పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ - మొదటి భాగం
ప్ర; రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో అయోధ్య వివాదం ముగిసినట్లే. దీనితో శ్రీ రామచంద్రుని గురించిన చర్చ కూడా ముగిసిపోతుందా?
జ. శ్రీ రామమందిర శిలాన్యాస కార్యక్రమం 1989లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 5న కేవలం మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ కోసం ప్రయత్నం సాగింది. దేశ సర్వోచ్ఛ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక న్యాస్ ఏర్పాటైంది. ఆ న్యాస్ కు అవసరమైన భూమి ప్రభుత్వం అందించింది. దానితో రామమందిర ఉద్యమం కూడా సమాప్తమయింది. కానీ శ్రీరామచంద్రుని గురించిన చర్చ ఎన్నటికీ సమాప్తం కాదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడిని ఈ దేశంలో అధిక సంఖ్యాకులు భగవంతునిగా పూజిస్తారు. భగవంతుడిగా భావించని వారు కూడా ఆదర్శపురుషునిగా మన్నిస్తారు. ఈ దేశపు వర్తమాన, భవిష్యత్తులపై ఎంతో ప్రభావాన్ని చూపే భవ్యమైన గతకాలపు గుర్తు ఆయన. రాముడు ఉండేవాడు, ఉన్నాడు, ఉంటాడు. శ్రీరామచంద్రుడు పుట్టినప్పటి నుంచి ఆయన గుణగానం జరుగుతూనే ఉంది. ముందు కూడా అలాగే సాగుతుంది. రామజన్మభూమి ఉద్యమం మాత్రం ఏ రోజున మందిర నిర్మాణ ట్రస్ట్ ఏర్పడిందో అప్పుడు పూర్తైంది.
ప్ర. రాబోయే రోజుల్లో కాశీ విశ్వనాధమందిరం, మథుర శ్రీకృష్ణజన్మభూమి ఉద్యమాలు జరుగుతాయా?
జ: మాకు తెలియదు. ఎందుకంటే మేము కేవలం ఉద్యమాలు చేసేవాళ్లం కాదు. రామమందిర ఉద్యమాన్ని కూడా మేము ప్రారంభించలేదు. అది చాలాకాలంగా ప్రజల ద్వారా నడుస్తోంది. అశోక్ సింఘాల్ జీ విశ్వహిందూ పరిషత్ కు వెళ్లడానికి చాలా కాలం ముందు నుంచే ఆ ఉద్యమం సాగుతోంది. ఆ తరువాత ఆ విషయం విశ్వహిందూ పరిషత్ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఉద్యమాన్ని మేము ప్రారంభించలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ఉద్యమంలో మేమూ భాగస్వాములమయ్యాం. ఏ ఉద్యమం ప్రారంభించాలన్నది మా కార్యప్రణాళికలో ఉండదు. మేము ప్రతి వ్యక్తిలో హృదయ పరివర్తన కోసం శాంతియుతంగా పనిచేస్తాము. హిందూ సమాజం ఏం చేస్తుందో నాకు తెలియదు. అది కాలమే నిర్ణయిస్తుంది. దీని గురించి నేను ఇప్పుడు ఏమి చెప్పలేను. మేము స్వయంగా ఎలాంటి ఉద్యమాలు ప్రారంభించమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేయదలుచుకున్నాను.
ప్ర. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తరువాత అది కేవలం పూజాదికాలకు పరిమితమవుతుందా లేక అక్కడ ఇంకా ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయా?
