పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ: రెండవ భాగం...
ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారు?
జ. చూడండి, అది సత్యం. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం వారి ఇష్టం. కానీ అది సత్యం. సత్యాన్ని అంగీకరించి నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ ఎంతకాలం సత్యాన్ని అంగీకరించకుండా ఉంటారు? సత్యానికి శక్తి ఉంటుంది. ఎవరు ఏమీ చెప్పకపోయినా తాము హిందువులమని, భారతీయులమని అందరికీ అనిపిస్తుంది, తెలుస్తూ ఉంటుంది.
జ. చూడండి, అది సత్యం. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం వారి ఇష్టం. కానీ అది సత్యం. సత్యాన్ని అంగీకరించి నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ ఎంతకాలం సత్యాన్ని అంగీకరించకుండా ఉంటారు? సత్యానికి శక్తి ఉంటుంది. ఎవరు ఏమీ చెప్పకపోయినా తాము హిందువులమని, భారతీయులమని అందరికీ అనిపిస్తుంది, తెలుస్తూ ఉంటుంది.
ముస్లిములమైనా అరబ్బీలు, తుర్కీలము కాము, మేము భారతీయులం. భారతీయులంటే? ఎవరు అన్నది ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడు భారతీయులు అంటే హిందువులు అని స్పష్టమవుతుంది. కానీ ఈ విషయాన్ని ఎలా అంగీకరించాలి? అలా అంగీకరించేట్లు వారికి వివరించాలి. అది నచ్చచెప్పాల్సిన విషయమేకానీ బలవంతంగా ఒప్పించవలసింది కాదు. చేతిలో కర్ర పట్టుకుని ఇలాంటి విషయాలు ఒప్పించగలమా? అలా చేయకూడదు. చేయము. హృదయ పరివర్తన ద్వారా అది జరగాలి. అది జరగాలంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మా పూర్వజులు ఎవరు? ఏ నేలతో తమకు సంబంధం ఉంది? ముస్లిం దేశాల్లో కూడా లేని ఖవ్వాలీ ఇక్కడ ఎందుకు మిగిలింది? అఖండ భారత్ ప్రాంతాల అవతల నేటికీ ఖవ్వాలికి అనుమతి లేదు. అలాగే దర్గాల దగ్గర పూజలు కూడా ఇతర దేశాల్లో కనిపించవు. అలాగే మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఈద్ – ఏ –మిల్లద్ – ఉన్ – నబీ అనే వేడుకగా జరుపుకోవడం మరెక్కడా లేదు. అల్లా ఒక్కడే శ్రేష్టమైన దేవుడు కాబట్టి ప్రవక్త పుట్టినరోజు కూడా జరపడానికి వీలులేదన్నది ఆయా దేశాల్లో భావిస్తారు. అందుకని ఏ వ్యక్తికీ ఇలాంటి వేడుకలు జరపరు.
అల్లాను మించి ఇంకెవరున్నారు అని వాళ్ళంటారు. కానీ మన దగ్గర అలా కాదు. ఎందుకంటే మనకు పరంపరాగతంగా కొన్ని పద్దతులు అలవాటయ్యాయి. మన పూర్వజులు ఒకటేనన్నది సత్యం. బయట దేశాల్లో మనల్ని భారతీయులుగానే గుర్తిస్తారు, గౌరవిస్తారు. అంతేకాని వేరువేరు గుర్తింపులు లేవు. ఈ దేశపు ప్రతిష్టే మన ప్రతిష్ట. బెంగళూరు వెలుతున్నప్పుడు ఒక టీసీ కలిశారు. `చనిపోతే శవపేటికపై స్వదేశపు మట్టి వేసి పూడ్చాల్సిందే. అప్పటివరకూ స్వర్గ ప్రాప్తి లభించదు. ఒసామాబిన్ లాడెన్ శవాన్ని అమెరికా సముద్రంలో విసిరి పారేసినప్పుడు చాలా చర్చ జరిగింది. అందుకు కారణం ఇదే. అతని శవాన్ని స్వదేశపు మట్టి వేసి పూడ్చలేదు. మేము చనిపోతే ఈ దేశపు మట్టి వేయకపోతే మాకూ పరలోకప్రాప్తి కలగదు’ అన్నాడు. నిజమే మనం ఈ నేలకు చెందినవాళ్లమన్నది సత్యం. ఇదే విషయాన్ని