వక్ఫ్(సవరణ) చట్టం తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బొహ్రా ముస్లిం ప్రతినిధులు ప్రధాని మోదీని తన అధికారిక నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా, ప్రత్యేకంగా వక్ఫ్ సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తంచేశారు.వక్ఫ్ సవరణ చట్టానికి తమ మద్దతు వుంటుందని ప్రకటించారు. బొహ్రూ ముస్లిం ప్రతినిధుల బృందంలో ఆ వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు, వైద్యులు, నిపుణులు,విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు కూడా వున్నారు. వక్ఫ్ బోర్డు తమకి సంబంధించిన ఆస్తులను ఎలా తప్పుగా క్లెయిమ్ చేసిందో వారు ప్రధాని మోదీకి సవివరంగా వివరించారు.
సవరణ చట్టం ద్వారా తమ సమస్యలను పరిష్కరించినందుకు వారు ప్రధానికి ధన్యవాదాలు ప్రకటించారు. మైనారిటీలలోని మైనారిటీలకు ఇదో సంస్కరణ పథమని బొహ్రా ముస్లిం ప్రతినిధులు అభివర్ణించారు.భారత్ లో అభివృద్ధికి ఎప్పుడూ తలుపులు తెరిచే వుంటాయని, ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ లో సమ్మిళిత వృద్ధి జరుగుతోందన్నారు. 2047 వికసిత్ భారత్ కోసం ప్రధాని మోదీ దార్శనికతను ఈ బృందం ప్రశంసించింది. దేశ అభివృద్ధిలో తాము కూడా సహకరిస్తామని, పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చింది.
అలాగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మ నిర్భర భారత్, MSME లకు మద్దతివ్వడంతో పాటు బేటీ పఢావో బేటీ బచావో, నారీశక్తి లాంటి పలు పథకాలు, కార్యక్రమాలను బొహ్రా ముస్లిం ప్రతినిధుల బృందం ప్రశంసించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకాలను మెచ్చుకుంది.
![]() |
Bohra Muslims thank Modi |
ఇక.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించడంలో దావూదీ బోహ్రా సమాజం గణనీయమైన కృషి చేసిందని ప్రశంసించారు. వక్ఫ్ సవరణ చట్టం వెనుక సంవత్సరాల కృషిని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. మునుపటి వ్యవస్థ కారణంగా చాలా మంది మహిళలు, వితంతులు పడ్డ ఇబ్బందులను పేర్కొన్నారు. దావూదీ బోహ్రా సమాజంతో తనకున్న దీర్ఘకాల సంబంధాన్ని కూడా ప్రస్తావించారు.
ఈ చట్టాన్ని రూపొందించడంలో సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ అందించిన సహకారాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకురావాలని పని ప్రారంభమైనప్పుడు తాను మొదటగా చర్చించిన వ్యక్తులలో సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్తీన్ వున్నారని మోదీ పేర్కొన్నారు.