జ: కేవలం పూజాదికాలు నిర్వహించడానికి దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. దానికోసం హిందూ సమాజం ఇంత సుదీర్ఘమైన పోరాటం చేయవలసిన అవసరం లేదు. ఈ దేశంలో ధర్మాన్ని అంతం చేయడం కోసమే ఈ ప్రముఖ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందుకనే ఈ మందిరాన్ని తిరిగి నిర్మించుకోవాలని హిందూ సమాజం పోరాడింది. ఇంతకాలానికి ఆ పని పూర్తవుతోంది. అయితే కేవలం ప్రతీకాత్మకంగా ఒక మందిర నిర్మాణం జరిగిపోతే సరిపోదు. ఏ విలువలు, ఆదర్శాలకు ఆ మందిరం గుర్తుగా నిలచిందో వాటిని ఆచరించాలి. మందిర నిర్మాణం జరుగుతుంది. కానీ మనం ఏం చేయాలన్నది ఆగస్ట్ 5నాటి కార్యక్రమంలో నేను గుర్తుచేశాను. “ఈ దేశాన్ని పరమవైభవ, సంపన్న, విశ్వగురువుగా చేయడానికి ప్రతివ్యక్తీ తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సులనే అయోధ్యగా మార్చుకునే కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి. రామమందిర నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రతి భారతీయుని మనస్సులో అయోధ్య నెలకొనాలి.’’ మనస్సే అయోధ్యాగా మారడమంటే ఏమిటన్నది కూడా రామచరిత మానస్ ఉదాహరణగా నేను వివరించాను –
కామ్ కోహ్ మద్ మాన్ న మోహ | లోభ్ న చోభ్ న రాగ్ న ద్రోహ ||
జిన్హ్ కె కపట్ దంభ్ నహి మాయా | తిన్హ్ కె హృదయ్ బసహు రఘురాయ ||
రాముడే సర్వస్వంగా భావించే అయోధ్యవాసులు అలా ఉంటారు. కాబట్టి ప్రతి భారతీయుడు తన మనస్సును అలా మలచుకోవాలి.రెండవ దోహా –
జాతి పాత్ ధను ధరమ్ బఢాయి | ప్రియ పరివార్ సదన్ సుఖదాయీ ||
సబ్ తజి తుమ్హహి రహయీ ఉర్ లాయీ | తెహి కె హృదయ రహహు రఘురాయి ||
కొన్ని విషయాలపట్ల అభిమానం ఉండడం తప్పు కాదు. కానీ వాటిని పట్టుకుని విభేదాలు, కలహాలు కలిగించుకోరాడు. `సబ్ తజి’ అంటే అన్నీ వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్లిపోవాలని కాదు. ఏ విషయం పట్ల మనకు అవసరానికి మించి అభిమానం, ఆపేక్ష కలుగుతాయో దానిని వదిలిపెట్టాలి. మనసులో కేవలం రామనామాన్నే నింపుకోవాలి అని అర్ధం. రాముని ఆదర్శాన్ని ముందుంచుకుని నడవాలి అని. `తెహికే హృదయ రహహు రఘురాయి’ (హృదయంలో రాముడే ఉండాలి) అనే విధంగా జీవితాన్ని గడపాలి. అందుకోసం మందిరం కావాలి. దేశం మొత్తంలో ఈ భావన కలగాలి. అందుకు అందరూ ప్రయత్నించాలి. మనకు ఆదర్శమైన శ్రీరాముని మందిరాన్ని కూల్చి, అవమానపరచారు. ఆ ఆదర్శాన్ని పునః స్థాపితం చేసుకునేందుకు భావ్యమైన, దివ్యమైన రామమందిరం తిరిగి కట్టుకోవాలి.
ప్ర. శ్రీ రాముడు మన ఆదర్శం. కానీ ఇప్పటికీ ఈ దేశంలో అనేక మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు చలామణిలో ఉన్నాయి. వాటిని అంతం చేయడానికి ఏం చేయాలి? ధర్మాచార్యులు ఇందుకు పూనుకోవాలా?
జ: ధర్మాచార్యులు ఏం చేయాలి? ఎలా చేయాలి అన్నది నేను చెప్పలేను. అయితే సమాజంలో నైతికత, ధర్మాచరణ ఉండాలన్నది నిజం. ఎలాంటి ఆచారాలు ఉండాలన్నది ధార్మిక వ్యవస్థ ద్వారా నిర్ణయమవుతుంది. ఆ ధార్మిక వ్యవస్థ ఏమిటి? సత్యం, అహింస, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, స్వాధ్యాయం, సంతోషం, తపం అనేవి శాశ్వత ధర్మాలు. అంటే ఇవి సదా, సర్వదా, సర్వత్ర ఆచరించవలసినవి. అయితే దేశాకాల పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి వీటి ఆచరణ ఉంటుంది.
శిబి చక్రవర్తి కధ ఒకటి ఉంది. ఒకసారి ఒక పావురం తనను తరుముకు వస్తున్న ఒక గద్ద నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు శిబి చక్రవర్తి సభలో ప్రవేశించి ఆయన శరణువేడుకుంది. ఆ పావురం ప్రాణాలు కాపాడటం తన కర్తవ్యమని శిబి కూడా భావించారు. అంతలోనే గద్ద అక్కడికి వచ్చి `పావురం ఎక్కడ ఉందో చెప్పండి. అది నాకు ఆహారం” అని అడిగింది. అప్పుడు రాజు `ఆ పావురం నా శరణువేడింది. దానిని కాపాడటం నా ధర్మం’ అన్నాడు. ప్రకృతి ధర్మం ప్రకారం ఆ పావురాన్ని తిని నేను జీవించాలి. కాబట్టి ఆ పావురాన్ని రక్షించడం ద్వారా నా ఆహారాన్ని నాకు అందకుండా చేస్తున్నావు. అది అధర్మం. ఇక్కడ రాజుకు ఒక ధర్మం ఉంది, పావురానికి ఒక ధర్మం ఉంది, గద్దకు కూడా ఒక ధర్మం ఉంది. ఈ ముగ్గురి ధర్మాలను దృష్టిలో పెట్టుకుని రాజు `కడుపు నింపుకోవడమే నీ ధర్మం, శరణు అన్న వారిని రక్షించాల్సిన నా ధర్మం నెరవేరేవిధంగా నీ కోసం నా శరీరంలో మాంసాన్ని ఇస్తాను’ అని అన్నాడు.