హిందువు చెప్పాలని చూస్తే అప్పుడు వాళ్ళు వెంటనే అడుగుతారు `ఇందులో మీకేమి లాభం’ అని. కాబట్టి హిందువు `మీరు ఈ సత్యాన్ని నమ్మినా, నమ్మకపోయినా మాకు ఏమీ తేడా పడదు. ఆ విషయాన్ని మీకు నచ్చచెప్పవలసిన అగత్యం కూడా మాకు లేదు. కానీ మనమంతా సహోదరులమన్నది మాత్రం సత్యం. అందుకనే ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాము’ అని చెప్పాలి. అలాంటి ధోరణి అవలంబించాలి. కాబట్టి హిందువుకు ఏదీ చెప్పాల్సిన, చేయాల్సిన అవసరం లేదు. స్వీయరక్షణ చేసుకోగలడు. అయినా మనసులో బంధుభావన, స్నేహభావనతో మనమంతా ఒకటని చెపుతాడు. ఈ విషయం అవతలివారు అర్ధం చేసుకున్నప్పుడే ఆ మాట చెప్పాలి. అప్పటివరకూ హిందువు వేచి ఉండాలి. ఎందుకంటే మనమంతా బంధువులమని హిందువు మాత్రమే చెపుతుంటే అలా చేయడంకంటే అతనికి మరో గత్యంతరం లేదనే భావం ఏర్పడుతుంది. లేదా బేరసారాలకు దిగుతారు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. రెండు వైపుల నుంచి సద్భావన, సమన్వయం ఏర్పడాలి. కాబట్టి హిందూ సమాజం సర్వశక్తివంతమైన, ఎవరు బెదిరింపులకు దిగలేని స్థితి సాధించాలి. ఇది ఎవరికో గుణపాఠం చెప్పడానికో కాదు. చెప్పిన మాటకు విలువ, గౌరవం సాధించేందుకు.
ప్ర: కరోనా సంక్షోభ కాలంలో ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి పిలుపు వచ్చింది. ఆత్మనిర్భర భారత్ ను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలి?
జ: ఇందుకు ముందుగా మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మన ఆత్మ ఏమిటి? మనం ఏమిటి?
చాణక్య నీతి ఇలా చెపుతోంది –
కః కాలః కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ |
కక్షాహం కా చ మే శక్తి – రితి చిన్త్ర్యమ్ ముహూర్ ముహు ||
అభివృద్ధి సాధించదలుచుకున్న వ్యక్తి లేదా సమాజం ఈ 6 విషయాల పట్ల జాగ్రత్తవహించాలి. అవి – కాలం ఎలా నడుస్తోంది? నా మిత్రులు ఎవరు? ఆదాయం, ఖర్చు(ఆర్ధిక స్థితి) ఎలా ఉంది? దేశాల స్థితి ఎలా ఉంది? నేను ఎవరిని? నేను ఏమిటి? చివరి రెండు ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. వీటి పైనే మిగిలినవన్నీ ఆధారపడి ఉంటాయి. ఏ విషయాల్లో శాంతి లభిస్తుంది? అనే విషయం కూడా తెలియాలి. అందుకు భూతకాలం, వర్తమానం గురించి అవగాహన ఉండాలి. మనకు ఎందులో శాంతి సుఖం లభిస్తుందో ఆ విషయాలను కొనసాగిస్తున్నమా లేదా అని చూసుకోవాలి.
ఆంగ్ల మాధ్యమంలో 12వ తరగతి చదువుకుంటున్న ఒక విద్యార్ధి నాతో `ఇప్పుడు మాకు సరైన చరిత్ర చెప్పడమే లేదు. ముఖ్యంగా భారత దేశ చరిత్ర గురించి మాకు ఏమి తెలియదు’ అని అన్నాడు. 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి ఒక వ్యాసం వ్రాయాలనుకున్నాడు. కాని అతనికి దాని గురించి ఏమి తెలియదు. ఆ విషయాన్నికి సంబధించిన పుస్తకాలు ఏమున్నాయో కూడా తెలియదు. గ్రంధాలయాల్లో కూడా అలాంటి పుస్తకాలు దొరకలేదు. అప్పుడు నేను అతనికి రెండు, మూడు పుస్తకాల గురించి చెప్పాను. మనం ఈ స్థితి నుంచి బయటపడాలి. ముందు మనమేమిటో తెలుసుకోవాలి. మనకు ఏముందో దానిపట్ల గౌరవాన్ని, మన్ననను కలిగి ఉండాలి.
