుండి వన్యప్రాణులను రక్షించడంలో ఏ మాత్రం తగ్గకుండా ఈ మహిళా దళం పనిచేస్తోంది. నేషనల్ జియోగ్రాఫీ, డిస్కవరీ ఛానెళ్ళలో వీరికి సంబంధించి న కథనాలు కూడా వచ్చాయి.
జమ్ముకాశ్మీర్‌లో పని చేసే గ్రామ మిలీషియా దళం కూడా మహిళలతో కూడినదే. వీరు కరడుగట్టిన ఉగ్రవాదులను సైతం మట్టు పెడుతారు. ఆయుధాలను అవలీలగా వాడుతారు. దేశ సరిహద్దుల్లో ఉండి సైనికులకు తోడ్పాటును అందిస్తారు.19వ దశకంలో జమ్ము, కాశ్మీర్లలో మహిళల మాన, ప్రాణాలను తీవ్రవాదులు తీసేసే వారు. అంతేకాకుండా గ్రామాలను సర్వనాశనం చేసేవారు. ఇలాంటి దుశ్చర్యల నుండి గ్రామాలను రక్షించడానికి, మహిళల మానాన్ని, ఆత్మగౌరవాన్ని రక్షించడానికి గ్రామ రక్షణ దళాలను భారత సైనిక దళం ఏర్పాటు చేసింది. వారికి యుద్ధ విద్యలతోపాటు ఆయుధాలను కూడా అందించింది. అప్పటి నుంచి ఎందరో కరడుగట్టిన తీవ్రవాదులను కాశ్మీర్ లోయల్లోని మారుమూల గ్రామాల్లో ఈ గ్రామ రక్షణ దళాల సభ్యలు మట్టుబెట్టారు. పూంచ్, రాజౌరి, ఖతా, రెక్కాన్ వంటి అత్యంత సంక్లిష్ట వాతావరణ పరిస్థితులు ఉన్న చోట కూడా ఈ ధీరవనితలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా కేవలం వత్తి పనులే కాదు.. రక్షణ.. ఐటీ.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమ సత్తాను చాటుకుంటూ ముందుకు వెళ్తున్న మహిళామణులు ఎందరో ఉన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి యువతి, మహిళ దేశం కోసం, సమాజం కోసం, తమ కుటుంబం కోసం పనిచేయాలి. వంటింటికే కాదు.. బాధ్యతల పంపకాల్లో కూడా తాము ముందుంటామని నిరూపించుకోవాలి. అవసరమైతే ఆయుధం పట్టాలి.. కలంతో కాలాన్ని మార్చేయాలి.. యంత్రంతో అభివద్ధి వైపు పరుగులిడాలి.. నారీ లోకం జయభేరిని మోగించాలి.. స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటాలి.
రచన: లతా కమలం