దేశ, కాల, పరిస్థితులు, వ్యక్తుల స్వభావం మొదలైనవాటి ఆధారంగా ఏర్పడే కర్తవ్యాలనే `ఆచార ధర్మాలు’ అంటారు. మనకు అనేక స్మృతులు ఉన్నాయి. అవి వివిధ కాలాలకు చెందినవి. వాటిలో చివరిది దేవల స్మృతి అని చెపుతారు. మహిళలకు విద్యార్జన, ఇతర అధికారాలు ఉన్నాయని దేవల స్మృతి పేర్కొంటున్నది. అయితే 10వ శతాబ్దంలో ఈ దేవల స్మృతి కూడా సమాప్తమయింది. ఆ తరువాత వెయ్యేళ్లపాటు ఎలాంటి స్మృతి రాలేదు. అందుకనే ప్రజలు తమ ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటి పరిస్థితులకు తగిన, సరళమైన, ఆచరణ యోగ్యమైన కొత్త స్మృతిని రూపొందించడానికి ధర్మాచార్యులు పూనుకోవాలి. అలాంటి స్మృతి అవసరం ఇప్పుడు చాలా ఉంది.
ప్ర. మీరు స్మృతుల గురించి ప్రస్తావించారు. మన అనేక ధర్మ గ్రంధాల్లో విషయాలు కూడా ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు మార్పు చేసుకోవలసి ఉంది. వాటి గురించి ఏమంటారు?
జ: భారతీయులమైన మనం గ్రంధాల ఆధారంగా జీవనం సాగించం. గ్రంధాల ప్రకారమే నడుచుకునేవారమైతే ఏకనాధుడు రామేశ్వరంలో దాహంతో ఉన్న గాడిదకు గంగాజలం తాగించేవాడు కాదు. గ్రంధాల్లో కాలబాహ్యమైన(out of date) విషయాలు అనేకం ఉన్నాయి, ఉంటాయి. భారతీయ సమాజం ధర్మం పట్ల నిష్టను, శ్రద్ధను కలిగి ఉంటుంది. అందుకనే కాలబాహ్యమైన విషయాలను వదిలిపెట్టి ముందుకు వెళుతుంది. ఎందుకంటే గ్రంధాల్లో చెప్పిన విషయాలు దేశ, కాల, పరిస్థితుల ప్రకారం మారిపోతాయని ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ గ్రంధాల్లో ఉపయోగించిన పదాలు, వాటి అర్ధాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, పునర్వ్యఖ్యానించుకుంటూ ఉండాలి. మన ధర్మ గ్రంధాల్లో ఏమాత్రం ప్రక్షిప్తాలు, కల్పితాలు లేనిది భగవద్గీత అని చెపుతారు. అలాగే ఒకరి నుంచి మరొకరు మౌఖికంగా నేర్చుకుంటూ నిలబెట్టిన వేదాలు, ఉపనిషత్తులలో కూడా ప్రక్షిప్తాలు, కల్పిత విషయాలు ఉండవు. ఇతర గ్రంధాల్లో మహాభారతాన్నే తీసుకుంటే ఆ గ్రంధపు ప్రస్తావన లోనే మొట్టమొదటసారి 800 శ్లోకాలలో మొత్తం కధ చెప్పారని ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు లభించే మహాభారతంలో లక్షకు పైగా శ్లోకాలు ఉంటాయి. అంటే 200 పైగా శ్లోకాలు తరువాత వచ్చి చేరాయన్నమాట. నేటి పరిస్థితులకు అనుగుణంగా లేనివాటిని తొలగించుకుని, అవసరమైనవి ఉంచుకోవాలి. ఏది ఉంచుకోవాలన్నది చెప్పే అధికారం కేవలం ధర్మచార్యులకు మాత్రమే ఉంటుంది. ఇతరులు ఎవరు అందులో జోక్యం చేసుకోకూడదు. కేవలం ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు ధర్మాచార్యులకు విన్నవించుకోవచ్చును.