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలి. మనలో ప్రత్యేకతలను గుర్తించి వాటి పట్ల గర్వించాలి. ఆత్మగౌరవం, స్వాభిమానం లేనివారు ఎన్నటికీ ముందుకు వెళ్లలేరు. అవి లేనివాళ్లు సంకుచితంగా, తగ్గువగానే ఆలోచిస్తారు. నేను పెద్ద ఉద్యోగం చేస్తాను అని ఆలోచించే బదులు నేనే ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వస్తాను అని ఎందుకు ఆలోచించకూడదు? అలా చేయడానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలాంటి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని కలిగించే వాతావరణం ఏర్పరచుకోవాలి. అలాంటి విద్య లభించాలి. తల్లిదండ్రులు అలా పెంచాలి. కొన్ని వ్యక్తిగతంగా మనం సాధించాలి, కొన్ని సమాజం నుంచి వస్తాయి. అలా సామాజిక స్థితితో పాటు వ్యక్తిగత ప్రయత్నం ఉన్నప్పుడే విజయం సాధ్యపడుతుంది. ఇంగ్లండ్ గురించి చెపుతూ the battle of waterloo was won on the playground’s of Harrow and Eton (వాటర్ లూ యుద్ధ విజయం హారో, ఈటన్ ఆటస్థలాల్లో లభించింది) అని అంటారు. ఎందుకంటే ఇంగ్లండ్ లో ఇళ్ళలో, సామాజిక వాతావరణం, విద్య మొదలైనవాటిలో సంస్కారాలు సహజంగానే లభిస్తాయి. కాబట్టి అవి వ్యక్తుల స్వభావం అవుతాయి. అందుకనే నెపోలియన్, హిట్లర్ వాటి వారిని కూడా ఇంగ్లండ్ ఓడించగలిగింది. మనం కూడా అటువంటి సహజమైన, సంస్కారవంతమైన జీవన శైలిని అవలంబించాలి.
ప్ర: మీరు తరచుగా మూడవ ప్రత్యామ్నాయం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. మూడవ ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? దానిని ఎలా అమలు చేయగలుగుతాము?
జ: భారత్ కు తనదంటూ ఒక స్వభావం, ధోరణి ఉన్నాయి. వీటి ఆధారంగా ఏది చేసినా అది ఆత్మనిర్భరతను సాధిస్తుంది. ఆత్మనిర్భరత అంటే కేవలం స్వావలంబన, విజయం మాత్రమే కాదు. `స్వావలంబన’లోని `స్వ’ చాలా ముఖ్యమైనది. మన దగ్గర చక్కెర బాగా ఉత్పత్తి అవుతోంది. దానితో మనం మద్యం తయారుచేసి ఎగుమతి చేయవచ్చును. కానీ అది ఆత్మనిర్భరత కాదు. ఎందుకంటే మద్యం తయారుచేసి లాభాలు గడించడం భారత్ స్వభావం కాదు. భారత్ మూల స్వభావం `ఏకాత్మత, సమగ్రత’. అంటే సంపూర్ణ విశ్వంలోని ఏకాత్మతను దర్శించడం. నాకు ఏదైనా కావాలి లేదా అవసరం ఉన్నది అంటే అది ప్రపంచానికి కూడా కావలసినదై ఉంటుంది. ప్రపంచానికి మేలు చేసేదే నాకు కూడా మంచి చేస్తుంది. కేవలం నాకు మాత్రమే మంచి జరిగితే చాలు ప్రపంచం సంగతి అవసరం లేదనే పద్దతి భారత్ ది కాదు. ఎందుకంటే మనమందరి మధ్య పరస్పర సంబంధం ఉంది. బయట నుంచి వేరువేరుగా కనిపిస్తున్న ఇది అంతా ఒకటే. అందుకనే మనం ముక్కలు ముక్కలుగా విడగొట్టి చూడము. అంతా ఒక్కటిగానే భావించి ఆలోచిస్తాము.
మరొక విషయం ఏమిటంటే మనం దేని గురించైనా సమగ్రంగా, కూలంకషంగా ఆలోచిస్తాము. అందుకనే మనం ఎప్పుడు అతివాదులం (extremist), పిడివాదులం అయ్యే అవకాశం లేదు. సంతులితమైన, మధ్యే మార్గంలోనే వెళతాము. ఈ సంతులిత మార్గాన్నే ధర్మం అన్నారు. అస్తిత్వం ఒక్కటే, కానీ బయటకు కనిపించడం వేరువేరుగా ఉంటుంది అన్నది సత్యం. ఇదే ధర్మబద్ధమైన ఆలోచన. నేడు ప్రపంచంలో బాగా చెలామణిలో ఉన్నది పాశ్చాత్య ధోరణి. ప్రతి వ్యక్తి వేరు. అతని శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ వేరు. సమాజపు ప్రయోజనం వేరు, వ్యక్తి లాభం వేరు, సృష్టి మంచి మరింత వేరు. అందరికీ సుఖం కావాలి. ఇలా అందరూ సుఖం కోరుకుంటారని భారత్ కూడా చెపుతుంది. కానీ కావలసింది శారీరిక సుఖమా? మానసిక సుఖమా? అక్కడ శారీరిక సుఖానికి ప్రాధాన్యత. కానీ శారీరిక సుఖం ఎంత అవసరమో మానసిక, బౌద్ధిక సుఖం కూడా అంటే అవసరం. అందరికీ సుఖం కావాలి కాబట్టి అది సాధించడం కోసం అందరూ సంయమనంతో వ్యవహరించాలని మనం చెపుతాము. అలా అవసరం లేదంటారు వాళ్ళు. సుఖ సాధన కోసం ఎంతకైనా తెగించాలని(struggle for existence) అంటారు. దానివల్ల ఘర్షణ తలెత్తుతుంది.
ఒకసారి పార్లమెంట్ లో మాట్లాడుతూ డా. అంబేడ్కర్ స్వాతంత్ర్యం, సమానత్వం ఒకేసారి సాధించాలంటే పరస్పర బంధుభావనే మార్గమని అన్నారు. మనమంతా ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాము. కానీ మరచిపోయిన ఆ భావాన్ని గుర్తుచేయాలి. మన దేశంలో ఇదే ప్రధాన విషయం కావడం వల్ల మనం అభివృద్ధి చెందాము. 1000 సంవత్సరాలపాటు ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా విలసిల్లాము. ఈ విషయంపై అధ్యయనం జరగాలి. ప్రపంచంపై మన ప్రభావం ఎంతో ఉండేది. అలాగే మన సామ్రాజ్యం కూడా చాలా పెద్దగా ఉండేది. కానీ అంతటి స్థితిలో కూడా మనం ఎప్పుడు ఏ దేశంపైన దండెత్తలేదు, దానిని నాశనం చేయలేదు. ఎంతో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉండేది. అయినా ఎప్పుడు పర్యావరణానికి హాని చేయలేదు.
ప్రపంచంలో సంఘర్షణ అంతమై, అందరూ ఉన్నతి సాదించాలని కోరుకుంటున్నారు కానీ అది సాధ్యం కావడం లేదు. ఇప్పటి వరకు రెండు రకాల మార్గాలలో ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. వ్యక్తికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి చూశారు. ఫలితం లేదు. మరోసారి సమాజానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు. అయినా లాభం లేదు. మూడవ ప్రత్యామ్నాయం ఎక్కడ ఉంది? ఇక్కడ, మనదగ్గర ఉంది. అర్ధ, కామాలను సాధిస్తూ మోక్షాన్ని పొందే ధర్మ మార్గం మన దగ్గర ఉంది. శరీరం, మనస్సు, బుద్ధిలను అదుపులో పెట్టుకుని ఆత్మను పరమాత్మ వైపు తీసుకువెళ్లడమే తీసుకువెళ్లడమే ఆ మార్గం. అందుకనే వ్యక్తి, సమిష్టి, సృష్టి మూడింటి ఉన్నతి, వీటిని మూడింటిని పరమాత్మ వైపు నడపడం అనేది ఇక్కడి ప్రధాన దృష్టి. దీని ఆధారంగా జీవన విధానాన్ని తిరిగి ఏర్పరచుకోవాలి. ఇది సనాతన కాలం నుంచి వస్తున్న విధానం. ఇది శాస్త్రం. దీనిని ప్రస్తుతం ఎలా ప్రకటికరించాలి, దీనిని అనుసరించడానికి ప్రణాళిక ఏమిటి అన్నది ఆలోచించాలి. ఇప్పటికే ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ముందు కూడా జరగాలి.