ప్ర: మన సమాజంలో అనేక పంథాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ కలిస్తే సమాజం మరింత బలోపేతం అవుతుంది. ఆ విషయంలో రామమందిరం దారి చూపుతుందా?
జ: ఎందుకు చూపదు? రామాయణంలోగానీ, రామచరితమానస్ లోగాని ఎవరి పూజ చేయాలన్నది చెప్పలేదు. సత్యమార్గంలో వెళ్ళు, అన్యాయం, అత్యాచారాలకు పాల్పడకు, అహంకారంతో ప్రవర్తించకు అని మాత్రమే చెప్పారు. పూజా పద్దతులు అనేకం ఉండవచ్చును. ఎవరికి నచ్చిన పద్దతి వాళ్ళు అనుసరించవచ్చును. ఇతర పూజా పద్ధతిని తమ పద్ధతి మాదిరిగానే సత్యమైనదని భావించగలగాలి. అందరికీ వర్తించే, అందరినీ కలిపే అంశాలను గౌరవిస్తూ ముందుకు సాగితే దేశ కళ్యాణం నెరవేరుతుంది. మన రాజ్యాంగంలో మౌలిక విషయాలు ఇవే. రాజ్యాంగ పీఠిక (preamble)లో ఇవే ప్రస్తావించారు. రాజ్యాంగంలోని పీఠిక, పౌరుల విధులు, అధికారాలు, ఆదేశిక సూత్రాలు కూడా ఇవే విషయాలను చెపుతాయి. మన దేశంలో వైవిధ్యం మొదటి నుంచి ఉంది. శ్రీరాముని కాలంలో ఎలాంటి సంప్రదాయాలు ఉండేవి? ప్రధానంగా శైవం, వైష్ణవం అనే రెండు రకాలు కనిపిస్తాయి. శివుడు రామనామ జపం చేస్తాడు. రాముడు అనేకచోట్ల శివ పూజ చేశాడు. ఎవరి పద్దతి వారిది. కానీ కలిసి ముందుకు వెళ్ళే నిశ్చయం, పరస్పర ఆత్మీయత వంటివే రామాయణ సందేశాలు. అవే మన పరంపర మనకు అందించే సందేశం కూడా. మనుషులు రూపురేఖలలో వేరువేరుగా కనిపించవచ్చును. కానీ అందరిలో ఉన్నది ఆ సత్యస్వరూపమే. ఇదే ఈ దేశం ప్రపంచానికి ఇచ్చే సందేశం. రామాయణంలో కూడా అదే ఉన్నది. ఎన్ని పూజాపద్దతులు ఉన్నా అవన్నీ ఈ సందేశాన్ని అనుసరిస్తే అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది, దేశానికి కూడా మంచి జరుగుతుంది. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి.
ప్ర: రామమందిర సందేశాన్ని అనుసరించి అన్ని సంప్రదాయాలు, పూజాపద్ధతులకు చెందినవారు ఒకటిగా నిలబడటానికి, కలిసి పనిచేయడానికి వీలవుతుంది. కానీ ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. వారిలో కూడా ఈ ఏకత్వ భావాన్ని తీసుకురావడానికి ఏం చేయాలి?
జ: వాళ్ళని తీసుకురావడం ఏమిటి? తాము దూరంగా, వేరుగా వెళిపోకూడదని వారికి అనిపిస్తే చాలు. రసఖాన్ గురించి తెలుసుకదా. ఆయన ఇస్లాంను వదిలిపెట్టలేదు. అయినా కృష్ణునిపై ఎంతో అద్భుతమైన కావ్యాన్ని రచించారు. ఆయన కృష్ణ భక్తుడు. షేక్ మహమ్మద్ అనే విఠల భక్తుడు ఉండేవాడు. వీళ్ళంతా ఎప్పటివారో కారు. ఇస్లాం, క్రైస్తవ మత పద్దతులను స్వయంగా అనుసరించి, ఆచరించిన తరువాత అన్ని మతాలు ఒకే లక్ష్యాన్ని చేరుకుంటాయని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. తాను హిందువుగా మారాలనుకుంటున్నట్లు పాల్ బ్రన్టన్ (paul Brunton) అనే విదేశీయుడు చెప్పినప్పుడు `లేదు నువ్వు క్రైస్తవుడిగా జన్మించావు. కాబట్టి మంచి క్రైస్తవుడిగా మారేందుకు ప్రయత్నించు. ఒక హిందువుకు మంచి హిందువుగా మారితే ఎలాంటి ఫలితం లభిస్తుందో అదే నీకూ దొరుకుతుంది’ అని రమణ మహర్షి చెప్పారు. కానీ కొన్నిసార్లు పిడివాదులు ఇందుకు వ్యతిరేకమైన దిశలో సమాజాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాలను శివాజీ మహారాజ్ వంటివారు నిరోధిస్తారు. ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉండేవారు.