ప్ర: మార్పు కోసం అనేక కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయని మీరు అన్నారు. ఇందులో విద్య కు కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. విద్యలో ధర్మానికి ఎలాంటి స్థానం ఉండాలి? మీ అభిప్రాయం ఏమిటి?
జ: ధర్మం సర్వత్ర ఉంటుంది. అధర్మం ఎక్కడా ఉండకూడదు. విద్యలో ధర్మం ఉండాలని నేను అంటే చాలామంది గగ్గోలు పెడతారు. కానీ అదే నేను విద్యలో అధర్మం ఉండకూడదు అని అంటే పట్టించుకోరు. ధర్మం అంటే మతం కాదు, పూజా పద్దతి అంతకంటే కాదు. ధర్మం అంటే పౌర క్రమశిక్షణ, పౌర బాధ్యత. మన దేశంలో ప్రతి పిల్లవాడికి మన రాజ్యాంగంలోని 4వ అధ్యాయం తప్పక తెలియాలి. దాని గురించి న్యాయ విద్యార్ధులు వివరంగా తెలుసుకోవాలి. రాజ్యాంగంలోని పీఠిక, పౌరుల విధులు, అధికారాలు, ఆదేశిక సూత్రాలు అందరికీ తెలియాలి. ఎందుకంటే అవే ధర్మం. మనమంతా కలిసిమెలసి జీవిస్తూ ఉన్నతి సాధించాలి, అలా అభివృద్ధి సాధిస్తున్నప్పుడు ప్రపంచానికి నష్టం కలగకూడదు అనే దృష్టితోనే మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం.
రాజ్యాంగ రూపకల్పన చేసిన వారి ఆలోచన, ఆకాంక్షలు మొదటి ప్రతి లోని ప్రతి చిత్రంలో ప్రతిబింబించాయి. ప్రతి మాట గురించి జరిగిన కూలంకషమైన చర్చను ఇప్పుడు పరిశీలిస్తే సనాతన ధర్మపు విలువలు ఇలా ప్రకటితమయ్యాయని తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి, నేర్పాలి. డబ్బు సంపాదన కోసం చడవకూడదు. అలాగని ఉపాధికి ఎందుకు పనికిరాని చదువువల్ల కూడా ప్రయోజనం లేదు. చదువుకుంటే జీవితం సుఖంగా గడపవచ్చన్న ఆలోచన మంచిదే కానీ జీవితం బాగా ఉండడం కోసం మాత్రమే చదువుకోవాలనే అభిప్రాయం మాత్రం సరైనది కాదు. మన చదువు ప్రపంచంలో నిలబడి మన జీవితం సజావుగా గడపగలను అనే విశ్వాసాన్ని కలిగించాలి.
ఈ సమాజం నుంచి నేను ఎంతో తీసుకుంటున్నాను కాబట్టి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన కలిగించాలి. మూడవ విషయం జీవితంలో అనేక అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి, జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుళ్ళను సహజమైనవిగానే భావించి ఆనందాన్ని పొందాలి అనే ఆలోచన మనకు విద్య ఇవ్వాలి. అప్పుడు జీవితమంటే సకారాత్మక, సానుకూల దృష్టి ఏర్పడుతుంది. విధ్య ఇలా ఉండాలి. నేడు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విద్యావిధానం ఈ దిశగా అడుగులు వేసింది. అది ఆహ్వానించదగిన విషయం. అయితే ఇది సంపూర్ణమైనదని భావించకూడదు. అలాంటి సంపూర్ణమైన విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడు రూపొందించి అమలుచేస్తే అప్పుడు చేస్తుందిగాని అప్పుడు కూడా అలాంటి విధానపు అమలు కేవలం విద్యావ్యవస్థ ద్వారా మాత్రమే విజయవంతం కాదు. అందుకు ధర్మం, సమాజపు పాత్ర చాలా ముఖ్యం. విద్యావిధానపు అమలుకు తగిన వాతావరణాన్ని అందరూ కలిసి నిర్మాణం చేయాల్సిఉంటుంది.
మూలము: విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)