మహారాణా ప్రతాప్ సైన్యంలో కూడా ముస్లింలు ఉండేవారు. ఆయన హల్దిఘాటిలో అక్బర్ ను ఎదిరించాడు.
ఎప్పుడెప్పుడు భారతీయ సంస్కృతి పట్ల భక్తి, పరంపర పట్ల గౌరవం జాగృతమవుతాయో అప్పుడు అన్ని రకాల భేదభావాలు సమసిపోతాయి. స్వప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకున్న వారు పిడివాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు. దీర్ఘకాలం ప్రజలంతా ఒకటిగా కలిసి జీవించిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమే. ఇతర మతాలకు చెందిన వారికి కూడా పాలనా వ్యవస్థలో స్థానం కల్పించిన దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. ముస్లిం ఆక్రమణకు కొంత కాలం ముందు ముస్లింలు ఇక్కడకు వచ్చారు. ఆక్రమణకారులతోపాటు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చారు. ఎంతో రక్తపాతం, సంఘర్షణ జరిగాయి. అయినా ఇప్పటికీ ఇక్కడ ముస్లింలు ఉన్నారు. అలాగే క్రైస్తవులు ఉన్నారు. వారిపట్ల ఎవరూ ఎలాంటి హాని తలపెట్టలేదు. ఇక్కడ వారికి కూడా సర్వాధికారాలు లభించాయి. కానీ పాకిస్థాన్ ఇతర మతస్తులకు ఎలాంటి అధికారాలు కల్పించడం లేదు. మతప్రాతిపదికన ముస్లింలు హిందూస్థాన్ ను ముక్కలు చేసి పాకిస్థాన్ ఏర్పాటుచేసుకున్నారు. అప్పుడు కూడా మీరంతా పాకిస్థాన్ కు వెళిపొండి. ఇక్కడే ఉండదలుచుకుంటే హిందువుల క్రింద అణగిమణిగి ఉండండి అని రాజ్యాంగం చెప్పలేదు.
మన రాజ్యాంగ సభలో అన్ని రకాలవారు ఉన్నారు. జనాభా మార్పిడి జరగాలని అంబేడ్కర్ కోరుకున్నారు. కానీ ఇక్కడ ఉండిపోయినవారిని తరలించడం కోసం ఆయన రాజ్యాంగంలో ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలనుకోలేదు. వారిని కూడా ఈ దేశస్థులుగానే పరిగణించారు. ఇదే మన దేశపు తత్వం. ఇదే హిందూ స్వభావం. ఏ పూజాపద్దతిని అనుసరిస్తామో దానికి హిందూత్వానికి సంబంధం లేదు. ధర్మం అంటే కలిపేది, ఉన్నతిని తెచ్చేది, సమాజాన్ని ఏకం చేసేదిగా ఉండాలి. భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతిని తెచ్చేదిగా ఉండాలి. జాతీయతకు పూజాపద్ధతికి సంబంధం లేదు. పాకిస్థాన్ ఏర్పాటు ప్రతిపాదన మొదట వచ్చినప్పుడు జమాతే ఇస్లామి అధినేతగా మదాని ఉండేవారు. దేశానికి, మతానికి సంబంధం లేదని ఆయన తన పుస్తకంలో వ్రాసారు. ముస్లింలు హిందూస్థాన్ కు చెందినవారు కాదని కొందరు చేస్తున్న వాదన పూర్తిగా తప్పు.
అప్పుడప్పుడు పిడివాదం పెచ్చుమీరినప్పుడు మనం కూడా దారి తప్పకూడదు. మనది హిందూ రాష్ట్రం. పురాతన, చిరంతన దేశం. మనం ఏది మార్చుకోవలసిన అవసరం లేదు. కేవలం కొన్ని చెడు పద్దతులను వదులుకోవాలి. సంకుచితత్వాన్ని వదులుకోవాలి. ఇది సాధ్యమే. ఈ విషయాలను అంగీకరించేవారు కలుస్తూ ఉంటారు. బాగా విద్యావంతులైన, ఉన్నత పదవులలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు కలుస్తూ ఉంటారు.
మూలము: విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)
🖝 రెండవ భాగం ఇక్కడ చదవండి….